ఆర్థిక మంత్రిత్వ శాఖ
పారిశ్రామిక రంగంపై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నమ్మకముంది : సిఐఐతో ఆర్ధిక శాఖ మంత్రి
Posted On:
20 MAY 2020 7:22PM by PIB Hyderabad
దేశంలోని పారిశ్రామిక రంగంపై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో, సంపూర్ణమైన నమ్మకముందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని కార్మిక శక్తిని సరైన రీతిలో ఉపయోగించుకోవాలని వారి నైపుణ్యాలను పెంచడానికి పారిశ్రామిక రంగం ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్ధిక మంత్రి కోరారు. కార్మికులను సక్రమంగా ఉపయోగించుకోవడంలో పారిశ్రామిక రంగం అందరికీ ఆదర్శంగా నిలవాలని..అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పారిశ్రామిక విధానాలు వుండాలని ఆమె కోరారు.
భారత పారిశ్రామిక సమాఖ్య ( కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, సిఐఐ) ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ధిక మంత్రి మాట్లాడారు. సిఐఐ ఏర్పడి ఈ ఏడాదితో 125 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశ పారిశ్రామిక రంగ అభ్యున్నతికి సిఐఐ ఉన్నతమైన సేవలందించిందని ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి ప్రశంసించారు. సంస్థ సభ్యులు తమ తమ రంగాల్లో ప్రధాన పాత్ర పోషించారని ఆమె అన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సిఐఐ తనదైన ముద్ర వేయాలని ఆర్ధిక మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నైపుణ్యం లేని కార్మికులకు సరైన శిక్షణ ఇప్పించి వారిలో నైపుణ్యాలను పెంచాలని, అంతే కాదు అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల్లో ఈ పని జరగాలని ఆర్ధిక మంత్రి కోరారు.
కోవిడ్ -19కు ముందుకూడా ప్రభుత్వం తరఫునుంచి దేశంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, గ్రామీణ పరిశ్రమలకు అవసరమైన మద్దతును ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. ఎంఎస్ ఎంఇలకు అవసరమైన రుణాల విషయంలో బ్యాంకులకు ప్రభుత్వం గ్యారంటీనిస్తోందని అన్నారు.
వ్యవసాయరంగానికి సంబంధించి సమగ్రమైన సంస్కరణలు చేయడం జరిగిందని ఒక ప్రశ్నకు బదులుగా ఆర్ధిక మంత్రి అన్నారు. వీటికి సంబంధించి మూడు మోడల్ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరిగిందని అన్నారు. భూ సంస్కరణలకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశంసించాయని అన్నారు.
దేశంలో ప్రాధమిక సౌకర్యాల కల్పనకు సంబంధించి భారీ ప్రాజెక్టులను రూపొందించామని, ఇవి మొదలు కాగానే ఆయా రంగాల్లో గణనీయమైన స్థాయిలో ఉత్తేజం వస్తుందని ఆర్ధిక మంత్రి అన్నారు.
జిఎస్ టి విషయంలో సముచితమైన చర్చలు జరిగాయని, వసూళ్లు తక్కువస్థాయిలో వున్నాయని దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. విద్యుత్ రంగానికి చేసిన ఉద్దీపన కేటాయింపులు 90 వేల కోట్లని వీటిని ఎలాంటి జాప్యం లేకుండా అందుబాటులోకి వచ్చేలా చేస్తామని అన్నారు.
భారీ పరిశ్రమలకు సంబంధించిన సమస్యలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకొచ్చాయి. ముఖ్యంగా పర్యాటక రంగం, వాహన తయారీ రంగం, విమానయాన తయారీ రంగాల గురించి చర్చలు జరిగాయి. ఉద్యోగ భద్రత, డిమాండ్ పెంచడం, భారీ పరిశ్రమల, వ్యాపారాల భద్రత గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐఐ డైరెక్టర్ జనరల్ శ్రీ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ ఎంఎస్ ఎం ఇ రంగాన్ని పునర్ నిర్వచిస్తూ కేంద్రం తెచ్చిన కొత్త విధానాలకు పరిశ్రమలనుంచి చక్కటి స్పందన వచ్చిందని, ఈ విషయం తాము చేసిన సర్వే ద్వారా తేలిందని అన్నారు.
****
(Release ID: 1625666)
Visitor Counter : 359