రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

DPSUలు, OFB సీనియర్‌ అధికారులతో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్ష కొవిడ్‌-19ను నియంత్రించడంలో ఆ సంస్థలు చేపట్టిన కార్యక్రమాలపై అభినందన లాక్‌డౌన్‌ తర్వాత వారి కార్యాచరణ ప్రణాళికలు తెలుసుకున్న రక్షణ మంత్రి ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో ప్రముఖ పాత్ర పోషించాలని సూచన

Posted On: 28 APR 2020 3:17PM by PIB Hyderabad

 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు (DPSUలు), ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు (OFB) అధికారులతో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌పై పోరులో ఆ సంస్థలు చేసిన ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతమున్న లాక్‌డౌన్‌ ముగిశాక, వాటి కార్యాచరణ ప్రణాళికలపై ఆరా తీశారు. కొవిడ్‌-19పై పోరాడటానికి కొత్త ఉత్పత్తులు కనిపెట్టడం, తయారుచేయడంలో నైపుణ్యాత్మక చొరవ చూపిన DPSUలను రక్షణ మంత్రి అభినందించారు. స్థానిక యంత్రాంగాలకు వివిధ రూపాల్లో అందించిన సాయంపైనా ప్రశంసలు కురిపించారు.

ప్రధాని ఆలోచనల ప్రకారం పునరుద్ధరణ ప్రణాళిక

    లాక్‌డౌన్‌ కారణంగా కోల్పోయిన పని సమయాన్ని, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత సాధ్యమైనంతవరకు భర్తీ చేసి, ఉత్పత్తిని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రక్షణ మంత్రి సూచించారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత, దేశ ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించాలన్న ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రణాళికల గురించి వివరించారు. ప్రైవేటు రంగంలో ఉన్న రక్షణ పరిశ్రమలతో కలిసి ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించేలా DPSUలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు.


పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఒక రోజు వేతనంగా రూ.77 కోట్ల
    
    కొవిడ్‌పై పోరాటానికి సామాజిక బాధ్యత కింద, పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఒక రోజు వేతనంగా రూ.77 కోట్ల విరాళం ప్రకటించిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ (DDP), రక్షణ మంత్రిత్వ శాఖ  (MoD), రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు (DPSUలు), ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు (OFB) లను రక్షణ మంత్రి అభినందించారు. 2020 ఏప్రిల్‌ నెలకుగాను DPSUల నుంచి పీఎం కేర్స్‌ ఫండ్‌కు మరింత సహకారం ఉంటుందని భావిస్తున్నారు.

కొవిడ్‌పై పోరుకు తమవంతు సాయం

    తమకు చెందిన 41 తయారీ యూనిట్లలోని ఏ ఉద్యోగికీ కొవిడ్‌-19 సోకలేదని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు రక్షణ మంత్రికి తెలిపింది. 100కు పైగా వెంటిలేటర్లకు మరమ్మతులు చేశామని, 12,800 కవరాల్స్‌ తయారీ, PPEల పరీక్షల కోసం ప్రత్యేక యంత్రాలు తయారు చేయడం, స్థానిక యంత్రాంగాలకు 6.35 లక్షల మాస్కులు పంపిణీ, కొవిడ్‌-19 రోగుల కోసం అరుణాచల్‌ప్రదేశ్‌కు 340 ప్రత్యేక టెంట్లు పంపిణీ, లక్ష లీటర్ల హ్యాండ్‌ శానిటైజర్‌ పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ వెల్లడించింది. OFBకి చెందిన 10 ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 280 ఐసోలేషన్‌ బెడ్లు కేటాయించింది. 

    మే, 2020లో 12 వేల వెంటిలేటర్ల తయారీకి, జూన్‌లో 18 వేల వెంటిలేటర్ల తయారీకి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL) ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దాదాపు 3 వేలమంది ఇంజినీర్లకు ఆరోగ్య నిపుణులతో శిక్షణ ఇప్పించనుంది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (HAL), 300 ఏరోసోల్ క్యాబినెట్స్ తయారుచేసి, వివిధ ఆస్పత్రులకు పంపిణీ చేసింది. 56 వేల మాస్కుల వితరణతో పాటు, వలస కూలీలకు సాయం అందించింది.  బెంగళూరులోని ఆస్పత్రిలో కొవిడ్‌-19 రోగుల కోసం 93 ఐసోలేషన్‌ బెడ్లను కేటాయించింది. HAL ఉద్యోగుల్లో ఎవరికీ కొవిడ్‌-19 సోకలేదు. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL) కూడా ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేస్తోంది. వెంటిలేటర్ల రూపకల్పన డిజైన్‌ ప్రస్తుతం తుది దశలో ఉంది. నమూనాను కూడా తయారు చేస్తున్నారు. ముంబయిలోని నావికాదళ క్వారంటైన్‌ కేంద్రానికి 4 వేల లీటర్ల శానిటైజర్‌తోపాటు, రూ.5 లక్షల విలువైన PPEలు, ఔషధాలను మజగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ అందించింది.

    రెడ్‌జోన్లు కాని ప్రాంతాల్లో ఉన్న OFB, DPSUల యూనిట్లు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత, ఉత్పత్తిని పెంచేలా మూడు షిఫ్టుల్లో పనిచేయాలని, పని దినాలను వారానికి ఐదు నుంచి ఆరు రోజులకు పెంచాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాయి. సామాజిక దూరం సహా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకున్నాకే ఈ ప్రణాళిక అమల్లోకి తెస్తారు.

    డిపార్టుమెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ సెక్రటరీ శ్రీ రాజ్‌కుమార్‌ సహా ఇతర సీనియర్‌ అధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖ, OFB, BEL, HAL, MDL, భారత్‌ ఎర్త్‌ మూవర్స్ లిమిటెడ్‌ (BEML), గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ (GRSE), BDL, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (HSL), మిధాని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (MIDHANI) మరియు గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.



(Release ID: 1618997) Visitor Counter : 147