రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కరోనా పోరాట యోధులకు భారత్ వందనం, భారత నౌకాదళం భూమి, వాయు, సాగర తలాల నుంచి వందనం

Posted On: 03 MAY 2020 10:09PM by PIB Hyderabad

కరోనా పోరాట యోధులకు వందనం చేసి కృతజ్ఞతలు ప్రకటించేందుకు దేశవ్యాప్తంగా 2020 మే 3వ తేదీన జరిగిన కార్యక్రమంలో భారత నౌకాదళం కూడా పాల్గొంది. దృఢ సంకల్పం, స్థిర నిశ్చయంతో కోవిడ్-19 మహమ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది, మీడియాకు చెందిన పోరాట యోధులకు వారి అవిశ్రాంత శ్రమను గౌరవిస్తూ జాతి యావత్తు తరఫున సాయుధ దళాలు భూమి, వాయు, జల ఉపరితలాల నుంచి గౌరవ వందనం ఘటించాయి.

భూ ఉపరితలం నుంచి…  
ధన్యవాదాలు  :  దేశంలోని మూడు కమాండ్లకు (పశ్చిమ, దక్షిణ, తూర్పు  నౌకా స్థావరాలు), అండమాన్ నికోబార్ ప్రాంతానికి చెందిన స్టేషన్ కమాండర్లు, సీనియర్ నౌకా దళాధికారులు ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వృత్తి నిపుణులు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు సహా పోరాట క్షేత్రంలో ముందు వరుసలో నిలిచి పోరాడుతున్న వారిని స్వయంగా కలిసి భారత నౌకాదళం తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్-19 రోగులకు విజయవంతంగా చికిత్స చేయడంలో వారందరి కృషిని ప్రశంసిస్తూ వారి అవిశ్రాంత కృషికి ధన్యవాదాలు తెలియచేశారు.

మానవ మాటల హారం :  గోవాలోని ఐఎన్ఎస్ హంసకు చెందిన 1500 మంది భారత నావికులు మానవ మాటల హారంగా ఏర్పాటై కరోనా యోధులకు కృతజ్ఞత తెలియచేశారు.

నౌకాదళ బ్యాండు :  కోచిలో ఉదయాన్నే అత్యంత ప్రముఖ ప్రదేశాలైన కోచి షిప్ యార్డ్ లిమిటెడ్ కు ఎదురుగా నిలిపిన యుద్ధ నౌక ఉపరితలం నుంచి, విక్రాంత్ వెందురుతి వంతెన సమీపం నుంచి ఎస్ఎన్ సి బ్యాండ్ కొన్ని ప్రముఖ గీత వాద్యాలు మోగించింది. ముంబైలోని ఎక్స్ విరాట్ నౌక పై నుంచి, విశాఖపట్టణం హార్బర్ నుంచి కూడా నౌకా దళ బ్యాండు దళాలు గీతవాద్యాలు ఆలపించాయి.

గగనతలం నుంచి...
కోచి :  కృతజ్ఞతా పూర్వక వందనంలో భాగంగా నౌకాదళానికి చెందిన చేతక్ హెలీకాప్టర్ కోచి జిల్లా ఆస్పత్రిపై పూల వాన కురిపించింది. ఆ తర్వాత భారత నౌకాదళానికి చెందిన 2 డార్నియర్ విమానాలు, 1 సీ కింగ్ హెలీకాప్టర్, 2 అత్యాధునిక తేలిక రకం హెలీకాప్టర్లు, 2 చేతక్ హెలీకాప్టర్లు మెరైన్ డ్రైవ్ మీదుగా గగనతలంలో విన్యాసాలు చేశాయి. వెనువెంటనే 7 ఫాస్ట్ ఇంటర్ సెప్టర్ హెలీకాప్టర్లు కరోనా పోరాట యోధులకు ధన్యవాదాలు తెలిపే బ్యానర్ ను ప్రదర్శిస్తూ గగనతలంలో తిరిగాయి.  
విశాఖపట్టణం : ఐఎన్ఎస్ డేగకు చెందిన చేతక్ హెలీకాప్టర్ ఆంధ్రా మెడికల్ కాలేజి, ప్రభుత్వ ఛాతీ వ్యాధులు, అంటు వ్యాధుల ఆస్పత్రి (జిహెచ్ సిసిడి), గీతమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లపై (జిఐఎంఎస్ఆర్) పూలవర్షం కురిపించింది. 

ముంబై :  భారత నౌకాదళానికి చెందిన చేతక్ హెలీకాప్టర్ ముంబైలోని కస్తూర్బా గాంధీ ఆస్పత్రి, అశ్విని ఆస్పత్రులపై విన్యాసాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించింది.

గోవా :  చేతక్ హెలీకాప్టర్ గోవాలో గగనవిహారం చేస్తూ గోవా మెడికల్ కాలేజి, ఇఎస్ఐ ఆస్పత్రులపై (ఐసిజి సహాయంతో) పూలవాన కురిపించింది.
అండమాన్-నికోబార్ దీవులు :  భారత నౌకాదళానికి చెందిన విమానాలు, హెలీకాప్టర్లు వైమానిక స్థావరం, కోస్ట్ గార్డ్ స్థావరం మీదుగా అండమాన్ నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాలపై గగన విన్యాసాలు చేశాయి.

సాగర ఉపరితలంపై...
తూర్పు నౌకా దళం :  కోవిడ్ మహమ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న యోధులకు తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల మీద నుంచి నౌకా దళాలు అంజలి ఘటించాయి.
పశ్చిమ నౌకా దళం : అరేబియా సముద్రంలో నిలిపి ఉంచిన నౌకలపై నుంచి భారత నౌకాదళ సిబ్బంది కరోనా పోరాట యోధుల చెక్కు చెదరని విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. 

కర్వార్ ప్రాంతంలో నిలిపిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య పై నుంచి భారత నౌకాదళానికి చెందిన నావికులు మానవ హారంగా ఏర్పడి కృతజ్ఞతలు తెలిపారు.
పశ్చిమ నౌకాదళ స్థావరం :  కోచిలో 7 ఫాస్ట్ ఇంటర్ సెప్టర్ విమానాలు కరోనా పోరాట యోధులకు గౌరవ సూచకంగా ఆవిరి వదిలే యంత్రాలతో పొగలు వదులుతూ గగనతల విహారం చేశాయి.

లంగరు వేసిన నౌకల ధగధగలు
ఈ కార్యక్రమాలన్నింటికీ పతాక కార్యక్రమంగా అండమాన్, నికోబార్ సహా దేశంలోని 9 పోర్టు నగరాల సమీపంలో 25 భారత నౌకాదళ యుద్ధ నౌకలు సాగర జలాలపై 7 గంటల 30 నిముషాల నుంచి లంగరు వేసిన నౌకల్లో కాంతులు విరజిమ్మే దీపాలతో వెలుగులు పంచుతూ సైరన్లు మోగించాయి.

 (Release ID: 1620834) Visitor Counter : 109