PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 28 APR 2020 6:52PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 • దేశంలో 29,345 మంది కోవిడ్‌-19 బారినపడగా కోలుకున్న వారు 23.3 శాతం అంటే- 6,868 మంది.
 • అతిస్వల్ప/వ్యాధి లక్షణాలకు ముందు ఏకాంత గృహ చికిత్సకు మార్గదర్శకాలు జారీ.
 • కోవిడ్‌-19పై భారత్‌ పోరుకు మద్దతుగా 1.5 బిలియన్‌ డాలర్ల రుణం ఇవ్వనున్న ఏడీబీ.
 • దిగ్బంధం ఉన్నప్పటికీ చురుగ్గా సాగుతున్న గోధుమ పంట కోతలు-నూర్పిళ్లు; కొనుగోళ్లు.
 • దిగ్బంధం సమయంలో రికార్డు స్థాయిలో ఎరువుల అమ్మకాలు.
 • ఓడరేవుల ఉద్యోగులు/కార్మికులకు కోవిడ్‌-19వల్ల ప్రాణనష్టం వాటిల్లితే రూ.50 లక్షల పరిహారం.
 • దిగ్బంధం వేళ పీఎంజీకేవై కింద 7.4లక్షలుసహా 12.91 లక్షల అభ్యర్థనలు పరిష్కరించిన ఈపీఎఫ్‌వో.
 • రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నడుమ సరిహద్దుల్లో ట్రక్కులు/లారీల దిగ్బంధాన్ని తక్షణం పరిష్కరించాలని శ్రీ నితిన్‌ గడ్కరీ పిలుపు

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 బారినపడి కోలుకున్నవారు 23.3 శాతం... అంటే- 6,868 మంది; దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 29,435; కాగా, ఇంతకుముందు కేసులు నమోదైన 17 జిల్లాల్లో గడచిన 28 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అతిస్వల్ప/వ్యాధి లక్షణాలకు ముందు ఏకాంత గృహ చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాక మార్గదర్శకాలు జారీచేసింది. తమ సొంత నివాసాలలో అవసరమైన సదుపాయాలున్న రోగులు స్వీయ ఏకాంత చికిత్సకు అంగీకారం తెలపవచ్చునని ఇందులో పేర్కొంది. ఇక కోవిడ్‌-19కు వైద్యంలో రక్తజీవ ద్రవ్య (ప్లాస్మా) చికిత్సకు సంబంధించి ఈ పద్ధతిసహా ఆరోగ్యం బాగుచేయడానికి నిర్దిష్ట చికిత్సలేవీ లేవని ఐసీఎంఆర్‌ ఇప్పటికే స్పష్ం చేసింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా చేస్తున్న చికిత్సలలో ఇదీ ఒకటి మాత్రమేనని తెలిపింది. అయినప్పటికీ, దీన్ని ఒక చికిత్స విధానంగా ఆమోదించదగిన ఆధారమేదీ లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఐసీఎంఆర్‌ అధ్యయనం ముగిసి, స్పష్టమైన శాస్త్రీయ ఆధారం లభిస్తే తప్ప దీన్ని పరిశోధనార్థం లేదా ప్రయోగాత్మకంగా తప్ప నిర్దిష్ట చికిత్సగా పరిగణించరాదని స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619111

కోవిడ్‌-19పై భారత తక్షణ ప్రతిస్పందనకు మద్దతుగా ఏడీబీ నుంచి 1.5 బిలియన్‌ డాలర్ల రుణం; ఒప్పందంపై భారత్‌ సంతకం

కరోనా వైరస్‌ ప్రపంచ మహమ్మారి (కోవిడ్‌-19)పై పోరులో ప్రభుత్వ స్పందనకు మద్దతుగా 1.5 బిలియన్‌ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఆసియా ఆభివృద్ధి బ్యాంకు-ఏడీబీ అంగీకరించింది. ఈ మేరకు ఒప్పందంపై భారత్‌-ఏడీబీ సంతకాలు చేశాయి. ఈ మేరకు వ్యాధి నియంత్రణ, నిరోధంతోపాటు సమాజంలోని ఆర్థిక దుర్బలవర్గాలకు, పేదలకు.. ప్రత్యేకించి మహిళలు, అణగారినవర్గాలకు సామాజిక రక్షణవంటి ప్రాథమ్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ మహమ్మారి ప్రభావిత ప్రతికూల ఆరోగ్య, సామాజిక-ఆర్థిక పరిస్థితుల ఉపశమనం కోసం ప్రభుత్వానికి బడ్జెట్‌పరమైన మద్దతు కల్పించాలని ఏడీబీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619088

కేంద్ర ప్రభుత్వ సేకరణ కింద జోరందుకున్న గోధుమ కొనుగోళ్లు

దేశంలో గోధుమ పండించే ప్రధాన రాష్ట్రాల్లో కొనుగోలు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సేకరణ కింద 26.04.2020నాటికి 88.61 లక్షల టన్నుల పంట కొనుగోలు పూర్తయింది. ఇందులో అత్యధికంగా పంజాబ్‌ నుంచి 48.27 లక్షల టన్నులు, హర్యానా నుంచి 19.07 లక్షల టన్నుల వంతున సేకరించారు. కొనుగోళ్లు ఇదే వేగంతో సాగితే ఈ సీజన్‌లో 400 లక్షల టన్నుల గోధుమ సేకరణ లక్ష్యం త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618801

దిగ్బంధం ఉన్నప్పటికీ వేగం పుంజుకున్న గోధుమ పంట కోత, నూర్పిళ్లు

దేశంలో దిగ్బంధం కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ గోధుమ పంట కోత, నూర్పిళ్లు చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుత 2020 ఖ‌రీఫ్‌కు సంబంధించి పంట కోత‌ నూర్పిళ్లపై ప్రభుత్వం జారీచేసిన ప్రామాణిక కార్యాచరణ ప్రక్రియలను రైతులు, కార్మికులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంతోపాటు రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్య రక్షణదిశగా అనుసరించాల్సిన ప్రామాణిక కార్యాచరణ ప్రక్రియలపై కేంద్ర వ్యవసాయ-సహకార-రైతు సంక్షేమశాఖ అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618918

దిగ్బంధం సమయంలోనూ రికార్డు స్థాయిలో ఎరువుల అమ్మకాలు

కోవిడ్‌-19 జాతీయ దిగ్బంధం కొనసాగుతున్నప్పటికీ దేశంలో ఎరువుల అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగాయి. ఈ మేరకు 2020 ఏప్రిల్‌ 1 నుంచి 22వ తేదీవరకూ రైతులు 10.63 లక్షల టన్నుల పీఓపీ ఎరువులు కొనుగోలు చేశారు. నిరుడు ఇదే వ్యవధిలో 8.02 లక్షల టన్నుల మేర అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం 32 శాతం పెరుగుదల నమోదైంది. కోవిడ్‌-19 ఫలితంగా దేశమంతటా రవాణాపై అనేక ఆంక్షలున్నప్పటికీ ఎరువులు, రైల్వే మంత్రిత్వశాఖల సంయుక్త కృషితోపాటు రాష్ట్రాలు, రేవుల సహకారంసహా దేశవ్యాప్తంగా ఉత్పత్తి యూనిట్లలో ఎరువుల తయారీ ఎక్కడా వెనుకబడలేదు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619020

ఓడరేవుల ఉద్యోగులు/కార్మికులకు కోవిడ్‌-19వల్ల ప్రాణనష్టం వాటిల్లితే రూ.50 లక్షల నష్టపరిహారం

దేశంలోని ప్రధాన ఓడరేవులలో పనిచేసే ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు కార్మికులకూ కోవిడ్‌-19 కారణంగా ప్రాణనష్టం వాటిల్లితే వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులు/చట్టబద్ధ వారసులకు రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర నౌకాశ్రయాల మంత్రిత్వశాఖ నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618935

దిగ్బంధం వేళ పీఎంజీకేవై ప్యాకేజీ కింద 7.4 లక్షల కోవిడ్‌-19 సంబంధితంసహా 13లక్షలదాకా అభ్యర్థనలను పరిష్కరించిన ఈపీఎఫ్‌వో

దిగ్బంధం సమయంలో ఉద్యోగుల భవిష్యనిధి పంపిణీ వేగంగా సాగేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ-ఈపీఎఫ్‌వో కృషిచేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్యాకేజీ కింద కోవిడ్‌-19కు సంబంధించిన 7.4 లక్షలుసహా మొత్తం 12.91 లక్షల అభ్యర్థనలను ఈపీఎఫ్‌వో పరిష్కరించింది. తదనుగుణంగా పీఎంజీకేవై ప్యాకేజీకి సంబంధించి రూ.2,367.65 కోట్లుసహా రూ.4,684.52 కోట్లు మంజూరుచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618992

కోవిడ్‌-19వల్ల అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఆగిన ట్రక్కులు/లారీల ప్రయాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు శ్రీ నితిన్‌ గడ్కరీ పిలుపు

దేశవ్యాప్తంగా నిత్యావసరాల సత్వర సరఫరా దృష్ట్యా కోవిడ్‌-19వల్ల అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఆగిన ట్రక్కులు/లారీలు తిరిగి కదిలేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర రోడ్డురవాణా-జాతీయరహదారులు-ఎంఎస్‌ఎంఈ శాఖల మంత్రి శ్రీ నితిన్గడ్కరీ పిలుపునిచ్చారు. ఈ మేరకు దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ఆయా రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల రవాణాశాఖ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లారీలు/ట్రక్కులను అనుమతించడంపై రాష్ట్రాలు స్థానిక/జిల్లా యంత్రాంగాలకు తగిన ఆదేశాలివ్వాలని శ్రీ గడ్కరీ సూచించారు. మరోవైపు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల రవాణాకు వెసులుబాటు కల్పించడంతోపాటు ఆరోగ్య విధివిధానాలను అనుసరించాలని కోరారు. అలాగే వలస కార్మికులకు ఆహారం, ఆశ్రయం కల్పించడంలో సామాజిక దూరం, పరిశుభ్రత నిబంధనలను తూచా తప్పకుండా పాటించేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619074

ఇండోనేషియా అధ్యక్షుడితో ప్రధానమంత్రి టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఇండోనేషియా అధ్యక్షుడు మాననీయ ‘జోకో విడోడో’తో ఫోన్‌ద్వారా సంభాషించారు. ప్రపంచంతోపాటు ఈ ప్రాంతంలో కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తికి సంబంధించి దేశాధినేతలిద్దరూ అభిప్రాయాలు పంచుకున్నారు. కాగా, భారత ప్రభుత్వం తమకు అవసరమైన మందులు సరఫరా చేయడంపై ఇండోనేషియా అధ్యక్షుడు ప్రశంసించారు. రెండు దేశాల మధ్య ఔషధ ఉత్పత్తులు, ఇతర వస్తు వాణిజ్యంలో భాగంగా సరఫరాల్లో అంతరాయం కలగకుండా చూస్తామని ప్రధానమంత్రి ఆయనకు హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618999

కోవిడ్‌-19 నేపథ్యంలో రక్షణశాఖ ప్రభుత్వరంగ సంస్థలు, ఓఎఫ్‌బీల చేయూతసహా దిగ్బంధం అనంతర కార్యాచరణపై రక్షణశాఖ మంత్రి సమీక్ష

కోవిడ్‌-19పై జాతి పోరాటానికి తోడ్పాటుగా ఎప్పటికప్పుడు కొత్త పరికరాలను రూపొందిస్తూ తమ ఆవిష్కరణాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించడంతోపాటు వివిధ రూపాల్లో స్థానిక యంత్రాంగాలకు తమవంతు చేయూతనందించిన రక్షణశాఖ ప్రభుత్వరంగ సంస్థలు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డులను రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. జాతీయ దిగ్బంధం అనంతరం ఇప్పటిదాకా నష్టపోయిన పనిదినాల భర్తీకి వీలుగా ఉత్పత్తిని పెంచేదిశగా కార్యకలాపాల పునరుద్ధరణకు అత్యవసర ప్రణాళికను రూపొందించాల్సిందిగా రక్షణమంత్రి సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618997

సార్వత్రిక సేవాకేంద్రాల(సీఎస్‌సీ)ద్వారా ఆధార్‌ నవీకరణకు యూఐడీఏఐ అనుమతి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఊరటనిస్తూ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ-యూఐడీఏఐ తాజా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు సమాచార సాంకేతిక-ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రత్యేక ప్రయోజన సంస్థలైన సార్వత్రిక సేవా కేంద్రా (సీఎస్‌సీ)లద్వారా ఆధార్‌ నవీకరణకు అనుమతించింది. ఈ మేరకు గ్రామాల్లో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లుగా పనిచేస్తున్న 20,000 సీఎస్‌సీలలో పౌరులకు సేవలు లభిస్తాయని కేంద్ర సమాచార సాంకేతిక-ఎలక్ట్రానిక్‌, చట్ట-న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618943

భారత ఓడరేవులలో సిబ్బంది మార్పిడి అంశంపై వివిధ సంఘాలతో చర్చించిన శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ

కేంద్ర నౌకాశ్రయ శాఖ సహాయమంత్రి (ఇన్‌చార్జి) శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా షిప్పింగ్‌ కంపెనీలు, రవాణా ఓడలు, సముద్ర వాణిజ్య సంఘాలు, నావికులు తదితరులతో వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా భారత రేవులలో సిబ్బంది మార్పిడి, అంతర్జాతీయ సముద్ర సరిహద్దులో చిక్కుబడిన భారత నావికుల స్థితిగతులు తదితరాలపై సమాచారం తెలుసుకుని తగు ఆదేశాలిచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618922

కోవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో వెబినార్‌ద్వారా పలు అంశాలపై చర్చించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ విద్యా పథకాలు, కార్యక్రమాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ వెబినార్‌ద్వారా మంత్రి సమగ్ర సమాచారమిచ్చారు. పిల్లల విద్యాభ్యాసంపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతున్నదని, ఈ మేరకు అనేక పథకాలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీటిద్వారా దేశంలోని 33 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618835

‘స్వామిత్వ’ పథకంపై మార్గదర్శకాలు జారీచేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీ రాజ్‌ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌

గ్రామీణ ప్రాంతాల్లో రాబడి వసూళ్లు, ప్రణాళికల క్రమబద్ధీకరణకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆస్తి హక్కుపై స్పష్టతకు భరోసానిస్తుంది. అలాగే డ్రోన్‌ సర్వే పరిజ్ఞానంద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలలో నాణ్యత మెరుగుకు దోహదపడుతుంది. కాగా, ‘ఈ-గ్రామ్‌స్వరాజ్‌’ యాప్‌ సంబంధిత ప్రామాణిక కార్యాచరణ ప్రక్రియను ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ విడుదల చేశారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618810

దేశవ్యాప్తంగా నిత్యావసరాలు, వైద్య సామగ్రి రవాణా చేసిన 403 లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు

 ‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’కింద దేశీయంగా విమాన సేవలందించే ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 403 విమానాలను నడిపాయి. వీటిలో 235 విమానాలను ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌ నడిపాయి. ఈ లైఫ్‌లైన్‌ విమానాలు 2020 ఏప్రిల్‌ 27దాకా గగనతలంలో 3,97,632 కిలోమీటర్లు ప్రయాణించి 748.68 టన్నుల సరఫరాలను రవాణా చేశాయి. కోవిడ్‌-19పై భారత్‌ పోరాటంలో భాగంగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్యసామగ్రి రవాణా కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లైప్‌లైన్‌ ఉడాన్‌ విమానాలను నిర్వహిస్తోంది. మరోవైపు స్పైస్‌జెట్‌, బ్లూడార్ట్‌, ఇండిగో, విస్తారా వంటి ప్రైవేటు సంస్థలు వాణిజ్య ప్రాతిపదికన రవాణా విమానాలు నడుపుతున్నాయి.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618998

‘ది క్లాస్‌ సెంట్రల్‌’ ఎంపిక చేసిన 30 అత్యుత్తమ ఆన్‌లైన్‌ కోర్సుల జాబితాలో ‘స్వయం’కు చెందిన 6 కోర్సులకు స్థానం

‘ది క్లాస్‌ సెంట్రల్‌’ (స్టాన్‌ఫోర్డ్‌, ఎంఐటీ, హార్వర్డ్‌ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలనుంచి ఓ సామూహిక ఉచిత ఆన్‌లైన్‌ కోర్సు-ఎంవోవోసీ సంస్థ) 2019కిగాను ప్రపంచంలో అత్యుత్యమైన 30 ఆన్‌లైన్‌ కోర్సులను ఎంపిక చేసింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన ఆన్‌లైన్‌ వేదిక ‘స్వయం’ పరిధిలోని ఆరు కోర్సులకు స్థానం లభించడం విశేషం.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618778

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భత్యాలలో కోత ప్రసక్తి లేదు; అవాస్తవ వార్త నిగ్గు తేల్చిన ‘పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌’

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618886

కోవిడ్‌-19 నేపథ్యంలో అంతరాయానికి తావులేకుండా ఐఏఎస్‌ అధికారుల కోసం శిక్షణ కార్యక్రమాలు కొనసాగిస్తున్న LBSNAAకి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ ప్రశంసలు

వినూత్న సాంకేతిక పరిజ్ఞాన వినియోగంద్వారా శిక్షణ కార్యక్రమాలకు అకాడమీ కొత్తరూపునిచ్చింది. ఈ మేరకు తన సొంత ‘జ్ఞాన్‌’ పోర్టల్‌ద్వారా అభ్యాస నిర్వహణ వ్యవస్థతోపాటు శిక్షణలో ఉన్న అధికారుల సమాచారం, అభ్యాస కార్యాచరణను మళ్లించింది. ఈ కృషికి తోడ్పాటుగా ఇంటర్నెట్‌ రేడియో సదుపాయాన్ని కూడా అకాడమీ ప్రవేశపెట్టింది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618886

కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణకు కీలక ప్రాంతాల్లో డ్రోన్లద్వారా పరిశుభ్రత చర్యలు చేపట్టిన వారణాసి స్మార్ట్‌ సిటీ

వారణాసి స్మార్ట్ సిటీ యంత్రాంగం స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కార్యక్రమం కింద నగరంలోని కీలక ప్రాంతాల్లో పరిశుభ్రత ద్రవం చల్లేందుకు  చెన్నైకి చెందిన ‘గరుడ ఎయిరోస్పేస్‌’ ప్రైవేట్‌ లిమిటెడ్‌వారి డ్రోన్‌ సేవలను వినియోగించుకుంటోంది.

మరిన్ని వివరాలకు..., https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1618889

కోవిడ్‌-19 నమూనాల సేకరణ కోసం మొబైల్‌ కియోస్క్‌ వినియోగిస్తున్న అగర్తల స్మార్ట్‌సిటీ

కోవిడ్‌-19 నిర్ధారణ దిశగా అగర్తల స్మార్ట్‌ సిటీ యంత్రాంగం ఒక సంచార నమూనా సేకరణ ఉపకరణాన్ని రూపొందించి నగర ముఖ్య వైద్యాధికారికి అందజేసింది. ఇందులోనుంచి నమూనాల సేకరణలో వైద్యులకు రక్షణ లభించడంతోపాటు వ్యక్తిగత రక్షణ సామగ్రి వృథా తప్పుతుంది. ఈ మేరకు కోవిడ్‌-19పై పోరులో అగర్తల స్మార్ట్‌ సిటీ ముందంజవేసింది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619022

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • చండీగ‌ఢ్‌: న‌గ‌రంలో కర్ఫ్యూ అనంతరం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధ్య‌య‌నం, సిఫార‌సుల కోసం ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీ ఎ.కె.సిన్హా అధ్యక్షతన న‌గ‌ర పాల‌నాధికారి ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ మేర‌కు ప్రజా రవాణా, పాఠశాలలు/కళాశాలల పునఃప్రారంభం, ఆతిథ్య పరిశ్రమ, పరిశ్రమలు/కర్మాగారాలు/దుకాణాల‌ను తిరిగి తెర‌వ‌డం, అంతర్రాష్ట్ర ర‌వాణా, కార్యాలయాల్లో కార్య‌క‌లాపాలు త‌దిత‌రాల‌పై క‌మిటీ త‌న సిఫార‌సుల‌తో నివేదిక‌ను అంద‌జేసే అవ‌కాశం ఉంది.
 • పంజాబ్: రాష్ట్రంలో మండీల వద్ద కొనుగోళ్ల కార్యకలాపాల ప‌రిశీల‌న‌, స‌మీక్షించి, ఏప్రిల్ 30లోగా స‌మ‌గ్ర నివేదిక ఇచ్చేవిధంగా ఆరుగురు ఐఏఎస్ అధికారుల బృందాన్ని ముఖ్య‌మంత్రి నియ‌మించారు. అలాగే కర్ఫ్యూ పాసుల జారీ వ్య‌వ‌స్థ‌, నిర్దేశిత మండీల‌కు గ్రామాల‌వారీగా గోధుమ పంట రాక‌, గోధుమ‌ల నాణ్య‌త ప‌రిశీల‌న‌స‌హా కోవిడ్‌-19 విధివిధానాల పాటింపు త‌దిత‌రాల‌ను కూడా ఈ బృందం త‌నిఖీ చేస్తుంది.  కాగా, నాందేడ్‌లో చిక్కుకున్న యాత్రికులు, రాజస్థాన్ నుంచి కార్మికులు, విద్యార్థులు పంజాబ్‌లోని తమ ఇళ్లకు చేరుకోవడం కొనసాగుతోంది. ఈ నేప‌థ్యంలో దిగ్బంధం కార‌ణంగా జాతీయ రాజ‌ధానిలోని మజ్నూకా తిలా గురుద్వారాలో చిక్కుకున్న 250 మంది సిక్కు యాత్రికులను సురక్షితంగా పంపే ఏర్పాటు చేయాల‌ని పంజాబ్ ప్ర‌భుత్వం ఢిల్లీ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసింది.
 • హర్యానా: ఎన్‌డిఎ, ఇంజనీరింగ్-మెడికల్ క‌ళాశాల‌ల్లో ప్రవేశ ప‌రీక్ష‌ల‌తోపాటు సంయుక్త ర‌క్ష‌ణ స‌ర్వీసుల, జేఈఈ, నీట్‌వంటి పోటీ పరీక్షల తేదీలపై అనిశ్చితిని తొలగించడానికి కేంద్ర ప్ర‌భుత్వం స‌త్వ‌ర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.  కాగా, కోవిడ్‌-19 దిగ్బంధం నేప‌థ్యంలో వ్యక్తిగత సమాచారాన్ని ఎవ‌రితోనూ పంచుకోవద్దని లేదా వాట్సాప్ లేదా ఈమెయిల్‌లో అనుమానాస్పద లింకుల‌ను క్లిక్ చేయ‌వ‌ద్ద‌ని హర్యానా పోలీసులు పౌరులకు సూచించారు. మోస‌గాళ్ల వ‌ల‌లో ప‌డితే వారి బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్ము మాయ‌మైపోతుంద‌ని హెచ్చ‌రించారు.
 • కేరళ: కోవిడ్-19పై పోరాటానికి నిధుల కోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను త‌గ్గిస్తూ ప్ర‌భుత్వం జారీచేసిన ఆదేశాల‌పై కేర‌ళ హైకోర్టు నిలిపివేత ఉత్త‌ర్వులిచ్చింది. కాగా, రాష్ట్రంలోని ప్రధాన వ్యాపారాలు, కర్మాగారాలు క్ర‌మేణా పునఃప్రారంభ‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు ఫాక్ట్, కొచ్చి రిఫైనరీ, హెచ్‌ఎంటీ, కొచ్చిన్ షిప్‌యార్డ్, హెచ్‌ఎల్‌ఎల్ వంటి ప్ర‌భుత్వ‌రంగ ప్ర‌ధాన సంస్థ‌లు పరిమిత సిబ్బందితో కార్యకలాపాలను తిరిగి మొద‌లుపెట్టాయి. రాష్ట్రంలో నిన్నటిదాకా నిర్ధారిత కోవిడ్‌-19 కేసులు: 481, యాక్టివ్ కేసులు: 123, న‌య‌మైన‌వారు: 355 మంది.
 • తమిళనాడు: కేంద్ర ప్రభుత్వం అద‌నపు నిధుల‌ను, టెస్ట్‌కిట్ల‌ను పంపాల‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కోరారు. ఇక చెన్నైలో మరో ఇద్ద‌రు పోలీసుల‌కు కోవిడ్‌-19 నిర్ధార‌ణ అయింది. మానసికంగా అస్వ‌స్థుడైన కోవిడ్-19 రోగి చెన్నై రాజీవ్ గాంధీ ఆస్ప‌త్రి నుంచి తప్పించుకుని, ఇల్లు చేరాడు. అయితే, పోలీసుల‌ సహాయంతో అత‌ణ్ని తిరిగి తీసుకొచ్చారు. కాగా, నిన్నటి వరకు మొత్తం కేసులు: 1,937, యాక్టివ్ కేసులు: 809, మరణాలు: 24, డిశ్చార్జ్ అయిన‌వారు: 1,101. రాష్ట్రంలో మొత్తంమీద చెన్నై న‌గ‌రంలో గ‌రిష్ఠంగా 570 కేసులు నమోదయ్యాయి.
 • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 8 కొత్త కేసులు న‌మోద‌వ‌డంతో మొత్తం కేసులు 520కి చేరాయి. వీటిలో కల్బుర్గి 6, బెంగళూరు, గడగ్ ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. ఇప్పటిదాకా 20 మంది మ‌ర‌ణించ‌గా, 198 మంది కోలుకుని వెళ్లారు. మ‌రోవైపు రాష్ట్రంలోని కోవిడ్ ‌ర‌హిత జిల్లాల్లో దిగ్బంధం నిబంధ‌న‌ల‌ను ప్ర‌భుత్వం స‌డ‌లించింది.
 • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో గ‌డ‌చిన 24 గంటల్లో 82 కొత్త కేసులు నమోదవ‌గా మొత్తం కేసులు 1,259కి చేరాయి. యాక్టివ్ కేసులు: 970, కోలుకున్నవారు: 258 మంది, మరణాలు: 31. అయితే, గ‌త 3 రోజులుగా మరణాలు న‌మోదు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాగా, ‘జగన‌న్న విద్యా దీవెనపథకం కింద దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు 100% ఫీజు వాప‌సు కోసం ప్ర‌భుత్వం రూ.4000 కోట్లకుపైగా విడుదల చేయ‌నుంది. గుజరాత్‌లో చిక్కుకున్న 5 వేల మంది మత్స్యకారులను తీసుకురావడానికి అధికారులు చర్యలు చేప‌ట్టారు. ఖరీఫ్ సీజన్ నాటికి రైతులకు 56 లక్షల క్రెడిట్ కార్డులు, 56 లక్షల డెబిట్ కార్డులు జారీ చేయాలని ప్ర‌భుత్వం ఆదేశించింది. కోవిడ్ నిర్ధారిత కేసుల‌లో కర్నూలు (332), గుంటూరు (254), కృష్ణా (223) జిల్లాలు అగ్ర‌స్థానంలో ఉన్నాయి.
 • తెలంగాణ:  రాష్ట్రంలో 21 జిల్లాలను కోవిడ్‌ర‌హితంగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కాగా, దిగ్బంధం ముగిసే స‌మ‌యానికి వ‌ల‌స కార్మికుల కొర‌త ఫ‌లితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ప‌డ‌వ‌చ్చురాష్ట్రం 7 లక్షలకుపైగా వలస కూలీలపై ఆధారపడి ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణం. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,003; యాక్టివ్‌ కేసుల సంఖ్య‌: 646.
 • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఇంటింటి విక్ర‌యాల కోసం రైతులనుంచి నేరుగా కూర‌గాయ‌ల కొనుగోలు బాధ్య‌తను ప్ర‌భుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీకి అప్పగించింది.
 • అసోం: మ‌ర్క‌జ్‌కు వెళ్లివ‌చ్చిన వ్య‌క్తితో సంబంధంగ‌ల బొంగైగావ్ జిల్లాలోని సల్మారాకు చెందిన 16 ఏళ్ల బాలికకు కోవిడ్‌-19 నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆరోగ్యశాఖ‌ మంత్రి హిమంత బిశ్వ‌శర్మ ట్వీట్ చేశారు.
 • మణిపూర్: రాష్ట్రంలో కోవిడ్‌-19 నేప‌థ్యంలో మాద‌క‌ద్ర‌వ్యాల‌కు అల‌వాటు ప‌డుతున్న‌వారిని కాపాడేందుకు మరిన్ని ఆశ్రయ శిబిరాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తోంది.
 • మిజోరం: రాష్ట్ర, అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల వ‌ద్ద బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న స్వ‌చ్ఛంద కార్య‌క‌ర్త‌లు, గ్రామ కార్యాచ‌ర‌ణ బృందాల యువ‌త‌కు ఉప‌శ‌మ‌నం కోసం మ‌రింత‌మంది పోలీసుల‌ను నియ‌మించాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది.
 • నాగాలాండ్: రాష్ట్రంలో దిగ్బంధం ఆంక్షలను సడలించిన నేప‌థ్యంలో కొహిమా మార్కెట్లలో భారీ రద్దీ క‌నిపించింది. కాగా, దుకాణాలను ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటలదాకా తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది.
 • సిక్కిం: రాష్ట్రం వెలుప‌ల చిక్కుకుపోయిన సిక్కిం వాసుల వివ‌రాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు.
 • త్రిపుర: రాష్ట్ర రాజ‌ధాని అగర్తల నగరంలోని ముఖ్యమైన మార్కెట్లలో నేటినుంచి థర్మల్ స్కానర్లను ఉపయోగించడం ప్రారంభించారు.

 

PIB FACTCHECK

******(Release ID: 1619119) Visitor Counter : 54