రక్షణ మంత్రిత్వ శాఖ
డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన మొబైల్‌ను కోవిడ్-19 పరీక్షల ప్రయోగశాలను ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
23 APR 2020 4:14PM by PIB Hyderabad
డీఆర్‌డీఓ సంస్థ అభివృద్ధి చేసిన మొబైల్ వైరాలజీ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్ లాబొరేటరీని (ఎంవీఆర్‌డీఎల్) కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గురువారం ఆవిష్కరించారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఎంవీఆర్‌డీఎల్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ ఆసుప్రతి, ప్రైవేట్ పరిశ్రమల వారి సహకారంతో దీనిని డీఆర్‌డీఓ అభివృద్ధి పరిచింది.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం అనేక సమయానుకూల నిర్ణయాలు తీసుకుందన్నారు, అందువల్లే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని అన్నారు. బయో-సేఫ్టీ లెవల్ 2 మరియు లెవల్ 3 ల్యాబ్‌ను డీఆర్‌డీఓ కేవలం 15 రోజుల రికార్డు సమయంలో తయారు చేయడాన్ని ఈ సందర్భంగా శ్రీ రాజనాథ్ సింగ్ ప్రశంసించారు. సాధారణంగా ఇలాంటి ల్యాబ్‌ల తయారీకి ఆరు దాదాపు నెలల సమయం పడుతుంది. రోజుకు 1,000 కంటే ఎక్కువ నమూనాలను ప్రాసెస్ చేయగల ఎంవీఆర్‌డీఎల్ వల్ల కోవిడ్-19 వైరస్‌తో పోరాడటంలో మన దేశ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని అన్నారు.
తన వంతు సాయమందిస్తున్న సాయుధ దళాలు..
కోవిడ్-19 మహమ్మారితో పోరాడటానికి మన సాయుధ దళాలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కల్పించడం, ఇతర దేశాల్లోని భారతీయ పౌరులను తరలించడం వంటి కార్యక్రమాలతో సహకరిస్తున్నాయని అన్నారు. కోవిడ్-19తో పోరులో భాగంగా ఇలాంటి ప్రయత్నాలు ఇకపై కూడా కొనసాగుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, కార్మిక ఉపాధి శాఖ మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధిశాఖ మంత్రి శ్రీ కె. తారక రామారావు, తెలంగాణ కార్మిక శాఖ మంత్రి శ్రీ సి.హెచ్. మల్లారెడ్డి, డీఆర్‌డీఓ ఛైర్మన్ మరియు డీడీఆర్ అండ్ డీ కార్యదర్శి డాక్టర్ జి.సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో..
కోవిడ్ వైరస్ స్క్రీనింగ్ మరియు సంబంధిత ఆర్అండ్‌డీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ఉపయోగపడేలా డీఆర్‌డీఓకు చెందిన హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో (ఆర్‌సీఐ) దీనిని అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లోని ఈఎస్ఐసీ వారి సౌజన్యంతో దీనిని తయారు చేశారు.
బీఎస్ఎల్ 3 ల్యాబ్, బీఎస్ఎల్ 2 ల్యాబ్ కలయికగా నమూనాలను పరీక్షించేలా దీనిని డీఆర్‌డీఓ తయారు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐసీఎంఆర్ నిర్ధేశించిన బయో-సేఫ్టీ ప్రమాణాల ప్రకారం అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రయోగశాలను తీర్చిదిద్దారు. అంతర్ నిర్మిత విద్యుత్తు నియంత్రణ వ్యవస్థ, లాన్, టెలిఫోన్ కేబులింగ్, సీసీటీవీ పర్యవేక్షణ వంటి అమరికలతో దీనిని నిర్మించారు. కోవిడ్-19 నిర్ధారణతో పాటు ఔషధ పరీక్షలకు అవసరమైన వైరస్ కల్చర్, కన్వలేసెంట్ ప్లాస్మా డెరైవ్డ్ థెరపీ, టీకా అభివృద్ధికి గాను కోవిడ్-19 రోగుల సమగ్ర రోగనిరోధక ప్రొఫైలింగ్‌తో పాటు భారతీయ జనాభాకు ప్రత్యేకమైన ప్రారంభ క్లినికల్ ట్రయల్స్‌కు అనుగుణంగా ఉండేందుకు వీలుగా ఈ మొబైల్ ల్యాబ్ సహాయపడుతుంది.
దేశంలో ఎక్కడికైనా తీసుకుపోయే వేసులుబాటు..
ఈ ల్యాబ్ ద్వారా రోజుకు 1000-2000 నమూనాలను పరీక్షించేందుకు వీలుంటుంది. ఈ ల్యాబ్‌ను దేశంలో ఎక్కడైనా అవసరానికి అనుగుణంగా తీసుకుపోయి అక్కడ పరీక్షలు నిర్వహించేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ల్యాబ్ అభివృద్ధికి అవసరమై కంటైనర్‌ల సదుపాయాలను మెస్సర్స్ ఐకామ్, నిర్ణీత కాలంలో బీఎస్ఎల్ -2 మరియు బీఎస్ఎల్-3 ప్రమాణాలతో ల్యాబ్ ఏర్పాట్ల రూపకల్పనకు తోడ్పాటు అందించిన మెస్సర్స్ ఐక్లీన్ బేస్ ఫ్రేమ్‌లను అందించినందుకు మెసర్స్ హైటెక్ హైడ్రాలిక్స్ సంస్థల సహకారాన్ని డీఆర్‌డీవో ఈ సందర్భంగా ప్రస్తుతించింది.
***
(Release ID: 1617590)
Visitor Counter : 248
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada