రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ -19 వల్ల రక్షణ పరికరాల తయారీపై ప్రతికూల ప్రభావం పడిందని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారతీయ రక్షణ ఉత్పత్తిదారుల సంఘం

(ఎస్ఐడిఎం) మరియు ఇతర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఈ-మహాసభలో మంత్రి వీడియో ప్రసంగం చేశారు.
రక్షణ సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉత్పత్తులలో ఇండియా 'స్వయం సమృద్ధి' సాధించేందుకు కృషి చేయాలని ఎం ఎస్ ఎం ఈ సంస్థలను మంత్రి ప్రేరేపించారు
ఇటీవల ప్రకటించిన సంస్కరణలు మరియు ఆర్ధిక ప్యాకేజీ ఎంఎస్ఎంఈ సంస్థలను శక్తివంతంగా చేస్తాయని రక్షణ మంత్రి ఉద్ఘాటించారు
స్వావలంభన సాధించడానికి మన దైనందిన జీవితంలో 'స్థానికత'పైన దృష్టిని కేంద్రీకరించాలని మంత్రి పిలుపు

Posted On: 21 MAY 2020 2:23PM by PIB Hyderabad

కోవిడ్ -19 విశ్వ మహమ్మారిపై దేశం జరిపిన  పోరాటంలో ఎస్ఐడిఎం మరియు  ఇతర ఎంఎస్ఎంఈ సంస్థలు పోషించిన పాత్రను  రక్షణ మంత్రి  శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు.   ఎస్ఐడిఎం,  భారత పరిశ్రమల సమాఖ్య (సి ఐ ఐ)  మరియు రక్షణ ఉత్పత్తుల శాఖ సంయుక్తంగా గురువారం ఏర్పాటు చేసిన ఈ-మహాసభలో మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా  ప్రసంగించారు.  

 

 

'రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ  (డి ఆర్ డి ఓ) డిజైన్ చేసిన వ్యక్తిగత సంరక్షణ సాధనాలు (పి పి ఈ) , మాస్కులు, వెంటిలేటర్ల విడిభాగాలను ఎస్ఐడిఎం సమన్వయంతో త్వరితగతిన ఉత్పత్తి చేస్తున్నందుకు  నాకు ఎంతో సంతోషంగా ఉంది.  కేవలం రెండు నెలల లోపలే మనం దేశీయ అవసరాలకు తగినంతగా ఉత్పత్తి చేయగలగడమే కాక,  రానున్న రోజుల్లో పొరుగు దేశాలకు కూడా సహాయపడే విషయాన్ని గురించి  మనం యోచించవచ్చు'  అని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. 

ఎంఎస్ఎంఈ సంస్థలు దేశ ఆర్ధిక రంగానికి వెన్నెముక వంటివని,  అవి  స్థూలదేశీయోత్పత్తిని  త్వరితం చేస్తాయని,  విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తాయని మరియు ఉపాధి అవకాశాలను పెంచుతాయని మంత్రి పేర్కొన్నారు.   ఎంఎస్ఎంఈలను దృఢంగా ఉంచడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని అన్నారు.  "మన  ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు --  ఆయుధకర్మాగారాలు, రక్షణ శాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు (డి పి ఎస్ యు) మరియు సేవా సంస్థలతో  జతకూడి  8,000కు పైగా  ఎంఎస్ఎంఈలు ఉత్పత్తులు సాగిస్తున్నాయి.   రక్షణ శాఖ సంస్థల మొత్తం ఉత్పత్తిలో  వాటి తోడ్పాటు 20 శాతానికి పైగా ఉంటుంది"  అని అన్నారు.   

 రక్షణ పరిశ్రమ అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని శ్రీ రాజ్ నాథ్ సింగ్  అంగీకరిస్తూ " లాక్ డౌన్ మరియు సరఫరా శృంఖల తెగిపోవడం వల్ల ఉత్పత్తి రంగంపై తీవ్ర  ప్రతికూల ప్రభావం పడింది,  రక్షణ రంగం అందుకు మినహాయింపు కాదు.  ఇంకొక విధంగా చెప్పాలంటే రక్షణ  ఉత్పత్తుల కొనుగోలుదారు కేవలం ప్రభుత్వం మాత్రమే కావడం వల్ల రక్షణ రంగానికి ఎక్కువ చెడు జరిగింది"  అని అన్నారు.  లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి  రక్షణ మంత్రిత్వ శాఖ,  సైనిక దళాలకు చెందిన సీనియర్ అధికారులతో  ఎస్ఐడిఎం  అనేకమార్లు సమావేశమై సమాలోచనలు జరిపింది.  దీనివల్ల రక్షణ పరిశ్రమల సమస్యలను గురించి  తెలుసుకోవడానికి,  వాటిని అధిగమించేందుకు ఎస్ఐడిఎం సూచనలు వినేందుకు అవకాశం లభించింది.  

ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి  పరిశ్రమల కోసం, విశేషంగా  ఎంఎస్ఎంఈల కోసం  రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్ ఎఫ్ పి / ఆర్ ఎఫ్ ఐ స్పందన తేదీల పొడిగింపు,  పెండింగ్ చెల్లింపులను సత్వరం విడుదల చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంది.  ఈ సంక్షోభ సమయంలో   పరిశ్రమలపై ఆర్ధిక భారాన్ని తగ్గించడానికి,  తోడ్పాటును అందించేందుకు  ప్రభుత్వం,  రిజర్వు బ్యాంకు అనేక ఆర్ధిక చర్యలను ప్రకటించాయి.  వీటివల్ల వారికి అదనపు నిర్వహణ పెట్టుబడి లభ్యత,  వడ్డీల చెల్లింపులో వాయిదా వంటివి లభిస్తాయి.   

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పూర్తితో ప్రారంభించిన 'స్వయం సమృద్ధ భారత్"  ప్రచారోద్యమం భారతీయ పరిశ్రమలకు  ఎన్నో అవకాశాలను కలిగించడమే కాక లక్షలాది మంది ఉద్యోగాలు పునరుద్ధరించడం రుగుతుందని రక్షణ మంత్రి హామీ ఇచ్చారు. "ఇందుకోసం స్థానికత గురించి గట్టిగా నొక్కి చెప్పాలని,  దేశీయంగా తయారైన వస్తువులనే వాడాలని ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. అందువల్ల మనం స్వదేశీ ఉత్పత్తులను తయారు చేయాలని నా అభిప్రాయం.  స్థానికత గురించి గట్టిగా చెప్పాలి.   అంటే మన దైనందిన  జీవితంలో  స్థానిక వస్తువులపై దృష్టిని కేంద్రీకరించడం.   అనగా మన జీవితంలో 'స్వదేశీ' ఉత్పత్తులను ఎంచుకోవాలి. దేశీయ ఉత్పత్తుల తయారీ లక్ష్య సాధనలో,   స్వావలంబన భారత్ లక్ష్యాన్ని చేరడంలో  ఎంఎస్ఎంఈల పాత్ర  ముఖ్యమైనదని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు"  అని ఆయన అన్నారు.  

'ఆత్మ నిర్భర్ భారత్' స్కీము కింద ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  ప్రకటించిన చర్యలలో కొన్ని  ఎంతో ముఖ్యమైనవని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.  మూడు లక్షల కోట్ల  ఎంఎస్ఎంఈలకు అదనపు గ్యారంటీ లేకుండా రుణాలు ఇవ్వడం వాళ్ళ దాదాపు 45 లక్షల యూనిట్ల పునఃస్థాపన జరిగి ఉద్యొగాల పునరుద్ధరణ జరుగుతుంది.  ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న 2 లక్షల ఎంఎస్ఎంఈ సంస్థలకు ఊరట చేకూర్చేందుకు  రూ. 20,000 కోట్ల మేర రుణాలు కేటాయించనున్నట్లు కూడా ప్రకటించారు.   ఎంతో అవసరంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చేందుకు 'మదర్ -  డాటర్ ఫండ్' ద్వారా రూ. 50,000 కోట్ల ఈక్విటీని కలుపుతారు.  ఈ యూనిట్ల సామర్ధ్యాన్ని పెంచి  మార్కెటింగ్ కు అనువుగా తయారు చేయడానికి రూ.10,000 కోట్లతో  'నిధుల నిధిని'  ఏర్పాటు చేస్తారు.  

ఎంఎస్ఎంఈ సంస్థల విస్తరణకు వీలుగా వాటి నిర్వచనాన్ని సవరించారు.   ఉత్పత్తి ,  సేవల రంగం మధ్య తేడా చూపారు.   రూ. 200 కోట్లు లేక అంతకన్నా తక్కువ కాంట్రాక్టుల(సేకరణ)  కోసం గ్లోబల్ టెండర్లను పిలవరు. దీనివల్ల ఎంఎస్ఎంఈల వ్యాపారం పెరుగుతుంది.   వాణిజ్య ప్రదర్శనలకు  హాజరు కాలేక పోతున్నందువల్ల ఈ- మార్కెట్ సంధానం జరిగేట్లు చూస్తారు. ఎంఎస్ఎంఈలకు   ప్రభుత్వం,  పి ఎస్ యులు చెల్లించవలసిన   బకాయిల  చెల్లింపులు వచ్చే 45 రోజుల్లో నిశ్చయంగా జరిగేట్లు చూస్తారు. 

" రక్షణ మరియు అంతరిక్ష రంగాలలో ఎంఎస్ఎంఈల వ్యాపార కొనసాగింపు"  అనే అంశంపై నిర్వహించిన ఈ-మహాసభలో 800 మందికి పైగా  రక్షణ  ఎంఎస్ఎంఈల ప్రతినిధులు పాల్గొన్నారు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలో అమెరికాలో దేశీయ రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ అభివృద్ధి చెందిందని ఉదహరిస్తూ ఇండియా కూడా తన సొంత రక్షణ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని  రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ అన్నారు.    రక్షణ సాంకేతిక విధానాల్లో ఇండియాను పది ప్రధాన దేశాల సరసన చేర్చేందుకు ఎంఎస్ఎంఈలు కృషి చేయాలని  ఆయన అన్నారు.  

 

రక్షణ ఉత్పత్తుల కార్యదర్శి  శ్రీ రాజ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వల్ల  రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం  చేపట్టిన బకాయిలను తీర్చడం వంటి  వివిధ  చర్యలను వివరించారు. వాటి ఉత్పత్తి లక్ష్యాలను తగ్గించలేదని చెప్పారు.   ఆర్ధిక మంత్రి ప్రకటించిన సంస్కరణల గురించి చెప్తూ వాటివల్ల  2025 నాటికి ఇండియా రక్షణ సామగ్రి తయారీ లక్ష్యం 2500 కోట్ల అమెరికా డాలర్ల లక్ష్యాన్ని సాధించవచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

 ఎస్ఐడిఎం  అధ్యక్షుడు శ్రీ జయంత్ డి. పాటిల్,  మాజీ అధ్యక్షుడు శ్రీ బాబా ఎన్.  కళ్యాణి,  సి ఐ ఐ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ,  రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్  సివిల్, సైనిక అధికారులు,  ఆయుధకర్మాగార బోర్డు మరియు  డి పి ఎస్ యులకు చెందిన అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.    



(Release ID: 1625875) Visitor Counter : 213