హోం మంత్రిత్వ శాఖ

విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను రప్పించేందుకు ఏర్పాట్లు

ఆకాశ, సముద్ర మార్గాల ద్వారా తీసుకొచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు
మే 7 నుంచి దశలవారీగా ప్రక్రియ ప్రారంభం

Posted On: 04 MAY 2020 6:08PM by PIB Hyderabad

కరోనా కారణంగా విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. విమానాలు, నౌకాదళ నౌకల ద్వారా, దశలవారీగా వారిని తీసుకురానుంది. దీనిపై, 'సాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్‌' (ఎస్‌వోపీ‌) ఇప్పటికే సిద్ధమైంది.

     భారతీయ రాయబార కార్యాలయాలు, హై కమిషన్లు ఇబ్బందుల్లో ఉన్న భారతీయుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. చెల్లింపు విధానం ఆధారంగా తరలింపు సౌకర్యం ఉంటుంది. షెడ్యూల్‌ కాని వాణిజ్య విమానాలను ఆకాశ ప్రయాణాల కోసం వినియోగిస్తారు. మే 7 నుంచి విడతల వారీగా ఈ తరలింపు ప్రారంభమవుతుంది. విమానాలు ఎక్కేముందు ప్రయాణీకులకు వైద్య పరీక్షలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. భారత వైద్య మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రయాణ సమయంలో ప్రయాణీకులు పాటించాలి.

తిరిగివచ్చాక 14 రోజుల క్వారంటైన్‌
    గమ్యస్థానం చేరగానే ప్రతి ఒక్కరి పేరును ఆరోగ్య సేతు యాప్‌లో నమోదు చేస్తారు. మరోసారి వైద్య పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత వారి స్వరాష్ట్రాల్లోని ఆస్పత్రులకు గానీ, ఇతర క్వారంటైన్‌ కేంద్రాలకు గానీ తరలిస్తారు. అక్కడ 14 రోజులు ఉండాలి. చెల్లింపు విధానంలో ఇది జరుగుతుంది. 14 రోజుల క్వారంటైన్‌ తర్వాత, కొవిడ్‌ పరీక్ష చేస్తారు. దాని ఫలితం ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుంటారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖలు తమ వెబ్‌సైట్లలో వీరి వివరాలను ప్రదర్శిస్తాయి.

    విదేశాల నుంచి వచ్చే భారతీయులకు, వారి సొంత రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు, క్వారంటైన్‌, తరలింపు వంటివాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే సూచనలు వెళ్లాయి.



(Release ID: 1621041) Visitor Counter : 359