PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 04 MAY 2020 6:44PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో 11,706 మందికి కోవిడ్‌-19 నయంకాగా- కోలుకున్నవారి శాతం 27.52కి పెరిగింది.
 • నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా 2,553 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 42,553కి చేరింది.
 • దేశంలో అత్యధికంగా కోవిడ్‌-19 కేసులు నమోదవుతున్న జిల్లాల్లో అధ్యయనానికి 20 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బృందాలు
 • విదేశాలలో చిక్కుకున్న భారతీయుల‌ను త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల‌లో ద‌శ‌ల‌వారీగా స్వ‌దేశం తీసుకురావాల‌ని నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం.
 • సివిల్‌ సర్వీసెస్‌ (ప్రాథమిక) పరీక్షలు-2020 వాయిదా.
 • ‘ఖాదీ ఇండియా’ పేరిట మోసపూరితంగా పీపీఈ కిట్లు విక్రయిస్తున్న తయారీదారులకు కేవీఐసీ హెచ్చరిక

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌-19 బారినపడి నయమైనవారి సంఖ్య 11,706కు చేరగా, మొత్తం కోలుకున్నవారి శాతం 27.52కు పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 42,553 కాగా, నిన్నటినుంచి 2,553 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, నయమైన కేసుల సంఖ్యరీత్యా ఇప్పటిదాకా మొత్తం (కోలుకున్న-మరణించిన) రోగుల నిష్పత్తి 90:10గా నమోదైంది. కాగా, 2020 ఏప్రిల్‌ 17కు ముందు ఇది 80:20గా నమోదైన నేపథ్యంలో ఆస్పత్రుల్లో వైద్య నిర్వహణ స్థాయి మెరుగుపడిందని దీన్నిబట్టి స్పష్టమవుతోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621072

దేశంలో అత్యధిక కోవిడ్‌19 కేసులు నమోదవుతున్న జిల్లాలకు కేంద్ర బృందాలు

దేశంలో కోవిడ్‌-19 కేసులు గరిష్ఠ సంఖ్యలో నమోదవుతున్న 20 జిల్లాల్లో అధ్యయనం కోసం కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 20 కేంద్ర ప్రజారోగ్య బృందాలను ఏర్పాటు చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620779

విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల స్వదేశ పయనానికి ప్రభుత్వం ఏర్పాట్లు

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు తప్పనిసరి పరిస్థితుల్లో స్వదేశం రావాల్సి ఉంటే వారిని దశలవారీగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. తదనుగుణంగా విమానాలు, నౌకలలో వారిని తరలిస్తారు. ఇందుకు సంబంధించి ప్రామాణిక కార్యకలాపాల ప్రణాళిక కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విదేశాల్లోని రాయబార, హైకమిషన్‌ కార్యాలయాలు సదరు భారతీయుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే, ఈ ప్రయాణ ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది. ఆ మేరకు నిర్ణీత ప్రయాణ ప్రణాళికతో నిమిత్తం లేకుండా ఈ నెల 7వ తేదీనుంచి దశలవారీగా వాణిజ్య విమాన సర్వీసులు నడుస్తాయి. విమానం ఎక్కేముందుగా ప్రయాణికులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధి లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతిస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621041

రక్తదానం ప్రాణప్రదాత... దీనిపై అవగాహన పెంచుదాం.. అవసరమైనవారికి సకాలంలో సురక్షిత, నాణ్యమైన రక్తం అందుబాటులో ఉంచుదాం: డాక్టర్‌ హర్షవర్ధన్‌

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేంద్రమంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ మాట్లాడుతూ- “కోవిడ్‌-19వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రక్తం అవసరమైన రోగులకు కీలకంగా సరఫరా చేయగలిగాం. నేను ఇంతకుముందే రెడ్‌క్రాస్‌ సొసైటీ అధికారులతో చర్చించి, సంచార వాహనాలద్వారా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని సూచించాను. అందుకోసం రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యకర్తలకు, వారి వాహనాలు వివిధ ప్రాంతాల్లో ప్రయాణించేందుకు 30,000 పాసులు మంజూరు చేయించాను” అని తెలిపారు. 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620948

మధ్యప్రదేశ్‌లో కోవిడ్‌-19 నిర్వహణ చర్యలు, సంసిద్ధతపై దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంద్వారా సమీక్షించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

రాష్ట్రంలో కోవిడ్‌-19 రోగుల మరణాల శాతం అధికంగా ఉండటంపై డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. “కొన్ని జిల్లాల్లో మరణాల శాతం జాతీయ సగటుకన్నా ఎక్కువగా నమోదు కావడం బాధాకరం” అని విచారం వెలిబుచ్చారు. అదే సమయంలో కోవిడ్‌ ప్రభావితం కాని జిల్లాలపైనా శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆ మేరకు ‘ఎస్‌ఏఆర్‌ఐ/ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులున్న వారిని కనుగొనేందుకు తగిన నిఘా, శోధన, పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇతర ప్రాంతాలలో కేసుల వ్యాప్తి నిరోధానికి ఈ ప్రక్రియ తోడ్పడగలదని ఆయన వివరించారు. అదే సమయంలో కోవిడ్‌-19 నిర్వహణకు ప్రాధాన్యమిస్తూనే దానితో సంబంధంలేని ఇతర వ్యాధుల చికిత్సకూ సమాన ప్రాధాన్యం ఉండేవిధంగా చూడాలని సలహా ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621039

కరోనా యోధులకు భారత్‌ వందనం; సముద్ర, భూ, గగనతలాల్లో భారత నావికాదళం వందన సమర్పణ

కరోనా యోధులకు ఆదివారం... మే 3వ తేదీన దేశం మొత్తం కృతజ్ఞతలు అర్పించిన నేపథ్యంలో భారత నావికాదళం కూడా తనవంతుగా వందన సమర్పణ చేసింది. ఆ మేరకు  భారతీయులందరి తరఫున భారత సాయుధ దళాల ప్రతినిధిగా నావికాదళం కూడా వారికి శిరసాభివందనం చేసింది. కోవిడ్‌-19పై నిరంతర, అవిశ్రాంత పోరాటం సాగిస్తున్న ముందువరుసలోని వైద్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, పత్రికా-ప్రసార మాధ్యమాల ప్రతినిధులు తదితరులందరి నిస్వార్థ సేవలకు, చిత్తశుద్ధికి దేశం మొత్తం 2020 మే 3వ తేదీన కృతజ్ఞతలు తెలుపుతూ సముద్ర, భూ, గగనతలాల నుంచి వందనం చేసింది. 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620834

‘కరోనా యోధులకు సాయుధ దళాల వందన సమర్పణ’పై రక్షణశాఖ మంత్రి అభినందన

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం దిశగా కృతనిశ్చయంతో పోరాడుతున్న కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతూ సాయుధ దళాలు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పలు రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించడంపై శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలు తెలిపారు. కాగా, సాయుధ దళాలు నిన్న ఆదివారం నాడు వినూత్న రీతిలో కరోనా యోధులకు వందన సమర్పణ చేశాయి. ఈ మేరకు శ్రీనగర్‌ నుంచి తిరువనంతపురందాకా; దిబ్రూగఢ్‌ నుంచి కచ్‌వరకూ పోలీసు స్మారకాలవద్ద పుష్పగుచ్ఛాలుంచడం, ఆరోగ్య నిపుణులను, అత్యవసర కార్యకలాపాల్లో నిమగ్నమైనవారిని సత్కరించడం వంటి పలు కార్యక్రమాలను సాయుధ దళాలు నిర్వహించాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా ప్రాంతాల్లోని సాయుధ దళ స్థావరాల నుంచి అధికార బృందాలు ఆస్పత్రులను సందర్శించి, మిలిటరీ బ్యాండ్‌తో దేశభక్తి గీతాలు ఆలపిస్తూ కరోనాపై పోరాడే యోధుల సాహసం, త్యాగనిరతికి కృతజ్ఞతలు అర్పించాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620765

‘ఖాదీ’ పేరిట నకిలీ పీపీఈ కిట్ల అమ్మకాలు; చట్టపరమైన చర్యలపై కేవీఐసీ పరిశీలన

కొన్ని మోసపూరిత వ్యాపార సంస్థలు తమ రిజిస్టర్‌ ట్రేడ్‌మార్క్‌ అయిన “ఖాదీ ఇండియా” పేరిట నకిలీ వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కిట్లను విక్రయిస్తున్నట్లు ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కేవీఐసీ) దృష్టికి వచ్చింది. అయితే, తమ బ్రాండ్‌తో ఇప్పటివరకూ పీపీఈ కిట్లను మార్కెట్‌లోకి విడుదల చేయలేదని కేవీఐసీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కేవీఐసీ తమ ఉత్పత్తుల తయారీలో ‘రెట్టింపు మెలికలుగల, చేతితో వడికిన, చేతితో నేసిన ఖాదీ వస్త్రాన్ని వినియోగిస్తామని పేర్కొంది. అందువల్ల కుట్టువేయని, పోలీయెస్టర్‌, పోలీప్రోపిలిన్‌లతో తయారుచేసిన పీపీఈ కిట్లను కేవైఐసీ ఆమోదిత ‘ఖాదీ’ ఉత్పత్తులుగా పరిగణించవద్దని ప్రజలకు సూచించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621044

కోవిడ్‌-19పై భారత్‌ పోరాటంలో సీఎస్‌వో/ఎన్జీవో/పారిశ్రామిక/అంతర్జాతీయ సంస్థల్ని భాగస్వాములను చేసిన సాధికార బృందం-6

కోవిడ్‌-19 విసిరిన అనూహ్య సవాలును దేశం ఎదుర్కొంటున్న తరుణంలో నీతి ఆయోగ్‌ సీఈవో నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సాధికార బృందం-6 (ఈజీ-6)ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో  సదరు బృందం ప్రపంచ మహమ్మారిపై యుద్ధంలో పౌరసమాజ (సీఎస్‌వో), స్వచ్ఛంద (ఎన్జీవో) సంస్థలు, ప్రగతి-పారిశ్రామిక భాగస్వాములు, అంతర్జాతీయ సంస్థలు పాలుపంచుకునేలా చేసింది. ఆ మేరకు ఈజీ-6 చొరవతో ఆయా సంస్థలు ప్రభుత్వ కృషితో సమన్వయం చేసుకుంటూ తమవంతు పాత్రను పోషిస్తున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1620908

రోగకారకాల నిర్మూలన టవర్‌ను రూపొందించిన డీఆర్‌డీవో

రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ-డీఆర్‌డీవో ఒక అతినీలలోహిత (యూవీ) రోగకారక నిర్మూలన టవర్‌ను రూపొందించింది. దీని సాయంతో అత్యధిక రోగకారక ముప్పున్న ప్రదేశాల్లో విజయవంతంగా సత్వర, రసాయనరహిత నిర్మూలన చేయవచ్చు. దీనికి ‘యూవీ బ్లాస్టర్‌’గా పేరుపెట్టారు. ఈ ‘యూవీ ఆధారిత ప్రాదేశిక శానిటైజర్‌’ను డీఆర్‌డీవో పరిధిలోని ఢిల్లీలోగల లేజర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (లాస్‌టెక్‌) తయారుచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621018

ప్రభుత్వ ‘ఈ-విపణి’ పోర్టల్‌లో “ది సారస్‌ కలెక్షన్‌”ను ప్రారంభించిన శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌

ప్రభుత్వ ‘ఈ-విపణి’ పోర్టల్‌లో “ది సారస్‌ కలెక్షన్‌”ను కేంద్ర పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ-రైతుసంక్షేమ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇవాళ ప్రారంభించారు. ‘ఈ-విపణి పోర్టల్‌’తోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ఈ విశిష్ట కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి. ఇందులో భాగంగా ‘ది సారస్‌ కలెక్షన్‌’ కింద దైనందిన వినియోగం కోసం గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయ బృందాలు తయారుచేసే ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. అంతేకాకుండా దీనిద్వారా ఆ బృందాలకు కేంద్ర-రాష్ట్ర కొనుగోలుదారులతో కూడిన మార్కెట్‌ అందుబాటులోకి వస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620909

కోవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో గిరిజన అటవీ ఉత్పత్తుల సేకరణదారులు, చేతివృత్తులవారికి జీవనోపాధి భద్రతకు ప్రభుత్వం తక్షణ చర్యలు

దేశవ్యాప్తంగా అనూహ్య పరిస్థితులు ఏర్పడి గిరిజన చేతివృత్తులవారు, అటవీ ఉత్పత్తుల సేకరణదారులు కష్టనష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారికి అండగా నిలుస్తూ అనేక తక్షణ చర్యలు తీసుకుంటోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620936

మే 31న నిర్వహించాల్సిన సివిల్‌ సర్వీసెస్‌ (ప్రాథమిక)-2020 పరీక్షలు వాయిదా

దేశవ్యాప్తంగా దిగ్బంధం మూడోవిడత పొడిగింపు నేపథ్యంలో నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ సాధ్యంకాదని యూపీఎస్‌సీ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు మే 31న నిర్వహించాల్సిన సివిల్‌ సర్వీసెస్‌ (ప్రాథమిక)-2020 పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620911

కోవిడ్‌-19 నేపథ్యంలో పీఎం జనౌషధి కేంద్రాల కీలకపాత్ర: మన్‌సుఖ్‌ మాండవీయ

కోవిడ్‌-19 పరిస్థితుల నడుమ దేశంలోని జనౌషధి కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి (ఇన్‌చార్జి) శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 6000 కేంద్రాల నుంచి రోజూ 10 లక్షలమంది నాణ్యమైన మందులను అందుబాటు ధరలకు పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధం కూడా లభిస్తుందని ఆయన తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621058

కోవిడ్‌-19 సంసిద్ధతపై శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన విభాగంతో డాక్టర్‌ హర్షవర్ధన్‌ చర్చలు

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ, భూవిజ్ఞానశాస్త్ర, శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన విభాగం (డీఎస్టీ) 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీని పరిధిలోని స్వయంప్రతిపత్తిగల సంస్థలు, ఉప విభాగ కార్యాలయాల అధిపతులతో చర్చలు జరిపారు. ఈ మేరకు వారివారి పర్యవేక్షణలో సాగుతున్న... ప్రత్యేకించి కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంపై చేపట్టిన శాస్త్ర-సాంకేతిక చర్యల గురించి ఈ సందర్భంగా వాకబు చేశారు. అలాగే ‘కోవిడ్‌ కథ’ పేరిట కోవిడ్‌-19పై ఒక మల్టీమీడియా కరదీపికను ఆవిష్కరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620836

మహారాష్ట్రలోని 34 కేంద్రాల్లో కనీస మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లు; దిగ్బంధం సమయంలో 6,900 బేళ్లతో సమానమైన 36,500 క్వింటాళ్ల ముడిపత్తి సేకరణ

మహారాష్ట్ర పత్తి దిగుబడులలో 2020 మార్చి 25 నుంచి ఇప్పటిదాకా దాదాపు 77.40 శాతం మార్కెట్లకు చేరగా కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేసింది. ఈ మేరకు రైతుల నుంచి రూ.4,995 కోట్ల విలువగల 18.66 లక్షల బేళ్లకు సమానమైన 91.90 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ సేకరించింది. ఆ మేరకు మొత్తం కొనుగోళ్ల విలువలో రూ.4,987 కోట్లు రైతులకు అందగా, బకాయిల చెల్లింపునకు సీసీఐ చర్యలు తీసుకుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620884

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు తోడ్పడేందుకు చర్యలు తీసుకుంటున్న స్థానిక పాలన యంత్రాంగాలు

కోవిడ్‌-19 దిగ్బంధం నేపథ్యంలో స్థానిక పాలన యంత్రాంగాలు ప్రజలకు సహాయపడేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. ఇందులో భాగంగా  చిక్కుకుపోయిన‌వారికి సహాయం కోసం కంట్రోల్‌ రూముల ఏర్పాటు, నిర్బంధ వైద్యపరిశీలనలో ఉంచినవారి ప్రయాణ మార్గాల జాడ తీయడంతోపాటు వారితో సంబంధం కలిగినవారేగాక లారీ డ్రైవర్లుసహా సరిహద్దులు దాటినవారిని గుర్తించడం,  సందేహాలను నివృత్తి చేయడం; ఇవే కాకుండా జీవ-వైద్య వ్యర్థాల సేకరణ-నిర్వహణ-నిర్మూలన ప్రక్రియలు సూచించడం; వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు-విక్రయాలకు ఏర్పాట్లు చేయడం వంటి పలు చర్యలు తీసుకున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620793

‘సర్దార్‌ పటేల్‌ జాతీయ సమైక్యత అవార్డు’కు నామినేషన్ల స్వీకరణ గడువు 2020 జూన్‌ 30వరకు పొడిగింపు

భారతదేశంలో సమగ్రత, సమైకత్యలను ప్రోదిచేయడంలో విశేషకృషి చేసినవారిని సత్కరించడం కోసం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ పేరిట అత్యున్నత పౌర పురస్కారం ‘సర్దార్‌ పటేల్‌ సమైక్యత అవార్డు’ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ మేరకు శక్తిమంతమైన, సమైక్య భారత నిర్మాణం కోసం అవిరళ కృషిచేసే వ్యక్తులు, సంస్థలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620878

‘దేఖో అప్నాదేశ్‌’ సిరీస్‌కింద సుసంపన్న డార్జిలింగ్‌ వారసత్వంపై ‘బెంగాల్‌ బై ది హిమాలయాస్‌’ పేరిట 14వ వెబినార్‌ నిర్వహించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1620907

“ఎన్జీఎంఏ కే సంగ్రహ్‌ సే” పేరిట జాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శనశాల దృశ్యమాధ్యమ కార్యక్రమం; దిగ్బంధం సమయంలో తన భాండాగారంలోని అరుదైన, నేటిదాకా ఎవరూ చూడని చిత్రకళా వస్తువులతో వీక్షకులకు కనువిందు

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1621032

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • కేరళ: రాష్ట్రంలో దిగ్బంధం పొడిగింపుపై ప్ర‌భుత్వం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీచేసింది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కేరళ‌వాసుల త‌ర‌లింపు నిమిత్తం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, ఇతర రాష్ట్రాల్లోని మ‌ల‌యాళీలు తిరిగివ‌చ్చేందుకు 30,000 పాసుల‌ను ప్ర‌భుత్వం ఈ-పాస్ ప‌ద్ధ‌తిలో మంజూరు చేసింది. మ‌రోవైపు బీహార్ ప్ర‌భుత్వం అనుమ‌తించ‌ని కార‌ణంగా పాట్నాకు వెళ్లాల్సిన 5 వలస కార్మికుల ప్రత్యేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. ఇక కేర‌ళ నుంచి రానున్న రెండు ప్ర‌త్యేక రైళ్ల‌కు పశ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసులు: 499, యాక్టివ్ కేసులు: 95గా ఉన్నాయి.
 • తమిళనాడు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్ర‌భుత్వం లీట‌రుకు రూ .3.25, 2.50 వంతున‌ పెంచింది. చెన్నైలో కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ఇప్ప‌టికే ఆస్పత్రులలోగ‌ల‌ ఆరోగ్య ప‌రిస్థితి స్థిరంగా ఉన్న కోవిడ్‌-19 రోగుల‌ను నిర్బంధ వైద్య కేంద్రాలకు పంపుతున్నారు. కాగా, కడలూరులోని కోయంబేడు క్లస్టర్‌లో 114,  విల్లుపురంలో 39 వంతున అత్య‌ధికంగా కేసులు న‌మోదైన నేప‌థ్యంలో నిన్నటిదాకా మొత్తం నిర్ధారిత కేసులు: 3,023, వీటిలో యాక్టివ్: 1,611, మరణాలు: 30, డిశ్చార్జ్ అయిన‌వారు: 1,379. చెన్నైలో ప్ర‌స్తుతం గ‌రిష్ఠంగా 1,458 కేసులున్నాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో వలస కార్మికుల కోసం ఉచిత బస్సు సేవలను ప్ర‌భుత్వం రెండు రోజులు పొడిగించింది. ఇవాళ‌ 28 కొత్త కేసులు నిర్ధార‌ణ కాగా, వీటిలో దావ‌ణ‌గేరె 21, కల్బుర్గి, మాండ్యల‌లో రెండేసి, చిక్కబళ్లాపూర్, హవేరి, విజయపురాలలో ఒక్కొక్కటి వంతున న‌మోద‌య్యాయి. కాగా ఈ రోజు కల్బుర్గిలో ఒక మరణం సంభ‌వించింది. రాష్ట్రంలో మొత్తం కేసులు: 642, మరణాలు: 26 కాగా, డిశ్చార్జ్ అయిన‌వారి సంఖ్య‌: 304గా ఉంది.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల కోసం 108 అంబులెన్స్‌లను అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ఎఎల్ఎస్) వాహ‌నాలుగా మార్చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో సేవలందించే 19,584 మంది పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక వస్తు సామగ్రిని అందించడానికి రూ.3.84 కోట్లు విడుదల చేసింది. గడ‌చిన‌ 24 గంటల్లో 67 కొత్త కేసులు రాగా, 36 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మ‌ర‌ణాలేవీ న‌మోదు కాన‌ప్ప‌టికీ మొత్తం కేసుల సంఖ్య‌ 1650కి పెరిగింది. వీటిలో యాక్టివ్‌: 1,062, కోలుకున్నవారు: 524మంది, మరణాలు: 33 కాగా, గ‌రిష్ఠ కేసులరీత్యా కర్నూలు (491), గుంటూరు (338), కృష్ణా జిల్లాలు (278) అగ్ర‌స్థానంలో ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్ -19 దిగ్బంధం విముక్త ప్ర‌ణాళిలో భాగంగా కొన్ని రంగాలకు నిబంధనల సడలింపుపై చ‌ర్చించ‌డానికి మంత్రిమండ‌లి రేపు స‌మావేశం కానుంది. రాష్ట్రంలో చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికులు త‌మ‌ను సొంత రాష్ట్రాల‌కు పంపాలంటూ ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆందోళ‌న‌కు దిగారు. కాగా,  మతపరమైన క‌ల్లోలం రేపే ప్రయత్నంలో భాగంగా నిన్న టోలిచౌకీలో వలస కార్మికుల నిరసన సంద‌ర్భంగా అవాస్త‌వ వార్తలకు సంబంధించి ఇద్దరు వ్య‌క్తుల‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య‌: 1,082, యాక్టివ్ కేసులు: 508, కోలుకున్నవారు: 545 మంది, మరణాలు: 29.
 • చండీగ‌ఢ్‌: ఈ కేంద్ర‌పాలిత ప్రాంతంలోని నిర్దేశిత నియంత్ర‌ణ ప్ర‌దేశాల‌ను అష్ట‌దిగ్బంధం చేయాల‌ని పాల‌న యంత్రాంగం నిర్ణ‌యించింది. దీంతోపాటు ఆయా ప్ర‌దేశాల ప్ర‌వేశ‌-నిష్క్ర‌మ‌ణ మార్గాల్లో క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. ఈ నేప‌థ్యంలో పండ్లు, కూరగాయల సరఫరాకు వీలుగా, వైద్యప‌రంగా అత్యవసర పరిస్థితుల నిమిత్తం మాత్ర‌మే వ్యక్తుల కదలికకు అనుమ‌తి ఉంటుంది. త‌నిఖీ లేనిదే ప్ర‌జ‌ల‌, వాహ‌నాల రాకపోక‌ల‌కు వీల్లేదు. అలాగే నియంత్ర‌ణ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల క‌ద‌లిక‌ల‌పై సీసీటీవీ నిఘా ఉంటుంది. ఆయా ప్రాంతాల ప‌రిధిలో నివ‌సించేవారికి ముమ్మ‌ర త‌నిఖీ, అనుమానాస్పద కేసుల పరీక్ష సాగుతాయి. ఆయా ప్ర‌దేశాల్లోని దుకాణాలు, కార్యాలయాలు, వాణిజ్య కర్మాగారాలు, డిస్పెన్సరీలు తెరవ‌డానికి వీల్లేదు.
 • పంజాబ్: కోవిడ్‌-19పై పోరాటంలో పంజాబ్ ప్రభుత్వం ఒక మైలురాయిని అధిగ‌మించింది. ఈ మేర‌కు రాష్ట్రంలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య‌ 20,000 స్థాయిని దాటింది సంచార నమూనా సేకరణ కియోస్క్‌లు, సామూహిక ప‌రీక్ష‌ల‌వంటి వినూత్న పద్ధతులను ప్ర‌భుత్వం అనుస‌రించింది. పరీక్ష సామర్థ్యాన్ని పెంచడం కోసం సామూహిక ప‌రీక్ష విధానాన్ని ప్రారంభించారు. అనంత‌రం 2020 ఏప్రిల్ 30నాటికి ఇలా సేక‌రించిన 5,788 న‌మూనాల‌ను ప‌రీక్షించారు.  రాష్ట్రంలో నివసిస్తున్న వలసదారుల నమోదు కోసం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ రూపొందించి పంజాబ్ ముందంజ వేసింది. మ‌రోవైపు సొంత రాష్ట్రాలకు వెళ్ల‌డానికి ఆస‌క్తిగ‌ల 6.44 లక్షలకుపైగా వలసదారులను రాష్ట్రం విజయవంతంగా నమోదు చేసింది.
 • హర్యానా: హర్యానాలో చిక్కుకుపోయిన దేశంలోని ఇతర రాష్ట్రాల‌ వ్యవసాయ/వలస కార్మికుల‌ను త్వరగాసురక్షితంగా, క్రమపద్ధతిలో ఇళ్లకు పంప‌డానికి హర్యానా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ మేర‌కు సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల‌వారిని బస్సుల్లో పంపాలని నిర్ణ‌యించింది. అలాగే బీహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల‌వారిని హ‌ర్యానాలోని వివిధ స్టేష‌న్ల నుంచి శ్రామిక్ ప్ర‌త్యేక రైళ్ల‌లో పంప‌నుంది. ఇక మిగిలిన రాష్ట్రాల వలస కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నందున  న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక రైళ్లలో పంపుతారు.
 • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్నిశాఖ‌ల సమ‌ష్టి కృషి, ప్రజల చురుకైన సహకారంవ‌ల్ల హిమాచల్ ప్రదేశ్ త్వరలోనే కరోనార‌హిత రాష్ట్రంగా అవ‌త‌రిస్తుంద‌ని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రాన్ని సందర్శించే ప్రతి వ్యక్తి విష‌యంలోనూ కఠినమైన జాగ్ర‌త్త‌లు పాటించడం చాలా ముఖ్యమ‌ని ఆయన అన్నారు. ఆరోగ్య సేతు యాప్‌ను త‌ప్ప‌నిస‌రిగా డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేశారు. గ్రామంలో, ప‌ట్ట‌ణాల్లో కొత్త‌గా ప్రవేశించిన వ్య‌క్తులు నిర్బంధ వైద్య ప‌రిశీల‌న కేంద్రాల‌నుంచి అదృశ్యం కాకుండ చూడాల్సిన బాధ్య‌త పంచాయతీ రాజ్, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికైన ప్రతినిధులదేన‌ని పేర్కొన్నారు.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వం వివరణాత్మక మార్గదర్శకాలు జారీచేసింది. కోవిడ్‌-19కు టీకా సిద్ధ‌మ‌య్యేదాకా నివారణ చర్యలు పాటించ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇవాళ పౌరులకు సూచించారు.
 • అసోం: రాష్ట్రంలోని బొంగైగావ్ జిల్లాలో కోవిడ్‌-19 ప‌రిస్థితిని ప‌రిశీలించేందుకు ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ‌శర్మ ఇవాళ అక్క‌డి నిర్బంధ వైద్య ప‌రిశీల‌న‌ కేంద్రం, నియంత్ర‌ణ జోన్ల‌ను సందర్శించారు.
 • మేఘాలయ: ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వ్యక్తులు మే 5 నుంచి రాష్ట్రానికి రానున్న నేప‌థ్యంలో అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌కు సంబంధించి షిల్లాంగ్‌లోని పౌర ఆస్ప‌త్రి వైద్యుల‌తో ముఖ్య‌మంత్రి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.
 • మణిపూర్: రాష్ట్రం గ్రీన్ జోన్‌లో ఉన్న నేప‌థ్యంలో ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ లువాంగ్‌సాంగ్‌బామ్ కొండలవద్ద పండ్ల మొక్కలు నాటే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు ముఖ్య‌మంత్రి చెప్పారు.
 • మిజోరం: రాష్ట్రంలో బ‌హిరంగం ప్ర‌దేశాల్లో సామాజిక దూరం పాటించ‌డం, మాస్కు ధ‌రించడాన్ని ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. ఈ మేర‌కు ఆర్డినెన్స్ జారీచేయ‌డంతోపాటు దీన్ని ఉల్లంఘిస్తే నేర‌మ‌ని ప్ర‌క‌టించింది.
 • నాగాలాండ్: రాష్ట్రం వెలుప‌ల చిక్కుకున్న 16,526 మందికి ఇప్పటివరకు రూ.6.47 కోట్లదాకా ఆర్థిక సహాయం అందించినట్లు ముఖ్య కార్యదర్శి తెలిపారు.
 • సిక్కిం: కోవిడ్‌-19పై పోరులో భాగంగా ముందువ‌రుస‌న నిలిచి విధులు నిర్వ‌ర్తిస్తున్న మీడియా ప్ర‌తినిధుల కోసం ఫేస్ మాస్కులు, ప‌రిశుభ్ర‌త ద్ర‌వాల సామ‌గ్రిని సిక్కిం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శికి అంద‌జేసిన గ‌వ‌ర్న‌ర్‌.
 • త్రిపుర: రాష్ట్రం నుంచి 33,000 మంది వలస కార్మికులలో అధిక‌శాతాన్ని రైళ్ల‌ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం తిప్పి పంపింది.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ 678 కొత్త కరోనావైరస్ కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 12,974కు చేరగా  మ‌ర‌ణాల సంఖ్య 548గా ఉంది. ఇక 441 ​​కొత్త కేసులు, 21 మరణాలతో ముంబై అగ్ర‌స్థానంలో ఉంది. దీంతో ఒక్క ముంబైలోనే కేసుల సంఖ్య 8,800కు పెరిగింది. మొత్తం 10,223 కేసులకుగాను ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోనే 80 శాతం ఉండ‌టం గ‌మ‌నార్హం.
 • గుజరాత్: రాష్ట్రం‌లో నమోదైన కేసుల సంఖ్య 5,428కు చేర‌గా, మరణించిన వారి సంఖ్య 290గా ఉంది, దేశంలో మహారాష్ట్ర తర్వాత గుజ‌రాత్ రెండో స్థానంలో ఉండ‌టం గ‌మ‌నార్హం. అయితే, ఇప్పటివరకు 1,042 మంది వ్యాధినుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.
 • రాజస్థాన్: రాష్ట్రంలోని జైపూర్‌లో ఇవాళ 12 కొత్త కేసులు న‌మోదుకాగా ఇక్క‌డి కేసుల సంఖ్య 1,005కి, రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 3,009గా నమోదైంది. మొత్తంమీద రాష్ట్రంలో ఇప్పటివరకు 75 మంది మరణించ‌గా వారిలో జైపూర్ వాసులు 45 మంది ఉన్నారు.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని ఉజ్జయిని కోవిడ్-19 కొత్త హాట్‌స్పాట్‌గా మారింది. దీంతో పరిస్థితి నియంత్ర‌ణ‌కు వెంటనే ప్రత్యేక వైద్యుల బృందాన్ని పంపాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. కాగా, ఉజ్జయినిలో నిర్ధారిత కేసులు 150 మాత్ర‌మే అయిన‌ప్ప‌టికీ 30 మంది మరణించ‌డం రాష్ట్రంలోనే అత్యధిక మరణాల రేటును నమోదు చేసింది. ఇక‌ 1,568 కేసులతో ఇండోర్ అత్యంత ప్రభావిత నగరంగా కొనసాగుతోంది.
 • గోవా: మార్చి 24 దిగ్బంధం అమ‌లులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గోవాలో చిక్కుకున్న వలస కార్మికులలో దాదాపు 90 శాతం తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని కోరుకుంటున్న‌ట్లు పంచాయతీ స్థాయి స‌మాచారం ఆధారంగా రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ తెలిపింది. వీరిలో పొరుగు రాష్ట్రమైన‌ కర్ణాటకకు చెందిన వలస కార్మికులు అత్య‌ధిక సంఖ్య‌లో ఉండ‌గా- ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్ వాసులు ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు.


(Release ID: 1621074) Visitor Counter : 140