PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
21 MAY 2020 6:32PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో కోవిడ్-19 నయమైనవారి సంఖ్య 45,299; కోలుకున్న రోగుల శాతం 40.32కు చేరిక
- దిగ్బంధ కాలం... ఆరోగ్య మౌలిక వసతుల మెరుగు కోసం సద్వినియోగం
- జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న రైళ్ల రాకపోకలపై మార్గదర్శకాలు జారీ
- దేశీయ విమాన ప్రయాణానికి వీలుగా దిగ్బంధం నిబంధనలు సవరించిన దేశీయాంగ శాఖ
- గర్భిణులైన అధికారులు, దివ్యాంగ ఉద్యోగులకు కార్యాలయ హాజరునుంచి డీవోపీటీ మినహాయింపు
- పీఎంజీకేపీ కింద 6.8 కోట్లమంది పీఎంయూవై లబ్ధిదారులకు వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ
కోవిడ్-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం
దేశంలో ఇప్పటిదాకా 45,299 మందికి వ్యాధి నయం కాగా, వీరిలో గడచిన 24 గంటల్లో కోలుకున్నవారు 3,002 మంది ఉన్నారు. దీంతో కోలుకుంటున్నవారి శాతం నిరంతరం మెరుగుపడుతూ ప్రస్తుతం 40.32కు చేరింది. ఇక దేశంలో నేటివరకూ 63,624 యాక్టివ్ కేసులుండగా, వీరిలో సుమారు 2.94 శాతం మాత్రమే ఐసీయూలలో ఉన్నారు. మొత్తం కేసులతో పోలిస్తే మరణాల నిష్పత్తి ప్రపంచ స్థాయిలో 6.65 కాగా, భారత్‌లో అత్యంత తక్కువగా 3.06గా ఉంది. ఇక మరణాలపై విశ్లేషణ ప్రకారం... పురుషులు 64 శాతం కాగా, మహిళల్లో 36 శాతంగా ఉంది. అలాగే వయసురీత్యా చూస్తే 15 ఏళ్లకన్నా లోపువారిలో 0.5శాతం; 15-30 వయోవర్గంవారిలో 2.5 శాతం; 30-45 వయోవర్గంవారిలో 11.4 శాతం; 45-60 వయోవర్గంవారిలో 50.5 శాతంగా ఉంది. అయితే, ఈ మరణాలన్నిటిలోనూ అప్పటికే ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు 73 శాతంగా ఉన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625794
కోవిడ్-19పై తాజా సమాచారం-II
దేశంలోని ఆరోగ్య మౌలిక వసతుల మెరుగుదిశగా దిగ్బంధ కాలం సద్వినియోగమైంది. మరోవైపు ఇప్పటిదాకా వ్యాధి నయమైనవారి సంఖ్య 45,299 కాగా, కోలుకునేవారి శాతం 40.32కు చేరింది. దేశవ్యాప్తంగా 21.05.2020నాటికి 555 (391 ప్రభుత్వ - 164 ప్రైవేటు) ప్రయోగశాలల్లో మొత్తం 26,15,920 నమూనాలను పరీక్షించగా, గడచిన 24గంటల్లోనే 1,03,532 నమూనాలు పరీక్షించబడ్డాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషి ఫలితంగా 3027 కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలతోపాటు 6,50,930 సంరక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. సదరు ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో అదనంగా మరో 2.81 లక్షల ఏకాంత చికిత్స పడకలు, 31,250 లక్షలకుపైగా ఐసీయూ పడకలు, 11,387 ఆక్సిజన్ మద్దతుగల పడకలు సిద్ధమయ్యాయి. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం 65లక్షల వ్యక్తిగత రక్షణ సామగ్రి కవరాల్స్, 101.07 లక్షల N95 మాస్కులను రాష్ట్రాలకు సరఫరా చేసింది. కాగా, భారత జనాభాలో సార్స్-సీవోవీ-2 (SARS-CoV-2) వ్యాధి ఉనికిపై అంచనా నిమిత్తం భారత వైద్య పరిశోధన మండలి సామాజిక అధ్యయనం నిర్వహిస్తోంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625836
ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జనారోగ్య యోజన కింద కోటి చికిత్సలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జనారోగ్య యోజన (AB-PMJAY) కింద చేపట్టిన చికిత్స సంఖ్య ఇవాళ్టితో కోటి స్థాయికి చేరింది. ఈ మైలురాయిని అధిగమించినందుకు గుర్తుగా కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ‘ఆరోగ్య ధార’ పేరిట ప్రజారోగ్య సమస్యలపై చర్చించడం కోసం వెబినార్‌లు నిర్వహించే వేదిక తొలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, ఈ పథకం కింద హామీ ఇచ్చిన అన్ని సేవలూ సకాలంలో అందడానికి తమవంతు తోడ్పాటునిస్తున్న రాష్ట్రాలకు... ప్రత్యేకించి ప్రస్తుత అనూహ్య కోవిడ్-19 పరిస్థితుల నడుమ అందిస్తున్న సహకారానికి ఆరోగ్యశాఖ మంత్రి కృతజ్ఞతలతోపాటు శుభాకాంక్షలు కూడా తెలిపారు. “ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవై కింద నమోదైన 53 కోట్లమంది లబ్ధిదారులలో ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 చికిత్స పూర్తి ఉచితంగా లభించేలా ప్రభుత్వం అన్నివిధాలా కృషిచేస్తోంది. దీంతో సార్వత్రిక ఆరోగ్య భరోసా కల్పన దిశగా భారత ప్రభుత్వ సంకల్పం, పరిధి, సామర్థ్య విస్తరణ తదితరాలు మరింత శక్తిమంతం అవుతాయి. ఈ మేరకు ఈ పథకంలో భాగస్వాములైన ఆస్పత్రులు, ప్రతి ఆరోగ్య కార్యకర్తల సమష్టి కృషితోనే కోటి చికిత్సల మైలురాయిని చేరగలిగాం” అని ఆయన చెప్పారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625914
జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న రైళ్ల రాకపోకలపై మార్గదర్శకాలు జారీ
భారత రైల్వేశాఖ ఈ అనుబంధంలోని జాబితాలో పేర్కొన్న మేరకు 200 ప్రయాణికుల రైళ్లను నడపనుంది. ఇవి 1/06/2020 నుంచి ప్రారంభం కానుండగా ఈ రైళ్లకు ఆన్‌లైన్ బుకింగ్ ఇవాళ అంటే 21/05/2020 ఉదయం 10 గంటల నుంచి మొదలైంది. మే 1వ తేదీనుంచి నడుస్తున్న శ్రామిక్ స్పెషల్ రైళ్లతోపాటు 2020 మే 12 నుంచి నడుపుతున్న (30) ప్రత్యేక ఏసీ రైళ్లకు జూన్ 1 నుంచి నడిచే ప్రత్యేక రైళ్లు అదనం. అయితే, తదుపరి ఆదేశాలు వెలువడేదాకా మెయిల్/ఎక్స్‌ప్రెస్, పాసింజర్, శివారు రైళ్ల రద్దు మాత్రం కొనసాగుతుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1625585
వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వ్యక్తుల దేశీయ విమాన ప్రయాణం కోసం దిగ్బంధం నిబంధనలను సవరించిన దేశీయాంగ శాఖ
దేశవ్యాప్త దిగ్బంధం కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వ్యక్తుల దేశీయ విమాన ప్రయాణానికి వెసులుబాటు కల్పిస్తూ కోవిడ్-19పై పోరులో భాగంగా జారీచేసిన మార్గదర్శకాలను దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ (MHA) సవరించింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల నిర్వహణ, విమాన ప్రయాణికులకు సంబంధించిన మార్గదర్శకాలను పౌర విమానయాన మంత్రిత్వశాఖ జారీచేయనుంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625633
పీఎంజీకేపీ కింద నేటిదాకా 6.8 కోట్లమంది పీఎంయూవై లబ్ధిదారులకు ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీ
కోవిడ్-19పై ఆర్థిక ప్రతిస్పందనాత్మకతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం “ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ” (PMGKP)కి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద కేంద్ర పెట్రోలియం-సహజవాయువుల శాఖ దేశంలోని 8 కోట్లమందికిపైగా పీఎంయూవై లబ్ధిదారులకు 1.04.2020 నుంచి మూడు నెలలపాటు ఉచితంగా వంటగ్యాస్ సరఫరా చేస్తోంది. ఆ మేరకు పీఎంజీకేపీ కింద 2020 ఏప్రిల్‌లో చమురు విక్రయ కంపెనీ (OMC)లు 453.02 లక్షల సిలిండర్లను, మొత్తంమీద 20.5.20దాకా 679.92 లక్షల సిలిండర్లను పీఎంయూవై లబ్ధిదారులకు సరఫరా చేశాయి. తదనుగుణంగా ఈ సిలిండర్లను పొందడంలో లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యక్ష లబ్ధి బదిలీ (DBT)కింద వారి బ్యాంకు ఖాతాల్లో ముందుగానే నగదు జమచేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625763
పారిశ్రామిక రంగంపై ప్రభుత్వానికి సంపూర్ణ, సమగ్ర నమ్మకం: సీఐఐ ప్రతినిధులతో సంభాషణ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి
పారిశ్రామిక రంగంపై ప్రభుత్వానికి సంపూర్ణ, సమగ్ర విశ్వాసం ఉందని కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బంది మరింత వృత్తిగత నిబద్ధతతో నైపుణ్యంతో పనిచేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆమె కోరారు. “కార్మికశక్తి నిర్వహణ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటూ పారిశ్రామిక రంగ ధోరణికి ఆదర్శప్రాయం కావాలి” అని ఆర్థికమంత్రి ఆకాంక్షించారు. కోవిడ్-19 పరిస్థితులకు ముందునుంచే గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలకు సహాయపడే దిశగా ఎంఎస్‌ఎంఈ రంగానికి, బ్యాంకింగేతర సంస్థలకు తగిన చేయూతనిచ్చినట్లు ఎంఎస్‌ఎంఈ రంగంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆమె జవాబిచ్చారు. అదనపు కాలవ్యవధి రుణాలు, నిర్వహణ మూలధనం కోసం ఎంఎస్‌ఎంఈలకు రుణలభ్యత కల్పించినట్లు గుర్తుచేశారు. అందుకు తగినట్లుగా రుణ మంజూరులో బ్యాంకుల సందిగ్ధాన్ని తొలగిస్తూ ప్రభుత్వమే హామీ ఇచ్చిందని తెలిపారు. “దిగ్బంధం అనంతరం ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPV)ద్వారా ప్రభుత్వం పూర్తి/పాక్షిక హామీ ఇస్తున్న నేపథ్యంలో బ్యాంకుల్లో సందిగ్ధానికి తావులేకుండాపోయింది”అని ఆమె వివరించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625666
దేశంలోని సామాజిక రేడియోలద్వారా రేపు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్
దేశ ప్రజలకు మరింత చేరువయ్యే చొరవలో భాగంగా కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ రేపు.. 2020 మే 22న రాత్రి 7 గంటలకు సామాజిక రేడియో స్టేషన్లద్వారా చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేశంలోని అన్ని సామాజిక రేడియోలలో ఈ కార్యక్రమం ఏకకాలంలో ప్రసారమవుతుంది. దీన్ని హిందీ, ఆంగ్ల భాషలలో రెండు భాగాలుగా ప్రసారం చేస్తారు. శ్రోతలు ఎఫ్‌ఎం గోల్డ్ (100.1 ఎంహెచ్‌జడ్) రేడియో చానెల్‌ద్వారా రాత్రి 7:30 గంటలకు హిందీలో, 9:10 గంటలకు ఆంగ్లంలో ఈ ప్రసంగాన్ని వినవచ్చు. దేశంలోని అన్నివర్గాలకూ కోవిడ్-19 సంబంధిత సమాచార ప్రదానం దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాగా, దేశంలో సుమారు 290 సామాజిక రేడియో స్టేషన్లున్నాయి. మారుమూల ప్రాంతాలకు చేరగల వీటి సామర్థ్యందృష్ట్యా ఈ చర్చా కార్యక్రమం ఏర్పాటైంది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625793
ఎంహెచ్‌ఆర్‌డీద్వారా దిగ్బంధంలో చిక్కుకున్న జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థుల సురక్షిత తరలింపు
దిగ్బంధం సమయంలో దేశంలోని 173 జవహర్ నవోదయ విద్యాలయాల్లో చిక్కుకున్న సుమారు 3000 మంది విద్యార్థులను తరలించే ప్రక్రియను నవోదయ విద్యాలయ సమితి 2020 మే 15వ తేదీతో విజయవంతంగా పూర్తిచేసిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ చెప్పారు. కాగా, జవహర్ నవోదయ విద్యాలయాలు బాలబాలికల విద్యాకేంద్రాలు కావడం ఈ సందర్భంగా గమనార్హం.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625838
‘స్వయం’ వేదికపై 2020 జూలై సెమిస్టర్‌లో 82 యూజీ, 42 పీజీ స్థాయి ఇంజనీరింగేతర సామూహిక సార్వత్ర్రిక ఆన్‌లైన్ కోర్సుల అందుబాటు
వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో చదివే విద్యార్థులు ‘స్వయం’ వేదికద్వారా నిర్వహించే ఆన్‌లైన్ కోర్సులను సద్వినియోగం చేసుకుని విశ్వవిద్యాలయ అనుమతుల సంఘం (యూజీసీ) నిర్దేశిత విధివిధానాల చట్రం పరిధిలో సంబంధిత క్రెడిట్స్ పొందవచ్చునని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ సూచించారు. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులు, బోధకులు, జీవితాభ్యాసకులు, వృద్ధపౌరులు, గృహిణులు కూడా ‘స్వయం’ వేదికపై లభించే కోర్సులలో నమోదు చేసుకుని, తద్వారా లబ్ధి పొందవచ్చునని మంత్రి వివరించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625873
‘సైబర్ సెక్యూరిటీ ఫర్ స్టూడెంట్స్, 21వ శతాబ్దపు నైపుణ్యాలు, ప్రిన్సిపాల్స్’ పేరిట సీబీఎస్ఈ రూపొందించిన మూడు కరదీపికలను ఆవిష్కరించిన హెచ్ఆర్‌డి మంత్రి
కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ కేంద్ర మాధ్యమిక విద్యాసంస్థ (CBSE) రూపొందించిన మూడు కరదీపికలను ఢిల్లీలో ఇవాళ ఆవిష్కరించారు. విలువల-ఆధారిత అంతర్జాతీయ విద్యా ప్రమాణాల అనుసరణ దిశగా బోర్డు తీసుకున్న చర్యలు ప్రాతిపదికగా వీటిని రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- దేశంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పన కోసం “సైబర్ సేఫ్టీ-ఎ హ్యాండ్‌బుక్ ఫర్ స్టూడెంట్స్ ఫర్ సెకండరీ అండ్ సీనియర్ సెకండరీ స్కూల్స్” కరదీపికను తయారుచేసినట్టు తెలిపారు. ఇంటర్నెట్, ఇతర డిజిటల్ వేదికలను తరచూ వాడే ఈ వయోవర్గంలోని పిల్లలు రకరకాల భద్రత ముప్పులకు గురవుతున్నారని, అలాంటివారికి ఈ కరదీపిక సరైన మార్గదర్శిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1625547
గర్భిణులైన అధికారులు, దివ్యాంగులైన ఉద్యోగులకు కార్యాలయ హాజరునుంచి డీవోపీటీ మినహాయింపు
దేశవ్యాప్తంగా కొన్ని సడలింపులతో నాలుగో దశ దిగ్బంధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర సిబ్బంది-శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ (DoPT) గర్భిణులైన అధికారులు, దివ్యాంగులైన ఉద్యోగులకు కార్యాలయ హాజరునుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు సర్క్యులర్ జారీచేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని ఇతర శాఖలతోపాటు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు కూడా దీన్ని అనుసరించనున్నాయి. ప్రస్తుతం ప్రసూతి సెలవులో లేని గర్భిణులతోపాటు దివ్యాంగులైన ఉద్యోగులకూ ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఇక దిగ్బంధానికి ముందునుంచే ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ ఇప్పటికీ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న ఉద్యోగులు కూడా సీజీహెచ్‌ఎస్/సీఎస్ (ఎంఏ) నిబంధనల మేరకు వీలైనంతవరకూ తమకు చికిత్స చేస్తున్న వైద్యులు రాసిచ్చిన మందుల చీటీలను సమర్పించి ఈ మినహాయింపు పొందవచ్చునని తాజా సర్క్కులర్‌లో డీవోపీటీ పేర్కొంది.
కోవిడ్-19 కారణంగా రక్షణరంగంలో తయారీపై ప్రతికూల ప్రభావం: రక్షణ మంత్రి
ప్రపంచ మహమ్మారి (కోవిడ్-19) కరోనా వైరస్‌పై జాతి పోరాటంలో దేశంలోని సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమ (MSME)లతోపాటు భారత రక్షణ ఉత్పత్తిదారుల సంఘం (SIDM) పోషించిన పాత్రను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధిని వేగవంతం చేయడం, ఎగుమతులద్వారా విలువైన విదేశీమారకం ఆర్జనలోనేగాక ఉపాధి అవకాశాల సృష్టిలోనూ కీలకమైన ఎంఎస్‌ఎంఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని రక్షణమంత్రి పేర్కొన్నారు. అందుకే ఎంఎస్‌ఎంఈలను బలంగా ఉంచడం ప్రభుత్వ ప్రాథమ్యాలలో ఒకటిగా ఉందని చెప్పారు. “దేశంలో 8,000కుపైగా ఎంఎస్‌ఎంఈలు సహా, వాటితో అంచెలవారీగా ముడిపడిన-ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, రక్షణరంగ ప్రభుత్వ సంస్థలు (DPSU), సేవాసంస్థలవంటి అనేక రక్షణసంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సంస్థల మొత్తం ఉత్పత్తిలో ఎంఎస్‌ఎంఈల వాటా 20 శాతానికి పైగా ఉంటుంది” ఆయన అన్నారు.
జూన్ 5వ తేదీన సమావేశం తర్వాత పరీక్షలపై కొత్త కేలండర్ ప్రకటించనున్న యూపీఎస్‌సీ
కోవిడ్-19 నేపథ్యంలో దేశవ్యాప్త దిగ్బంధం మూడోదశ అనంతరం పరిస్థితులపై సమీక్ష కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే, పలు ఆంక్షల విస్తరణ కారణంగా ప్రస్తుతానికి పరీక్షలు, ఇంటర్వ్యూల పునరుద్ధరణ ఇప్పడప్పుడే సాధ్యంకాదని కమిషన్ నిర్ణయానికి వచ్చింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్రగతిశీల సడలింపులను పరిగణనలోకి తీసుకుని, నాలుగోదశ దిగ్బంధం తర్వాత పరిస్థితిని మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రెండు నెలలనుంచీ వాయిదావేసిన వివిధ పరీక్షలు, ఇంటర్వ్యూలపై అభ్యర్థులకు కాస్త స్పష్టత ఇవ్వడం కోసం 2020 జూన్ 5నాటి తదుపరి సమావేశం తర్వాత సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేయనుంది.
‘స్థానిక నుంచి ప్రపంచ స్థాయి’: విదేశీ విపణుల బాటపట్టనున్న ‘ఖాదీ’ మాస్కులు
దేశంలో విస్తృత ప్రాచుర్యం పొందిన ‘ఖాదీ’ ఫేస్‌మాస్క్ ఇక ‘అంతర్జాతీయ’ స్థాయికి దూసుకు వెళ్లనుంది. ఈ మేరకు ఖాదీ కాటన్/సిల్క్ మాస్కులను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలను ఖాదీ-గ్రామీణ పరిశ్రమల సంస్థ (కేవీఐసీ) పరిశీలిస్తోంది. ‘స్వయం సమృద్ధ భారతం’ ఉద్యమంలో భాగంగా ప్రధానమంత్రి ‘స్థానికం నుంచి ప్రపంచస్థాయికి’ వెళ్లే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చిన కొద్దిరోజుల వ్యవధిలో కేవీఐసీ ఈ దిశగా కృషి ప్రారంభించడం విశేషం. కాగా, కోవిడ్-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఫేస్ మాస్కులకు భారీ గిరాకీ ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాటన్/సిల్క్ వస్త్రంతో రెండు/మూడు పొరల మాస్కులను కేవీఐసీ రూపొందించింది. దిగ్బంధం వేళ వచ్చిన ఆర్డర్ల మేరకు మొత్తం 8 లక్షల మాస్కులకుగాను కేవీఐసీ ఇప్పటిదాకా 6 లక్షలు సరఫరా చేసింది. ఈ విక్రయాలతోపాటు దేశంలోని దాదాపు అన్ని జిల్లాల యంత్రాంగాల కోసం మరో 7.5 లక్షల మాస్కులను కేవీఐసీ పరిధిలోని సంస్థలు అందజేశాయి.
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- కేరళ: రాష్ట్రంలో కోవిడ్ గణాంకాల విశ్లేషణ కోసం అమెరికాకు చెందిన బిగ్ డేటా సంస్థ స్ప్రింక్లర్‌తో కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందం రద్దుచేసుకున్నట్లు ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఈ సమాచారం మొత్తాన్నీ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ‘సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇమేజింగ్ టెక్నాలజీ (సి-డిఐటి)కి బదిలీచేసినట్లు పేర్కొంది. కాగా, గల్ఫ్ ప్రాంతంలో తాజాగా మరో ఇద్దరు కేరళవాసులు కోవిడ్-19 వ్యాధితో మరణించగ, వీరిలో ఒకరు ఆరోగ్య కార్యకర్త కావడం గమనార్హం. ఇక ముంబైలో మరో ఇద్దరు మలయాళీలు ప్రాణాలు కోల్పోయారు. వందే భారత్ మిషన్ రెండో దశకింద ఇవాళ మూడు విమానాలు రాష్ట్రానికి రానున్నాయి. కాగా, గల్ప్ ప్రాంతంనుంచి కేరళవాసులు స్వదేశం చేరుకున్న నేపథ్యంలో కోవిడ్ కేసులు 12 రోజుల్లోనే పదిరెట్లు పెరిగి 16 నుంచి 161కి చేరాయి.
- తమిళనాడు: రాష్ట్రంనుంచి వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్తున్న నేపథ్యంలో తమిళనాడులోని ఎంఎస్‌ఎంఈ రంగం, నిర్మాణ ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడనుంది. చెంగల్పట్టు జిల్లా యంత్రాంగం ఇవాళ కరోనా వైరస్ రోగుల వివరాలి అందజేసింది; విధివిధానాల ప్రకారం పేరును మాత్రం వెల్లడించరాదని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో 743కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 13,000 స్థాయిని దాటింది. యాక్టివ్ కేసులు: 7219, మరణాలు: 87, డిశ్చార్జ్: 5882. చెన్నైలో యాక్టివ్ కేసులు మే 20 నాటికి 5345గా ఉన్నాయి.
- కర్ణాటక: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 12 గంటలవరకు 116 కొత్త కేసులతోపాటు ఒక మరణం నమోదైంది; మొత్తం కేసుల సంఖ్య 1578కి చేరగా, ఇవాళ 14మంది డిశ్చార్జ్ కావడంతో ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 570కి పెరిగింది. ఇక మరణాల సంఖ్య 41 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 966గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22 పరిశ్రమలు వ్యక్తిగత రక్షణ సామగ్రి కిట్లను, మరో 4 సంస్థలు వెంటిలేటర్లను తయారుచేస్తున్నాయి. చైనాను వదిలి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కొత్త పెట్టుబడులను పర్యవేక్షించే ప్రత్యేక కార్యాచరణ బృందం కార్యకలాపాలను ప్రతి వారం పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
- ఆంధ్రప్రదేశ్: కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో బస్సులు పునఃప్రారంభమయ్యాయి. అలాగే పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు, సంస్థల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 61,781 మంది సొంత రాష్ట్రాలకు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్రంలో 45 కొత్త కేసులు నమోదవగా, 8092 నమూనాలను పరీక్షించిన తర్వాత గత 24గంటల్లో 41 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసులు: 2452. యాక్టివ్: 718, రికవరీ: 1680, మరణాలు: 54గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలనుంచి తిరిగి వచ్చిన వారిలో 153మందికి లక్షణాలు కనిపించగా ఈ కేసులో 128 యాక్టివ్ కేసులుగా నిర్ధారించారు.
- తెలంగాణ: రాష్ట్రంలో దుకాణాలు తెరిచేందుకు నిర్దేశించిన ‘సరి-బేసి’ పథకం ఇప్పటికీ ఒక చిక్కుముడిగానే ఉంది. కాగా, హైదరాబాద్‌లోని దుకాణ యజమానులకు కిరాయిల చెల్లింపు అంశం ఎంతో ఆందోళన కలిగిస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆరోగ్య శాఖ సమన్వయంతో 45 బస్తీ దవాఖానాల ప్రారంభంపై సమన్వయం/పర్యవేక్షణ కోసం ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. మే 21 నాటికి తెలంగాణలో మొత్తం నిర్ధారిత కేసుల సంఖ్య 1661కాగా, నిన్న 89మంది వలసదారులకు రోగ నిర్ధారణ అయింది.
- చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌లో దుకాణాలు తెరిచేందుకు అనుమతించిన నేపథ్యంలో ఖాతాదారులంతా తూచా తప్పకుండా సామాజిక దూరంసహా వ్యక్తిగత పరిశుభ్రత చర్యలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వాణిజ్య సంఘాలు, మార్కెట్ అసోసియేషన్లు, దుకాణాల యజమానులదేనని నగర పాలనాధికారి సూచించారు. కాగా, కరోనా వైరస్ సోకిన వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిర్వహిస్తున్న తనిఖీలలో ఎలాంటి సడలింపు లేకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు.
- పంజాబ్: విదేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో రాష్ట్రానికి తిరిగివస్తున్న పంజాబీపౌరులు రాష్ట్రంలోని తమ స్వస్థలాలకు చేరడంలో సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌలభ్యకల్పన కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అంతేకాకుండా సంబంధిత జిల్లాల్లోని వివిధ హోటళ్లలో వారిని నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉంచడానికి విస్తృత ఏర్పాట్లు కూడా చేసింది. ఇక హోటళ్ల ఖర్చు భరించలేని విద్యార్థులు/వలసదారులకు ఉచిత నిర్బంధవైద్య సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. మరోవైపు ఏకాంత చికిత్స, నిర్బంధవైద్య పర్యవేక్షణలో ఉన్నవారికి సలహా-మానసిక సాంత్వన సహాయం అందించడం కోసం భారత వైద్య సంఘం, మొహాలీవారి సహకారంతో S.A.S.నగర్ జిల్లా యంత్రాంగం సహాయకేంద్రాన్ని ప్రారంభించింది. బాధితులు తమ భావోద్వేగాలను, ఆందోళన, నిరాశనిస్పృహలను ప్రముఖ వైద్యులు, క్షేత్రస్థాయి నిపుణులతో పంచుకునేలా చూడటమే ఈ కేంద్రం ఏర్పాటు లక్ష్యం.
- హర్యానా: హర్యానా నుంచి సొంతరాష్ట్రాలకు వెళ్లడానికి ఆసక్తిగల వలసకార్మికులను పంపించడంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆ మేరకు వలసకార్మికులలో ఏ ఒక్కరూ తమ స్వస్థలాలకు నడిచివెళ్లే అవసరం లేకుండా చూడాలని డిప్యూటీ కమిషనర్లందరినీ ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు ఉద్దేశించిన రైళ్లు, బస్సుల మొత్తం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అలాగే సహాయ కేంద్రాల్లో వలస కార్మికులకు ఆశ్రయంసహా వారిని రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్లకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఏర్పాట్లు చేస్తోంది.
- హిమాచల్ ప్రదేశ్: దిగ్బంధం నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కుకున్న వలసదారులను స్వయం సమృద్ధ భారతం పథకం కింద ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ ఆహారభద్రత చట్టం లేదా రాష్ట్రాల ప్రజాపంపిణీ వ్యవస్థ కింద రేషన్ కార్డులేని వారికి 2020 మే, జూన్ నెలల్లో తలా 5 కిలోల బియ్యం, ముక్కుశనగ పప్పు సరఫరా చేయనుంది. ఇందుకోసం వారు పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులు, మేయర్, డిప్యూటీ మేయర్, కౌన్సిలర్ లేదా గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన నిర్ధారణ పత్రాన్ని దుకాణదారుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రాన్ని జిల్లా కంట్రోలర్ లేదా ఆహార తనిఖీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయం లేదా చౌకధరల దుకాణాలనుంచి పొందవచ్చు.
- అరుణాచల్ ప్రదేశ్: కర్ణాటకలో చిక్కుకున్న 209మంది అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థులు అసోం రాజధాని గువహటి చేరుకోగా, వారిని రోడ్డుమార్గాన ఇటానగర్ తీసుకెళ్లనున్నారు.
- అసోం: కోవిడ్-19పై రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో వ్యాధి లక్షణాలు లేవని తేలడంతో ఆరుగురు రోగులను డిశ్చార్జ్ చేశారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 130 యాక్టివ్ కేసులున్నాయి.
- మణిపూర్: రాష్ట్రానికి తిరిగివచ్చిన వారందరినుంచి పకడ్బందీగా నమూనాల సేకరణ కొనసాగుతోంది. ఈ మేరకు ఇప్పటిదాకా 139 నమూనాలను పరీక్ష కోసం ఉఖ్రుల్ నగరానికి పంపారు. తక్యేల్‌పాత్‌లోని ప్రభుత్వ ఆదర్శ అంధ పాఠశాలలో లింగమార్పిడి వ్యక్తులకోసం నిర్బంధవైద్య కేంద్రం ప్రారంభమైంది.
- మేఘాలయ: రాష్ట్రంలో గడచిన రెండు నెలల్లో కోవిడ్-19 సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ.69 కోట్లు ఖర్చుచేసిందని మేఘాలయ ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ఇదే వ్యవధిలో ఆరోగ్య మౌలిక వసతులు, సౌకర్యాల మెరుగుదలకు రూ.46 కోట్లు వెచ్చించామని తెలిపారు.
- మిజోరాం: రాష్ట్రంలోని సియాహా జిల్లాలోని గ్రామీణులు తమ ఇళ్లలో పండించిన కూరగాయలతోపాటు శ్రమించి సేకరించిన అటవీ ఉత్పత్తులను సియాహా పట్టణంలోని నిర్బంధవైద్య కేంద్రాల వంటశాల నిర్వహణ కమిటీకి విరాళంగా అందజేశారు.
- నాగాలాండ్: రాష్ట్రానికి తిరిగివచ్చే 200 మందికోసం తబేకు గ్రామంలో నిర్బంధవైద్య కేంద్రం ఏర్పాటుకు పూర్తిస్థాయి తోడ్పాటునివ్వాలని పశ్చిమ సుమి సంస్థలు నిర్ణయించాయి.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ 2250 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 39,297కు చేరింది. కాగా, తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 27,581 ఉండగా హాట్‌స్పాట్ ముంబైలో 1372 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 23,935కి చేరాయి. ముంబైలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం 24 వార్డుల్లోని ఐసీయూలలో 10, ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు, చిన్న ఆసుపత్రులుసహా కనీసం 100 పడకలను సమీకరించాలని బీఎంసీ ఇవాళ అధికారులను ఆదేశించింది.
- గుజరాత్: రాష్ట్రంలో కొత్త కేసులు 398తోపాటు 30 మరణాలు నమోదయ్యాయి, దీంతో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 12,539కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులలో 6,571 మంది చికిత్స పొందుతుండగా వారిలో 47మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ‘నేను కూడా కరోనా పోరాట యోధుణ్ని’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, దీనికి ప్రజలు విస్తృతంగా మద్దతివ్వాలని విజ్ఞప్తిచేశారు. పిల్లలు, వృద్ధ పౌరులవంటివారు కరోనా వైరస్‌పై పోరులో పాటించాల్సిన ‘ఇంట్లోనే ఉండటం, మాస్కు తప్పక ధరించడం, సామాజిక దూరం పాటించడం’ అనే మూడు ప్రాథమిక నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని వారంపాటు నిర్వహించనున్నారు.
- రాజస్థాన్: రాష్ట్రంలో ఇవాళ 83మందికి రోగ నిర్ధారణ కావడంతో కోవిడ్ పీడితుల సంఖ్య 6098కి పెరిగింది. ఇప్పటిదాకా 3421మంది కోలుకోగా, మరో 2527మంది చికిత్స పొందుతున్నారు.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 227 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 5875కు చేరింది. ఇండోర్ జిల్లాలో అత్యధికంగా 2774 కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తం మరణాలు 267కు పెరిగింది. వీరిలో ఇండోర్‌లో గరిష్ఠంగా 107 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ రోజు మొత్తం 14 కొత్త కేసులు నమోదయ్యాయి.
- గోవా: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇవాళ 4 కొత్త కేసుల నమోదుతో మొత్తం రోగుల సంఖ్య 50కి చేరింది. వీరిలో ఇద్దరు ఆదివారం రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో నగరానికి వచ్చారు. అలాగే పుణె నుంచి బస్సులో ఒకరు, నాలుగో వ్యక్తి ఓడలో వచ్చిన తీర రక్షకదళ నావికుడు.
***
(Release ID: 1625927)
Visitor Counter : 320
Read this release in:
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam