మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

సురక్షితంగా నవోదయ విద్యార్థుల తరలింపు: కేంద్ర మానవవనరుల శాఖామంత్రి

Posted On: 21 MAY 2020 3:25PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఉన్న 173 జవహర్ నవోదయ విద్యాలయాలలో  లాక్ డౌన్ సందర్భంగా ఉండిపోయిన 3000 మందికి పైగా విద్యార్థులను సురక్షితంగా తరలించే కార్యక్రమాన్ని నవోదయ విద్యాలయ సమితి మే 15 న విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ మేరకు తెలియజేశారు.
మానవ వనరుల మంత్రిత్వశాఖలోని పాఠశాల విద్య, సాక్షరతా విభాగం కింద బాలబాలికలకు ఉమ్మడిగా రెసిడెన్షియల్ విధానంలో  నవోదయ విద్యాలయ సమితి ఆద్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే.  గ్రామీణ ప్రాంతాలకు చెందిన తెలివైన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సామాజిక- ఆర్థిఅమ్ నేపథ్యంతో నిమిత్తం లేకుండా  ఎంపిక చేసి నాణ్యమైన ఆధునిక విద్య నందించటంతోబాటు సంస్కృతి, విలువలు, పర్యావరణం పట్ల అవగాహన, సాహస కృత్యాలు, వ్యాయామవిద్య నేర్పటం నవోదయ విద్యాలయాల ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగఅ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రస్తుతం 661 నవోదయ విద్యాలయాలను అనుమతించగా వాటిలో 2 లక్షల 60 వేలమందికి పైగా విద్యార్థులు ఉచితంగా నాణ్యమైన విద్యనందుకుంటున్నారు.

https://twitter.com/DrRPNishank/status/1263388946618187776?s=19

నవోదయ విద్యాలయ పథకంలోని ఒక ముఖ్యమైన లక్షణమేంటంటే ఒక భాషాప్రాంతపు విద్యార్థిని మరో భాషా ప్రాంతపు విద్యాలయానికి ఏడాదిపాటు పంపటం. దీనివలన భారత సంస్కృతిలోని వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని, ప్రజా జీవనాన్ని అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇలా పంపించే విధానం చాలా కాలంగా అమలులో ఉండగా జాతీయ సమగ్రతా భావాన్ని విద్యార్థులలో పాదుకొల్పటానికి ఇది దోహదం చేస్తున్నది.

కోవిడ్ - 19 నేపథ్యంలో నవోదయ విద్యాలయ సమితి వేసవి సెలవులను ముందుకు జరిపింది. ఆ విధంగా నవోదయ విద్యాలయాలకు  2020 మార్చి 21 న వేసవి సెలవులిచ్చారు.
చాలామంది విద్యార్థులు అదే జిల్లాకు చెందినవాళ్ళు కావటం వలన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే లోపు తమ ఇళ్ళకు చేరుకోగలిగారు. అయితే, మైగ్రేషన్ పథకం కింద వచ్చిన 173 పాఠశాలకు చెందిన 3169 మంది దూరప్రాంత విద్యార్థులతోబాటు  పుణెలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో   జె ఇ ఇ మెయిన్స్ కోసం శిక్షణ తీసుకుంటున్న మరో 12 మంది విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్ళలేకపోయారు.
లాక్ డౌన్ కాలపరిమితి మరింతగా పెంచటం కారణంగా బాలికలతో సహా ఈ దూరప్రాంత విద్యార్థులు దిగులు పడటం ఎక్కువైంది. ఎక్కువమంది 13 - 15 ఏళ్ళవారే కావటం, ఆరు నెలలుగా ఇంటి ముఖం చూడకపోవటం వీళ్ళలో బెంగను బాగా పెంచాయి.
 వీలైనంత త్వరగా వీళ్ళను ఇంటికి చేర్చే మార్గాలు ఏమున్నాయో వెతకటం మీద నవోదయ విద్యాలయ సమితి దృష్టి సారించింది. హోం మంత్రిత్వశాఖతోను, ఆయా రాష్ట్రాల, జిల్లాల  విడతల వారీగా జరిపిన చర్చల అనంతరం కావలసిన అనుమతులన్నీ పొందిన మీదట లాక్ డౌన్ సమయంలో సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా రోడ్డు మార్గాన తరలించటం ప్రారంభించింది. అలా వివిధ నవోదయ విద్యాలయాల విద్యార్థుల తరలింపు 2020 మే 9 వరకు సాగింది. ఆఖరి విడత విద్యార్థి బృందం  మే 15న  తమ గమ్యస్థానమైన ఝబువా చేరటంతో ఈ తరలింపు పూర్తయింది.

 
ఈ మొత్తం ప్రక్రియను నవోదయ విద్యాలయ సమితి ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించింది. వాహనాల శుద్ధి, మాస్కులు, శానిటైజర్లు సమకూర్చటం తోబాటు ఆహారం తదితర అవసరాలకు తగిన ఏర్పాట్లు చేయటం, తోడుగా ఉపాధ్యాయులను పంపటం దాకా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. మొత్తం ప్రయాణంలో ఎక్కడా బయటి ఆహారం తీసుకోకుండా చూడటం, బయలుదేరినప్పుడు, వాళ్ళ గమ్యస్థానాలు చేరినప్పుడు కూడా అక్కడి జిల్లా అధికారుల సహకారంతో  వైద్య పరీక్షలు నిర్వహించటం లాంటి పనులన్నీ చేపట్టింది.

విద్యార్థుల ప్రయాణం దూరం దృష్ట్యా అతి సుదీర్ఘ ప్రయాణం హర్యానాలోని కర్నాల్ జనవహర్ నవోదయ విద్యాలయం నుంచి 3060 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరళ లొని తిరువనంతపురం దాకా సాగింది. ఈ క్రమంలో తమిళనాడు, కర్నాటక, ఆంధ్త్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అనే ఏడు రాష్ట్రాలు దాటాల్సి వచ్చింది. అతి తక్కువ ప్రయాణం ఒడిశాలోని బోలంగీర్ నవోదయ విద్యాలయ నుంచి 420 కిలోమీటర్లు ప్రయాణించి మధ్యప్రదేశ్ లోని అన్నుపూర్ చేరటం.

ఉత్తరప్రదేశ్ లోని నైనిటాల నవోదయ విద్యార్థులు కేరళలోని వయనాడ్ చేరటానికి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక గుండా ప్రయాణించారు. అదే విధంగా మణిపూర్ లోని సేనాపతి నవోదయ విద్యార్థులు సంక్లిష్టమైన దారిగుండా నాగాలాండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు దాటి మే 15 నాటికి సురక్షితంగా మధ్యప్రదేశ్ లోని ఝబువా చేరుకున్నారు.

అవసరమైన అనుమతులు రావటంలో జాప్యం, సుదూర ప్రయాణం చేయాల్సి రావటం లాంటి కారణాల వలన ఉత్తరప్రదేశ్ అమేథి విద్యాలయం నుంచి కేరళలోని అలెప్పీ ప్రయాణానికి అత్యధికంగా ఐదు రోజుల 15 గంటలు పట్టింది. అయితే, బోలంగిర్ నుంచి అన్నుపూర్ చేరటానికి పట్టిన తొమ్మిదిన్నర గంటలు అతి తక్కువ సమయంగా నమోదైంది.

విద్యార్థుల ప్రయాణాన్ని నవోదయ విద్యాలయ సమితి, మానవ వరుల మంత్రిత్వశాఖ చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ప్రతిరోజూ పురోగతిని సమీక్షించాయి. మొత్తం173 పాఠశాలలకు చెందిన 3169 మంది విద్యార్థులూ ఎలాంటి సమస్యలూ లేకుండా సురక్షితంగా వాళ్ళ గమ్య స్థానాలు చేరుకోగలిగారు. ఈ క్రమంలో మొత్తం 41 లక్షల కిలోమీటర్ల ప్రయాణం సాగింది. ఇది నవోదయ విద్యాలయాల సమితి అధికారుల అకుంఠిత దీక్షకు, పట్టుదలకు, అంకితభావానికి అద్దం పట్టింది. అదే విధంగా ఆయా రాష్ట్ర, జిల్లాల అధికారుల చొరవ, అవిరళ కృషిని ఈ విజయం చాటి చెప్పింది. 



(Release ID: 1625838) Visitor Counter : 220