ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 21 MAY 2020 3:27PM by PIB Hyderabad

కోవిడ్ - 19 నివారణకు, నియంత్రణకు భారత్ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అనేక ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలను అత్యున్నత స్థాయిలో క్రమం తప్పకుండా సమీక్షిస్తూ నిశితంగా పరిశీలిస్తోంది.

ఇప్పటివరకూ 45,299 మంది బాధితులు కోవిడ్ - 19  నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 3,002 మంది కోవిడ్ - 19  బాధితులు కోలుకోగా వ్యాధి బారి నుంచి అలా బైటపడుతున్న వారి శాతం క్రమంగా మెరుగుపడుతోంది.  ప్రస్తుతం కోలుకుంటున్నవారి శాతం 40.32% గా నమోదైంది.

ప్రస్తుతం భారతదేశంలో 63,624 మంది కోవిడ్ బాధితులు చికిత్స పొందుతూ ఉన్నారు. వీరంతా వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. చికిత్స పొందుతున్నవారిలో సుమారు 2.94%  మంది అత్యవసర చికిత్సా విభాగం (ఐ సి యు) లో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిన వారిలో మృతులు 6.65% ఉండగా భారత్ లో మాత్రం 3.06% గా నమోదైంది. సకాలంలో బాధితులను గుర్తించటంలోనూ, తగిన చికిత్స అందించటంలోనూ మనం చేస్తున్న కృషికి ఇది అద్దం పడుతున్నది.

మృతుల సమాచారాన్ని విశ్లేషించినప్పుడు వారిలో 64% మంది పురుషులు, 36% మంది స్త్రీలు ఉన్నట్టు తేలింది. వయోవర్గాల వారీగా చూస్తే 15 ఏళలోపు వారు  0.5% శాతం, 15-30 ఏళ్ళ మధ్య వారు 2.5%  ఉండగా 30-45 ఏళ్ళ మధ్య వయసున్న వారు 11.4% ఉన్నారు. 45-60 ఏళ్ళ వయోవర్గం బాధితులలో 35.1%  చనిపోగా  60 ఏళ్ళు పైబడిన వారిలో కరోనా బాధితులలో అత్యధికంగా 50.5% మంది చనిపోయారు. పైగా మృతులలో  73% మంది దీర్ఘకాల రుగ్మతల బాధితులే కావటం కూడా గుర్తించారు. అందుకే 60 ఏళ్ళు పైబడిన దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు కోవిడ్ -19 బారిన పడే అవకాశం చాలా ఎక్కువహా ఉన్నవారుగా తేలింది

అందుకే కోవిడ్ పట్ల సామాజిక అవగాహన కల్పించటం, దానికి తగినవిధంగా నడుచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించటం ద్వారా ఈ వ్యాధి విస్తరించకుండా చూడగలిగే ముఖ్యమైన మార్గమని తేలింది. వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత, ఊపిరి తీసుకునే సమయంలో పాటించాల్సిన నియమాలు, పరిసరాల శుభ్రత మీద ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. బహిరంగ ప్రదేశాలలో ముఖాన్ని కప్పుకోవటం, మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద సంఖ్యలో గుమికూడటం తగదు. వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వయోవర్గం వారు, దీర్ఘకాల రోగాల బాధితులు వైద్య చికిత్స లేదా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బైటికి రాకుండా ఇంట్లోనే ఉండటం తప్పనిసరి.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.

కోవిడ్ -19 మీద ఏవఇనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టొల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి.



(Release ID: 1625794) Visitor Counter : 193