ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19పై పోరాటంలో రాష్ర్టాలు చేస్తున్న ప్రయత్నాలకు శ్రీ రవిశంకర్ ప్రసాద్ ప్రశంస

డిజిటల్ విద్య, డిజిటల్ ఆరోగ్యం, డిజిటల్ చెల్లింపులు వంటి సదుపాయాలతో పూర్తి స్వయం సమృద్ధమైన లక్ష డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేయడమే తన కల అని ప్రకటించిన మంత్రి

కోవిడ్-19పై పోరాటానికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వనరులన్నీ ఏకీకృతం చేయడానికి ఐక్యంగా, డిజిటల్గా, భౌతికంగా శ్రమించాలని రాష్ర్టాలన్నింటికీ మంత్రి పిలుపు. ఈ ప్రయత్నంలో కేంద్రం నుంచి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ

Posted On: 28 APR 2020 9:30PM by PIB Hyderabad

కేంద్ర ఎలక్ర్టానిక్స్, కమ్యూనికేషన్ల భాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ 2020 ఏప్రిల్ 28న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ర్టాల ఐటి శాఖ మంత్రులతో సమావేశమయ్యారు. హర్యానా, సిక్కిం ముఖ్యమంత్రులు, ఐటి శాఖను కూడా నిర్వహిస్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఉపముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, అస్సాం, ఒడిశా, గోవా, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ ఐటి మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఐటి కార్యదర్శులు కూడా వారి రాష్ర్టాలకు ప్రాతినిధ్యం వహించారు. వీరితో పాటు కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటి శాఖ, టెలీ కమ్యూనికేషన్లలో భాగం అయిన తపాలా శాఖ కార్యదర్శులు, సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కోవిడ్-19 పై పోరాటంలో భాగంగా తాము విడుదల చేసిన ఆరోగ్య సేతు యాప్ గురించి, నవకల్పనల సవాలును తాము స్వీకరించిన తీరు గురించి, మై గవ్, సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించడం, అందరికీ సమాచారం అందించడం కోసం జాతీయ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ల నిర్వహణ, ఇ-కార్యాలయాలు, ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాల్లో కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా తాము చేస్తున్న కృషి గురించి, సిడారఖ ఇ-సంజీవని టెలీ మెడిసన్ వేదిక గురించి ఐటి, ఎలక్ర్టానిక్స్ మంత్రిత్వ శాఖ అధికారులు  సవివరంగా తెలియచేశారు. 

దేశవ్యాప్తంగా 1.56 లక్షల తపాలా కార్యాలయాలను ఐటితో అనుసంధానం చేయడం ద్వారా రూ.38 వేల కోట్ల విలువ గల 2.5 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్టు తపాలా శాఖ కార్యదర్శి చెప్పారు. ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిలో తపాలా సిబ్బంది 43 లక్షల లేఖలను, 250 టన్నుల ఔషధాలు, కోవిడ్ కిట్లను ఆయా చిరునామాల్లో అందచేసినట్టు ఆయన తెలిపారు.

లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ ప్రజలందరికీ నాణ్యమైన టెలికాం సేవలు నిరంతరాయంగా అందించేందుకు తమ శాఖ చేస్తున్న కృషిని టెలీ కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి వివరించారు. ప్రస్తుత వాతావరణంలో సరికొత్త విధానంగా ప్రాచుర్యంలోకి వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ కు డాట్ అన్ని రకాల మద్దతు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కొత్తగా ప్రారంభించిన కోవిడ్ క్వారంటైన్ అలర్ట్ వ్యవస్థ (సిక్యుఏఎస్), సావధాన్ వ్యవస్థల గురించి కూడా వివరించారు. జాతీయ బ్రాండ్ బ్యాండ్ కార్యక్రమం క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో భాగంగా అవసరమైన మేరకు సడలింపులు ఇవ్వడం, హేతుబద్ధమైన రేట్లు విధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

కోవిడ్-19ని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి తాము చేస్తున్న కృషి గురించి, అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాల గురించి రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు వివరించారు. ఈ సంక్షోభ సమయంలో పౌరుల అవసరాలే ప్రధానంగా సేవలందించడంలో ఇండియా పోస్ట్, కామన్ సర్వీస్ కేంద్రాలు, టెలికాం, ఐటి మంత్రిత్వశాఖ చేస్తున్న కృషిని రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధులందరూ ప్రశంసించారు. కేంద్రప్రభుత్వం మరింతగా కలిసి పని చేయాలని కోరుతూ ఈ దిశగా పలు చర్యలను వారు సూచించారు.

గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానత, ఇంటర్నెట్ నాణ్యత అత్యంత ప్రధానంగా మారాయని, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేటు రంగం విశ్వసనీయ భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను మెరుగుపరచాల్సి ఉన్నదని కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ ధోత్రే అన్నారు.

కోవిడ్-19పై పోరాటంలో రాష్ర్టప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల కృషిని గౌరవ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ప్రశంసించారు.సమావేశాన్ని ముగించే ముందు ఆయన కొన్ని ప్రధాన ప్రకటనలు చేశారు.

- వర్క్ ఫ్రమ్ హోమ్ నిబంధనల సడలింపు గడువును కేంద్రప్రభుత్వం ఏప్రిల్ 30 నుంచి 2020 జూలై 31 వరకు పొడిగిస్తుందని చెప్పారు.

- భారత్ నెట్ పథకానికి మద్దతు ఇవ్వాలని రాష్ర్టాలను కోరుతూ విస్తృతమైన టెలికాం నెట్ వర్క్ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సరైన దృక్పథంతో స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 విసురుతున్న సవాలు దృష్ట్యా డిజిటల్ విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో భారత్ నెట్ ప్రాధాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

- ఒక రాష్ట్రం చేసిన సూచనకు స్పందిస్తూ కోవిడ్-19పై పోరాటంలో అనుసరిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలను రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటి నుంచి సేకరించి ఒక పోర్టల్ ను అభివృద్ధి చేయాలని ఐటి, ఎలక్ర్టానిక్స్ మంత్రిత్వ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

- కోవిడ్-19 అనంతరం ఐటి, ఎలక్ర్టానిక్స్ రంగం అభివృద్ధికి సంబంధించిన సవివరమైన ప్రణాళిక రూపకల్పనకు కేంద్రప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ భాగస్వాములతో ఒక వ్యూహ బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ ఒక రాష్ట్ర ఐటి మంత్రి చేసిన సూచనను ఆయన ఆమోదించారు. 

- డిజిటల్ విద్య, డిజిటల్ ఆరోగ్యం, డిజిటల్ చెల్లింపుల వంటి సదుపాయాలతో పూర్తి స్వయం సమృద్ధమైన లక్ష డిజిటల్ గ్రామాల అభివృద్ధి తన కల అని ఆయన వివరించారు.

- ఆరోగ్య సేతు యాప్ లోని డేటా అంతటినీ రాష్ర్ట స్థాయి, జిల్లా స్థాయి అధికారుల వరకు అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలన్న రాష్ట్రప్రభుత్వాల అభ్యర్థనను కూడా ఆయన ఆమోదిస్తూ అందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫీచర్ ఫోన్ల కోస్ కూడా ఆరోగ్య సేతు వంటి సొల్యూషన్ అభివృద్ధి దశలో ఉన్నదని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

- ఎలక్ర్టానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి భారత్ కు మంచి అవకాశాలున్నాయని చెబుతూ ఈ రంగంలో రాష్ట్రస్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఎలక్ర్టానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం రూ.50 వేల కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలు 2.0, ఎలక్ర్టానిక్స్ తయారీ క్లస్టర్ల ఏర్పాటు, ఎలక్ర్టానిక్ విడిభాగాలు, సెమీ కండక్టర్ల (స్పెక్) తయారీకి ప్రోత్సాహం పేరిట మూడు స్కీమ్ ల వివరాలను ఆయన వారితో పంచుకున్నారు. ఈ స్కీమ్ లకు బలం అందించే విధంగా రాష్ర్టాలు స్కీమ్ లు సిద్ధం చేయాలని ఆయన కోరారు. 

కోవిడ్-19పై పోరాటానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో వనరులన్నింటినీ కూడగట్టేందుకు రాష్ర్టాలు ఐక్యంగా, డిజిటల్ గా, భౌతికంగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైనంత సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.



(Release ID: 1619172) Visitor Counter : 157