ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రక్తదానం ప్రాణాల్ని కాపాడుతుంది. రక్తదానంపై తగిన చైతన్యం పెంచుదాం.
అవసరమైవారినకి సమయానికి సురక్షితమైన, నాణ్యమైన రక్తం అందుబాటులో వుండేలా చూద్దాం.
అందరమూ రక్తదాన కార్యక్రమంలో పాల్గొందాం, ఇతరులకు సాయంగా నిలుద్దాం : డాక్టర్ హర్ష్ వర్ధన్
స్వచ్ఛంద రక్తదాతలనుప్రోత్సహించడంద్వారా తగినన్ని రక్త నిల్వలుండేలా చూసుకుందాం.
సంచార రక్త సేకరణ వాహనాలను, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయడంద్వారా రక్త నిల్వలు చేసుకుందాం : డాక్టర్ హర్ష్ వర్ధన్
Posted On:
04 MAY 2020 3:08PM by PIB Hyderabad
రక్తదానమనేది ప్రాణాలను కాపాడుతుంది. రక్తదానంపై అవగాహన పెంచుదాం అవసరమైనవారికి సమయానికి రక్తం అందుబాటులో వుండేలా చూద్దామన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో రెడ్ క్రాస్ ఏర్పాటు చేసిన రక్తదాన క్యాంపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సురక్షితమై, నాణ్యమైన రక్తాన్ని అవసరమైనవారికి అందించాల్సి వుంటుందని అననారు. మనందరమూ రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడుదామని కోరారు.
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులు వ్యక్తిగతంగా నన్ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపారు. అంతే కాదు ట్విట్టర్, ఇంకా ఇతర సోషల్ మీడియా వేదికలద్వారా రక్తం కొరతపై ఫిర్యాదులు అందుతూనే వున్నాయి. సుదీర్ఘకాలంపాటు వ్యాధిగ్రస్థులైనవారికి క్రమంతప్పకుండా రక్తం అవసరమవుతూ వుంటుంది. వారికి సమయానికి రక్తం ఎక్కించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంటుంది. కాబట్టి బ్లడ్ బ్యాంకుల్లో తగిన నిల్వలు వుండేలా చూసే బాధ్యత అందరిమీదా వుందని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు.
రక్తదాన కార్యక్రమాలు విరివిగా ఏర్పాటు చేయడంద్వారా, రక్తదాన విశిష్టతను ప్రజలకు వివరించడంద్వారా ప్రజల్లో చైతన్యం పెంచాలని స్వచ్ఛంద సంస్థలను మంత్రి శ్రీ హర్షవర్ధన్ కోరారు.
రక్తదాన కార్యక్రమాలను ప్రోత్సహించడానికిగాను, బ్యాంకుల్లో తగినన్ని నిల్వలు వుండేలా చూడడానికిగాను రెడ్ క్రాస్ సొసైటీ మరికొన్ని చర్యలు చేపట్టాలని డాక్టర్ హర్షవర్ధన్ కోరారు. రక్తదాతలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని, అలాగే క్రమం తప్పకుండా రక్తదానం చేసేవారి ఇళ్లకు మొబైల్ వ్యాన్లను పంపి వారి ఇంటిదగ్గరే రక్తాన్ని సేకరించాలని కోరారు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో అందరమూ ముందుకొచ్చి రక్తాన్ని దానం చేయాలని కోరారు. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిందిగా ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు లేఖలు రాసినట్టుగా, ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మాట్లాడినట్టు మంత్రి స్పష్టం చేశారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో అందరి సహకారంతో అవసరమైనవారికి రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతోందని మంత్రి అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యకర్తలకు, వారి వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 30 వేల పాసులు ఇచ్చామని అన్నారు.
రక్తాన్ని దానం చేయడంద్వారా ఇతరుల ప్రాణం కాపాడడమంటే మానవాళికి సేవ చేసనట్టేనని మంత్రి అన్నారు. ఒక ఆరోగ్యమైన వ్యక్తి తనకు 65 సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకూ రక్తాన్ని దానం చేయవచ్చని, ప్రతి మనిషి మూడు నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చని మంత్రి వివరించారు. రక్తాన్ని దానం చేయడంవల్ల దానం చేసినవారికి అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలుంటాయని అన్నారు. గుండెపోటు రాదని అన్నారు. బీపీ నియంత్రణలో వుంటుందని, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని, ఊబకాయంకూడా తగ్గుతుందని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. తాను ఇంతవరకూ వందసార్లకు పైగా రక్తాన్ని దానం చేశానని మొదటిసారిగా 1971లో దానం చేశానని చివరిసారిగా గత ఏడాది అక్టోబర్ లో చేశానని మంత్రి అన్నారు. పుట్టినరోజున కానీ, వివాహ దినోత్సవ సందర్భంగాగానీ ప్రతి మనిషి రక్తాన్ని దానం చేయాలనే అలవాటు చేసుకోవాలని మంత్రి కోరారు.
ప్రముఖ స్వచ్ఛంద సేవాసంస్థ రెడ్ క్రాస్ సొసైటీకి దేశవ్యాప్తంగా 1100 శాఖలున్నాయని ఏవైనా అత్యవసర సమయాలు వచ్చినప్పుడు విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందజేయడం చాలా సలువుగా జరుగుతోందని కేంద్ర మంత్రి అన్నారు. కోవిడ్ -19 కారణంగా ఏర్పడిన ఈ సంక్షోభ సమయంలో అవసరమైన వారికి రక్తాన్ని సరఫరా చేయడానికిగాను రెడ్ క్రాస్ సొసైటీ నెట్ వర్క్ ఎంతగానో ఉపయోగపడుతోందని మంత్రి ప్రశంసించారు.
కరోనా మహమ్మారిని నిరోధించడానికిగాను సరైన సమయంలో లాక్ డౌన్ విధించడం జరిగిందని, ప్రజలు చక్కగా సహకరిస్తున్నారని, ఇదే స్ఫూర్తిని లాక్ డౌన్ 3.0 విషయంలో కూడా చూపాలని మంత్రి కోరారు. దేశవ్యాప్తంగా అన్ని విధాలుగా వైద్య ఆరోగ్య సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని వైరస్ పై పోరాటం విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం చాలా మెరుగ్గా వుందని డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
ఈ సందర్భంగా రక్తదాతల సేవాభావాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. క్యాంపులో రక్తాన్ని దానం చేస్తున్నవారినందరినీ కలిసి వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశాన్య ఢిల్లీ ఎంపీ శ్రీ మనోజ్ తివారీ, ఐఆర్ సి ఎస్ సెక్రటరీ జనరల్ శ్రీ ఆర్ కె. జైన్, సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.
****
(Release ID: 1620948)
Visitor Counter : 1267