రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి అవసరమైన సరుకులను రవాణా చేసే ట్రక్కులు / లారీల అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రయాణించడానికి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని శ్రీ గడ్కరీ పిలుపునిచ్చారు.

భూసేకరణ ద్వారా రహదారుల నిర్మాణం కోసం కేటాయించిన 25 వేల కోట్ల రూపాయలను వినియోగించి, రహదారుల నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతం చేయాలని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు విజ్ఞప్తి చేశాయి.


రవాణా సదుపాయాలు వెన్నుముకగా నిలిచే ఆర్థికాభివృద్ధి ని వేగవంతం చేయడానికి చురుకైన నిర్ణయాలు తీసుకోవడంలో దృష్టి పెడుతున్నట్లు శ్రీ గడ్కరీ పేర్కొన్నారు.


ప్రస్తుతం ఉన్న స్థాయికంటే 2-3 రెట్లు ఎక్కువగా జాతీయ రహదారుల నిర్మాణాలను మెరుగుపరచాలని యోచిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు.


యాప్ ఆధారిత ద్విచక్ర వాహనాల టాక్సీ సర్వీసులను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత్రాల్లో ప్రారంభించాలని శ్రీ గడ్కరీ సూచించారు.

Posted On: 28 APR 2020 4:05PM by PIB Hyderabad

దేశంలోని వివిధ ప్రాంతాలకు అత్యవసర వస్తువుల రవాణా సజావుగా సాగడానికి వీలుగా, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల సరిహద్దుల వద్ద ట్రక్కులులారీలు దిగ్భంధనం కాకుండా అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎమ్.ఎస్.ఎం.ఈ.ఎస్. శాఖల మంత్రి శ్రీ నితిన్  గడ్కరీ పిలుపునిచ్చారు.  కోవిడ్-19 మహమ్మారిని అంతమొందించే చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి వీలుగా ట్రక్కులు / లారీ కదలికలకు ఆటంకం కలగకుండా వెంటనే దృష్టి సారించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు  రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల రోడ్డు రవాణా శాఖ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శ్రీ గడ్కరీ మాట్లాడుతూ, స్థానిక / జిల్లా పాలనా యంత్రాంగం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.  ఇదే సమయంలో సామాజిక అదూరం పాటించడం, మాస్కులు ధరించడం, సానిటైజర్లను ఉపయోగించడం వంటి ఇతర మార్గదర్శకాలతో పాటు ఆరోగ్య సూత్రాలను డ్రైవర్లుక్లీనర్లు, ముఖ్యంగా దాబాల వద్ద పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించేవిధంగా చూడాలని  ఆయన చెప్పారు

 

 

కనీసం ఒక మీటరు దూరం పాటించడం, మాస్కులు ధరించడం, సానిటైజర్స్ ఉపయోగించడం వంటి ఆరోగ్య నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ,  కార్మికులను ఫ్యాక్టరీలకు తీసుకువెళ్లడం మొదలైన సౌకర్యాలు కల్పించాలని శ్రీ గడ్కరీ చెప్పారు.  అదేవిధంగా, కార్మికులకు ఆహారం, వసతి కలిపించే సమయంలోకూడా సామాజిక దూరం, పరిశుభ్రత వంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలని పేర్కొన్నారు

 

 

రవాణా కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి త్వరలో తమ మంత్రిత్వశాఖ ఒక హెల్ప్ లైన్ ప్రారంభించనున్నట్లు శ్రీ గడ్కరీ ఒక సూచనకు సమాధానంగా చెప్పారు. 

 

 

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయమంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, రవాణా & పి.డబ్ల్యూ.డి. మంత్రులతో పాటు మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ముఖ్యమంత్రులు,  ఉప ముఖ్యమంత్రులు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి, అధికారులు, ఎన్.హెచ్.ఏ.ఐ., ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్. చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

 

 

 

రోడ్లు, రహదారుల మౌలిక సదుపాయాల అభివృధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వచ్చే రెండు మూడేళ్లలో ప్రస్తుతం ఉన్న స్థాయికంటే 2-3 రెట్లు ఎక్కువగా జాతీయ రహదారుల నిర్మాణాలను మెరుగుపరచాలని యోచిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు.  అభివృద్ధి కార్యక్రమాల వేగానికి అడ్డుగా నిలిచిన భూసేకరణ ను వేగవంతం చేయాలనీ, ఇందు కోసం కేటాయించిన నిధుల్లో తమ వద్ద మిగిలిన 25 వేల కోట్ల రూపాయలను వినియోగించాలనీ, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆయన విజ్ఞప్తి చేశారు   

 

 

భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఆర్ధికవ్యవస్థగా, ఆర్ధిక పరమైన ఒక సూపర్ పవర్ దేశంగా రూపొందించడానికి కీలకమైన  వేగవంతమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని శ్రీ గడ్కరీ పిలుపునిచ్చారు. రవాణా సౌకర్యాలు / మౌలిక సదుపాయాలూ  మన ఆర్ధికాభివృద్ధికి వెన్నుముకగా సేవలందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టులు కాలయాపనకు గురి కాకుండా, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆయన మంత్రులకు సూచించారు. 

 

 

రైతుల రవాణా అవసరాలకు సులువుగా ఉపయోగపడే యాప్ ఆధారిత ద్విచక్ర వాహనాల టాక్సీ సర్వీసులను ముఖ్యంగా గ్రామీణ ప్రాంత్రాల్లో ప్రారంభించే అవకాశాలను అన్వేషించాలని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులకు శ్రీ గడ్కరీ సూచించారు.  దీవివల్ల కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రజా రవాణాను ఎల్.ఎన్.జి./సి.ఎన్.జి., ఈ- వాహనాలకు మార్చడానికి ప్రయత్నించాలని కోరారు.  ఇవి వాతావరణానికి హాని చేయని ఇంధనాలు కాబట్టి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇంధన వ్యయం కూడా గణనీయంగా ఆదా అయ్యే అవకాశం ఉంది 

 

 

ఈ సందర్భంగా  జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్ మాట్లాడుతూ, ప్రాజక్టుల సత్వర అమలుకు రాష్ట్రాలు, కేంద్రం మధ్య గట్టి సమన్వయము ఉండాలని పిలుపునిచ్చారు.  ఉదాహరణకు, ఒక సెంట్రల్ ఏజెన్సీ నుండి మరొక ఏజెన్సీకి పనులు మారిన పక్షంలో తిరిగి వేరే రిజిస్ట్రేషన్ / చార్జీల కోసం పట్టు పట్ట కూడదని ఆయన పేర్కొన్నారుఅటువంటి పద్దతులను రద్దు చేయాలని ఆయన అన్నారు.  

 

 

వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు శ్రీ గడ్కరీ వ్యక్తం చేసిన మనోభావాలను అంగీకరిస్తూ, తమ తమ  రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లోని రహదారుల ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని కోరారు.  ఈ విషయంలో పూర్తి సహాకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ తమ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో పెండింగులో ఉన్న ప్రోజెక్టుల గురించి ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతి గురించి ఆ శాఖ మంత్రి శ్రీ గడ్కరీ, సహాయమంత్రి జనరల్ (రిటైర్డ్) శ్రీ వి.కె.సింగ్ లను వారు ప్రత్యేకంగా అభినందించారు. 

 

 

లాక్ డౌన్ సమయంలో చేపట్టిన వివిధ పనులను వివరిస్తూ ఒక ప్రదర్శన ఏర్పాటుచేశారు.  5,89,648 కోట్ల రూపాయలతో 49,238 కిలోమీటర్ల మేర చేపట్టిన 1,315 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో 3,06,250 కోట్ల రూపాయలతో, 30,301 కిలోమీటర్ల మేర చేపట్టవలసిన 819 ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. భూ సేకరణ, వాతావరణ అనుమతి వంటి రాష్ట్రాల పరిధిలోని కొన్ని సమస్యల కారణంగా ప్రోజెక్టుల అమలు ఆలస్యమౌతోందని కూడా పేర్కొన్నారు. రహదారుల రంగంలో ఎదురౌతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రాలను కోరడం జరిగింది. 

*****



(Release ID: 1619074) Visitor Counter : 183