ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డాక్టర్ హర్ష్ వర్ధన్
Posted On:
29 APR 2020 5:07PM by PIB Hyderabad
"మనమంతా' అనే భావన, భౌతిక దూరం పాటించడం కోవిడ్-19పై పోరాటంలో కీలక అంశాలు: డాక్టర్ హర్ష్ వర్ధన్
కోవిడ్-19కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో లయన్స్ క్లబ్ సభ్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రశంసించారు. ముఖ్యంగా పీఎం కేర్స్ కి విరాళాలు, ఆస్పత్రులకు వైద్య పరికరాలు, శానిటైజెర్లు, ఆహరం, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు విస్తృతంగా అందజేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారని కేంద్ర మంత్రి అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులతో కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా పోలియో, కేటరాక్ట్ వంటి శిబిరాలను నిర్వహించి మన్ననలు పొందిన లయన్స్ క్లబ్ ఇపుడు కోవిడ్ పై పోరులో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు 200 దేశాల వరకు వ్యాపించిన కోవిడ్-19 ను ఓడించడానికి అంతా ఉమ్మడిగా పనిచేయాలని కేంద్ర మంత్రి అన్నారు. లక్షలాది మందికి ఆహారం, వైద్య పరికరాలను పంపిణీ చేసి లయన్స్ క్లబ్ ప్రశంసనీయం పాత్ర పోషించిందని డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలిపారు.
కోవిడ్-19ను తుదముట్టించడానికి ప్రభుత్వం ఐదంచెల వ్యూహంతో ముందుకు వెళ్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు: (i) నిరంతరం పరిస్థితుల పట్ల అవగాహన (ii) ముందస్తు, సకారాత్మక విధానం అవలంబించడం (iii) నిరంతరం మారుతున్న ష్టితిగతులకు అనుగుణంగా వ్యవహరించడం (iv) అన్ని స్థాయిల్లో అంతర్ విభాగాల సమన్వయం తో పాటు చివరిది, అతి ముఖ్యమైనది అయిన వ్యాధిని ఎదుర్కోడానికి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నెలకొల్పడం.
వ్యాధిని ఎదుర్కోడానికి భారత్ సామర్థ్యాల గురించి చెబుతూ, అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సైతం భారత్ విజయవంతంగా ఎదుర్కొన్నదని, గతంలో మహమ్మారి లాంటి వ్యాధులను కూడా ఎదుర్కోగలిగిందని చెప్పారు. అంతర్జాతీయ ఆరోగ్య నియంత్రణలకు అనుగుణంగా అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా వ్యవహరించగలిగే కీలకమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. మహమ్మారి వ్యాధుల కోసం సమీకృత వ్యాధి నిఘా కార్యక్రమం (ఐడిఎస్పి) అనే జాతీయ స్థాయి నిఘా వ్యవస్థ ఇప్పటికే అనుసరిస్తున్నామని, తగిన డిజిటల్ సమాచార వివరాలతో ఆ కార్యక్రమాన్ని ప్రస్తుత కోవిడ్-19 విషయంలో కూడా మరింత పటిష్టంగా అమలు చేస్తున్నామని డాక్టర్ హర్ష్ వర్ధన్ వెల్లడించారు.
దేశంలో గత మూడు రోజులుగా వ్యాధి రెట్టింపు రేటు 11.3 రోజులుగా ఉందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మరణాల రేటు 7% ఉంటే, భారత్ లో అది 3% ఉందని తెలిపారు. కేవలం 0.33% మంది మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారని, ఆక్సిజన్ పై 1.5% మంది, ఐసీయూ లో 2.34% మంది మాత్రమే ఉన్నారని, దీనిని బట్టి భారత్ లో నాణ్యమైన సంరక్షణ చర్యలు ఎలా తీసుకుంటున్నామో స్పష్టం అవుతుందని ఆయన అన్నారు. ఇంకా పరిస్థితి విషమించినా ఎదుర్కొనేందుకు ఐసొలేషన్ పడకలు, పీపీఈలు, మాస్కులు, మొదలైనవి తగినన్ని సమకూర్చుకునే స్థితి దేశానికి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా 97 ప్రైవేట్ ల్యాబ్‌తో పాటు 288 ప్రభుత్వ ప్రయోగశాలలు పనిచేస్తున్నాయని ఆయన తెలియజేశారు. సుమారు 16,000 నమూనా సేకరణ కేంద్రాలతో రోజుకు 60,000 పరీక్షలను నిర్వహించే పరిస్థితి ఉందని అన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పరీక్ష సామర్థ్యాన్ని రోజుకు ఒక లక్ష పరీక్షలకు పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.
వ్యాక్సిన్ అభివృద్ధికి ఎక్కువ సమయం పట్టబోతున్నందున, లాక్డౌన్ మరియు సామాజిక దూరం సమర్థవంతమైన 'సామాజిక వ్యాక్సిన్'గా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి అన్నారు. "సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, నా ఆధ్వర్యంలో కూడా పనిచేస్తోంది ఆవిష్కరణలు మరియు పరీక్షా విధానాన్ని చాలా వేగంగా చేయబోయే కొన్ని ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తున్నాయి” అని ఆయన చెప్పారు. కోవిడ్-19ని భారత్ విజయవంతంగా ఎదుర్కోగలదనే విశ్వాసం ఉందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు.
****
(Release ID: 1619426)
Visitor Counter : 195
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada