సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

లోకల్ టూ గ్లోబల్ : విదేశీ మార్కెట్లను చేరుకుంటున్న ఖాదీ మాస్కులు.

Posted On: 21 MAY 2020 4:06PM by PIB Hyderabad

విస్తృతంగా ప్రాచుర్యం పొందిన ఖాదీ ఫేస్ మాస్కు  “ అంతర్జాతీయ మార్కెట్” కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.  ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) ఇప్పుడు ఖాదీ పత్తి మరియు పట్టు ఫేస్ మాస్కులను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాన్ని అన్వేషిస్తోంది.  అయితే, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని రకాల వైద్యేతర / శస్త్రచికిత్స కాని మాస్కుల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత ఈ విషయాన్ని చేపడతారు.  ఈ విషయమై  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) మే నెల 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.

"ఆత్మనిర్భర్ భారత్ అభియాన్" నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ "లోకల్ టూ గ్లోబల్" అని పిలుపు  ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఈ ఆలోచన వచ్చింది.  కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఫేస్ మాస్కులకు నెలకొన్న భారీ డిమాండ్ ని దృష్టి లో పెట్టుకుని కె.వి.ఐ.సి. రెండు పొరలతో, మూడు పొరలతో నూలు మరియు సిల్కు మాస్కులను తయారుచేసింది. ఇవి రెండు రంగులలో పురుషులకు, అనేక రంగుల్లో మహిళలకు అందుబాటులో ఉన్నాయి.  

కె.వై.ఐ.సి. ఇప్పటివరకు 8 లక్షల మాస్కుల సరఫరాకు ఆర్డర్లు స్వీకరించి, అందులో ఇప్పటికే 6 లక్షలకు పైగా  మాస్కులను లాక్ డౌన్ సమయంలో సరఫరా చేసింది.   రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలుజమ్మూకశ్మీర్ ప్రభుత్వంతో పాటు సాధారణ ప్రజల నుండి ఈ-మెయిల్ ద్వారా కె.వి.ఐ.సి. ఆర్డర్లు స్వీకరించింది.  విక్రయాలతో పాటు, కె.వి.ఐ.సి. 7.5 లక్షలకు పైగా ఖాదీ మాస్కులను దేశవ్యాప్తంగా ఉన్న ఖాదీ సంస్థల ద్వారా జిల్లా పాలనాయంత్రాంగాలకు ఉచితంగా పంపిణీ చేసింది.  

గత కొన్ని సంవత్సరాలుగా ఖాదీ యొక్క ఆదరణ గణనీయంగా పెరిగిన దుబాయ్, యుఎస్ఎ, మారిషస్ మరియు అనేక యూరోపియన్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాలలో ఖాదీ ఫేస్ మాస్క్‌లను సరఫరా చేయాలని కెవిఐసి యోచిస్తోంది. ఈ దేశాలలో ఖాదీ మాస్కులను భారత రాయబార కార్యాలయాల ద్వారా విక్రయించాలని కెవిఐసి యోచిస్తోంది.

కె.వి.ఐ.సి. చైర్మన్, శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ, ఖాదీ మాస్కుల ఎగుమతి “లోకల్ టు గ్లోబల్” కి తగిన ఉదాహరణ అన్నారు. " ప్రధానమంత్రి విజ్ఞప్తి తర్వాత ఖాదీ వస్త్రం మరియు ఇతర ఖాదీ ఉత్పత్తులకు ప్రజాదరణ ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. ఖాదీ మాస్కుల ఎగుమతి ఉత్పత్తిలో పెరుగుదలకు దారితీస్తుంది మరియు చివరికి భారతదేశంలోని చేతివృత్తులవారికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాన్ని సృష్టిస్తుంది, ” అని సక్సేనా చెప్పారు.   "కరోనా మహమ్మారితో పోరాడటానికి ఫేస్ మాస్క్‌లు అత్యంత ముఖ్యమైన సాధనం.  డబుల్ ట్విస్టెడ్ ఖాదీ ఫాబ్రిక్ నుండి తయారుచేసిన ఈ మాస్కులు డిమాండ్ కు అవసరమైన నాణ్యత, స్థాయి తో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, శ్వాస తీసుకోడానికి వీలుగాఉంటాయి, ఉతికి లేక కడిగి శుభ్రం చేయదగినవి, పునర్వినియోగపరచదగినవి మరియు సులువుగా మట్టిలో కలిసిపోయే గుణం కలిగి ఉండేలా తయారుచేయబడ్డాయి. ” అని సక్సేనా వివరించారు. 

ఈ మాస్కుల తయారీకి కెవిఐసి ప్రత్యేకంగా డబుల్ ట్విస్టెడ్ ఖాదీ వస్త్రాన్ని ఉపయోగిస్తోంది, ఎందుకంటే ఇది లోపల తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది, అదే సమయంలో గాలికి సులువుగా ప్రయాణించే మార్గాన్ని అందిస్తుంది.  ఈ మాస్కులు మరింత ప్రత్యేకమైనవి. ఎందుకంటే  చేతితో వడికిన, చేతితో నేసిన నూలు మరియు సిల్క్ బట్టలతో వీటిని తయారుచేస్తారు.  నూలు యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది, సిల్క్ ఎలెక్ట్రోస్టాటిక్ అవరోధంగా పనిచేస్తుంది. 

 

 *****



(Release ID: 1625835) Visitor Counter : 294