ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పార్లమెంటరీ కమిటీల సమావేశాలపై రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ చర్చ

వర్చువల్‌ విధానంలో సమావేశాల నిర్వహణపై సమాలోచన

Posted On: 07 MAY 2020 5:12PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు తన నివాసంలో లోక్‌సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లాతో సమావేశమయ్యారు. దేశంలో కొవిడ్‌ పరిస్థితి, పార్లమెంటు సభ్యుల పాత్ర, పార్లమెంటరీ కమిటీల సమావేశాలు నిర్వహించే అవకాశంపై చర్చించారు. 

    కరోనాపై యుద్ధంలో పార్లమెంటు సభ్యులు చురుగ్గా పాల్గొంటున్నారని; సంక్షేమ కార్యక్రమాలు చేపడున్నారని; ప్రభుత్వాలు, ప్రజలు చేపడుతున్న మానవతా కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ కష్టకాలంలో, అవసరాల్లో ఉన్న తమ నియోజకవర్గ ప్రజలతోనే ఎంపీలు ఉన్నారని శ్రీ వెంకయ్యనాయుడు, శ్రీ ఓం బిర్లా సంతోషం వ్యక్తం చేశారు. వివిధ పార్లమెంటరీ కమిటీలు తమ సమావేశాలను త్వరగా నిర్వహించే పరిస్థితులపైనా చర్చించారు. సాధారణ సంప్రదాయ సమావేశాలను ఇప్పట్లో నిర్వహించే వీలులేకపోతే, ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని ఇరువురూ అభిప్రాయపడ్డారు.

    వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్లమెంటరీ కమిటీల సమావేశాలు నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని, లాభనష్టాలను సమగ్రంగా బేరీజు వేయాలని ఉభయ సభల సెక్రటరీ జనరళ్లకు శ్రీ వెంకయ్యనాయుడు, శ్రీ ఓం బిర్లా ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంటు సమావేశాల నిబంధనలకు లోబడే ఇది జరగాలన్నారు. వివిధ దేశాల్లో అమలు చేస్తున్న వర్చువల్‌ సమావేశాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలని, ఆ తరహా సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని సిద్ధం చేయడానికి ఎంత సమయం పడుతుందో నివేదిక తయారు చేయాలని సూచించారు. ఉభయ సభల సెక్రటరీ జనరళ్లు ఇచ్చే నివేదిక ఆధారంగా, పార్లమెంటరీ కమిటీల సమావేశాల నిర్వహణపై శ్రీ వెంకయ్యనాయుడు, శ్రీ ఓం బిర్లా నిర్ణయం తీసుకోనున్నారు.
 


(Release ID: 1621870) Visitor Counter : 436