శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై పోరాటం కోసం భారత సాంకేతిక పరిజ్ఞాన సంగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌

Posted On: 06 MAY 2020 5:47PM by PIB Hyderabad

విధాన నిర్ణేతలు, పరిశ్రమలు, వ్యవస్థాపకులు, అంకుర సంస్థలు, ఎంఎస్‌ఎంఈలు, పరిశోధక విద్యార్థులు, శాస్త్రవేత్తలు తదితరులకు కరదీపికగా ‘పరిజ్ఞాన సంగ్రహం’

   కోవిడ్‌-19పై పోరాటం (అన్వేషణ-నిర్ధారణ-చికిత్స) దిశగా ‘జాతీయ పరిశోధన-అభివృద్ధి సంస్థ (NRDC) ‘భారత సాంకేతిక పరిజ్ఞాన సంగ్రహాన్ని’ రూపొందించింది. ఈ ‘పరిజ్ఞాన సంగ్రహాన్ని’ భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్‌, శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన విభాగం కార్యదర్శి డాక్టర్‌ శేఖర్‌ సి.మాండే న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. కోవిడ్‌-19పై పోరుకు సంబంధించి భారత సాంకేతికతలు, ప్రస్తుత పరిశోధన కార్యకలాపాలు, వాణిజ్యీకరణకు అందుబాటులోగల సాంకేతిక పరిజ్ఞానాలు, ప్రభుత్వ కృషి-చర్యలు తదితరాలను ఈ ‘పరిజ్ఞాన సంగ్రహం’లో “అన్వేషణ-నిర్ధారణ-చికిత్స” (3T) అనే మూడు విభాగాల కింద వర్గీకరించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాలు పరీక్షించబడి, నిరూపితమైనవి (POC) కావడంవల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దీన్ని ఉత్పాదక రూపంలో వేగంగా మార్కెట్లోకి తీసుకురావచ్చు. ఈ ‘పరిజ్ఞాన సంగ్రహం’ రూపకల్పనలో ఎన్‌ఆర్‌డీసీ కృషిని డాక్టర్‌ మాండే ఇది ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలతోపాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరం కాగలదని పేర్కొన్నారు. కాగా, కోవిడ్‌-19పై పోరాటం కోసం ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నవిసహా దేశీయంగా అభివృద్ధి చేసిన, చేస్తున్న సాంకేతిక ఆవిష్కరణలను ఈ ‘పరిజ్ఞాన సంగ్రహం’లో పొందుపరిచే ప్రయత్నం చేశామని ఎన్‌ఆర్‌డీసీ చైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హెచ్‌.పురుషోత్తం వివరించారు. ఇది విధాన నిర్ణేతలకు, పరిశ్రమలకు, వ్యవస్థాపకులకు, అంకుర సంస్థలకు, ఎంఎస్‌ఎంఈలకు, పరిశోధక విద్యార్థులకు, శాస్త్రవేత్తలకే కాకుండా ఈ రంగంలోని భాగస్వాములందరికీ కరదీపికగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

 

*****


(Release ID: 1621547) Visitor Counter : 307