ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఒక కోటి చికిత్సలు జరిగాయి.

"ఆయుష్మాన్ భారత్ : ఒక కోటి చికిత్సలు మరియు అంతకంటే ఎక్కువ" రికార్డు సాధించిన సందర్భంగా నిర్వహించిన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన - డాక్టర్ హర్ష వర్ధన్.

Posted On: 21 MAY 2020 6:16PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ఆరోగ్య బీమా పధకం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏ.బి-పి.ఎమ్.జె.ఏ.వై.) ఈ రోజు ఒక కోటి చికిత్సల రికార్డును అధిగమించింది.  ఈ సందర్భంగా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఆరోగ్యధార పేరుమీద ప్రజారోగ్యం యొక్క సమయోచిత సమస్యలపై చర్చించడానికి బహిరంగ వేదికగా రూపొందించిన వెబినార్ సీరీస్ లో మొదటి వీడియో కాన్ఫరెన్స్ ను ఈ రోజు ప్రారంభించారు.  "ఆయుష్మాన్ భారత్ : ఒక కోటి చికిత్సలు మరియు అంతకంటే ఎక్కువ" అనే శీర్షిక తో ఈ వెబినార్ ను నిర్వహిస్తున్నారు.  కేంద్ర ఆరోగ్యం, కుటుంబసంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే కూడా ఈ వెబినార్ లో పాల్గొన్నారు

ఎన్.‌హెచ్.ఏ. ముఖ్య కార్యనిర్వహణాధికారి ‌డాక్టర్ ఇందూ భూషణ్ ఈ సందర్భంగా ఎ.బి-పి.ఎమ్.జే.ఏ.వై. పనితీరుపై ప్రెజెంటేషన్ ఇచ్చి, భవిష్యత్ ప్రణాళిక గురించి తెలియజేశారు.  వెబినార్ ను  జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ కు చెందిన అన్ని అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా సాధారణ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.  

ఈ సందర్భంగా డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ,  "రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుండి దేశంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన రోగులకు ఒక కోటి చికిత్సలు అందించడం, ఆయుష్మాన్ భారత్ పి.ఎమ్.జే.ఏ.వై. పథకానికి ఒక రికార్డు.  13,412 కోట్ల రూపాయల విలువైన ఈ చికిత్సలు, ఎంపిక చేసిన 21,565 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా అందించబడ్డాయి. ” అని వివరించారు.   "మనం ఎదుర్కొనే వివిధ ఆరోగ్య సంబంధిత సవాళ్ల పరిష్కారానికి, ఆయుష్మాన్ భారత్ నిరంతరం అన్ని విధాలా మానవతా విధానంతో ట్రైల్ బ్లేజర్ లా  కొనసాగుతుంది," అని ఆయన చెప్పారు. 

"ఆరోగ్య హామీ కోసం 2018 లో మన ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పధకం ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన" .  భారతదేశంలోని పేద మరియు బలహీన వర్గాల వారికి ఆసుపత్రుల ద్వారా  సంవత్సరానికి ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు సరసమైన ఆరోగ్య సంరక్షణను ఈ పధకం ద్వారా అందజేస్తారు.   దేశంలోని 10.74 కోట్లకు పైగా పేద, అత్యంత బలహీన కుటుంబాలకు ఆర్థిక ప్రమాద రక్షణ కల్పించడం దీని లక్ష్యం, అదేవిధంగా,  భారతదేశంలో సార్వత్రిక ఆరోగ్య రక్షణ కల్పించే దిశగా ఇదొక ముందడుగు.” అని కేంద్ర మంత్రి వివరించారు. 

కోవిడ్-19 యొక్క అసాధారణమైన పరిస్థితుల్లో, ఈ పథకం ద్వారా ఆరోగ్య సేవలు అందజేసిన అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తన శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలిపారు.  "ఆయుష్మాన్ భారత్ పి.ఎమ్.జే.ఏ.వై. యొక్క 53 కోట్ల మంది లబ్ధిదారులకు పరీక్షలను విస్తరించడానికి మరియు కోవిడ్-19 చికిత్సను ఉచితంగా అందుబాటులో ఉంచడానికి భారత ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది, సార్వత్రిక ఆరోగ్య రక్షణ కల్పించే దిశగా భారత ప్రభుత్వ సంకల్పం, పరిధి మరియు సామర్థ్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది.  ఒక కోటి రికార్డును సాధించడానికి, ఆరోగ్య కార్యకర్తలు, ఎంపిక చేసిన ఆసుపత్రులు చేసిన కృషి సహాయపడింది,” అని ఆయన అన్నారు.

వాట్సాప్‌ ద్వారా 24 గంటలు సేవలందించేందుకు వీలుగా 'ఆస్క్ ఆయుష్మాన్'  పేరుతొ ఒక చాట్ బాట్‌ను డాక్టర్ హర్ష వర్ధన్  ఈ సందర్భంగా ప్రారంభించారు. దీని ద్వారా ఆయుష్మాన్ భారత్ పి.ఎమ్.జే.ఏ.వై. పథకం ప్రయోజనాలు, లక్షణాలు, ఈ-కార్డు తయారుచేసే విధానం, సమీపంలోని ఎంపిక చేసిన ఆసుపత్రిని గుర్తించడం, అభిప్రాయాన్ని పంచుకోవడం, ఫిర్యాదులను అందించే ప్రక్రియ వంటి వివిధ అంశాల గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.  ఈ చాట్ బోట్ యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే ఇది హిందీ మరియు ఆంగ్ల భాషలలో అర్థం చేసుకోగలదు, ప్రతిస్పందించగలదు.  ఇది వినియోగదారులకు అన్ని ప్రధాన సామాజిక మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తంగా ఉపయోగించబడుతుంది.

కేంద్ర మంత్రి "హాస్పిటల్ ర్యాంకింగ్ డాష్ బోర్డ్" ను కూడా ప్రారంభించారు, ఇది లబ్ధిదారుల అభిప్రాయాల ఆధారంగా ఆసుపత్రులకు ర్యాంకులు నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది.  లబ్ధిదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి అన్ని ఆసుపత్రుల సదుపాయాలలో ఆరోగ్య చర్యలు మరియు ఆరోగ్య సంరక్షణ సేవల సూచికలను పెంచడానికి సాక్ష్యం ఆధారిత నిర్ణయం తీసుకోవడానికి ఈ ర్యాంకింగ్ వ్యవస్థ సహాయపడుతుంది.

"ఆయుష్మాన్ భారత్ పి.ఎమ్.జే.ఏ.వై. లబ్ధిదారుల ఈ-కార్డు యొక్క ప్రత్యేక ఎడిషన్" ను డాక్టర్ హర్ష వర్ధన్ విడుదల చేశారు. ఈ-కార్డు పై ఒక కోటి రోగులను ఆసుపత్రిలో చేర్చిన రికార్డు గురించి ప్రత్యేకంగా ప్రదర్శించారు. వీటితో పాటు, "ఆయుష్మాన్ భారత్  పి.ఎమ్.జే.ఏ.వై. వెబ్‌సైట్ యొక్క హిందీ వెర్షన్" కూడా ప్రారంభించబడింది, ఇది ప్రజలతో సమర్థవంతంగా అనుసంధానం కావడానికి మరియు వినియోగదారులకు స్నేహపూర్వక మాధ్యమం ద్వారా సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికి వీలు కల్పిస్తుంది. 

ఈ సందర్భంగా శ్రీ అశ్విని కుమార్ చౌబే మాట్లాడుతూ, ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. మరియు ఎన్.హెచ్.ఏ. అన్ని పరీక్షలు, చికిత్స, ఆసుపత్రి మరియు సంబంధిత మార్గదర్శకాలు, ఇతర సమాచారాన్ని దాని లబ్ధిదారులకు స్థిరంగా అభివృద్ధి చేస్తున్నాయి, పంచుకుంటున్నాయి, సవరించుకుంటున్నాయని చెప్పారు.  ఇది కోవిడ్ చుట్టూ ఉన్న పుకార్లు మరియు అపోహలను తొలగించడంలో ఎంతో సహాయపడుతుందని కూడా ఆయన తెలిపారు. 

నీతీ ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వినోద్ పాల్ మాట్లాడుతూ, 2018 లో ప్రారంభించినప్పటి నుండి, ఎబి-పి.ఎమ్.జే.ఏ.వై. భారతదేశంలోని పేద మరియు బలహీన వర్గాల ప్రజలకు ఆసుపత్రి చికిత్స రూపంలో సరసమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తోందని చెప్పారు.  దేశంలో 10 కోట్లకు పైగా పేద, అత్యంత బలహీన కుటుంబాలకు ఆర్థిక ప్రమాద రక్షణ కల్పించడం మరియు భారతదేశంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సాధించే దిశగా అడుగులు వేయడం  ఎబి-పి.ఎమ్.జే.ఏ.వై. యొక్క లక్ష్యం. 

జాతీయ కోవిడ్-19 హెల్ప్‌లైన్ 1075 ను నిర్వహించడం ద్వారా వేలాది మంది కోవిడ్ పాజిటివ్ రోగులకు, వారి కుటుంబాలకు సమాచారం అందించడానికి వీలుకలిగింది.  భారత ప్రభుత్వం యొక్క సంసిద్ధత మరియు ప్రతిస్పందనకు మద్దతుగా ఎన్‌.హెచ్.‌ఎ.  తన ఐటి వ్యవస్థలను ప్రభావితం చేయడానికి ఈ కాలాన్ని ఉపయోగించుకుందని  శ్రీ ఇందూ భూషణ్ పేర్కొన్నారు. 

 

****



(Release ID: 1625914) Visitor Counter : 328