PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
07 MAY 2020 6:28PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- మొత్తం 52,952 కోవిడ్-19 కేసులకుగాను 15,266మందికి నయంకాగా- కోలుకున్నవారి శాతం 28.83గా ఉంది.
- గడచిన 24 గంటల్లో 3,561 కొత్త కేసులు నమోదవగా; 1,084 మంది కోలుకున్నారు.
- వలస కార్మికుల సంఖ్య పెరగనుండటంతో పకడ్బందీ వ్యూహం, యంత్రాంగాలను సిద్ధం చేయాలని డాక్టర్ హర్షవర్ధన్ రాష్ట్రాలను కోరారు. వైద్య పరీక్షలు, నిర్బంధ కేంద్రాలకు పంపడం, నిర్ధారిత కేసులలో చికిత్స తదితరాలు చేపట్టాలని సూచించారు.
- సకల మానవాళితోపాటు ప్రపంచ ప్రయోజనాల కోసం భారత్ సదా కృషిచేస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు.
- పరిశోధనలకు ఉత్తేజం దిశగా పీఎంఆర్‌ఎఫ్ పథకంలో మార్పుచేర్పులు: హెచ్‌ఆర్‌డి మంత్రి ప్రకటన.
- కోవిడ్-19పై ప్రామాణిక చికిత్సతోపాటు ఆయుర్వేద విధానాలపై పరిశోధనాధ్యయనాలకు సంయుక్తంగా శ్రీకారం చుట్టిన ఆరోగ్య, ఆయుష్‌శాఖల మంత్రులు.
- 5,231 రైలు బోగీలను కోవిడ్ సంరక్షణ కేంద్రాలుగా మార్పుచేసిన రైల్వేశాఖ
- కోవిడ్-19పై పోరాటం దిశగా భారత సాంకేతిక పరిజ్ఞాన సంగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎస్‌ఐఆర్.
ఉత్తరప్రదేశ్, ఒడిసా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కోవిడ్-19 నిర్వహణ దిశగా చేపట్టిన నియంత్రణ, సన్నద్ధత చర్యలపై డాక్టర్ హర్షవర్ధన్ సమీక్ష
ఉత్తరప్రదేశ్, ఒడిసా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కోవిడ్-19 స్థితిగతులు, వ్యాధి నిర్వహణ దిశగా చేపట్టిన నియంత్రణ, సన్నద్ధత చర్యలపై ఆ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సమీక్షించారు. దేశవ్యాప్తంగా 2020 మే 7వ తేదీనాటికి నమోదైన నిర్ధారిత కేసుల సంఖ్య 52,952కాగా, వారిలో 15,266 మంది కోలుకున్నారని, 1,783 మరణాలు సంభవించాయని ఆయన ఈ సందర్భంగా వివరించారు. అలాగే గడచిన 24 గంటలలో మొత్తం 3,561 కొత్త కేసులు నమోదవగా, 1,084 మంది నయం చేసుకుని వెళ్లారని తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైన స్థితిలో ఉందని, మన దేశంలో మరణాల సగటు 3.3 శాతంకాగా, కోలుకునేవారి సగటు 28.83 శాతంగా ఉందని వెల్లడించారు. ఇక ఐసీయూలలో ఉన్నవారు 4 శాతం కాగా, వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నవారు 1.1 శాతమని, ఆక్సిజన్ తోడ్పాటుతో చికిత్స పొందుతున్నవారు 3.3 శాతంగా ఉన్నారని తెలిపారు. దేశంలో పరీక్షల నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరిగి, ప్రస్తుతం రోజుకు 95,000 పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మొత్తంమీద ఇప్పటిదాకా 13,57,442 నమూనాలను పరీక్షించగా 7 రోజులకన్నా తక్కువ వ్యవధిలో కొత్త కేసులు నమోదుకాని జిల్లాల సంఖ్య 180గా ఉందని వివరించారు. అలాగే మరో 180 జిల్లాల్లో 7-13 రోజుల మధ్య ఒక్క కేసు కూడా రాలేదని, 164 జిల్లాల్లో 14-20 రోజుల మధ్య, 136 జిల్లాల్లో 21-28 రోజుల మధ్య కొత్త కేసులేవీ నమోదు కాలేదని వెల్లడించారు. కాగా, ఇతర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రాలకు వస్తున్న వలస కార్మికుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తం కావాలని డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు. ఈ మేరకు వారికి తగురీతిలో పరీక్షల నిర్వహణ, నిర్బంధ కేంద్రాలకు తరలింపు, సకాలంలో చికిత్సకు తరలింపు తదితరాల కోసం పకడ్బందీ వ్యూహంతో యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అవసరమైతే కోవిడేతర ఆరోగ్య సమస్యల పరిష్కారానికి, సమాచార ఆదానప్రదానం కోసం ప్రస్తుత జాతీయ సహాయ కేంద్రం నంబరు 1075తోపాటు 104 నంబరును కూడా రాష్ట్రాలు వాడుకోవచ్చునని తెలిపారు. అదే సమయంలో ఇతర అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1621842
వైశాఖీ-బుద్ధపూర్ణిమ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రధానమంత్రి దృశ్యమాధ్యమ ప్రసంగం
బుద్ధపూర్ణిమ సందర్భంగా ఇవాళ నిర్వహించిన దృశ్యమాధ్యమ ప్రార్థన కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగాగల బౌద్ధసంఘాల అధిపతులు పాల్గొన్నారు. కోవిడ్-19 మృతులు, ముందు వరుసలోని పోరాటయోధుల గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ ప్రార్థన వారంగా ప్రకటించారు. మరోవైపు అంతర్జాతీయ వైశాఖీ-బుద్ధపూర్ణిమ వేడుకలలోపాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఆయనతోపాటు కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, క్రీడలు-యువజన వ్యవహారాల, మైనారిటీ వ్యవహారాల శాఖల సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ కిరణ్ రిజిజు తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు.
వైశాఖీ-బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
“మిత్రులారా! బుద్ధ భగవానుని ప్రతి పదం, ప్రతి బోధన... మానవాళి సేవలో భారతదేశ నిబద్ధతను మరింత ప్రస్ఫుటం చేస్తుంది. భారతదేశ ఆత్మజ్ఞానానికి, స్వీయ సాక్షాత్కారానికి బుద్ధ భగవానుడే ప్రతీక. ఈ స్వీయ-సాక్షాత్కారంతో విశ్వ మానవాళికేగాక మొత్తం ప్రపంచ ప్రయోజనాల పరిరక్షణకు భారత్ సదా పాటుపడుతూనే ఉంటుంది. భారత పురోగతి ప్రపంచ ప్రగతికి ఎల్లవేళలా దోహదపడుతుంది.”
కోవిడ్-19 పరిస్థితుల నడుమ ఆయుష్ వైద్యవిధానాలకు సంబంధించి అంతర-శాఖ అధ్యయనాలు అధికారికంగా ప్రారంభం
దేశంలో కోవిడ్-19 పరిస్థితులకు సంబంధించి మూడు ఆయుష్ ఆధారిత అధ్యయనాలను కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ శ్రీపాద యశోనాయక్, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్ న్యూఢిల్లీలో సంయుక్తంగా ప్రారంభించనున్నారు. దేశంలో కోవిడ్-19 సమస్య పరిష్కారం దిశగా ఆయుష్ మంత్రిత్వశాఖ వినూత్న చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయుష్ వ్యవస్థల ద్వారా వైద్యపరమైన అధ్యయనాల (రోగనిరోధక చర్యలు, మరికొన్ని అదనపు పద్ధతుల)కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముప్పు అధికంగాగల ప్రజానీకంపై ఆయుష్ ఆధారిత రోగనిరోధక చర్యల ప్రభావాన్ని, అలాగే కోవిడ్-19 నియంత్రణకు ఆయుష్ ప్రతిపాదించిన, ఆయుష్ చేపట్టిన చర్యల ఫలితాలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొందరు నిపుణులతో అంతర-శాఖా ఆయుష్ పరిశోధన-అభివృద్ధి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ అధ్యయనాల ప్రాతిపదికన సదరు నిపుణులు కొన్ని వ్యూహాలను రూపొందిస్తారు.
కోవిడ్ సంరక్షణ కేంద్రా (బోగీ)లను రాష్ట్రాలకు అందించనున్న రైల్వేశాఖ
భారత రైల్వేశాఖ 5,231 రైలు బోగీలను కోవిడ్ సంరక్షణ కేంద్రాలుగా మార్పుచేసింది. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాల మేరకు స్వల్ప కోవిడ్ లక్షణాలున్న వ్యక్తులకు చికిత్స చేస్తున్న వైద్యశాలలకు అనుబంధ సంరక్షణ కేంద్రాలుగా ఈ బోగీలను వాడుకోవచ్చునని తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైనా సదుపాయాల కొరత ఉన్న పక్షంలో ఈ బోగీలను అనుమానితులతోపాటు నిర్ధారిత రోగులకు ఏకాంత చికిత్స కోసం కూడా వీటిని వాడుకోవచ్చునని పేర్కొంది. కాగా, ఇలాంటి సంచార కోవిడ్ సంరక్షణ కేంద్రాల నిర్వహణ కోసం దేశంలోని 158 స్టేషన్లను వాటరింగ్-చార్జింగ్ సదుపాయాలతోనూ, మరో 58 స్టేషన్లను వాటరింగ్ సదుపాయంతోనూ రైల్వేశాఖ సిద్ధంగా ఉంచింది.
దేశంలో పరిశోధనలకు ఉత్తేజం దిశగా పీఎంఆర్‌ఎఫ్ పథకానికి మార్పుచేర్పులు: కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి ప్రకటన
దేశంలో పరిశోధనల జోరు పెంచేదిశగా ‘ప్రధానమంత్రి పరిశోధన సహాయ పథకం’ (పీఎంఆర్‌ఎఫ్)లో పలు సవరణలు చేసినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిషాంక్’ ప్రకటించారు. ఈ సవరణల మేరకు ఇకపై (ఐఐఎస్‌సీ, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ఐఐఈఎస్‌టీ, సీఎఫ్ ఐఐటీలు మినహా) గుర్తింపుగల విద్యా సంస్థలు/విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు పరిశోధనలు చేపట్టాలంటే అవసరమైన ‘సీపీపీఏ’ని 8గా నిర్ణయంచడంతోపాటు ‘గేట్’ స్కోరును 750 నుంచి 650కి తగ్గించినట్లు ఆయన పేర్కొన్నారు.
దేశంలో కోవిడ్ పరిస్థితులతోపాటు పార్లమెంటరీ కమిటీల సమావేశాల నిర్వహణపై రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్ చర్చ
దేశంలో కోవిడ్-19 పరిస్థితులతోపాటు పార్లమెంటు సభ్యులు పోషిస్తున్న పాత్రసహా పార్లమెంటరీ కమిటీల సమావేశాల నిర్వహణ అవకాశాలపై భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా చర్చించుకున్నారు. దేశంలో ప్రయాణ ఆంక్షలు కొనసాగుతున్న దృష్ట్యా వివిధ సభాసంఘాల సమావేశాలు నిర్వహించడంలోగల ఇబ్బందులు, అవకాశాలపై శ్రీ నాయుడు, శ్రీ బిర్లా లోతుగా సమీక్షించారు. సమీప భవిష్యత్తులో ఆయా కమిటీల సంప్రదాయక సమావేశాల నిర్వహణకు పరిస్థితులు సహకరించని పక్షంలో ప్రత్యామ్నాయ సమావేశాల నిర్వహణ మార్గాలను అన్వేషించాలని వారు అభిప్రాయపడ్డారు.
విదేశాల్లోని భారతీయుల తరలింపునకు నావికాదళం నౌకలు; నిర్బంధ వైద్య పరిశీలన సదుపాయాల కల్పనలో సాయుధ బలగాలు
హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అనేక దేశాలకు వైద్యబృందాలు, ఔషధ నిల్వలతో భారత సాయుధ బలగాలు నావికాదళం నౌకలను పంపాయి. తిరుగు ప్రయాణంలో ఈ నౌకలు ఆయా దేశాల్లో చిక్కుబడిన భారతీయులను స్వదేశం తీసుకొస్తాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారికోసం 6 నిర్బంధ వైద్య పరిశీలన కేంద్రాలను కూడా సిద్ధం చేస్తున్నాయి. విదేశాంగ, పౌర విమానయాన శాఖల సమన్వయంతో ఆయా దేశాల నుంచి తీసుకురానున్న 2,100 మందిని ఈ కేంద్రాల్లో వైద్య పరిశీలనలో ఉంచుతారు. కాగా, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి ఫలితంగా అనేకమంది భారతీయులు సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మలేషియా తదితర దేశాల్లో చిక్కుబడ్డారు. వీరందరినీ స్వదేశం తీసుకొచ్చాక భారత సైనిక, నావికా, వైమానిక దళాలు జోధ్‌పూర్, జైసల్మేర్, భోపాల్, కోచ్చి, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో సాయుధ దళాలు నిర్వహించే నిర్బంధ వైద్య పరిశీలన శిబిరాలకు తరలిస్తారు.
భారత, ఇథియోపియా ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇథియోపియా ప్రజాతంత్ర సమాఖ్య ప్రధానమంత్రి గౌరవనీయులైన డాక్టర్ అబియ్ అహ్మద్ అలీతో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి విసిరిన జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై దేశాధినేతలిద్దరూ ఈ సందర్భంగా చర్చించడంతోపాటు ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో పరస్పర సంఘీభావం ప్రకటించారు. ఇథియోపియాకు అవసరమైన ఔషధ సరఫరాలపై డాక్టర్ అబియ్ అహ్మద్ అలీకి ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. అలాగే కోవిడ్ మహమ్మారి సృష్టించిన ప్రతికూల ఆర్థిక ప్రభావ ఉపశమనానికి తోడ్పాటునిస్తామని హామీ ఇచ్చారు.
కోవిడ్-19 సంక్షోభం ముగిశాక ఉత్పన్నమయ్యే అవకాశాలను పరిశ్రమలు అందిపుచ్చుకోవాలి: శ్రీ గడ్కరీ
దేశంలో కోవిడ్ మహమ్మారి ఉపశమనానంతర పరిస్థితుల్లో లభ్యమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమలు సానుకూల దృక్పథం అనుసరించాలని శ్రీ నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. ముందుగా కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి పారిశ్రామిక రంగం అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని శ్రీ గడ్కరీ చెప్పారు. ఆ మేరకు వారి సంస్థల్లో పనిచసే అధికారులు, సిబ్బందిపట్ల అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకోవాలని, వారికి ఆహారం, ఆశ్రయం కల్పించడంతోపాటు సామాజిక దూరం పాటించేలా చూడాలని సూచించారు.
రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి శ్రీ గడ్కరీ లక్ష్య నిర్దేశం
కాలం చెల్లిన వాహన వినియోగం రద్దు విధానాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని తమశాఖ అధికారులను ఆదేశించినట్లు కేంద్ర రోడ్డురవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ గడ్కరీ చెప్పారు. అలాగే రోడ్డు నిర్మాణ వ్యయం తగ్గింపుపైనా దృష్టి పెట్టాలని సూచించామన్నారు. చౌకరుణాల సమీకరణ ప్రయత్నాలతోపాటు ఆటోమొబైల్ తయారీ రంగంలో విదేశీ పెట్టుబడుల లభ్యత పెంచే మార్గాలు అన్వేషించాలన్నారు. ఇక దేశంలో బిఎస్-4 ప్రమాణాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
భూసార పరీక్ష కార్డుల ఆధారంగా సమగ్ర భూపోషక నిర్వహణపై రైతు ఉద్యమానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పిలుపు
దేశంలోని రైతులు సమగ్ర భూపోషక నిర్వహణను ఉద్యమంలా కొనసాగించాలని కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ పిలుపునిచ్చారు. భూసార అభివృద్ధి కార్యక్రమం పురోగతిని ఆయన సమీక్షించారు. భూసార కార్డు ఆధారిత సిఫారసుల మేరకు రసాయన ఎరువుల వాడాన్ని తగ్గించి, జీవ-సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడంపై ఉద్యమస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద 2020-21 మధ్య దేశంలోని లక్ష గ్రామాల్లో రైతుల కోసం సామూహిక అవగాహన కల్పనపై దృష్టి సారిస్తామని ప్రకటించారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఆహారధాన్యాల పంపిణీపై 24 రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో కేంద్ర ఆహార-ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సమీక్ష సమావేశం
దేశవ్యాప్తంగా ప్రపంచ మహమ్మారి ప్రభావానికి గురైన సమాజంలోని దుర్బల వర్గాలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనకింద ఇప్పటిదాకా 120 లక్షల టన్నుల ఆహారధాన్యాలు పంపిణీ చేయబడ్డాయి. జాతీయ ఆహారభద్రత చట్టం పరిధిలోకి వచ్చే అర్హతగల అన్ని కుటుంబాలకూ 2020 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రెట్టింపు కేటాయింపులకు ప్రభుత్వం భరసా ఇచ్చింది. అలాగే అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద ప్రతి లబ్ధిదారుకూ కార్డుపై 35 కిలోల సాధారణ కోటాతోపాటు నెలకు 5 కిలోల వంతున అదనంగా కేటాయించింది. ఈ పథకం పట్ల అన్ని రాష్ట్రాల్లోనూ విశేష స్పందన కనిపిస్తున్న నేపథ్యంలో 06.05.2020 వరకూ 69.28 లక్షల టన్నుల ఆహారధాన్యాలను స్వీకరించాయి.
కోవిడ్-19 అనిశ్చితి, అనూహ్య పరిణామాల నడుమ సమీకృత శీతల గిడ్డంగుల శృంఖల నెట్‌వర్క్ ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన శ్రీమతి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
కేంద్ మంత్రి ఇవాళ ఆహారోత్పత్తుల మంత్రిత్వశాఖ చేయూతగల శీతలగిడ్డంగుల శృంఖల ప్రాజెక్టుల నిర్వాహకులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత కోవిడ్-19 అనిశ్చిత, అనూహ్య పరిణామాల నడుమ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థలు.. ప్రత్యేకించి సమీకృత శీతల గిడ్డంగుల శృంఖల నెట్‌వర్క్ కింద ఉన్న పరిశ్రమలకుగల ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా ఆమె నొక్కిచెప్పారు. వారి చొరవతో మార్కెట్ ధరల స్థిరీకరణతోపాటు రైతులకు అనిశ్చితి నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయోత్పత్తుల అదనపు దిగుబడుల నిల్వకు తగిన సౌకర్యాలు ఉన్నందున రైతులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. అదే సమయంలో పంట ఉత్పత్తులను విలువ జోడించిన ఆహార ఉత్పత్తుల రూపంలో జాతీయ, అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా మార్కెట్లకు తరలించడంద్వారా పరిశ్రమలకూ ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
కోవిడ్-19పై పోరాటం దిశగా వాణిజ్య సంఘాల కేంద్రీయ సంస్థ (సీటీయూలవో)తో కార్మికశాఖ మంత్రి చర్చలు
కోవిడ్-19పై పోరాటం దిశగా ప్రస్తుత స్థితిగతులతోపాటు ఆర్థిక వ్యవస్థసహా కార్మిశక్తిపై దాని ప్రభావ ఉపశమనం గురించి వాణిజ్య సంఘాల కేంద్రీయ సంస్థ (సీటీయూలవో)తో కేంద్ర కార్మిక-ఉపాధికల్పన శాఖ సహాయ (ఇన్‌చార్జి) మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ వెబినార్ ద్వారా చర్చించారు. ఇందులో భాగంగా (1) కోవిడ్-19 నేపథ్యంలో దేశంలోని కార్మికుల, వలసకూలీల ప్రయోజనాల పరిరక్షణ, (2) ఉపాధి అవకాశాల సృష్టికి చర్యలు (3) ఆర్థిక కార్యకలాపాల పునరారంభంపై ఆచరణీయ విధానాలు (4) ఎంఎస్‌ఎంఈల పరిస్థితిని మెరుగు పరచే చర్యలద్వారా కార్మిక చట్టాలకు అనుగుణంగా అవి తమ బాధ్యతలు నిర్వర్తించేలా చూడటంపై మంత్రి చర్చలు నిర్వహించారు.
దేశీయ ఉత్పత్తి, దిగుమతి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులకు శ్రీ గడ్కరీ పిలుపు
కేంద్ర సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమీక్ష నిర్వహించారు. అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ, ఎంఎస్‌ఎంఈలపై కోవిడ్-19 ప్రభావంపై ఈ సందర్భంగా వారితో చర్చించారు. కొవిడ్-19 నేపథ్యంలో ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతినిధులు ఆయనకు వివరించడంతోపాటు కొన్ని సూచనలు చేశారు. ఈ మేరకు ఎంఎస్‌ఎంఈ రంగం సజావుగా సాగిపోయేలా ప్రభుత్వం మద్దతివ్వాలని వారు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ- విదేశీ దిగుమతుల వినియోగంకన్నా దేశీయ ఉత్పత్తుల వాడకంపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ వారికి సూచించారు. ముఖ్యంగా దేశంలో వెదురు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని, ప్రపంచ మార్కెట్‌లో పోటీ ఇవ్వడానికి ఆవిష్కరణలు, సాంకేతికత, పరిశోధన నైపుణ్యంపై మరింత శ్రద్ధ వహించాలని కూడా ఆయన సూచించారు.
కోవిడ్-19పై పోరాటం కోసం భారత సాంకేతిక పరిజ్ఞాన సంగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్
కోవిడ్-19పై పోరాటం (అన్వేషణ-నిర్ధారణ-చికిత్స) దిశగా ‘జాతీయ పరిశోధన-అభివృద్ధి సంస్థ (NRDC) ‘భారత సాంకేతిక పరిజ్ఞాన సంగ్రహాన్ని’ రూపొందించింది. ఈ ‘పరిజ్ఞాన సంగ్రహాన్ని’ భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్, శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన విభాగం కార్యదర్శి డాక్టర్ శేఖర్ సి.మాండే న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. కోవిడ్-19పై పోరుకు సంబంధించి భారత సాంకేతికతలు, ప్రస్తుత పరిశోధన కార్యకలాపాలు, వాణిజ్యీకరణకు అందుబాటులోగల 200 సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రభుత్వ కృషి-చర్యలు తదితరాలను ఈ ‘పరిజ్ఞాన సంగ్రహం’లో “అన్వేషణ-నిర్ధారణ-చికిత్స” (3T) అనే మూడు విభాగాల కింద వర్గీకరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాలు పరీక్షించబడి, నిరూపితమైనవి (POC) కావడంవల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దీన్ని ఉత్పాదక రూపంలో వేగంగా మార్కెట్లోకి తీసుకురావచ్చు.
పర్యావరణ ప్రభావ అంచనా ప్రకటన (ఈఐఏ)-2020 ముసాయిదాపై స్పందనకు గడువు జూన్ 30దాకా పెంపు
పర్యావరణ ప్రభావం అంచనా ప్రకటన (ఈఐఏ)-2020 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ‘ఎస్.ఓ. 1199 (ఈ); తేదీ 2020 మార్చి 23 కింద 2020 ఏప్రిల్ 11న రాజపత్రం (గజిట్)లో ప్రజలకు సమాచారం కోసం ప్రచురించింది. ఆ మేరకు దీనివల్ల ప్రభావితులయ్యేవారు 60 రోజుల్లోగా నోటీసుద్వారా అభ్యంతరాలు తెలపవచ్చునని ప్రకటించింది. అయితే, ఈ వ్యవధిని 2020 జూన్ 30దాకా పొడిగిస్తున్నట్లు తాజాగా పేర్కొంది.
‘దేఖో అప్నా దేశ్' లోగో రూపకల్పన పోటీకి భారత పర్యాటక శాఖ శ్రీకారం
భారత పర్యాటక మంత్రిత్వశాఖ ‘మైగవ్’ వేదికగా ‘దేఖో అప్నా దేశ్' లోగో రూపకల్పన పోటీకి శ్రీకారం చుట్టింది. దేశ పౌరుల సృజనాత్మకత నుంచి పుట్టుకొచ్చే సరికొత్త ఆలోచనల ప్రాతిపదికన 'దేఖో అప్నా దేశ్* ప్రచార కార్యక్రమానికి ఒక గుర్తింపు చిహ్నం (లోగో) ఉండాలన్నది ఈ పోటీ నిర్వహణలోని ప్రధానోద్దేశం. కాగా, కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడి, దిగ్బంధం తొలగిపోయాక అంతర్జాతీయ పర్యాటకంతో పోలిస్తే దేశీయ పర్యాటకమే వేగంగా పుంజుకుంటుందన్నది వాస్తవం. ఆ మేరకు దేశీయ పర్యాటక సామర్థ్యంపై దృష్టి సారించడంమేగాక స్వదేశ శోధనకు పౌరులను ప్రోత్సహించి, దేశ సరిహద్దుల లోపలే ప్రజలు తమ విరామ సమయాన్ని ఉల్లాసంగా గడిపేవిధంగా చూడటం వంటివి భారత విజయ వ్యూహాలు కానున్నాయి.
మత్స్య పరిశ్రమ రంగానికి 12 భాషల్లో సూచనలు జారీ చేసిన భారత వ్యవసాయ పరిశోధన సంస్థలు
దేశంలో వ్యవసాయ రంగంతో ముడిపడిన ఇతర భాగస్వామ్య రంగాల భద్రతకు భరోసా ఇస్తూ- భారత వ్యవసాయ పరిశోధన మండలి, కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ తమ వ్యవసాయ పరిశోధన సంస్థల ద్వారా వివిధ ఉప రంగాల ఉత్తేజం కోసం అనేక వినూత్న చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మత్స్య సంబంధ సంస్థల తోడ్పాటుతో సలహా పత్రాలను విడుదల చేయడంద్వారా మత్స్య కార్మికులు వ్యాధి బారినపడకుండా చర్యలు తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలోని కొచ్చిలోగల మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ మత్స్యకారులు, చేపలు పట్టే పడవల యజమానులు, చేపల వేటకు సంబంధించిన రేవులు, మత్స్య విపణి, సముద్ర ఉత్పత్తుల కర్మాగారాలు తదితరాల కోసం ఇంగ్లిష్, హిందీతోపాటు మరో 10 ప్రాంతీయ భాషల్లో సలహాపత్రాలను రూపొందించి పంపిణీ చేసింది.
నాసిక్ స్మార్ట్ సిటీ మొబైల్ యాప్‌లు, శరీర పరిశుభ్రత యంత్రాలద్వారా చేపట్టిన చర్యలతో కోవిడ్-19పై నగరం పోరాటం బలోపేతం
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- చండీగఢ్: చండీగఢ్: నగరంలోని బాధ్యతగల పౌరులందరూ తమకేవైనా అనారోగ్య సమస్యలుంటే తక్షణం సమీప వైద్యశాలను సంప్రదించాలని నగర పాలనాధికారి ఆదేశించారు. తమతమ ప్రాంతాల్లో ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తే ఇరుగుపొరుగున ఉన్నవారు లేదా స్థానిక నేతలు వెంటనే పాలన యంత్రాంగానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఇప్పటిదాకా నగరంలోని నిరాశ్రయులకు, పేదలకు 38,44,867 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
- పంజాబ్: విదేశాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రవాసులు పెద్ద సంఖ్యలో రానుండటంతో ప్రభుత్వం అందుకు తగిన సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, తిరిగివచ్చే వారందరికీ కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు వారిని నిర్బంధ వైద్యపరిశీలన కేంద్రాలకు తరలించాలని ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి కఠినమైన ఆదేశాలు జారీచేశారు. అలాగే ప్రాణాంతక కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి పటిష్ఠ చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారిని వ్యవస్థాగత నిర్బంధ కేంద్రాలకు, ప్రవాస భారతీయులను హోటళ్లు/ స్వీయ గృహ నిర్బంధానికి పంపేవిధంగా చూడాలని కోరారు.
- హర్యానా: పురపాలక సంస్థ పరిధిలోని మార్కెట్ ప్రాంతాల్లో సామాజిక దూరం నిబంధనను ఉల్లంఘిస్తే జరిమానా, అపరాధ రుసుము విధించాలని హర్యానా పట్టణ స్థానిక సంస్థల శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వం కృతనిశ్చయంతో చర్యలు చేపట్టింది. ఈ మేరకు https://saralharyana.gov.in/ పోర్టల్ ద్వారా ఆటోమేటిక్ అనుమతుల పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికింద ఇప్పటిదాకా 19,626 యూనిట్ల పునఃప్రారంభానికి ఆమోదం ఇవ్వడంతోపాటు వాటిలో పనిచేసేందుకు 11,21,287 మంది కార్మికులకు అనుమతి ఇచ్చింది.
- కేరళ: చరిత్రాత్మక ‘వందే భారత్’ మిషన్ ఆరంభ సూచికగా 177 మంది పెద్దలు, నలుగురు పిల్లలతో అబుధాబి నుంచిన బయల్దేరిన తొలి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఈ రాత్రి 9.40 గంటలకు కొచ్చికి చేరుతుంది. అలాగే దుబాయ్ నుంచి వచ్చే మరో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ రాత్రి 10.30 గంటలకు కోళికోడ్‌లో దిగుతుంది. కేంద్ర దేశీయాంగ వ్యవహారాల శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ విమానాల్లో వచ్చేవారిని నిర్బంధ వైద్య కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. కాగా, నిర్బంధ వైద్య సదుపాయాల కల్పలో ఆలస్యం కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి కేరళీయుల రాకకు పాసుల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు తమను స్వస్థలాలకు పంపాలంటూ వలస కార్మికులు ఇవాళ కన్నూర్, ఎర్నాకుళం జిల్లాల్లో నిరసన చేపట్టారు. ఇక బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో ఈ రోజు మరో ఆరుగురు కేరళవాసులు కోవిడ్ వ్యాధితో మరణించారు. రాష్ట్రంలో 8 జిల్లాలు కోవిడ్ విముక్తం కాగా, రాష్ట్రంలో 30 యాక్టివ్ కేసులున్నాయి.
- తమిళనాడు: తమిళనాడు నుంచి 1,136 మంది ప్రయాణికులతో ప్రత్యేక రైలు ఇవాళ రాంచీకి బయలుదేరింది. కాగా, కోయంబత్తూరు నుంచి 32,000 మందిసహా లక్షలాది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తుండటంతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. మదురైలో దిగ్బంధం నేపథ్యంలో నిత్యావసరాలు, మద్యం తదితరాల కొనగోలుకు ప్రయాణ పాసులు తప్పనిసరి చేశారు. టాస్మాక్ దుకాణాలను తెరవవద్దని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినా కొన్ని జిల్లాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన మద్యం అమ్మకాలు. రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తం కేసులు: 4829, యాక్టివ్ కేసులు: 3275, మరణాలు: 35, డిశ్చార్జ్ అయినవారు: 1516 మంది.
- కర్ణాటక: రాష్ట్రంలో నేడు 8 కొత్త కేసులు నిర్ధారణ కాగా, వీటిలో దావణగేరె, కల్బుర్గిలలో 3 వంతు, బెళగావి, బెంగళూరులలో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి. ఇవాళ దావణగేరెలో 55 ఏళ్ల మహిళ కోవిడ్‌కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 701. ఇప్పటివరకు 30 మంది చనిపోగా, 363 మంది నయమై డిశ్చార్జ్ అయ్యారు.
- ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ వద్ద తెల్లవారుజామున రసాయన గ్యాస్ లీకైన సంఘటనలో 9 మంది మరణించగా, 200 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి కేంద్రం నుంచి అవసరమైన మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, గ్రీన్ జోన్ జిల్లా విజయనగరంలో తొలిసారి 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 8,087 నమూనాలను పరీక్షించిన గత 24 గంటల్లో ఇద్దరు మరణించగా 56 కొత్త కేసులు నమోదవగా 51 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసులు 1,833కి పెరిగిన నేపథ్యంలో యాక్టివ్ కేసులు: 1015, కోలుకున్నవి: 780, మరణాలు: 38గా ఉన్నాయి. కేసుల సంఖ్యరీత్యా కర్నూలు (540), గుంటూరు (373), కృష్ణా (316) అగ్రస్థానంలో ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రం నుంచి ఇవాళ 2,803 మంది వలస కార్మికులు తమ రాష్ట్రాలకు వెళ్లారు. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి తీసుకుంటున్న చర్యలను రెండు రోజుల్లోగా నివేదించాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు కార్యాలయాలు 33% సిబ్బందితో పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినా ఐటి/ఐటిఇఎస్ రంగం మాత్రం ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే వ్యూహంపై మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసులు: 1107, యాక్టివ్ కేసులు: 430, మరణాలు 29; నయమై వెళ్లినవారు: 648 మంది.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇప్పటివరకు రూ.19.89 కోట్లు వచ్చాయని, కోవిడ్ సంబంధిత ఉపశమన చర్యల కోసం రూ.9.49 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో పిఎమ్‌జికెవై కింద మొత్తం 32,751 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి.
- అసోం: కరోనావైరస్ వ్యాప్తివల్ల దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే చర్యలపై చర్చించేందుకు సలహాసంఘం చైర్మన్, సభ్యులతో ముఖ్యమంత్రి ఇవాళ సమావేశమయ్యారు.
- మేఘాలయ: మేఘాలయలోని ఐఐఎం-ఉమ్సావ్లీ విద్యా సంస్థను 258 పడకలు, సిబ్బందితో కూడిన ప్రత్యేక అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రిగా రూపొందించారు. తదనుగుణంగా రోగులకు, సిబ్బందికి, అనుమానిత కేసులకు వివిధ అంతస్తులను కేటాయించారు.
- మణిపూర్: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే, సామాజిక దూరాన్ని తప్పక పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆన్‌లైన్ బోధనద్వారా విద్యా సంస్థలన్నీ విద్యా కేలండర్‌ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
- మిజోరాం: రాష్ట్రంలోని ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం మస్టర్ రోల్ ఉద్యోగులు కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.లక్ష అందజేశారు.
- నాగాలాండ్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ హుయాత్సాంగ్ జిల్లా ఆసుపత్రిని తనిఖీచేశారు. ఈ సందర్భంగా రోజువారీ వేతనజీవులకు సహాయ సామగ్రిని పంపిణీచేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి హుయాత్సాంగ్, లాంగ్లెంగ్, కిఫేర్, షామాటర్ గ్రామ కౌన్సిళ్లకు వాకీ-టాకీ సెట్లను విరాళంగా ఇచ్చారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 1,233 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 16,758కి చేరింది. అలాగే మరో 34 మంది మరణించడంతో మృతుల సంఖ్య 651కి పెరిగింది. ఒక్క ముంబైలోనే 10,500 కేసులు నమోదవగా లక్షకుపైగా పరీక్షలు నిర్వహించిన ఏకైక నగరం దేశంలో ఇదే కావడం గమనార్హం. కాగా, ఆరు ప్రభుత్వ, 11 ప్రైవేట్ ప్రయోగశాలల్లో నిత్యం 4,500 నమూనాల పరీక్ష జరుగుతోంది. రాష్ట్రంలో ఏప్రిల్ ఆరంభంలో నిర్ధారిత కేసులు 3 శాతంకాగా, నేడు 10శాతానికి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని 25,000 మంది ప్రైవేటు వైద్యులు వెంటనే కోవిడ్-19 రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది. వైద్యులకు అవసరమైన రక్షణ సామగ్రిని అందజేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో పనిచేసినందుకు ప్రతిఫలం చెల్లిస్తామని నోటీసులో తెలిపింది. అయితే, 55 ఏళ్లు పైబడిన వైద్యులను ఈ ఉత్తర్వు నుంచి మినహాయించింది.
- గుజరాత్: రాష్ట్రంలో 380 కొత్త కేసులు నమోదుకాగా మొత్తం కేసులు 6,625కు చేరాయి. కరోనా మహమ్మారివల్ల మరణించిన వారి సంఖ్య 396కు పెరిగింది. ఇవాళ నమోదైన కొత్త కేసులలో 291 అహ్మదాబాద్ నగరంనుంచే కావడం గమనార్హం.
- రాజస్థాన్: రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తిపై పరిశీలన కోసం వచ్చే అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని ఆపడానికి రాజస్థాన్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,355గా ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కోలుకుంటున్నవారి శాతం అత్యధికంగా 46.98గా నమోదైంది.
- మధ్యప్రదేశ్: రాష్ట్రంలో నిర్ధారిత కేసుల సంఖ్య 3,138కాగా, 1,099 మందికి నయం కావడంతో కోలుకున్నవారి శాతం 33గా నమోదైంది.

*******
(Release ID: 1621967)
|