ప్రధాన మంత్రి కార్యాలయం
2020వ సంవత్సరం నవంబర్ 29వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) యొక్క 18వ భాగం ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
29 NOV 2020 11:50AM by PIB Hyderabad
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. ఈ రోజు 'మన్ కీ బాత్' ప్రారంభంలో మీతో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. అతి పురాతనమైన అన్నపూర్ణ దేవత విగ్రహం కెనడా నుండి భారతదేశానికి తిరిగి వస్తోంది. ఈ విషయం తెలుసుకోవడం ప్రతి భారతీయుడికి గర్వంగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని సుమారు వంద సంవత్సరాల కిందట 1913లో వారణాసిలోని ఒక ఆలయం నుండి దొంగిలించి దేశం నుండి బయటికి తరలించారు. కెనడా ప్రభుత్వానికి, ఈ మంచి పనిని సాధ్యం చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నపూర్ణ మాతకు కాశీతో చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇప్పుడు ఆ మాత విగ్రహం తిరిగి రావడం మనందరికీ సంతోషకరంగా ఉంది.
అన్నపూర్ణ మాత విగ్రహం లాగే మన వారసత్వ సంపద- అత్యంత విలువైన వారసత్వ సంపద - అంతర్జాతీయ ముఠాల బారినపడింది. ఈ ముఠాలు అంతర్జాతీయ మార్కెట్లో వాటిని చాలా ఎక్కువ ధరలకు అమ్ముతాయి. ఇలాంటి వాటిపై ఇకపై కఠినంగా ఉంటాం. ఆ సంపద తిరిగి రావడానికి భారతదేశం తన ప్రయత్నాలను పెంచింది. ఇటువంటి ప్రయత్నాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం అనేక విగ్రహాలను, కళాఖండాలను తిరిగి తీసుకురావడంలో విజయవంతమైంది. మాతా అన్నపూర్ణ విగ్రహం తిరిగి రావడంతో పాటు కొన్ని రోజుల క్రితం ప్రపంచ వారసత్వ వారోత్సవం కూడా జరుపుకోవడం యాదృచ్చికం.
ప్రపంచ వారసత్వ వారోత్సవం సంస్కృతి ప్రేమికులకు పాత కాలానికి తిరిగి వెళ్లడానికి, చరిత్రపై వారి ఉత్సాహాన్ని పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. కరోనా కాలం ఉన్నప్పటికీ ఈసారి ప్రజలు ఈ వారసత్వ వారోత్సవాన్ని వినూత్నంగా జరుపుకోవడం చూశాం. సంక్షోభంలో సంస్కృతి చాలా ఉపయోగపడుతుంది. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సంస్కృతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సంస్కృతి కూడా టెక్నాలజీ ద్వారా భావోద్వేగాలను పెంచడంలో ఉపయోగపడుతుంది. దేశంలోని అనేక మ్యూజియాలు, గ్రంథాలయాలు వాటి సేకరణను పూర్తిగా డిజిటల్ రూపంలోకి తేవడానికి కృషి చేస్తున్నాయి. ఢిల్లీలోని మన జాతీయ మ్యూజియం ఈ విషయంలో కొన్ని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసింది. నేషనల్ మ్యూజియం ద్వారా పది వర్చువల్ గ్యాలరీలను ప్రవేశపెట్టే పని జరుగుతోంది. ఈ విషయం ఆసక్తికరంగా ఉంది కదా.. ఇప్పుడు మీరు మీ ఇంటి నుండి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం గ్యాలరీలలో పర్యటించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కువ మందికి సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం చాలా ముఖ్యం. ఈ వారసత్వ ప్రదేశాల రక్షణకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం కూడా ముఖ్యం.
నేను ఈ మధ్య ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి చదివాను. నార్వేకు ఉత్తర దిక్కులో స్వాల్బార్డ్ అనే ద్వీపం ఉంది. ఈ ద్వీపంలో ఆర్కిటిక్ ప్రపంచ ఆర్కైవ్ అనే ప్రాజెక్ట్ ను నిర్మించారు. ఈ ఆర్కైవ్‌లో విలువైన హెరిటేజ్ డేటాను ఎలాంటి ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తుల బారిన పడకుండా సురక్షితంగా ఉంచారు. ఈ ప్రాజెక్టులో అజంతా గుహల వారసత్వాన్ని కూడా డిజిటలైజ్ చేసి అలంకరిస్తున్నట్లు ఇటీవల తెలిసింది. ఇందులో మీరు అజంతా గుహల పూర్తి అవగాహన పొందుతారు. ఇందులో పునరుద్ధరించబడిన డిజిటలైజ్డ్ పెయింటింగ్‌తో పాటు సంబంధిత పత్రాలు, సూక్తులు ఉంటాయి. మిత్రులారా! అంటువ్యాధి ఒకవైపు మన పని తీరును మార్చింది. మరోవైపు ప్రకృతిని కొత్త మార్గంలో అనుభవించే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ప్రకృతిని చూడడంలో మన దృక్పథం కూడా మారిపోయింది. ఇప్పుడు మనం చలికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ప్రకృతిలోని వివిధ రంగులను మనం చూస్తాం. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ అంతా చెర్రీ బ్లాసమ్స్ వైరల్ చిత్రాలతో నిండిపోయింది. నేను చెర్రీ బ్లాసమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు జపాన్ లోని ఈ ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నానని మీరు తప్పకుండా ఆలోచిస్తూ ఉండాలి. కానీ అది నిజం కాదు.. అవి జపాన్ ఫోటోలు కాదు. షిల్లాంగ్ లో ఉన్న మేఘాలయలోని చిత్రాలివి. మేఘాలయ అందాలను ఈ చెర్రీ బ్లాసమ్స్ మరింతగా పెంచాయి.
మిత్రులారా! ఈ నెల- నవంబరు 12 వ తేదీనాడు డాక్టర్ సలీం అలీ గారి 125 వ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. పక్షుల ప్రపంచంలో డాక్టర్ సలీం పక్షుల వీక్షణతో పాటు అనేక చెప్పుకోదగ్గ పనులు చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల పక్షి వీక్షకులు కూడా భారతదేశం వైపు ఆకర్షితులయ్యారు. నేను ఎప్పుడూ పక్షిని చూసే వీక్షకుల అభిమానిని. చాలా ఓపికతో గంటల తరబడివారు పక్షులను చూస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకృతి ప్రత్యేకమైన దృశ్యాలను ఆస్వాదిస్తారు. వారి జ్ఞానాన్ని ప్రజలకు అందజేస్తారు. భారతదేశంలో కూడా బర్డ్ వాచింగ్ సొసైటీలు చురుకుగా పని చేస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా బర్డ్ వాచింగ్ తో అనుసంధానం కావాలి. నా ఉరుకులు పరుగుల జీవితంలో కూడా గతంలో పక్షులతో గడిపే అవకాశం కెవాడియాలో వచ్చింది. ఇది చాలా గుర్తుండిపోయే అవకాశం. పక్షులతో గడిపే సమయం మిమ్మల్ని ప్రకృతితో అనుసంధానిస్తుంది. పర్యావరణానికి కూడా ప్రేరణ ఇస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! భారతదేశం సంస్కృతి, శాస్త్రాలు ఎప్పుడూ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించే కేంద్రాలుగా ఉన్నాయి. వీటి అన్వేషణలో చాలా మంది భారతదేశానికి వచ్చారు. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయారు. చాలా మంది తమ దేశానికి తిరిగి వెళ్లి ఈ సంస్కృతిని వ్యాప్తి చేశారు. 'విశ్వనాథ్' అని కూడా పిలిచే జానస్ మాసెట్టి గారి గురించి నాకు తెలిసింది. జానస్ బ్రెజిల్ ప్రజలకు వేదాంతాన్ని, భగవద్గీతను బోధిస్తారు. రియో డి జనీరో నుండి గంటల తరబడి ప్రయాణ దూరంలో ఉండే పెట్రో పోలిస్ పర్వతాలలో విశ్వవిద్య అనే సంస్థను ఆయన నిర్వహిస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, తన కంపెనీలో స్టాక్ మార్కెట్లో పని చేశారు. తరువాత భారతీయ సంస్కృతి- ప్రత్యేకించి వేదాంతం వైపు ఆకర్షితులయ్యారు. స్టాక్ నుండి ఆధ్యాత్మికత వరకు- అది నిజానికి సుదీర్ఘ ప్రయాణం. జానస్ భారతదేశంలో వేదాంత తత్వాన్ని అభ్యసించారు. నాలుగు సంవత్సరాలు కోయంబత్తూర్ లోని అర్ష విద్యా గురుకులంలో నివసించారు. జానస్ కు మరో ప్రత్యేకత ఉంది. ఆయన తన సందేశాన్ని ఫార్వార్డ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఆయన క్రమం తప్పకుండా ఆన్‌లైన్ కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజూ ఆడియో ఫైళ్లను డౌన్ లోడ్ చేసేందుకు వీలుగా పాడ్ కాస్ట్ చేస్తారు. గత 7 సంవత్సరాల్లో జానస్ ఉచిత ఓపెన్ కోర్సుల ద్వారా ఒకటిన్నర లక్షకు పైగా విద్యార్థులకు వేదాంతాన్ని బోధించారు. జాన్స్ కేవలం ఇంత పెద్ద పని చేయడమే కాదు, చాలా మందికి అర్థమయ్యే భాషలో ఈ కోర్సులను నిర్వహించడం మరో విశేషం. కరోనా, క్వారంటైన్ల ఈ కాలంలో వేదాంతం ఎలా సహాయపడుతుందనే దానిపై ప్రజలకు చాలా ఆసక్తి ఉంది. జాన్స్ చేసిన కృషికి, ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు 'మన్ కీ బాత్' ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! అదే విధంగా మీరు ఒక వార్తను గమనించి ఉండాలి. న్యూజిలాండ్‌లో కొత్తగా ఎన్నికైన ఎం.పి. డాక్టర్ గౌరవ్ శర్మ ప్రపంచంలోని ప్రాచీన భాషలలో ఒకటైన సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయులుగా భారతీయ సంస్కృతి వ్యాప్తి మనందరికీ గర్వం కలిగిస్తుంది. 'మన్ కీ బాత్' ద్వారా గౌరవ్ శర్మ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజల సేవలో ఆయన కొత్త విజయాలు సాధించాలని మనమందరం కోరుకుంటున్నాం.
నా ప్రియమైన దేశవాసులారా! రేపు- నవంబర్ 30వ తేదీనాడు శ్రీ గురు నానక్ దేవ్ జీ 551 వ జయంతి సందర్భంగా ప్రకాశ్ పర్వ్ జరుపుకుంటున్నాం. గురు నానక్ దేవ్ జీ ప్రభావం ప్రపంచం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. వాంకోవర్ నుండి వెల్లింగ్టన్ వరకు, సింగపూర్ నుండి దక్షిణాఫ్రికా వరకు గురు నానక్ సందేశాలు ప్రతిచోటా వినబడతాయి. ‘సేవక్ కో సేవా బన్ ఆయీ’ అని గురు గ్రంథ్ సాహిబ్ పేర్కొంటోంది. అంటే సేవకుడి పని సేవ చేయడమేనని అర్థం. గత కొన్ని సంవత్సరాల్లో చాలా ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. సేవకుడిగా చాలా సేవ చేసే అవకాశం లభించింది. గురు సాహిబ్ మా నుండి సేవ పొందారు. గురు నానక్ దేవ్ జీ 550 వ జయంతి ఉత్సవం, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ 350 వ జయంతి ఉత్సవంతో పాటు వచ్చే ఏడాది శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 400 వ జయంతి ఉత్సవం కూడా ఉంది. గురు సాహిబ్ జీ కి నాపై ప్రత్యేక దయ ఉందని నేను భావిస్తున్నాను. ఆయన తన పనుల్లో నన్ను ఎప్పుడూ చాలా దగ్గరగా అనుసంధానించాడు.
మిత్రులారా! కచ్‌లోలఖ్ పత్ గురుద్వారా సాహిబ్ అనే పేరుతో గురుద్వారా ఉందని మీకు తెలుసా? శ్రీ గురు నానక్ తన విచార సమయంలో లఖ్‌పత్ గురుద్వారా సాహిబ్‌లో బస చేశారు. ఈ గురుద్వారా 2001 లో సంభవించిన భూకంపం వల్ల కూడా దెబ్బతింది. గురు సాహిబ్ కృప వల్ల దాని పునరుద్ధరణను నేను పూర్తి చేయగలిగాను. గురుద్వారా మరమ్మతులు చేయడమే కాదు- దాని గౌరవాన్ని, గొప్పతనాన్ని కూడా పునరుద్ధరించాం. మనందరికీ గురు సాహిబ్ నుండి ఆశీర్వాదాలు వచ్చాయి. లఖ్‌పత్ గురుద్వారా పరిరక్షణ ప్రయత్నాలకు 2004 లో యునెస్కో ఆసియా పసిఫిక్ వారసత్వ పురస్కారాలలో ప్రత్యేక అవార్డు లభించింది. మరమ్మతు సమయంలో శిల్పాలతో సంబంధం ఉన్న ప్రత్యేకతలు దెబ్బతినకుండా జాగ్రత్తగా చూసుకున్నట్టు అవార్డు అందజేసే జ్యూరీ పేర్కొన్నారు. గురుద్వారా పునర్నిర్మాణ పనులలో సిక్కు సమాజం చురుకుగా పాల్గొనడమే కాకుండా వారి మార్గదర్శకత్వంలోనే పునర్నిర్మాణం జరిగినట్టు కూడా జ్యూరీ గుర్తించారు. నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు కూడా లఖ్‌పత్ గురుద్వారాను సందర్శించే భాగ్యం నాకు లభించింది. నేను అపరిమిత శక్తిని పొందేవాడిని. ఈ గురుద్వారా సందర్శన వల్ల ధన్యులమైనట్టు అందరూ భావిస్తారు. గురు సాహిబ్ నా నుండి నిరంతర సేవలను తీసుకున్నందుకు చాలా ధన్యుడినయ్యాను. గత ఏడాది నవంబర్‌లో కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభించడం చాలా చారిత్రాత్మకమైనది. ఈ విషయం జీవితాంతం నా హృదయంలో ఉండిపోతుంది. శ్రీ దర్బార్ సాహిబ్‌కు సేవ చేయడానికి మరో అవకాశం లభించడం మనందరికీ ఒక విశేషం. విదేశాలలో నివసిస్తున్న సిక్కు సోదరులు, సోదరీమణులు దర్బార్ సాహిబ్ సేవ కోసం నిధులు పంపడం చాలా సులభం. ఈ అడుగు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వారిని కూడా దర్బార్ సాహిబ్‌కు సన్నిహితం చేసింది.
మిత్రులారా! అన్నదానం అనే లంగర్ సంప్రదాయాన్ని గురు నానక్ దేవ్ జీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజం కరోనా సమయంలో ప్రజలకు ఆహారం ఇచ్చే సంప్రదాయాన్ని ఎలా కొనసాగిస్తుందో మనం చూశాం. సేవ, మానవత్వాల ఈ సంప్రదాయం మనందరికీ నిరంతర ప్రేరణగా ఉపయోగపడుతుంది. మనమందరం సేవకులుగా పనిచేయడం కొనసాగించాలని కోరుకుంటున్నాను. గురు సాహిబ్ ఈ విధంగా నా నుండి, దేశవాసుల నుండి సేవలను పొందడం కొనసాగించాలని కోరుకుంటున్నాను. మరోసారి గురునానక్ జయంతి సందర్భంగా నా శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశవాసులారా! ఇటీవల దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థులతో సంభాషించడానికి, వారి విద్యా ప్రయాణంలో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాకు అవకాశం లభించింది. ఐఐటి-గువహతి, ఐఐటి- ఢిల్లీ, గాంధీనగర్ లోని దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం, ఢిల్లీ లోని జెఎన్‌యు, మైసూర్ విశ్వవిద్యాలయం, లక్నో విశ్వవిద్యాలయం విద్యార్థులతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కనెక్ట్ అవ్వగలిగాను. దేశంలోని యువతతో గడపడం తాజాగా ఉంచుతుంది. ఎంతో శక్తిని అందిస్తుంది. విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఒక విధంగా మినీ ఇండియా లాంటివి. ఒక వైపు ఈ క్యాంపస్‌లలో భారతదేశం లోని వైవిధ్యం కనబడుతుంది. మరోవైపు నవ భారతానికి అవసరమయ్యే పెద్ద మార్పుల పట్ల మక్కువ కూడా కనబడుతుంది. కరోనాకు ముందు రోజులలో నేను ఏదైనా ఒక సంస్థ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు సమీప పాఠశాలల నుండి పేద పిల్లలను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని కోరేవాడిని. ఆ పిల్లలు నా ప్రత్యేక అతిథిగా ఆ వేడుకకు వచ్చేవారు. ఆ గొప్ప వేడుకలో ఒక యువకుడు డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ అవ్వడాన్ని ఒక చిన్న పిల్లవాడు చూస్తాడు. ఎవరైనా పతకం తీసుకోవడాన్ని చూస్తాడు. అప్పుడు అతనిలో కొత్త కలలు తలెత్తుతాయి. ‘నేను కూడా చేయగలను’ అనే ఆత్మవిశ్వాసాన్ని అతనిలో ఆ కార్యక్రమం కలిగిస్తుంది. సంకల్పం దిశగా వెళ్లేందుకు ప్రేరణ లభిస్తుంది.
మిత్రులారా! ఇది కాకుండా ఆ సంస్థ పూర్వ విద్యార్థులు ఎవరు, ఆ సంస్థ పూర్వ విద్యార్థులతో క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించేందుకు చేసే ఏర్పాట్లు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవటానికి నేను ఎప్పుడూ ఆసక్తి కలిగి చూపిస్తాను. ఆ సంస్థ పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ ఎంత శక్తిమంతమైనదో తెలుసుకోవాలని నాకు ఉంటుంది.
నా యువ మిత్రులారా! విద్యార్థిగా మీరు అక్కడ చదువుతున్నంత కాలం మాత్రమే ఉంటారు. కానీ, పూర్వ విద్యార్థులుగా మీరు జీవితాంతం కొనసాగుతారు. పాఠశాల, కళాశాల నుండి బయటికి వచ్చాక రెండు విషయాలు ఎప్పటికీ ముగియవు. ఒకటి మీ అభ్యసన ప్రభావం. రెండవది మీ పాఠశాల, కళాశాలతో మీ అనుబంధం. పూర్వ విద్యార్థులు తమలో తాము మాట్లాడినప్పుడు పుస్తకాలు, చదువుల కంటే ఎక్కువగా క్యాంపస్‌లో స్నేహితులతో గడిపిన క్షణాలే ఎక్కువగా మాట్లాడతారు. ఈ జ్ఞాపకాల నుండే ఆ విద్యాసంస్థకు ఏదైనా చేయాలనే ఒక భావన ప్రారంభమవుతుంది. మీ వ్యక్తిత్వం అభివృద్ధి చెందిన ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి మించిన ఆనందం ఏముంటుంది? పూర్వ విద్యార్థులు తమ పాత సంస్థలను అభివృద్ధి చేసిన అలాంటి కొన్ని ప్రయత్నాల గురించి నేను చదివాను. ఈ రోజుల్లో పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థ అభివృద్ధిలో క్రియాశీలంగా ఉన్నారు. ఐఐటియన్లు తమ సంస్థలను కాన్ఫరెన్స్ సెంటర్లు, మేనేజ్‌మెంట్ సెంటర్లు, ఇంక్యుబేషన్ సెంటర్లు వంటి అనేక విభిన్న రూపాలుగా అభివృద్ధి చేశారు. ఈ ప్రయత్నాలన్నీ ప్రస్తుత విద్యార్థుల అభ్యసన అనుభవాలను మెరుగు పరుస్తాయి. ఐఐటి ఢిల్లీ ఎండోమెంట్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది అద్భుతమైన ఆలోచన. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి నిధుల సేకరణ సంస్కృతి ఉంది. ఇది విద్యార్థులకు సహాయ పడుతుంది. భారతదేశ విశ్వవిద్యాలయాలు కూడా ఈ సంస్కృతిని సంస్థాగతం చేయగలవని నా అభిప్రాయం.
ఏదైనా తిరిగి ఇవ్వాలనుకున్నప్పుడు పెద్దది, చిన్నది అన్న భేదం ఏమీ లేదు. ప్రతి చిన్న సహాయం ముఖ్యమైందే. ప్రతి ప్రయత్నం కూడా ముఖ్యమైందే. తరచుగా పూర్వ విద్యార్థులు తమ సంస్థల సాంకేతిక పరిజ్ఞానంలో; భవన నిర్మాణంలో; అవార్డులు, స్కాలర్‌షిప్‌లను ప్రారంభించడంలో; నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కొన్ని పాఠశాలల పూర్వ విద్యార్థి సంఘాలు మార్గదర్శక కార్యక్రమాలను కూడా ప్రారంభించాయి. ఇందులో వారు వివిధ బ్యాచ్‌ల విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. విద్యా అవకాశాల గురించి కూడా చర్చిస్తారు. అనేక పాఠశాలల్లో- ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. క్రీడా పోటీలు, సమాజ సేవ వంటి కార్యకలాపాలను కూడా అవి నిర్వహిస్తున్నాయి. వారు చదివిన సంస్థతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని పూర్వ విద్యార్థులను నేను కోరుతున్నాను. అది పాఠశాల అయినా, కళాశాల అయినా, విశ్వవిద్యాలయమైనా ఆ సంస్థతో పూర్వ విద్యార్థులు అనుబంధం పెరగాలి. పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో నవీన, వినూత్న మార్గాలలో పని చేయాలని నేను విద్యా సంస్థలను కోరుతున్నాను. పూర్వ విద్యార్థులు చురుకుగా పాల్గొనడానికి సృజనాత్మక వేదికలను అభివృద్ధి చేయండి. పెద్ద కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు- మన గ్రామాల పాఠశాలలు కూడా బలమైన, చురుకైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ కలిగి ఉండాలి.
నా ప్రియమైన దేశవాసులారా! డిసెంబర్ 5వ తేదీ శ్రీ అరబిందో వర్ధంతి. శ్రీ అరబిందోను మనం ఎంత ఎక్కువ చదువుతామో అంత లోతైన పరిజ్ఞానం మనకు లభిస్తుంది. నా యువ స్నేహితులు శ్రీ అరబిందో గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ మీ గురించి మీరే తెలుసుకుంటారు. మీరు ఉన్న జీవన స్థితి, మీ సంకల్పాలను నెరవేర్చడానికి పడుతున్న శ్రమ- వీటి మధ్య మీరు ఎల్లప్పుడూ శ్రీ అరబిందోకు కొత్త మార్గాన్ని చూపిస్తూ, నూతన మార్గం పొందుతారు. ప్రేరణ ఇస్తూ ప్రేరణ పొందుతారు. 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారంతో మనం ముందుకు వెళుతున్నప్పుడు శ్రీ అరబిందో స్వదేశీ తత్వశాస్త్రం మనకు కనిపిస్తుంది. బంగ్లాలో అత్యంత ప్రభావవంతమైన కవిత ప్రచారంలో ఉంది.
‘ఛుయీ శుతో పాయ్- మాన్ తో ఆశే తుంగ హోతే|
దియ-శలాయి కాఠి, తౌ ఆసే పోతే ||
ప్రో-దీప్తి జాలితే ఖేతే, శుతే, జేతే|
కిఛుతే లోక్ నాయ్శాధీన్||
అంటే- ఇక్కడ సూది నుండి అగ్గి పెట్టె వరకు ప్రతి ఒక్కటీ విలాసవంతమైన ఓడలో దిగుమతి అవుతాయి. తినడంలో, తాగడంలో, నిద్రపోవడంలో – ఏ విషయంలోనూ ప్రజలకు స్వేచ్ఛ లేదు.
స్వదేశీ అంటే మన భారతీయ కార్మికులు, చేతివృత్తులవారు తయారుచేసే వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వడమని ఆయన చెప్పేవారు. విదేశాల నుండి ఏదైనా నేర్చుకోవడాన్ని శ్రీ అరబిందో ఎప్పుడూ వ్యతిరేకించలేదు. కొత్త అంశం నుండి నేర్చుకోవాలని, మన దేశానికి ఉపయోగపడేదానికి సహకారం, ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన అభిప్రాయం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్ర భావన ఇదే. ముఖ్యంగా స్వదేశీని మనదిగా చేసుకోవడంతో పాటు వివిధ విషయాల్లో ఆయన చెప్పిన అభిప్రాయాలు ఈ రోజు ప్రతి పౌరుడు చదవాలి. మిత్రులారా! విద్యపై అరబిందో అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పుస్తక పరిజ్ఞానికి; డిగ్రీలు, ఉద్యోగాలకు పొందడానికి మాత్రమే విద్య పరిమితమని ఆయన భావించలేదు. మన జాతీయ విద్య మన యువతరం హృదయాలకు, మనసులకు శిక్షణగా ఉండాలని శ్రీ అరబిందో చెప్పేవారు. అంటే శాస్త్రీయ వికాసం పొందిన మస్తిష్కం, భారతీయ భావోద్వేగాల హృదయం ఉండే యువకుడు మాత్రమే దేశానికి మంచి పౌరుడిగా మారగలడని అరబిందో అభిప్రాయం. ఆ రోజుల్లో జాతీయ విద్యపై అరబిందో చెప్పినదాన్నే కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా దేశం పూర్తి చేస్తోంది.
నా ప్రియమైన దేశవాసులారా! భారతదేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కొత్త కోణాల అనుసంధానం జరుగుతోంది. గతంలోని వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయి. కొన్నేళ్లుగా ఉన్న రైతుల ఆకాంక్షలు, వాటిని తీరుస్తామన్న రాజకీయ పక్షాల వాగ్దానాలు నెరవేరాయి. చాలా చర్చల తరువాత భారత పార్లమెంట్ వ్యవసాయ సంస్కరణలకు చట్టపరమైన రూపాన్ని ఇచ్చింది. ఈ సంస్కరణలు రైతుల అనేక బంధనాలను అంతం చేయడమే కాకుండా వారికి కొత్త హక్కులు, కొత్త అవకాశాలను కూడా కల్పించాయి.
- హక్కులు చాలా తక్కువ సమయంలోనే రైతుల సమస్యలను తగ్గించడం ప్రారంభించాయి. మహారాష్ట్రలోని ధులే జిల్లా రైతు జితేంద్ర భోయి గారుకొత్త వ్యవసాయ చట్టాలను ఎలా ఉపయోగించారో కూడా మీరు తెలుసుకోవాలి. జితేంద్ర భోయి గారు మొక్కజొన్న సాగు చేసి సరైన ధరలకు వ్యాపారులకు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. పంట మొత్తం ఖర్చు మూడు లక్షల ముప్పై రెండు వేల రూపాయలుగా నిర్ణయించారు. జితేంద్ర భోయ్‌కు ఇరవై ఐదు వేల రూపాయల అడ్వాన్స్ కూడా వచ్చింది. మిగిలిన డబ్బును పదిహేను రోజుల్లో చెల్లించాలని నిర్ణయించారు. కానీ, తరువాత పరిస్థితుల వల్ల అతను మిగిలిన డబ్బులను పొందలేకపోయాడు. రైతు నుండి పంట కొని, నెలల తరబడి డబ్బులు చెల్లించకపోవడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. బహుశా మొక్కజొన్న కొనుగోలుదారులు అదే సంప్రదాయాన్ని అనుసరించేవారు. అదే విధంగా జీతేంద్ర కు డబ్బులు నాలుగు నెలల వరకు రాలేదు. ఈ పరిస్థితిలో సెప్టెంబరులో ఆమోదం పొందిన కొత్త వ్యవసాయ చట్టం ఆయనకు సహాయ పడింది. పంటను కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతుకు కొనుగోలుదారులు పూర్తి చెల్లింపు చేయవలసి ఉంటుందని ఈ చట్టం పేర్కొంటోంది. ఒకవేళ కొనుగోలుదారులు చెల్లింపు చేయకపోతే రైతు ఫిర్యాదు చేయవచ్చు. చట్టంలో మరో పెద్ద విషయం ఉంది. ఈ చట్టం ప్రకారం ఆ ప్రాంతానికి చెందిన సబ్ డివిజినల్ మెజిస్ట్రేటు రైతు ఫిర్యాదును నెలలోపు పరిష్కరించవలసి ఉంటుంది. ఆయన ఫిర్యాదు చేయడంతో కొనుగోలుదారులు బకాయిలను కొద్ది రోజుల్లోనే చెల్లించారు. అంటే చట్టంపై సరైన, పూర్తి పరిజ్ఞానం మాత్రమే జితేంద్ర బలంగా మారింది. ప్రాంతం ఏదైనా అన్ని రకాల గందరగోళాలు, పుకార్లకు దూరంగా సరైన సమాచారం మాత్రమే ప్రతి వ్యక్తికి మద్దతుగా నిలుస్తుంది. రాజస్థాన్‌లోని బారాం జిల్లాలో నివసిస్తున్న మహ్మద్ అస్లాం గారు రైతులలో అవగాహన పెంచడానికి అలాంటి ఒక పని చేస్తున్నారు. అతను రైతు ఉత్పాదక సంఘం CEO కూడా. అవును- మీరు సరిగ్గా విన్నారు, రైతు ఉత్పాదక సంఘం CEO. దేశంలోని సుదూర ప్రాంతాల్లో పని చేసే రైతు సంస్థలకు కూడా సిఇఒ లు ఉండడాన్ని విని పెద్ద కంపెనీల సిఇఒ లు కూడా హర్షిస్తారని ఆశిద్దాం. మిత్రులారా!మహ్మద్ అస్లాం గారు తన ప్రాంతంలోని చాలా మంది రైతులను వాట్సాప్‌తో అనుసంధానించారు. సమూహం ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ సమీపంలోని మార్కెట్లలో ఏం జరుగుతుందో సమూహంలో రైతులకు తెలియజేస్తారు. వారి ఎఫ్‌పిఒ రైతుల నుండి పంటలను కొంటారు. అందువల్ల వారి ప్రయత్నాలు రైతులు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి.
మిత్రులారా! అవగాహన సజీవంగా ఉంచుతుంది. తన అవగాహనతో వేలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన వ్యవసాయ పారిశ్రామికవేత్త వీరేంద్ర యాదవ్ గారు. వీరేంద్ర యాదవ్ గారు ఒకప్పుడు ఆస్ట్రేలియాలో నివసించారు. రెండేళ్ల క్రితం భారతదేశానికి వచ్చిన ఆయన ఇప్పుడు హర్యానాలోని కైతాల్‌లో నివసిస్తున్నారు. ఇతర వ్యక్తుల మాదిరిగానే వ్యవసాయంలో గడ్డి ఆయన ముందు పెద్ద సమస్యగా నిలిచింది. దీని పరిష్కారం కోసం చాలా విస్తృత స్థాయిలో పని జరుగుతోంది. కానీ, ఈ రోజు 'మన్ కీ బాత్'లో నేను ప్రత్యేకంగా వీరేంద్ర గారి గురించి ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రయత్నాలు భిన్నంగా ఉంటాయి. కొత్త దిశను చూపుతాయి. గడ్డి సమస్యను పరిష్కరించడానికి వీరేంద్ర గారు గడ్డి ముద్దలను తయారు చేయడానికి ఒక యంత్రాన్ని కొన్నారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ నుంచి ఆర్థిక సహాయం కూడా పొందారు. ఈ యంత్రంతో గడ్డి మోపులను చేసి, అగ్రో ఎనర్జీ ప్లాంట్, పేపర్ మిల్లులకు విక్రయించారు. వీరేంద్ర గారు కేవలం రెండేళ్లలో గడ్డితో ఒకటిన్నర కోట్లకు పైగా వ్యాపారం చేశారని, అందులో కూడా ఆయన సుమారు 50 లక్షల రూపాయల లాభం పొందారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తోంది. వీరి పొలాల నుండి కూడా వీరేంద్ర గారు గడ్డి సేకరిస్తారు. చెత్త నుండి బంగారం పొందడం గురించి మనం చాలా విన్నాం. కాని, గడ్డి ద్వారా డబ్బు, పుణ్యం సంపాదించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. యువత- ముఖ్యంగా వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులు- తమ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి రైతులకు ఆధునిక వ్యవసాయం, ఇటీవలి వ్యవసాయ సంస్కరణల గురించి అవగాహన కల్పించాలని నేను కోరుతున్నాను. ఇలా చేయడం ద్వారా దేశంలో జరుగుతున్న పెద్ద మార్పుల్లో మీరు భాగస్వామి అవుతారు.
నా ప్రియమైన దేశవాసులారా!
'మన్ కీ బాత్'లో మనం చాలా భిన్నమైన విభిన్న అంశాలపై మాట్లాడుకుంటాం. కానీ, ఒక విషయానికి కూడా ఏడాది గడుస్తోంది. దీన్ని మనం ఆనందంతో గుర్తుంచుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడం. కరోనా మొదటి కేసు గురించి ప్రపంచానికి తెలిసి దాదాపు ఒక సంవత్సరం అయ్యింది. అప్పటి నుండి ప్రపంచం మొత్తం చాలా ఉత్థాన పతనాలను చూసింది. లాక్ డౌన్ కాలం నుండి బయటపడిన తర్వాత ఇప్పుడు వ్యాక్సిన్ పై చర్చ ప్రారంభమైంది. కానీ, కరోనాకు సంబంధించిన ఎలాంటి నిర్లక్ష్యమైనా ఇప్పటికీ చాలా ప్రమాదకరమైంది. కరోనాపై మన పోరాటాన్ని దృఢంగా కొనసాగించాలి.
మిత్రులారా! కొద్ది రోజుల తరువాత డిసెంబర్ 6న బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి. బాబా సాహెబ్‌కు నివాళులర్పించడంతో పాటు, పౌరుడిగా మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఆయన మనకు బోధించిన పాఠాలను గుర్తుకు తెచ్చుకోవాలి. దేశంలోని అధిక ప్రాంతాల్లో శీతాకాలం కూడా ఊపందుకుంది. చాలా చోట్ల మంచు కురుస్తోంది. ఈ సీజన్ లో మనం కుటుంబంలోని పిల్లలు, వృద్ధులు, జబ్బుపడిన వ్యక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి. ప్రజలు తమ చుట్టూ ఉన్న పేదవారి గురించి కూడా ఆలోచించడం చూసినప్పుడు నాకు సంతోషంగా ఉంది. కొందరు వెచ్చని బట్టలు ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేస్తున్నారు. జంతువులకు కూడా శీతాకాలం చాలా కష్టం. వాటికి సహాయం చేయడానికి కూడా చాలా మంది ముందుకు వస్తారు.
మన యువ తరం ఇలాంటి కార్యకలాపాల్లో చాలా చురుకుగా ఉంటుంది. మిత్రులారా! మన్ కీ బాత్ తర్వాతి సంచికలో మనం కలిసినప్పుడు ఈ సంవత్సరం 2020 చివరిలో ఉంటుంది. కొత్త అంచనాలతో, కొత్త నమ్మకాలతో మనం ముందుకు వెళదాం. ఏమైనా సూచనలు, ఆలోచనలు ఉంటే వాటిని నాతో పంచుకుంటూ ఉండండి. మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. దేశం కోసం క్రియాశీలకంగా, చురుకుగా ఉండండి.
మీకు అనేకానేక ధన్యవాదాలు.
***
(Release ID: 1676974)
Visitor Counter : 285
Read this release in:
Punjabi
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam