ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐ.ఐ.ఎం.సి) విద్యార్థులనుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించిన - డాక్టర్ హర్ష్ వర్ధన్
పోలియోకు వ్యతిరేకంగా యుద్ధానికి కేంద్ర బిందువుగా నిలిచిన - హెల్త్ జర్నలిజం
2025 నాటికి టి.బి. ని నిర్మూలించడంలో వర్ధమాన జర్నలిస్టుల సహాయం కోరిన - డాక్టర్ హర్ష్ వర్ధన్
Posted On:
27 NOV 2020 5:45PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐ.ఐ.ఎం.సి) విద్యార్థులనుద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వర్ధన్ విద్యార్థులకు స్వాగతం పలుకుతూ, వర్ధమాన జర్నలిస్టులతో సంభాషించడానికి తనను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రజాస్వామ్యం యొక్క నాల్గవ స్తంభంగా, మీడియా ప్రజల వైఖరిలో మార్పు తీసుకురావడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల, జర్నలిస్టుల భుజాలపై భారీ బాధ్యత ఉంది, ఎందుకంటే వారు ఎంతో విలువైన ప్రతిస్పందనలను అందించగలరు. ” అని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు.
గత 11 నెలల నుండి మహమ్మారి కారణంగా సంక్షోభ సమయాల్లో జర్నలిస్టుల కృషిని డాక్టర్ వర్ధన్ ప్రశంసిస్తూ, "జర్నలిస్టులు క్షత్రస్థాయి నుండి ప్రజలకు సమాచారం అందించడం కోసం 24 గంటలూ పనిచేశారు. 2020 జనవరిలో ప్రారంభమైన కోవిడ్ యుద్ధం ఇప్పుడు పదకొండవ నెలలో కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో మీడియా ఒక చురుకైన భాగస్వామిగా పనిచేసింది.” అని వివరించారు. ప్రజలకు సమాచారం అందించే ప్రయత్నంలో ప్రాణాలను అర్పించిన వారికి ఆయన ఈ సందర్భంగా నివాళులర్పించారు. "నా కరోనా యోధుల జాబితాలో జర్నలిస్టులు కూడా ఉన్నారు" అని ఆయన అన్నారు.
పోలియోమైలిటిస్‌కు వ్యతిరేకంగా పోరాటంలో జర్నలిస్టుల సహకారాన్ని మంత్రి గుర్తుచేసుకుంటూ, "పోలియోకు వ్యతిరేకంగా మా యుద్ధానికి హెల్త్ జర్నలిజం కేంద్ర బిందువుగా నిలిచింది. పోలియో ప్రభావిత ప్రజలలో 60 శాతం మంది భారతదేశంలోనే ఉన్న సమయంలో, పోలియో రహిత భారతదేశం గురించి కలలు కనడం వాస్తవికతకు ఎంతో దూరంగా ఉండేది. జర్నలిస్టుల సానుకూల రచనలు దీనిని విజయవంతమైన జాతీయ కార్యక్రమంగా మార్చడంలో సహాయపడ్డాయి.” అని పేర్కొన్నారు.
2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనకు సహాయం చేయవలసిందిగా డాక్టర్ హర్ష వర్ధన్ పాత్రికేయులను కోరుతూ, “టి.బి. నిర్మూలన కార్యక్రమంలో మీరు మనఃస్ఫూర్తిగా పనిచేసి, ఈ కలను సాకారం చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల భాగస్వామ్యం ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది.” అని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, “అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా మీడియా తనను తాను నిరోధించాలి. ప్రజలు తమకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించడానికి మీడియాపై నమ్మకం ఉంచారు. ప్రజలకు విశ్వసనీయమైన, ధృవీకరించబడిన సమాచారాన్ని అందించడం ప్రతి పాత్రికేయుని విధి అవుతుంది. ధృవీకరించని వార్తలు ప్రజలకు అందుబాటులో ఉండే మాధ్యమాల ద్వారా ప్రసారం కావడం చాలా ప్రమాదకరం మరియు భారీ నష్టం కలిగిస్తుంది.” అని పేర్కొన్నారు.
ఆరోగ్యం మరియు విజ్ఞాన రంగంలో వర్ధమాన జర్నలిస్టులకు మంచి అభ్యాస అనుభవంగా ఉండే విధంగా పత్రికా రంగం మరియు ఆయా మంత్రిత్వ శాఖల మధ్య ఒక సహకార కార్యక్రమాన్ని ప్రారంభించాలని డాక్టర్ హర్ష వర్ధన్ ప్రతిపాదించారు.
ఈ కార్యక్రమంలో - ఐ.ఐ.ఎమ్.సి. డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ సంజయ్ ద్వివేది; ఐ.ఐ.ఎమ్.సి. అదనపు డైరెక్టర్ జనరల్ (అడ్మిన్) శ్రీ ఎ. సతీష్ నంబూద్రిపాద్; కార్యక్రమ సమన్వయకర్త ప్రొ. సురభి దహియా తో పాటు, కార్యక్రమ సహ-సమన్వయకర్త ప్రొఫెసర్ (డాక్టర్) ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.
*****
(Release ID: 1676628)
Visitor Counter : 168