PIB Headquarters
కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం
Posted On:
23 APR 2020 7:04PM by PIB Hyderabad
(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు
పీఐబీ వాస్తవాలను తనిఖీచేసిన అంశాలు ఇందులో లభ్యమవుతాయి)
- దేశంలో కోవిడ్-19 కేసుల ప్రస్తుత సంఖ్య 21,393; నిన్నటినుంచి నమోదైన కొత్త కేసులు 1,409, కోలుకున్నవారు 4,257 మంది.
- 78 జిల్లాల్లో గడచిన 14 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
- కోవిడ్-19 రోగులకు చికిత్సనందించే ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై హింస, ఆస్తులపై దాడులనుంచి రక్షణకు ఆర్డినెన్స్ జారీ
- పీఎంజీకే ప్యాకేజీకింద 33 కోట్ల మందికిపైగా పేదలకు రూ.31,235కోట్ల మేర ఆర్థిక సహాయం
- రేపు ఉదయం గ్రామ పంచాయతీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
- కోవిడ్-19 నమూనాల పరీక్ష కోసం సంచార ప్రయోగశాలను ప్రారంభించిన రక్షణశాఖ మంత్రి
కోవిడ్-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం
దేశంలో కోవిడ్-19 బారినపడి కోలుకున్నవారి సంఖ్య 19.89 శాతం.. అంటే 4,257కి చేరింది. కాగా, నిన్నటినుంచి 1,409 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దేశంలో కోవిడ్ నిర్ధారిత కేసుల సంఖ్య 21,398కి పెరిగింది. మరోవైపు 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 78 జిల్లాల్లో గడచిన 14 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617600
కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో అంటువ్యాధుల చట్టం-1897కు సవరణ ప్రతిపాదిస్తూ ఆర్డినెన్సు జారీ
ప్రస్తుత కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ సేవల సిబ్బందితోపాటు వారు నివసించే/పనిచేసే ప్రదేశాలకు రక్షణ కల్పించే దిశగా అంటువ్యాధుల చట్టం-1897కు సవరణ ప్రతిపాదిస్తూ ఆర్డినెన్సు జారీ చేయాలని 2020 ఏప్రిల్ 22నాటి కేంద్ర మంత్రిమండలి సమావేశం తీర్మానించింది. ఈ తీర్మానానికి రాష్ట్రపతి సమ్మతి తెలిపారు. ఇలాంటి దౌర్జన్యకాండకు పాల్పడే సంఘటనలను శిక్షార్హమైనవి, బెయిలుకు అవకాశం లేని నేరాలుగా ప్రకటించడంతోపాటు అంటువ్యాధుల నివారణలో ప్రత్యక్షంగా పనిచేసే ఆరోగ్య రక్షణ సిబ్బంది గాయపడినా, వారి ఆస్తులకు నష్టం కలిగినా నష్టపరిహారం మంజూరుకు ఈ ఆర్డినెన్సు వీలు కల్పిస్తుంది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ: ఇప్పటిదాకా సాధించిన ప్రగతి
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీ కింద 33 కోట్లమందికిపైగా పేదలకు రూ.31,235 కోట్ల ఆర్థిక సహాయం అందింది; జన్‌ధన్ యోజన ఖాతాలున్న 20.05 కోట్ల మంది మహిళలకు రూ.10,025 కోట్లు పంపిణీ; అలాగే 2.82 కోట్లమంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రూ.1,405 కోట్లు పంపిణీ; పీఎం-కిసాన్ తొలి వాయిదా కింద 8 కోట్లమంది రైతుల ఖాతాలకు రూ.16,146 కోట్లు బదిలీ; ఈపీఎఫ్ చందా కింద 68,755 సంస్థలకు రూ.162 కోట్లు బదిలీతో 10.6 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి; దీంతోపాటు 2.17 కోట్లమంది భవన-నిర్మాణ కార్మికులకు రూ.3,497 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ; ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 39.27 కోట్లమంది లబ్ధిదారులకు ఉచితంగా ఆహారధాన్యాలు; వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 1,09,227 టన్నుల పప్పుదినుసులు సరఫరా; ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 2.66 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలోని పంచాయతీలను ఉద్దేశించి 24న ప్రధానమంత్రి ప్రసంగం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుక్రవారం దేశంలోని పంచాయతీలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఏటా ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీ కాగా, ఈ ఏడాది దేశవ్యాప్త దిగ్బంధం నేపథ్యంలో సామాజిక దూరం నిబందన అమలులో ఉంది. అందువల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిని ఉద్దేశించి దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617316
భారత, ఐర్లాండ్ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్ సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న ఐర్లాండ్ ప్రధాని గౌరవనీయులైన డాక్టర్ లియో వరద్కర్‌తో టెలిఫోన్ ద్వారా సంభాషించారు. రెండు దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి సంబంధిత స్థితిగతుల గురించి దేశాధినేతలిద్దరూ చర్చించారు. ప్రజారోగ్యంపై ఈ మహమ్మారి ప్రభావం ఆర్థిక పరిస్థితిపై పడకుండా తమతమ దేశాల్లో తీసుకుంటున్న చర్యలపైనా వారు చర్చించారు. ఐర్లాండ్‌లో వైరస్ వ్యాప్తి నిరోధానికి భారత సంతతి వైద్యులు, నర్సులు అందిస్తున్న సహకారాన్ని ప్రధాని వరద్కర్ ప్రశంసించారు.
రబీ సీజన్-2020లో కనీస మద్దతుధరకు 20రాష్ట్రాల్లో పప్పు దినుసులు, నూనె గింజల కొనుగోళ్లు
ఈ మేరకు నాఫెడ్, ఎఫ్‌సీఐల ద్వారా రూ.1,313 కోట్ల విలువైన 1,67,570.95 టన్నుల పప్పుదినుసులు, 1,11,638.52 టన్నుల నూనెగింజలను కొనుగోలు చేశారు. దీనివల్ల 1,74,284 మంది రైతులకు లబ్ధి చేకూరింది. కాగా, ఈశాన్య భారతంలో రాష్ట్రాల మధ్య రవాణాసహా నిత్యావసరాలు, పండ్లు-కూరగాయల సరఫరా ధరలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617335
కోవిడ్-19 నమూనాల పరీక్షకోసం రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (DRDO) రూపొందించిన సంచార ప్రయోగశాలను ప్రారంభించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్
కోవిడ్-19 నిర్ధారణతోపాటు మందుల పరిశీలన, వైరస్‌ల సంవృద్ధి, కోలుకున్నవారి రక్త జీవద్రవ్యం ఆధారిత చికిత్స, వ్యాక్సిన్ అభివృద్ధి కోసం రోగుల సమగ్ర రోగనిరోధక చరిత్రపై అధ్యయనం, భారత జనాభా లక్షిత తరుణదశ ప్రయోగాలు వంటివాటిని ఈ సంచార ప్రయోగశాల సాయంతో నిర్వహించవచ్చు. అలాగే ఈ ప్రయోగశాలలో రోజుకు 1000-2000 నమూనాలను పరీక్షించవచ్చు. అవసరాన్నిబట్టి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఈ సంచార ప్రయోగశాలను వినియోగించుకోవచ్చు.
మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617590
ప్రాథమికోన్నత దశ విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ను ఆవిష్కరించిన హెచ్ఆర్‌డి మంత్రి
కోవిడ్-19 కారణంగా ఇళ్లలో ఉంటున్న ప్రాథమిక/ప్రాథమికోన్నత (6-8 తరగతి) విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో అర్థవంతమైన కార్యకలాపాల్లో నిమగ్నం చేయడం కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ను ఆవిష్కరించింది. దీనిపై మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ విద్యా-పరిశోధన మండలి సదరు కేలండర్‌ను రూపొందించింది.
దేశంలో ఔషధ ఉత్పత్తిని వేగిరపరచడంలో ఆయా సంస్థలకు సహకరించాల్సిందిగా రాష్ట్రాల ఔషధ నియంత్రణాధికారులకు కేంద్ర ఫార్మా కార్యదర్శి ఆదేశం
కోవిడ్-19 నిర్వహణ, చికిత్స కోసం అవసరమైన మందులు, వైద్య పరికరాల లభ్యతకు భరోసా దిశగా రాష్ట్రాల ఔషధ నియంత్రణాధికారులు శ్రద్ధ తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు తయారీ సంస్థల ఉత్పత్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటూ అన్ని స్థాయులలో అత్యవసర మందులు, పరికరాల నిల్వలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరింది.
2020 ఏప్రిల్ 22న 112 గూడ్సు రైళ్లద్వారా 3.13 లక్షల టన్నుల ఆహారధాన్యాల లోడింగ్‌ద్వారా రికార్డు సృష్టించిన భారత రైల్వేశాఖ
దేశవ్యాప్తంగా ఆహారధాన్యాలవంటి వ్యవసాయ ఉత్పత్తుల సకాల, సత్వర రవాణాలో భారత రైల్వేశాఖ తన కృషిని కొనసాగిస్తోంది. ఈ మేరకు 01.04.2020 నుంచి 22.04.2020 మధ్య మొత్తం 4.58 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను రవాణా చేసింది. నిరుడు ఇదే వ్యవధిలో 1.82 మిలిన్ టన్నులు రవాణా చేసిన నేపథ్యంలో కొత్త రికార్డు సృష్టించింది.
మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617507
కోవిడ్-19పై జాతి పోరాటానికి మద్దతుగా అలుపెరుగని శక్తితో కృషిచేస్తున్న లైఫ్‌లైన్ ఉడాన్ కరోనా యోధులు
లైఫ్‌లైన్ ఉడాన్ కింద ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, ఐఏఎఫ్, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 330 విమానాలను నడిపాయి. వీటిలో 200 విమానాలను ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, ప్రైవేటు సంస్థలు నడిపించాయి. ఈ మేరకు ఇప్పటిదాకా ఈ విమానాలు గగనతలంలో 3,27,623 కిలోమీటర్లు ప్రయాణించి 551.79 టన్నుల సరఫరాలను రవాణా చేశాయి.
మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617332
‘అందరి ప్రయాణగమ్యంగా భారత్ రూపకల్పన’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ‘దేఖో అప్నాదేశ్’ సిరీస్ కింద 6వ వెబినార్ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ
భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రదేశాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పర్యాటక శాఖ ఈ వెబినార్‌లను నిర్వహిస్తోంది. ఈ మేరకు పెద్దగా తెలియని ప్రాంతాలతోపాటు, బాగా తెలిసిన ప్రాంతాల్లో అంతగా తెలియని పార్శ్వాలను స్పర్శిస్తూ ఇతివృత్తసహిత వెబినార్లను నిర్వహిస్తోంది. తదనుగుణంగా ‘అందరి ప్రయాణగమ్యంగా భారత్ రూపకల్పన’ ప్రచార కార్యక్రమం కింద 2020 ఏప్రిల్ 22న ఈ సిరీస్‌లో 6వ వెబినార్‌ను నిర్వహించింది.
మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617397
‘దేఖో అప్నాదేశ్’ సిరీస్‌లో భాగంగా ‘ఫొటోవాకింగ్@వారణాసి: ఏ విజువల్ ట్రీట్ పేరిట 7వ వెబినార్ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ
మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1617477
ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంలేదు: డీవోటీ
ఇంటర్నెట్ వినియోగదారులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ 2020 మే 3వ తేదీదాకా ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని ప్రతికా సమాచార సంస్థ (పీఐబీ) ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. కాగా, ఇంటినుంచి పని చేసేందుకు వీలుగా డీవోటీ అందరికీ ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యం ఇస్తున్నదంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక లింక్‌సహా వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఇది పూర్తిగా అవాస్తవ ప్రచారమని పీఐబీ స్పష్టం చేసింది.
కోవిడ్-19పై పోరాటానికి మద్దతుగా రోగులకు పౌష్టికాహారం తయారుచేసి అందిస్తున్న ఐఐఎఫ్‌పీటీ
తమిళనాడులోని తంజావూరు వైద్య కళాశాలలో వైద్య పరిశీలనలోగల, ఇటీవలే వ్యాధినుంచి కోలుకున్న కోవిడ్-19 రోగులకోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సంపూర్ణ పోషకాలు నిండిన పౌష్టికాహారం తయారుచేసి అందిస్తోంది.
మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617593
తమిళనాడులోని పట్టుగూళ్ల రైతుల రక్షణ బాధ్యత స్వీకరించిన కేవీఐసీ
దేశం మొత్తం ప్రాణాంతక కరోనా వైరస్ భయంతో వణికిపోతున్న నేపథ్యంలో సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఖాదీ-గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) తమిళనాడులోని ఖాదీ సంస్థల సహకారంతో పట్టుగూళ్ల రైతుల నుంచి పట్టుగూళ్ల కొనుగోలుద్వారా తన బాధ్యతలు నెరవేర్చింది.
మరిన్ని వివరాలకు...: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617598
కోవిడ్-19పై పోరాటంలో భాగంగా పర్యవేక్షణతోపాటు అవగాహన కల్పన కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో వినూత్న చర్యలు చేపడుతున్న ఫరీదాబాద్ జిల్లా యంత్రాంగం
కోవిడ్ నిరోధక మందు తయారీలో భాగంగా వెల్లుల్లి సుగంధ తైలంతో శాస్త్రవేత్తల ప్రయోగాలు
ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్నీ చుట్టుముట్టిన ప్రాణాంతక కోవిడ్-19 మహమ్మారి నిరోధం, నియంత్రణ, నిర్మూలన కోసం కొన్ని ఉత్పత్తుల తయారీ దిశగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలోని మొహాలీలోగల సెంటర్ ఫర్ ఇన్నొవేటివ్ అండ్ అప్లయిడ్ బయోప్రాసెసింగ్ (DBT-CIAB) వివిధ పరిశోధన ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది.
కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆమోదిత రోగనిరోధక ఔషధం *సెప్సివ్యాక్*ను అభివృద్ధి/భిన్న వినియోగహితం చేయడంద్వారా శరీరంలోని సహజ నిరోధక శక్తిని పెంచడం, రోగులు త్వరగా కోలుకునేందుకు తోడ్పడే దిశగా ప్రయోగానికి సీఎస్ఐఆర్ నిర్ణయం
మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1617504
పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం
- కేరళ: అమెరికా, ఇంగ్లాండ్, గల్ఫ్ దేశాల్లో మరో ముగ్గురు కేరళవాసులు కోవిడ్-19తో మరణించారు. కాగా, ఇప్పటివరకు 40 మందికి పైగా కేరళవాసులు విదేశాల్లో మహమ్మారికి బలయ్యారు. కాగా, రాష్ట్రంలోని కొళ్లం జిల్లా కుళత్తుపుళ గ్రామంలో రోగితో పరిచయాలున్న మొత్తం 36 మందినీ నిర్బంధ వైద్య పరిశీలనకు తరలించిన నేపథ్యంలో వ్యాధి సామాజిక వ్యాప్తి అవకాశాలు లేనట్టే, ఇక రాష్ట్రంలో 11 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసులసంఖ్య 437కు చేరింది. వీటిలో నిర్ధారిత కేసుల సంఖ్య: 127గా ఉంది.
- తమిళనాడు: పుదుచ్చేరిలో గడచిన 10 రోజుల్లో కొత్త కోవిడ్-19 కేసులు నమోదు కాలేదు. కాగా, తొలి పాజిటివ్ కేసు ధర్మపురిలో నమోదైంది. ఇక చెన్నై నుంచి 30 విమానాలలో వందలాది విదేశీ పౌరులు స్వదేశాలకు తిరిగివెళ్లారు. చెన్నై నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన టెలి-కౌన్సెలింగ్ సేవా కేంద్రానికి రోజూ సుమారు 300 కాల్స్ వస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న 33 కొత్త కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 1629కి చేరింది. మరణాలు: 18, డిశ్చార్జ్ అయినవారు: 662 మంది.
- కర్ణాటక: కోవిడ్ -19 నేపథ్యంలో వైద్యుల జీతాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కోసం ఆర్డినెన్స్ తీసుకురానుంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దిగ్బంధం ఆంక్షలను సడలించింది. ఈ మేరకు వైద్యశాలలు, ఐటీ కంపెనీలు తగుసంఖ్యలో సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కాగా, రాష్ట్రంలో ఇవాళ 16 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 443కు చేరింది. కొత్త కేసులలో బెంగళూరు -9, మాండ్యా -2, విజయపుర -2 వంతున నమోదు కాగా, నయమైనవారి సంఖ్య-141గానూ, మరణాలు-17గానూ నమోదయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లనుంచే ప్రార్థనలు చేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ విజ్ఞప్తి చేశారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గడచిన గంటల్లో 80 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 893కు చేరింది. నిర్ధారిత రోగులు 725 మందికాగా, కోలుకున్నవారు: 141 మంది. మరణాలు: 27. కేసుల సంఖ్యరీత్యా కర్నూలు 234, గుంటూరు 195, కృష్ణా 88, చిత్తూరు 73, నెల్లూరు 67 , కడప 51, ప్రకాశం 50 జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయి.
- తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గింది. అయితే, హైదరాబాద్ పాత నగరంలో మాత్రం కేసుల సంఖ్య పెరుగుతుండటం కనిపిస్తోంది. రాష్ట్రంలోని 5 లక్షలకుపైగా తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.1,500 ఆర్థిక సహాయం ఇంకా అందలేదు; మరో 5.26 లక్షల కార్డుదారుల బ్యాంక్ ఖాతా నంబర్లవల్ల సమస్యలు తలెత్తాయి; తపాలా శాఖ సాయంతో ఈ సమస్య పరిష్కారానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 943కి చేరగా, నిర్ధారిత కేసులు 725గా ఉన్నాయి.
- అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రానికి తిరిగి వచ్చేవారికి అనుమతి ఇచ్చిన ప్రతి సందర్భంలోనూ దిగ్బంధ వైద్య పరిశీలన సౌకర్యాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- అసోం: రాష్ట్రంలోని 2019-2020 ప్రథమ సంవత్సర హయ్యర్ సెకండరీ విద్యార్థులను రెండో సంవత్సరా (2020-21)నికి ప్రమోట్ చేస్తామని రాష్ట్ర హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకటించింది.
- మణిపూర్: కోవిడ్-19 నేపథ్యంలో భారత-మయన్మార్ సరిహద్దుకు కంచె ఏర్పాటు పనులతోపాటు నిఘాను తీవ్రతరం చేశారు.
- మిజోరం: రాష్ట్రంలో కోవిడ్-19 నిర్వహణ కోసం పోలీసు అధికారుల సతీమణుల సంఘం రూ.5కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా సమర్పించింది. అలాగే ఐజ్వాల్‌లో విధుల్లో ఉన్న సిబ్బందికి 600 మాస్కులను అందజేసింది.
- నాగాలాండ్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆహార, ఇంధన, ఔషధ నిల్వలు తగినంత మేర ఉన్నాయని హోంశాఖ కమిషనర్ తెలిపారు. కాగా, కోహిమాలో బయోసేఫ్టీ ల్యాబ్-3 (బీఎస్‌ఎల్-3) ఏర్పాటైంది.
- సిక్కిం: రాష్ట్రంలోని ప్రతి పౌరుడితోపాటు రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- త్రిపుర: రాష్ట్రంలో వడగండ్ల వాన బాధితులకోసం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ సందర్శించారు. బాధితులందర్నీ వీలైనంత త్వరగా ఆదుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
- చండీగఢ్: వైద్య కళాశాలల్లో విద్యార్థి వైద్యులకు శిక్షణ భృతిని రోజుకు రూ.300 నుంచి 600 మేర పెంచాలని పాలనాధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ నెల 1 నుంచి ఈ నిర్ణయం అమలు కానున్న నేపథ్యంలో ప్రస్తుతం కోవిడ్-19పై పోరులో సేవలందిస్తున్న విద్యార్థులకు నెలకు రూ.18,000దాకా అందుతాయి. కాగా, పీఎంజీకేవై కింద మొత్తం 24,000 కుటుంబాలకు గోధుమలు, పప్పుదినుసుల పంపిణీ పూర్తయింది. దీంతోపాటు నగరంలో అనాథలు, నిరుపేదలకు 1,43,694 ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో ఇప్పటిదాకా 1.77 లక్షల మంది ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం గమనార్హం.
- పంజాబ్: రాష్ట్ర ప్రభుత్వం 50 ప్రత్యేక రైళ్ల ద్వారా 1.25 లక్షల టన్నుల బియ్యం, గోధుమలను ఇతర రాష్ట్రాలకు రవాణా చేసింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పంట కొనుగోళ్లలో భాగంగా ఏడో రోజున ప్రభుత్వ సంస్థలు, వ్యాపారులు 4,36,406 టన్నుల గోధుమను కొనుగోలు చేశారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు 1,797 టన్నుల మేర కొన్నారు. పంజాబ్ ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న కఠిన దిగ్బంధ చర్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రశంసించింది. అలాగే అనుమానితుల సత్వర గుర్తింపు, పరీక్ష, నియంత్రణ వ్యూహంతో కోవిడ్-19 మహమ్మారిని దూకుడుగా ఎదుర్కొంటున్నందుకు అభినందనలు తెలిపింది.
- హర్యానా: రాష్ట్ర ప్రభుత్వం దిగ్బంధం ఆంక్షలను మరింత సడలించడంతో వ్యవసాయ పరికరాల సంబంధిత వర్క్‌షాప్‌లు ప్రారంభం కానున్నాయి. పంటనూర్పిళ్లు సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు బ్యాంకు ఖాతాదారులకు సేవలు అందించడంతోపాటు సామాజిక దూరం పాటించేందుకు వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
- హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో పంట నూర్పిళ్ల సందర్భంగా రైతులు సామాజిక దూరం నిబంధన పాటించేలా అవగాహన కల్పించాలని డిప్యూటీ కమిషనర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రాధాన్యమిస్తూనే ప్రజా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు.
- మహారాష్ట్ర: రాష్ట్రంలో ఇవాళ 431 కొత్త పాజిటివ్ కేసులతో మొత్తం నిర్ధారిత కోవిడ్ -19 కేసుల సంఖ్య 5,652 కు చేరింది. ఇప్పటిదాకా వ్యాధి సోకినవారిలో 789 మంది కోలుకోగా 269 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో హాట్‌స్పాట్‌ల సంఖ్య 14 నుంచి 5కు తగ్గిందని, ఈ నెలలో కేసుల రెట్టింపు శాతం వ్యవధి 3.1 రోజుల నుంచి 7.01 రోజులకు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు.
- గుజరాత్: రాష్ట్రంలో 135 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 2,407కు చేరాయి. దేశంలో కోవిడ్ -19 రోగుల రికవరీ రేటుతో పోలిస్తే గుజరాత్‌లో అత్యల్పంగా 6.3 శాతం మాత్రమే ఉంది. మహారాష్ట్రతో పాటు గుజరాత్‌లో మరణాల శాతం కూడా అధికంగా ఉంది.
- రాజస్థాన్: రాజస్థాన్‌లో కోవిడ్-19 కేసులు 1,935కు పెరిగాయి. కొత్త కేసుల్లో జోధ్‌పూర్‌లో 20, జైపూర్‌లో 12, నాగౌర్‌లో 10 వంతున నమోదయ్యాయి.
***
(Release ID: 1617671)
Visitor Counter : 306
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam