PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 29 APR 2020 6:49PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో కోవిడ్‌-19 బారినపడిన 31,332 మందిలో కోలుకున్నవారు (24.5 శాతం) 7,695 మంది.
 • కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లేలా వెసులుబాటు కల్పించిన కేంద్ర ప్రభుత్వం
 • బోర్డు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించాలని, తదనుగుణంగా ‘సీబీఎస్‌ఈ’కి కూడా ఆ సదుపాయాలు కల్పించాలని హెచ్‌ఆర్‌డి శాఖ మంత్రి రాష్ట్రాలను కోరారు.
 • కోవిడ్‌-19 ఉపశమన పరిష్కారాల సత్వరాభివృద్ధి దిశగా శాస్త్రవేత్తలకు డాక్టర్‌ హర్షవర్ధన్‌ విజ్ఞప్తి
 • కోవిడ్‌ అనంతర ప్రపంచ వాణిజ్యంలో గణనీయ వాటాకోసం భారత్‌ కృషిచేయాలి: శ్రీ పీయూష్‌గోయల్‌

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 బారినపడి కోలుకున్నవారు 24.5 శాతం... అంటే- 7,695 మంది; దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 31,332; కాగా, కోవిడ్‌తో సంబంధంలేని ఇతర అత్యవసర వైద్య సంరక్షణను నిర్లక్ష్యం చేయరాదని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి అన్నారు. ఈ మేరకు రక్తశుద్ధి (డయాలసిస్‌), కేన్సర్‌ చికిత్స, మధుమేహం, గర్భిణులకు వైద్యసేవలు, గుండెజబ్బు రోగులకు చికిత్స వంటివాటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పునరుద్ఘాటించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధ కృషికి దోహదపడే స్వీయ అంచనా ఉపకరణం ‘ఆరోగ్యసేతు’ యాప్‌ వినియోగంవైపు పౌరులను ప్రోత్సహించాల్సిందిగా ఆమె రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619387

అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులతో కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రి చర్చ

ఈ సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా దేశంలో కోవిడ్‌-19 ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రతికూల పరిస్థితిని ఒక అవకాశంగా మలచుకుంటూ విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. తదనుగుణంగా విద్యార్థుల విద్యా సంక్షేమం, భ్రదతల భరోసా ఇచ్చే వినూత్న ప్రయోగాలు చేపట్టాలని కోరారు. పాఠశాలలకు వేసవి సెలవుల సందర్భంగానూ మధ్యాహ్న భోజన పథకం కొనసాగింపునకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు. ఇందుకోసం రూ.1600 కోట్ల మేర అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ బోర్డు పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని, అదే సమయంలో ‘సీబీఎస్‌ఈ’కి ఇందుకు వెసులుబాటు కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619050

కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు వెళ్లే వెసులుబాటు కల్పించిన కేంద్ర ప్రభుత్వం

కోవిడ్‌-19పై పోరులో భాగమైన జాతీయ దిగ్బంధంవల్ల వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు తదితరులు అనేకమంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుబడిపోయారు. ఈ నేపథ్యంలో వీరంతా రోడ్డుమార్గాన తమతమ రాష్ట్రాలకు వెళ్లేలా కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల మధ్య సంప్రదింపులకు అనుగుణంగా వారు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ప్రయాణించవచ్చునని తెలిపింది. అయితే, వారు తమ గమ్యస్థానాలకు చేరిన తర్వాత స్థానిక ఆరోగ్యశాఖ అధికారవర్గాలు సునిశిత ఆరోగ్య తనిఖీ చేపట్టడంతోపాటు ఆస్పత్రిలో ఉంచాల్సిన అవసరంలేదని నిర్ధారించిన పక్షంలో ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉండేవిధంగా చూడాల్సి ఉంటుంది. అంతేగాక నిర్ణీత వ్యవధి నడుమ వారికి ఆరోగ్య తనిఖీ నిర్వహించడం తప్పనిసరి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619424

కోవిడ్‌-19 ఉపశమన పరిష్కారాల సత్వర అభివృద్ధికి కృషిచేయాలని శాస్త్రవేత్తలను కోరిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

కోవిడ్‌-19 సంక్షోభ పరిష్కారానికి... ప్రత్యేకించి దేశీయంగా టీకా, సత్వర పరీక్ష;ఆర్టీ-పీసీఆర్‌ నిర్ధారణ కిట్లు వగైరాల అభివృద్ధికి జీవసాంకేతిక శాఖ, దాని పరిధిలోని స్వయంప్రతిపత్తిగల వ్యవస్థలు, ప్రభుత్వరంగ సంస్థలైన బిరాక్‌ (BIRAC), బిబ్‌కాల్‌ (BIBCOL) చేపట్టిన వివిధ వినూత్న చర్యలను డాక్టర్‌ హర్షవర్ధన్‌ సమీక్షించారు. సుమారు ఆరు నమూనా టీకాలకు ప్రభుత్వం మద్దతిస్తున్నదని, వీటిలో నాలుగు సత్వర ప్రగతిదిశగా సాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619170

కోవిడ్‌ అనంతర శకంలో అంతర్జాతీయ సరఫరా శృంఖలాల్లో మార్పులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయన్న శ్రీ పీయూష్‌గోయల్‌; ప్రపంచ వాణిజ్యంలో గణనీయ వాటా చేజిక్కించుకునేందుకు భారత్‌ యత్నించాలని సూచన

నిర్దిష్ట రంగాల్లో బలాబలాలు, సంభావ్యతలు-స్పర్థాత్మక ప్రయోజనాలను గుర్తించి, ప్రపంచ విపణులలో వాటిపై దృష్టి కేంద్రీకరించాలని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ ఎగుమతిదారులకు పిలుపునిచ్చారు. కోవిడ్‌ అనంతర శకంలో అంతర్జాతీయ సరఫరా శృంఖలాల్లో మార్పులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయని, ఈ పరిస్థితుల నడుమ భారత పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు ప్రపంచ వాణిజ్యంలో గణనీయ వాటా దక్కించుకునే మార్గాన్వేషణ చేయాలని శ్రీ గోయల్ సూచించారు. ఈ దిశగా ప్రభుత్వం చురుకైన రీతిలో మద్దతిస్తుందని, వారి కృషికి మధ్యవర్తిగా ఉంటుందని చెప్పారు. అలాగే  విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలు కూడా తగిన తోడ్పాటునిస్తూ ముఖ్య భూమిక పోషించగలవని వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉన్నా అవి సమర్థనీయంగా, సహేతుకంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని మంత్రి చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619378

కోవిడ్‌-19పై పోరాటంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కృషికి శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌ అభినందనలు

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌-సమాచార సాంకేతికశాఖ మంత్రి శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌ 28.04.2020న రాష్ట్ర ఐటీశాఖ మంత్రులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. ‘ఇంటినుంచే పని’కి సంబంధించి టెలికమ్యూనికేషన్ల శాఖ నిబంధనల సడలింపు గడువును కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 30 నుంచి 2020 జూలై 31దాకా పొడిగిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈ మేరకు ‘భారత్‌ నెట్‌’ పథకానికి మద్దతునివ్వాలని, మార్గానుగమన హక్కు సమస్యల పరిష్కారాన్ని పరిశీలించాలని రాష్ట్రాలను కోరారు. ఆరోగ్యసేతు యాప్‌నుంచి రాష్ట్రాల్లోని జిల్లా అధికారుల స్థాయిదాకా సమాచార లభ్యత కల్పించాలని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించి సాధారణ ఫోన్లు వాడే వినియోగదారులకూ వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు సాగుతున్నాయని, త్వరలోనే ఇది సాకారం కాగలదని చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619172

కోవిడ్‌-19 పరీక్ష-నిర్బంధ పరిశీలన కేంద్రాలు, ప్రత్యేక ఆస్పత్రులలో చికిత్సకు సంబంధించి దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా ప్రాథమిక సదుపాయాలకు భరోసా ఇవ్వాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు కేంద్ర సామాజిక న్యాయ-సాధికారత మంత్రిత్వశాఖ లేఖ

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి నిరోధం దిశ‌గా అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు దేశంలోని ప్రాంతాల‌ను నియంత్ర‌ణ-ఏకాంత చికిత్స కేంద్రాలు, ప్ర‌యోగ‌శాలల‌ను కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాలు సిద్ధం చేశాయి. అయితే, ప్ర‌స్తుత సంక్షోభ ప‌రిస్థితుల్లో  దివ్యాంగుల‌కు ప‌లు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. స‌హ‌జంగానే వారు శారీర‌కంగా అశ‌క్తులు కావ‌డంతోపాటు రోగ‌నిరోధ‌క‌త త‌క్కువ‌గా ఉండ‌టం, స‌మ‌గ్ర స‌మాచారం పొంద‌డానికి శ్ర‌మ‌ప‌డాల్సి రావ‌డం వంటి చిక్కులు వ‌స్తున్నాయి. అందువ‌ల్ల కోవిడ్‌-19 సంబంధిత స‌దుపాయాలున్న చోట అవి వారికి అందుబాటులో ఉండేవిధంగా ప్రాథ‌మిక సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం కోరింది. ఈ మేర‌కు దివ్యాంగుల సాధికారత శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619367

భారత, కెనడా ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కెనడా ప్రధాని గౌరవనీయ జస్టిన్‌ ట్రూడోతో ఫోన్‌ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తికి సంబంధించి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. ప్రపంచవ్యాప్త సంఘీభావం, సమన్వయం, సరఫరా శృంఖలాల నిర్వహణసహా సహకారపూరిత పరిశోధన కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని వారిద్దరూ అంగీకరించారు. కాగా, భారతీయులకు... ప్రత్యేకించి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలకుగాను కెనడా ప్రధానమంత్రికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619173

నిరుటితో పోలిస్తే దిగ్బంధం సమయంలో రైళ్లద్వారా ఆహారధాన్యాల ప్రైవేటు రవాణాలో భారీ పెరుగుదల

దేశంలో నిరుటితో పోలిస్తే ఈ ఏడాది దిగ్బంధం సమయంలో మార్చి 25 నుంచి 2020 ఏప్రిల్‌ 28వరకూ భారత రైల్వేశాఖ (303 గూడ్సురైళ్ల)ద్వారా  7.75 లక్షల టన్నులకుపైగా ఆహార ధాన్యాల ప్రైవేటు రవాణా సాగింది. నిరుడు ఇదే వ్యవధిలో (243 రైళ్లద్వారా) 6.62 లక్షల టన్నులు రవాణా అయ్యాయి. కాగా, ప్రస్తుత సంక్షోభ సమయంలో దేశమంతటా ఆహారధాన్యాలకు కొరతలేకుండా వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా శృంఖలాలకు భరోసా ఇస్తూ రైల్వేశాఖ సకాలంలో వివిధ ప్రాంతాలకు నిత్యావసరాలను చేరవేస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619373

ఫిక్కి తదితర పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో శ్రీమతి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం

దేశంలోని రైతుల ప్రయోజనాల పరిరక్షణ దిశగా వివిధ ప్రాంతాల్లో పండించిన పంటలు, త్వ‌రగా పాడయ్యే ఉత్పత్తుల సేకరణ కోసం పరిశ్రమ వర్గాలు ముందుకు రావాలని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్-పరిశ్రమలశాఖ‌ మంత్రి శ్రీమతి హర్‌సిమ్రత్‌ కౌర్ బాద‌ల్ పిలుపునిచ్చారు. ఈ దిశగా మంత్రిత్వశాఖ నుంచి పారిశ్రామికవర్గాలకు పూర్తి సహకారం ఉంటుందని, ఎలాంటి సహాయం కావాలన్నా కార్యాచరణ బృందాన్ని సంప్రదించాలని భారత వాణిజ్య-పారిశ్రామిక సంఘాల సమాఖ్య-ఫిక్కిసహా ఇతర సంస్థల ప్రతినిధులతో ఆమె దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంలో సూచించారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619188

వాతావరణ మార్పుపై పీటర్స్‌బర్గ్‌ తొలి దృశ్యమాధ్యమ సమావేశంలో 30 దేశాలతో కలసి పాల్గొన్న భారత్‌

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 తద‌నంత‌ర ఆర్థిక వ్యవస్థ పున‌రుత్తేజం, సామాజిక పున‌రుజ్జీవ‌న స‌వాళ్ల‌పై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్రణాళికల గురించి చ‌ర్చించేందుకు వాతావార‌ణ మార్పుపై 11వ స‌మావేశం దృశ్య‌మాధ్య‌మంద్వారా పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో జ‌రిగింది. ఇందులో భారత్‌తోపాటు మరో 30 దేశాలు పాల్గొన్నాయి. సవాళ్లపై సమష్టి పోరు దీక్షను కొనసాగించడంతోపాటు వాతావరణ మార్పు కార్యాచరణలో... ప్రత్యేకించి బలహీన దేశాలకు మద్దతిస్తూ ఉత్ప్రేరక పాత్రను సమర్థంగా పోషించాలని సమావేశం నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619099

కోవిడ్‌-19 నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు లేదా జీతాల తగ్గింపు వంటి చర్యలు తీసుకోరాదని యాజమాన్యాలకు సూచించిన కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ; ‘పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌’ నిర్ధారణ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619113

లయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులతో డాక్టర్‌ హర్షవర్ధన్‌ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం

కోవిడ్‌-19పై భారత పోరాట స్వభావాన్ని ఈ సందర్భంగా డాక్టర్‌ హర్షవర్ధన్‌ వివరించారు. “నేడు మేం అనుసరిస్తున్న ఐదంచెల విధానం అద్వితీయమైనది... (1) పరిస్థితిపై నిరంతర అవగాహన నిర్వహణ (2) ముందస్తు, చురుకైన చర్యల విధానం (3) ఎప్పటికప్పుడు పరిణామాధారిత ప్రతిస్పందన (4) అన్నిస్థాయులలోనూ అంతర-రంగ సమన్వయం... ఆఖరుదైనా అన్నిటికన్నా ముఖ్యమైనది (5) మహమ్మారిని ఎదుర్కొనడంపై ప్రజా ఉద్యమ నిర్మాణం” ఇందులో భాగమని స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619426

దేశవ్యాప్తంగా కోటికిపైగా ఫేస్‌మాస్కులు తయారుచేసిన స్వయం సహాయ సంఘాలు

దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల స్వయం సహాయ సంఘాలు కోటికిపైగా ఫేస్‌మాస్కులను తయారుచేశాయి. కోవిడ్‌-19పై పోరాటంలో కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రతిష్ఠాత్మక పథకం DAY-NULM కింద స్వయం సహాయ సంఘాల దృఢ సంకల్పం, సానుకూల సామర్థ్యం, అవిశ్రాంత కృషికి ఇదే నిదర్శనం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619230

రుతుపవన కార్యాచరణకు సిద్ధమవుతున్న జలశక్తి అభియాన్‌

దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య సంక్షోభంపై పోరుతోపాటు తన పరిధిలోని వివిధ కార్యక్రమాల కింద గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజమిచ్చేందుకు ‘జలశక్తి అభియాన్‌’ సిద్ధమవుతోంది. ఈ ఏడాది కోవిడ్‌-19 అత్యవసర స్థితి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కార్మికశక్తి లభ్యత అధికంగా ఉన్నందున రాబోయే రుతుపవన కార్యాచరణ అమలుకు సన్నద్ధమవుతోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619089

ప్రజలకు అందుబాటులో స్మార్ట్‌ సిటీ ‘కల్యాణ్‌-డోంబివిలీ’ కోవిడ్‌-19 డ్యాష్‌బోర్డ్‌

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619191

‘దేఖో అప్నాదేశ్‌’ ఇతివృత్తం కింద “యాన్‌ ఎపిక్‌ కాల్డ్‌ ఇండియా- ఎ లాండ్‌ ఆఫ్‌ మిరియడ్‌ స్టోరీస్‌” శీర్షికన 11వ వెబినార్‌ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వశాఖ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619215

కోవిడ్‌-19పై పోరులో అగ్రశ్రేణి ఆరోగ్యసంరక్షణ యోధులకు ‘HCARD’రోబో తోడ్పాటు

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619218

 

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగ‌ఢ్‌: కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన ఈ న‌గ‌రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సెక్టార్-26, సెక్టార్-30-Bల ప‌రిధిలోని బాపూధామ్ కాలనీవంటి ప్రాంతాల్లో శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను వనరులను కేంద్రీక‌రించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించాల‌ని న‌గ‌ర పాల‌నాధికారి స‌ల‌హాదారు పేర్కొన్నారు. త‌ద‌నుగుణంగా ఈ ప్రాంతాన్ని దిగ్బంధించ‌డంతోపాటు పౌరులు సామాజిక దూరం పాటించేలా స్థానిక స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌ల‌, నాయ‌కుల సాయం తీసుకోవాల‌న్నారు. అంతేకాకుండా నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించే వారిపై నిఘా కోసం సీసీటీవీ కెమెరాలుస‌హా డ్రోన్ల‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కర్ఫ్యూ ఉత్తర్వులు కచ్చితంగా పాటించేలా పోలీసు గ‌స్తీ కూడా ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.
 • పంజాబ్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయ బృందాల సభ్యులు కరోనా వైరస్ పోరాట యోధులుగా ఆవిర్భవించారు. ఈ మేర‌కు పంజాబ్ గ్రామీణాభివృద్ధి శాఖ నేతృత్వంలో పౌర యంత్రాంగం, పోలీసు, పంచాయ‌తీల సిబ్బంది కోసం మాస్కులు, ఏప్రాన్‌లు, గ్లోవ్స్ త‌దిత‌రాల‌ను త‌యారుచేస్తున్నారు. మ‌రోవైపు దిగ్బంధం వేళ మాస్కులు త‌యారు చేయ‌డంలో పంజాబ్ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు రికార్డు సృష్టించి రాష్ట్రానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారు.
 • హర్యానా: రాష్ట్రంలో కోవిడ్‌-19 నియంత్ర‌ణ దిశ‌గా స‌మాచార-సాంకేతిక విజ్ఞానం ఆధారంగా ప్ర‌భుత్వం చేప‌ట్టిన వినూత్న చ‌ర్య‌లు‌ స‌హాయ‌-సేక‌ర‌ణ కార్య‌క‌లాపాల్లో కీల‌క‌పాత్ర పోషించాయ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. ఈ మేర‌కు ఇబ్బందుల్లో ఉన్న పేద‌లకు ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌ద్వారా మూడు నెలలపాటు ఉచిత రేషన్ అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభ రేషన్ టోకెన్లను జారీచేసిందని ఆయన చెప్పారు.
 • హిమాచల్ ప్రదేశ్: దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికి స‌హాయం చేయ‌డం కోసం ప్ర‌భుత్వం స‌హాయ కేంద్రం ఏర్పాటుతోపాటు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది. ఈ ఫోన్ నంబర్ల‌తోపాటు ఈ-మెయిల్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన 5000 మందికిపైగా పౌరుల‌కు స‌హాయం అందింది. దీంతోపాటు పెద్ద సంఖ్యలో ఇత‌ర రాష్ట్రాల్లోగ‌ల హిమాచల్ పౌరులకు స‌హాయం చేయాల్సిందిగా ముఖ్య‌మంత్రి ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు లేఖ రాశారు.
 • కేరళ: రాష్ట్రంలో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోతకు వీలు కల్పించే ఆర్డినెన్స్‌ను ప్ర‌భుత్వం ఆమోదించింది. కాగా, అంత‌కుముందు ఈ ఉత్త‌ర్వుల‌పై రాష్ట్ర హైకోర్టు నిలిపివేత ఆదేశాలిచ్చింది. బ‌హిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధ‌రించ‌డాన్ని ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. కాసర‌గోడ్‌లో ఒక వ్యక్తికి వ్యాధి నిర్ధార‌ణ కాగా, సంక్ర‌మ‌ణ మూలాన్ని ఆరోగ్య శాఖ అధికారులు కనుగొన‌లేక‌పోయారు. కాగా, ఈ మహమ్మారి బాధితుల కోసం మే 3వ తేదీని సామూహిక ప్రార్థన దినంగా పాటించాల‌ని రాష్ట్రంలోని వివిధ మతాల‌కు చెందిన నాయ‌కులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నిన్నటిదాకా నిర్ధారిత కేసుల సంఖ్య: 485, యాక్టివ్ కేసులు: 123, న‌య‌మైన‌వారు: 359 మంది.
 • తమిళనాడు: చెన్నైలో ఆహార స‌ర‌ఫ‌రా సేవ‌లందించే వ్య‌క్తికి కోవిడ్‌-19 సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. కాగా, అత‌ని తండ్రి వ్యాధిబారిన‌ప‌డి ఇప్ప‌టికే మ‌ర‌ణించారు. రాష్ట్రంలోని బియ్యం కార్డుదారులంద‌రికీ మూడు నెల‌ల‌పాటు రెట్టింపు ఉచిత రేష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రానికి తిరిగిరావాల‌ని భావించే విదేశాల్లోని త‌మిళ కార్మికుల కోసం ఒక పోర్ట‌ల్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. కాగా, నగరంలోగ‌ల అన్ని కేంద్ర-రాష్ట్ర అత్య‌వ‌స‌ర సేవల సంస్థలన్నీ త‌మ కార్యాలయాల్లో రోజుకు రెండుసార్లు రోగ‌కార‌క నిర్మూల‌న ప్ర‌క్రియ నిర్వ‌హించాల‌ని చెన్నై న‌గ‌ర‌పాల‌క సంస్థ ఆదేశించింది. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసుల సంఖ్య :2048, యాక్టివ్ కేసులు: 902, మరణాలు: 25, డిశ్చార్జ్ అయిన‌వారు: 1128 మంది. కాగాచెన్నైలో గ‌రిష్ఠంగా 673 కేసులు న‌మోద‌య్యాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో 9 కొత్త కేసులు నిర్ధార‌ణ అయ్యాయి... వీటిలో కల్బుర్గి నుంచి 8, బెళ‌గావి నుంచి ఒకటి న‌మోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య‌ 532కు చేరింది. ఇప్పటివరకు మృతులు 20 మంది కాగా, 215 మంది న‌యం చేసుకుని ఆస్ప‌త్రుల నుంచి ఇళ్ల‌కు వెళ్లారు.
 • ఆంధ్రప్ర‌దేశ్‌: రాష్ట్రంలో గ‌డ‌చిన‌ 24 గంటల్లో 73 కొత్త కేసులు నమోదవ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 1,332కు చేరింది. యాక్టివ్ కేసులు: 1,014, కోలుకున్న‌వారి సంఖ్య: 287, మరణాలు: 31. వైరస్ వ్యాప్తి నిరోధం దిశ‌గా అన్ని ప్రభుత్వ శాఖ‌లు, బ్యాంకులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మీడియా ప్ర‌తినిధులు, వ్యాపారులు, రవాణా వాహనాల డ్రైవర్లు ఆరోగ్య‌సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్ర‌భుత్వం ఆదేశించింది. దిగ్బంధం మే 3వ తేదీతో ముగిసేట్ల‌యితే నియంత్ర‌ణ మండ‌లాల్లో అనుస‌రించాల్సిన వ్యూహాన్ని జిల్లా క‌లెక్ట‌ర్లు సిద్ధం చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. రాష్ట్రంలో నిర్ధారిత కేసుల సంఖ్య‌రీత్యా కర్నూలు (343), గుంటూరు (283), కృష్ణా (236) అగ్ర‌స్థానంలో ఉన్నాయి.
 • తెలంగాణ: పొరుగు రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌క‌న్నా తెలంగాణ‌లో చాలా తక్కువ సంఖ్య‌లో పరీక్షలు నిర్వహించిన‌ట్లు ఆరోగ్య‌శాఖ మంత్రి తెలిపారు. అయితే, నిర్ధారిత కేసుల సంఖ్య త‌గ్గుతున్న రీత్యా అధిక సంఖ్య‌లో ప‌రీక్ష‌లు అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. హైదరాబాద్ లోని ఐఐటీలో వలస కార్మికులు ఇవాళ హింసకు పాల్పడటంతో ఇద్దరు పోలీసులు గాయపడ‌గా, వారి వాహనం ఒక‌టి దెబ్బతిన్న‌ది. రాష్ట్రంలో మొత్తం కేసులు: 1,009, యాక్టివ్ కేసులు: 610.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో 728 కొత్త కేసుల న‌మోదుతో కోవిడ్-19 నిర్ధారిత కేసుల సంఖ్య 9,318కి చేరింది. కాగా, 1,388 మంది నయం చేసుకుని, ఆస్ప‌త్రినుంచి వెళ్లిన‌ప్ప‌టికీ మరణించిన వారి సంఖ్య 369గా న‌మోదైంది. మ‌రోవైపు రాజ‌స్థాన్‌లోని ఐఐటీ-ఇత‌ర ప‌రీక్ష కేంద్రాల్లో చ‌దివే రాష్ట్రానికి చెందిన విద్యార్థుల‌ను తిరిగి తీసుకురావ‌డానికి మహారాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ కోట న‌గ‌రానికి 70 బస్సులను పంపింది.
 • గుజరాత్: రాష్ట్రంలో 196 కొత్త కోవిడ్ కేసులు నమోదవ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 3,744కి చేరింది. వీరిలో 434 మంది కోలుకోగా, 181 మంది మ‌ర‌ణించారు.
 • రాజస్థాన్: రాష్ట్రంలో 29 తాజా కేసులు ఇవాళ నమోదు కావ‌డంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 2,393కు చేరింది. వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 52 మంది మరణించారు; ‌వీరిలో జైపూర్‌వాసుల 27 మంది ఉన్నారు. కాగా, ఇప్పటివరకు 781 మంది రోగులు కోలుకుని ఇళ్ల‌కు వెళ్లారు.
 • మధ్యప్రదేశ్: రాష్ట్రం‌లో 25 కేసులు న‌మోద‌వ‌గా మొత్తం కేసుల సంఖ్య 2,387కు చేరింది. వీరిలో 377 మంది కోలుకోగా 120 మంది మరణించారు.
 • ఛత్తీస్‌గఢ్‌: ‌రాష్ట్రంలో ఇవాళ్టిదాకా 4 కోవిడ్‌-19 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కాగా, ఇప్పటిదాకా నమోదైన మొత్తం 38 కేసుల్లో 34 కేసులు నయమయ్యాయి.
 • గోవా: గోవాలో న‌మోదైన మొత్తం కేసులు 7 మాత్ర‌మే కాగా, అంద‌రికీ న‌యం కావ‌డంతో ప్రస్తుతం యాక్టివ్ రోగులు ఒక్క‌రూ లేరు.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో స్వైన్ ఫీవర్ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్న యోచ‌న‌తో రాజధాని ప్రాంతంలో పందుల రవాణా, పంది మాంసం విక్ర‌యాల‌ను ఇటాన‌గ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ నిషేధించారు.
 • అసోం: కోవిడ్-19 నేపథ్యంలో ఉన్నత విద్య కోసం కొత్త వ్యూహం రూప‌క‌ల్ప‌న అత్యంత క‌ష్ట‌సాధ్య‌మ‌ని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ‌శర్మ అన్నారు. అయితే, మార్గ ప్ర‌ణాళిక సిద్ధం చేయ‌డం కోసం ఇవాళ అసోం క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ల మండ‌లి, ఉపాధ్యాయుల సంఘంస‌హా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, క‌మిష‌న‌ర్ల‌తో ఆయ‌న స‌మావేశం నిర్వ‌హించారు.
 • మణిపూర్: రాష్ట్రంలో కర్ఫ్యూ, దిగ్బంధం నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద నిన్న 784 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంద‌రి నుంచి జ‌రిమానా కింద లక్ష రూపాయ‌లు వ‌సూలు చేశారు.
 • మిజోరం: ఈశాన్య భార‌తంలోని నాలుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న మిజోరం వాసులు 693 మందిని ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ మధ్య తిరిగి తీసుకొస్తామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు వాహ‌నాలు లేనివారికి ప్ర‌భుత్వ‌మే వాహ‌నాలు స‌మ‌కూరుస్తుంది.
 • మేఘాలయ: రాష్ట్రంలో ఆన్‌లైన్ ద్వారా వైద్య సేవ‌ల కోసం తక్షణ సంప్రదింపులకు వీలుగా షిల్లాంగ్‌లోని NEIGRIHMSలో టెలిమెడిసిన్ స‌దుపాయాన్ని ముఖ్య‌మంత్రి ప్రారంభించారు. ఇందులో సాధారణ, కోవిడ్‌-19 కేసుల విష‌యంలోనూ సేవ‌లందించే అవ‌కాశం క‌ల్పించారు.
 • నాగాలాండ్: రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ మేర‌కు ఇప్పటికే అమ‌లులోగ‌ల‌ పన్ను, సుంకాల‌తోపాటు అన్ని ఇంధన ఉత్పత్తులపై కోవిడ్ -19 రుసుము విధిస్తామ‌ని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.
 • సిక్కిం: న్యూఢిల్లీలోని ఒక ఆస్ప‌త్రిలో ర‌క్త‌శుద్ధి చేయించుకుంటున్న సిక్కిం మ‌హిళ‌ల‌కు కోవిడ్‌-19 నిర్ధార‌ణ అయింది. అయితే, ఆమెకు వ్యాధి ఎలా సోకిందీ ఇంకా తెలియ‌రాలేద‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. ఆమెకు సంపూర్ణ చికిత్స అందుతున్న‌ద‌ని, బంధువులు ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేద‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.
 • త్రిపుర: ‌కోవిడ్‌-19 నేప‌థ్యంలో రాష్ట్రంలోని ఝూమియా కుటుంబాలకు జాతీయ గ్రామీణ ఉపాధి ప‌థ‌కం కింద ప‌నుల‌కుగాను త‌లా రూ.202 వంతున 6 ప‌నిదినాల‌కు ప్ర‌భుత్వం 1,212 రూపాయ‌లు చెల్లించ‌నుంది.

 

PIB FACTCHECK

*******(Release ID: 1619433) Visitor Counter : 51