PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
01 DEC 2020 5:33PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా
పీఐబీ పరిశీలనలో నిగ్గుతేలిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- భారత్‌లో ఇవాళ 4,35,603 వద్ద నిలిచిన చురుకైన కేసులు
- గత 24 గంటల్లో కోలుకున్న కేసులు 41,985 కాగా, కొత్త కేసులు 31,118 మాత్రమే
- దేశంలో ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 88,89,585; కోలుకునేవారి సగటు 93.94 శాతం
- కోవిడ్-19 టీకా రూపకల్పన-తయారీలో నిమగ్నమైన మూడు బృందాలతో ప్రధానమంత్రి చర్చ
- దేశంలో టీకా రూపకల్పన-తయారీ ప్రక్రియ సాగుతున్న 3 ప్రదేశాల్లోనూ ప్రధానమంత్రి సమీక్ష
- భారతీయ కోవిడ్-19 టీకా రూపకల్పన ప్రక్రియను వేగిరపరచే దిశగా ‘మిషన్ కోవిడ్ సురక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
భారత్‌లో చురుకైన కేసులు మరింత తగ్గి 4.35 లక్షలకు పరిమితం; రోజువారీ కొత్త కేసులను అధిగమించిన కోలుకునే కేసుల సంఖ్య
భారత్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5లక్షలకన్నా దిగువన స్థిరంగా కొనసాగుతూ ఇవాళ 4,35,603 వద్ద నిలిచింది. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులలో ఇది 4.60 శాతం మాత్రమే కావడం విశేషం. రోజువారీ కోలుకునే కేసులు, కొత్త కేసులను అధిగమించిన నేపథ్యంలో నేడు ఈ రెండింటి మధ్య నికర వ్యత్యాసం 11,349గా నమోదైంది.
కొన్ని రాష్ట్రాల్లో (కేరళ, ఢిల్లీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వగైరా) గత 24 గంటల్లో చురుకైన కేసుల భారం తగ్గుముఖం పట్టినా; ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, గోవావంటి రాష్ట్రాల్లో అదనంగా నమోదైంది. మొత్తంమీద గత 24 గంటల్లో 31,118 కొత్త కేసులు నమోదవగా 41,985 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 88,89,585కు పెరిగి, కోలుకునేవారి జాతీయ సగటు 93.94 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలో కోలుకున్న-ప్రస్తుత కేసుల మధ్య అంతరం స్థిరంగా పెరుగుతూ ఇవాళ 84,53,982కు చేరుకుంది. కోలుకున్న తాజా కేసులలో 76.82 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. కేరళలో అత్యధికంగా 6,055 మందికి వ్యాధి నయం కాగా, ఢిల్లీ (5,824) రెండోస్థానంలో ఉంది. ఇక కొత్త కేసులలో 77.79 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైనవి కాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 3,837, ఢిల్లీలో 3,726, కేరళలో 3,382 వంతున ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో సంభవించిన 482 మరణాలకుగాను 81.12 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైనవే. ఈ మేరకు ఢిల్లీలో అత్యధికంగా 108 మంది (22.4 శాతం) ప్రాణాలు కోల్పోగా- మహారాష్ట్రలో 80 మంది, పశ్చిమ బెంగాల్‌లో 48 మంది మహమ్మారికి బలయ్యారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677340
ఓల్డ్ ఢిల్లీ రైల్వేస్టేషన్ వద్ద ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో సంయుక్తంగా మాస్కులు, సబ్బులు పంపిణీ చేసిన డాక్టర్ హర్షవర్ధన్
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సిఎస్) చైర్మన్ హోదాలో ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ప్రజలకు మాస్కులు, సబ్బులు పంపిణీ చేశారు. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడంలోని ప్రాముఖ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. “కోవిడ్‌పై మన పోరాటానికి త్వరలోనే 11 నెలలు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో స్వీయ రక్షణతోపాటు ఇతరుల రక్షణ కోసం పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడమే మనం అనుసరించాల్సిన కీలక ప్రాథమిక సూత్రాలు. ఈ యుద్ధంలో మన అతిపెద్ద ఆయుధం మాస్క్, శానిటైజర్” అని డాక్టర్ హర్షవర్ధన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి ఉండటాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసి) విద్యార్థులను ఉద్దేశించి డిజిటల్ మాధ్యమంద్వారా డాక్టర్ హర్షవర్ధన్ ప్రసంగం
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శుక్రవారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసి) విద్యార్థులనుద్దేశించి డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. భవిష్యత్తరం పాత్రికేయులతో ముచ్చటించేందుకు తనను ఆహ్వానించడంపై ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా మాధ్యమం ప్రజా ధోరణిని ప్రభావితం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పాత్రికేయులు తమ భుజస్కంధాలపై గురుతర బాధ్యతను మోయాల్సి ఉంటుంది” అని డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మహమ్మారిపై పోరాటంలో గత 11 నెలలుగా పాత్రికేయుల కృషిని ఆయన ప్రశంసించారు. ప్రజలకు సమాచారం అందించే కర్తవ్య నిర్వహణలో ప్రాణాలర్పించిన పాత్రికేయులకు ఆయన నివాళి అర్పించారు.
కోవిడ్-19 టీకా రూపకల్పన-తయారీలో నిమగ్నమైన మూడు బృందాలతో ప్రధానమంత్రి చర్చ
కోవిడ్-19 టీకా అభివృద్ధి-తయారీలో నిమగ్నమైన 3 బృందాలతో ప్రధానమంత్రి సోమవారం దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు. పుణెలోని జెన్నోవా బయో- ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని బయోలాజికల్-ఇ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్-19 నిరోధం దిశగా టీకాను కనుగొనడంలో ఈ సంస్థల్లోని శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రశంసించారు. టీకాల అభివృద్ధిలో వివిధ వేదికల సామర్థ్యం గురించి కూడా వారితో చర్చించారు. నియంత్రణ ప్రక్రియలు, సంబంధిత అంశాలపై కంపెనీలు తమ సూచనలు/ఆలోచనలను వెల్లడించాలని ప్రధానమంత్రి కోరారు. టీకా, దాని సామర్థ్యం తదితరాలపై సామాన్య ప్రజానీకానికి సాధారణ భాషలో తెలిపేందుకు అదనపు ప్రయత్నాలు చేయాలని కూడా ప్రధాని సూచించారు. టీకాల పంపిణీకి సంబంధించి రవాణా విధానాలు/ వాహనాలు, శీతల నిల్వ సౌకర్యాలు తదితరాలపైనా ఈ కార్యక్రమంలో చర్చించారు.
వారణాసిలో దేవ్ దీపావళి మహోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం వారణాసిలో నిర్వహించిన దేవ్ దీపావళి మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- కాశీ నగరానికి ఇదొక ప్రత్యేక సందర్భమని, 100 సంవత్సరాల కిందట అపహరణకు గురైన మాతా అన్నపూర్ణ విగ్రహం తిరిగి కాశీకి చేరుకోనున్నదని చెప్పారు. కాశీ నగరానికి ఇదొక గొప్ప అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. పురాతన దేవతా విగ్రహాలు మన విశ్వాసాలకు, అమూల్యమైన మన వారసత్వానికి చిహ్నాలని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దేవ్ దీపావళి మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం
ఎన్‌హెచ్-19లో భాగమైన వారణాసి-ప్రయాగ్‌రాజ్ రహదారి ఆరు వరుసల విస్తరణ పథకాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో జాతీయ రహదారి-19లో భాగమైన వారణాసి- ప్రయాగ్‌రాజ్ మార్గం ఆరు వరుసల విస్తరణ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- లోగడ చేపట్టిన కాశీనగర సుందరీకరణతోపాటు అనుసంధాన కృషి ఫలితాలు నేడు ప్రస్ఫుటం అవుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వారణాసి పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకల రద్దీ నియంత్రణకు చేపట్టిన అనేక పథకాల పనులు కనీవినీ ఎరుగని వేగంతో పూర్తయ్యాయని గుర్తుచేశారు.
ఎన్‌హెచ్-19లో భాగమైన వారణాసి-ప్రయాగ్‌రాజ్ రహదారి ఆరు వరుసల విస్తరణ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం
దేశంలో టీకా రూపకల్పన-తయారీ సాగుతున్న 3 ప్రదేశాల్లోనూ ప్రధాని సమీక్ష
దేశంలో కోవిడ్-19 టీకా రూపకల్పన-తయారీ ప్రక్రియను సమీక్షించడ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం మూడు నగరాల్లో పర్యటించారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ సంస్థలను ఆయన సందర్శించారు. టీకా తయారీపై ప్రధానమంత్రి స్వయంగా తమతో చర్చించడంద్వారా ఆత్మస్థైర్యాన్ని ఇనుమడింపజేశారని శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. టీకా అభివృద్ధి కీలకదశలోగల ప్రస్తుత తరుణంలో ఆయన సందర్శన ఈ కృషిని మరింత వేగిరపరుస్తుందని వారు పేర్కొన్నారు. దేశంలో టీకా రూపకల్పన-తయారీ ప్రక్రియ ఇంత వేగంగా ముందంజ వేయడం గర్వంగా ఉందని ప్రధానమంత్రి సంతోషం వెలిబుచ్చారు. ప్రజలకు టీకాను చేరవేసే ప్రక్రియను మెరుగుపరచడంపై సూచనలు, సలహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
‘మన్ కీ బాత్ 2.0’ కార్యక్రమం 18వ సంచికలో భాగంగా 29.11.2020నాటి ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం
యూకే ప్రధానమంత్రి గౌరవనీయ బోరిస్ జాన్సన్‌తో ప్రధానమంత్రి సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం నాడు యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని గౌరవనీయ బోరిస్ జాన్సన్‌తో ఫోన్‌ద్వారా సంభాషించారు. కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాళ్లపై దేశాధినేతలిద్దరూ ఈ సందర్భంగా చర్చించారు. అలాగే టీకా రూపకల్పన-తయారీలో రెండు దేశాల మధ్య ఆశావహ సహకారంపై సమీక్షించారు. కోవిడ్/బ్రెగ్జిట్ అనంతర కాలంలో భారత-యూకే భాగస్వామ్యానికి మరింత ఊపునివ్వాలని వారు సంయుక్తంగా అభిప్రాయపడ్డారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676636
దేశవ్యాప్తంగా 2020 నవంబరులో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) స్థూల వసూళ్లు రూ.1,04,963 కోట్లు
దేశవ్యాప్తంగా 2020 నవంబరులో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) స్థూలవసూళ్లు రూ.1,04,963 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.19,189కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.25,540 కోట్లు, సమీకృత జీఎస్టీ రూ.51,992 కోట్లు (వస్తు దిగుమతిపై రూ.22,078 కోట్లుసహా), రుసుములు రూ.8,242 కోట్లు (వస్తు దిగుమతిపై రూ.809 కోట్లు సహా)గా ఉంది. ఇక 2020 నవంబరులో సాధారణ పరిష్కారాల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం ఆదాయం కేంద్ర జీఎస్టీ కింద రూ.41,482 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ కింద రూ.41,826 కోట్లుగా నమోదైంది.
భారతీయ కోవిడ్-19 టీకా రూపకల్పన ప్రక్రియ వేగిరపరచే దిశగా ‘మిషన్ కోవిడ్ సురక్ష’ను ప్రారంభించిన ప్రభుత్వం
భారతీయ కోవిడ్-19 టీకా రూపకల్పన కార్యక్రమం కోసం “మిషన్ కోవిడ్ సురక్ష” పేరిట రూ.900 కోట్లతో మూడో ఉద్దీపన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయ కోవిడ్-19 టీకాలపై పరిశోధన-అభివృద్ధి కోసం ఈ నిధులను బయోటెక్నాలజీ విభాగానికి (డిబిటి) పూర్తి సహాయం కింద అందజేస్తుంది. ఈ కార్యక్రమం కింద దాదాపు 5-6 సంభావ్య తుది టీకాల అభివృద్ధిని వేగవంతం చేస్తారు. ఇందులో భాగంగా ప్రయోగ పరీక్షలకు ముందు-తర్వాత ప్రగతిని వేగవంతం చేయడం; ప్రస్తుతం ప్రయోగదశలోగల లేదా అది ముగిసి, పూర్తిస్థాయి తయారీకి సిద్ధంగా ఉన్న కోవిడ్-19 సంభావ్య టీకాలకు లైసెన్స్, ప్రయోగ పరీక్షల ప్రదేశాల నిర్ణయం తదితర అనుబంధ చర్యలు చేపడతారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677127
ఢిల్లీలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిలో ఐసీయూ సామర్థ్యం పెంపు
ఢిల్లీలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిలో ఐసీయూ పడకల సంఖ్యను 500కు పెంచారు. దేశ రాజధానిలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) స్పందించింది. కాగా, ఈ పడకలన్నిటికీ ప్రాణవాయు సరఫరాను జోడించినట్లు వెల్లడించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిని 1000 పడకల సామర్థ్యంతో డీఆర్‌డీవో 2020 జూలై 5న ప్రారంభించింది. ఢిల్లీతోపాటు పరిసర రాష్ట్రాలనుంచి వచ్చే కోవిడ్ కేసులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677074
కోవిడ్-19 సంక్షోభం సమయాన పాఠశాల విద్యాశాఖ చేపట్టిన చర్యల సంకలనాన్ని ఆవిష్కరించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
కోవిడ్-19 సంక్షోభ సమయంలో పాఠశాల విద్యాశాఖ చేపట్టిన చర్యల సంకలనాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ శుక్రవారం దృశ్య మాధ్యమం ద్వారా ఆవిష్కరించారు. ప్రస్తుత 2020-21లో కోవిడ్-19 సంక్షోభం మునుపెన్నడూ లేనిరీతిలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సృష్టించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ప్రపంచ జనజీవనంపై మహమ్మారి పెనుసవాలుతో దేశంలో పాఠశాలలు మూతపడి పిల్లల చదువుపై ప్రభావం పడిందన్నారు. అయితే, విద్యార్ధులు చదువులో వెనుకబడకుండా పాఠశాల విద్యాశాఖ చొరవ చూపిందని, తదనుగుణంగా అనేక వినూత్న చర్యలు చేపట్టిందని పోఖ్రియాల్ వివరించారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676626
జీవన ప్రమాణ పత్రం సమర్పణ గడువును 2021 ఫిబ్రవరి 28దాకా పొడిగించిన ఈపీఎఫ్‌వో; 35 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం
కోవిడ్-19 పరిస్థితులు కొనసాగడంతోపాటు వృద్ధులు కరోనా వైరస్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉన్న దృష్ట్యా పెన్షనర్లు జీవన ప్రమాణ పత్రం-జేపీపీ సమర్పించాల్సిన గడువును 2021 ఫిబ్రవరి 28వరకూ పొడిగించినట్లు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎప్‌వో) ప్రకటించింది. ఈపీఎఎస్-1995 కింద పెన్షన్ పొందుతున్నవారితోపాటు 2021 ఫిబ్రవరి 28లోగా జేపీపీల దాఖలు గడువుగలవారందరికీ ఈ పొడిగింపు వర్తిస్తుంది. కాగా, జేపీపీ సమర్పణ కోసం నేడు 3.65 లక్షల సర్వజన సేవా కేంద్రాలు (సిఎస్‌సి); పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకుల శాఖలు; 1.36 లక్షల పోస్టాఫీసులుసహా తపాలాశాఖ పరిధిలో 1.90 లక్షల మంది పోస్టుమ్యాన్లు, గ్రామీణ డాక్ సేవకులతో కూడిన నెట్‌వర్క్ వంటి సదుపాయాలున్నాయి. ఇందులో భాగంగా పెన్షనర్లు తమ సమీపంలోని సీఎస్‌సీల కోసం https://locator.csccloud.in/ లింకుద్వారా అన్వేషించవచ్చు. అలాగే తమ సౌలభ్యం మేరకు ఇంటినుంచి లేదా ఇతర చోట్లనుంచి పోస్టాఫీసుకు ఆన్-లైన్ అభ్యర్థన పంపడం కోసం http://ccc.cept.gov.in/covid/request.aspx లింకును వాడుకోవచ్చు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676759
ఆర్చర్ కపిల్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ, ప్రస్తుతం లక్షణరహితం
పుణెలోని సైనిక క్రీడా సంస్థలో నిర్వహిస్తున్న జాతీయ విలువిద్య శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న జాతీయ విలువిద్య క్రీడాకారుడు కపిల్ కరోనా వైరస్‌బారిన పడినట్లు నిర్ధారణ అయింది. అయితే, వ్యాధి లక్షణాలు కనిపించడంలేదని, అతన్ని పర్యవేక్షిస్తున్న వైద్యులు తెలిపారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677211
కోవిడ్ బారినపడిన బాక్సర్ దుర్యోధన్ సింగ్ నెగి; ప్రస్తుతం లక్షణరహితం
పాటియాలలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్‌ఏఐ)కు చెందిన ‘ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్’లో శిక్షణ పొందుతున్న జాతీయ బాక్సర్ దుర్యోధన్ సింగ్ నెగి (69 కిలోలు)కి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. అతనిలో ప్రస్తుతం వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా, ముందు జాగ్రత్త చర్యగా కొలంబియా ఆసియా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675501
బల్క్ డ్రగ్స్-వైద్య పరికరాలపై 30-11-2020న ముగిసిన ‘పీఎల్‌ఐ’ పథకాలకు ఔషధ/వైద్య పరికరాల పరిశ్రమ నుంచి సానుకూల స్పందన
బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలకు సంబంధించి ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాలకు ఔషధ/వైద్య పరికరాల పరిశ్రమల రంగం ఎంతో సానుకూల స్పందన కనబరచింది. ఈ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు 30.11.2020న ముగిసిన నేపథ్యంలో బల్క్ డ్రగ్స్‌కు సంబంధించి 83 ఔషధ సంస్థలనుంచి 215 దరఖాస్తులు అందాయి. అలాగే 23 వైద్య పరికరాల తయారీ సంస్థలు 28 దరఖాస్తులు సమర్పించాయి.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677416
భారత వృద్ధి పయనాన్ని చాటుతున్న ఎఫ్‌పిఐ, ఎఫ్‌డిఐ/కార్పొరేట్ బాండ్ల మార్కెట్ ప్రవాహ పోకడలు
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడి వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది, ఇందుకు భారత్ మినహాయింపు కానప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నిరంతర, చురుకైన చర్యల ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల ప్రవాహం పుంజుకుంది. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం, పునరుత్థాన శక్తిపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని సూచించే, ప్రస్ఫుటం చేసేలా ఎఫ్‌పీఐ, ఎఫ్‌డిఐ/కార్పొరేట్ బాండ్ల మార్కెట్ ప్రవాహాల పోకడ భారత వృద్ధి పయనాన్ని మరింత ముందుకు తీసుకెళ్తోంది. ఈ మేరకు ఎఫ్‌పీఐల ప్రవాహం నవంబర్ 2020 నాటికి రూ.62,782 కోట్లు కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐ ఈక్విటీల ప్రవాహం 2020 సెప్టెంబర్ వరకు 30,004 మిలియన్ డాలర్ల స్థాయిని అందుకుంది. కాగా, 2019-20లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం అధికం.
మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1677388
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- అస్సాం: రాష్ట్రంలో 22,683 పరీక్షలు నిర్వహించగా, 0.70 శాతం నిర్ధారణ సగటుతో 159 కేసులు నమోదవగా 110 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని, రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 2,12,776కు చేరిందని అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ట్వీట్ చేశారు.
- నాగాలాండ్: రాష్ట్రంలో 27 కొత్త కేసులు నమోదవగా మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 11,186కు చేరింది. ప్రస్తుతం నాగాలాండ్‌లో యాక్టివ్ కేసులు 925గా ఉన్నాయి.
- సిక్కిం: రాష్ట్రంలో రాత్రివేళ ప్రజా సంచారంపై ప్రభుత్వం నిషేధం విధించిచంది. కాగా, తాజాగా 26 మందికి వ్యాధి నయం కాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 4,544కు చేరింది. సిక్కింలో ప్రస్తుతం 248 క్రియాశీల కేసులున్నాయి.
- మేఘాలయ: రాష్ట్రంలో గత 24 గంటలలో 70 కొత్త కేసులు నమోదవగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. కాగా, ప్రస్తుతం చురుకైన కేసుల సంఖ్య 763గా ఉంది.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా మాస్కు ధరించనివారినుంచి రూ.200 జరిమానా వసూలు చేయాలని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) కమిషనర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఏప్రిల్ నుంచి నవంబర్ 28దాకా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని 4.85 లక్షల మంది పౌరుల నుంచి రూ.10.7 కోట్లు జరిమానా కింద వసూలు చేసినట్లు బీఎంసీ తెలిపింది.
- గుజరాత్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1502 కొత్త కేసులు నమోదవగా కోలుకునేవారి సగటు 90.96 శాతంగా ఉంది. గుజరాత్‌లో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 2,90,780కి చేరింది. గత 24 గంటల్లో 1401 మంది కోలుకోగా ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 1,90,821కు చేరింది.
- రాజస్థాన్: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు, వినోద స్థలాల మూసివేత డిసెంబర్ 31దాకా కొనసాగుతుందని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది. కాగా, రాజస్థాన్‌లో నిన్న 20 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 2,312కు చేరగా, తాజాగా 2,677 కేసులు నమోదయ్యాయి.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలోని పలు నగరాల్లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. మొత్తంమీద మధ్యప్రదేశ్‌లో చురుకైన కేసుల సంఖ్య సుమారు 15వేలకు చేరింది. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన ముమ్మర అవగాహన కల్పన ప్రచారంలో భాగంగా వివిధ సంస్థలు యముడు, చిత్రగుప్తుడు పాత్రల ద్వారా మాస్కు ధారణ ప్రాముఖ్యాన్ని ప్రజలకు సూచించడంతోపాటు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో సోమవారం 1,324 కొత్త కేసులు, 21 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,37,322కు, మృతుల సంఖ్య 2,861కి చేరాయి. వివిధ ఆసుపత్రుల నుండి 153 మంది ఇళ్లకు వెళ్లిన నేపథ్యంలో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 2,14,826కు పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం 19,635 చురుకైన కేసులు కాగా, మొత్తం మరణాలు 656; నమోదైన కేసులు 46,526గా ఉన్నాయి.
- గోవా: గోవాలో మాస్కులు లేకుండా సంచరించే పర్యాటకుల ఫొటోలు తీసి, వారికి జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల చాలామంది పర్యాటకులు మాస్కులు ధరించకపోగా, ప్రశ్నించిన పోలీసులపై వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పణజి నగర మేయర్ ఉదయ్ మద్కైకర్ సోమవారం కీలక ప్రకటన చేశారు. కాగా, మాస్కు ధరించకపోతే విధించే జరిమానాను ప్రభుత్వం గతవారంలోనే రూ.200కు పెంచింది.
- కేరళ: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రచారం సందర్భంగా కోవిడ్-19 వ్యాప్తిపై ఆరోగ్యశాఖ మంత్రి కె.శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోతుందని ఆమె హెచ్చరించారు; కాగా, నిన్న కేరళలో 3382 కొత్త కేసులు నమోదవగా, రాష్ట్రంలో ఇప్పటిదాకా 2244 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తమిళనాడు: రాష్ట్రంలోని కళాశాలలు డిసెంబర్ 7న పునఃప్రారంభం కానున్నాయి. అలాగే డిసెంబర్ 14 నుంచి బీచ్‌లు, పర్యాటక ప్రదేశాలలో సందర్శకులను అనుమతించనున్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ క్రమంలో భాగంగా మంగళవారం నుంచి దిగ్బంధం మరింత సడలింపు ప్రణాళికను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు.
- కర్ణాటక: కేంద్ర ప్రభుత్వ సూచనమేరకు కోవిడ్-19 టీకా సరఫరా, పంపిణీ, పాలన వ్యవహారాలకు తగిన సన్నాహాలు ప్రారంభించినట్లు కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది; ఇందులో భాగంగా ఇప్పటివరకూ 68,317 ప్రభుత్వ, 35,310 మంది ప్రైవేట్ సంభావ్య వ్యాక్సినేటర్లను గుర్తించారు.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో రెండోదఫా కోవిడ్ విజృంభణ ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. అయితే, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆస్పత్రుల సామర్థ్యాన్నిగానీ, పరీక్షల సంఖ్యనుగానీ తగ్గించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ మరణాల సగటు అత్యల్పంగా 0.81 శాతం కాగా, ప్రతి 10 లక్షల జనాభాకు పరీక్షల సగటు అత్యధికంగా 1.8 లక్షలుగా ఉందని, మొత్తం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు.
- తెలంగాణ: రాష్ట్రంలో 502 కొత్త కేసులు, 3 మరణాలతో తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసుల నమోదు క్షీణత ధోరణి కొనసాగింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2.70 లక్షలకుపైగా ఉంది; కాగా, నవంబర్ 30 రాత్రి 8 గంటలదాకా సమాచారం మేరకు కొత్త కేసులలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 101 నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి 46, భద్రాద్రి కొత్తగూడెం 33 కేసుల వంతున తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ప్రభుత్వ బులెటిన్ పేర్కొంది.
FACT CHECK
*******
(Release ID: 1677617)
|