రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

వచ్చే రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల విలువైన రహదారి పనులు

ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించిన కేంద్రమంత్రి శ్రీ గడ్కరీ
ఆటో స్క్రాపింగ్‌ విధానాన్ని త్వరగా ఖరారు చేయాలని ఆదేశం

Posted On: 07 MAY 2020 3:33PM by PIB Hyderabad

కేంద్ర రహదారి రవాణా&హైవేలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ, 'ది సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌' (ఎస్‌ఐఏఎం) ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. వాహన తయారీ రంగంపై కొవిడ్‌-19 ప్రభావంపై చర్చించారు. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌, సెక్రటరీ శ్రీ గిరిధర్‌, ఇతర సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రపంచ మార్కెట్‌లో పోటీ గురించి ఆలోచిద్దాం
    కొవిడ్‌-19 కారణంగా వాహన తయారీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, పరిశ్రమ ప్రతినిధులు ప్రస్తావించారు. కొన్ని సూచనలు చేశారు. వాహన తయారీ రంగం సాఫీగా సాగేలా ప్రభుత్వ మద్దతు కోరారు. పరిశ్రమలో హెచ్చుతగ్గులు సాధారణం కాబట్టి, వ్యాపారంలో ద్రవ్యతను పెంచడంపై దృష్టి పెట్టాలని శ్రీ గడ్కరీ పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు. అభివృద్ధి కోసం పనిచేసేటప్పుడు ఇలాంటి క్లిష్ట సమయాల గురించి కూడా ముందే ఆలోచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ మార్కెట్‌లో పోటీ ఇవ్వడానికి ఆవిష్కరణలు, సాంకేతికత, పరిశోధన నైపుణ్యంపై మరింత శ్రద్ధ ఉంచాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో 15 లక్షల కోట్ల రూపాయల విలువైన రహదారులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. సమస్యలను పరిష్కరించడానికి తమ మంత్రిత్వ శాఖ అధిక సమయం పనిచేస్తోందని శ్రీ గడ్కరీ వెల్లడించారు.

ప్రభుత్వం తరుపున సాయానికి హామీ
    పరిశ్రమ ప్రతినిధుల ప్రశ్నలన్నింటికీ శ్రీ గడ్కరీ సమాధానాలిచ్చారు. ప్రభుత్వం తరపున చేతనైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధింత విభాగాల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. ఆటో స్క్రాపింగ్‌ విధానాన్ని త్వరగా ఖరారు చేయాలని తన శాఖ అధికారులను ఆదేశించినట్లు గడ్కరీ చెప్పారు. ఇది ఖర్చులను భారీగా తగ్గిస్తుందన్నారు. వాహన తయారీ రంగంలో ద్రవ్యత పెంచడానికి  విదేశీ మూలధనం సహా రుణాల కోసం అన్వేషించాలని ఆయన సూచించారు.

    బీఎస్‌4 వాహనాలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సుప్రీంకోర్టు తీర్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పరిశ్రమ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మరోమారు ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఇతర నిబంధనలపై సడలింపులకు సంబంధించి, వాహన తయారీ పరిశ్రమకు సాధ్యమైనంత ఉపశమనం ఇవ్వడానికి ప్రయత్నిస్తామని మంత్రి శ్రీ గడ్కరీ వివరించారు.


(Release ID: 1621836) Visitor Counter : 300