సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

తమిళనాడులో పట్టు పురుగుల రైతులను ఆదుకుంటున్న కే.వి.ఐ.సి.

Posted On: 23 APR 2020 4:55PM by PIB Hyderabad

ప్రాణాంతకమైన కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా అష్టకష్టాలు పడుతున్న సమయంలో, ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వశాఖ కింద స్వయంప్రతిపత్తి సంస్థ, తమిళనాడులో ఖాదీ సంస్థ (కె.ఐ.) లతో కలిసి పనిచేస్తున్న ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్ (కె.వి.ఐ.సి.), పట్టు పురుగుల రైతుల నుండి పట్టుపురుగులను కొనుగోలు చేసి తన బాధ్యతను మరోసారి నెరవేర్చుకుంది. 

 

లాక్ డౌన్ సమయంలో తమ పంటలను విక్రయించుకోడానికి ఇబ్బందిపడుతున్న పట్టుపురుగుల రైతులకు సహాయపడడం తో పాటు, సిల్క్ ఉత్పత్తిలో నిమగ్నమైన ఖాదీ సంస్థలకు పట్టుపురుగులు సరఫరా నిర్విరామంగా కొనసాగేలా చూడడం అనేవి  కె.వి.ఐ.సి. ప్రధాన ఉద్దేశ్యాలు. 

సమస్యపై దృష్టి సారించిన కె.వి.ఐ.సి. చైర్మన్ శ్రీ వినయ్ సక్సేన మాట్లాడుతూ, -  "రైతులు దేశానికి వెన్నుముక అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు. వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ కొనుగోళ్లు బయటికి కనబడినంత సులువేమీ కాదు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం, సిల్క్ ఉత్పత్తి చేస్తున్న కె.ఐ. లు తమకు అవసరమైన పట్టు పురుగులను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్దీకరించిన పట్టుపరిశ్రమ మార్కెట్ల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. అందువల్ల, రైతుల నుండి నేరుగా కొనుగోలు చేయాలంటే జిల్లా పాలనా యంత్రాంగంతో పాటు పట్టు పరిశ్రమ విభాగం నుండి అనుమతి తీసుకోవాలి" అని చెప్పారు  ఈ విషయమై శ్రీ సక్సేనా మరిన్ని వివరాలు తెలియజేస్తూ, " పట్టుపురుగుల రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను జిల్లా పరిపాలనా యంత్రాంగం ముందూ, పట్టు పరిశ్రమ విభాగం ముందూ, చెన్నై లోని కె.వి.ఐ.సి. అధికారులు తెలియజేయడానికి చేసిన నిర్విరామ కృషి ఫలించడంతో, చివరికి జిల్లా యంత్రాంగం అనుమతి మంజూరు చేసింది. ఇప్పుడు మేము ఈ కొనుగోళ్లు చేపట్టని పక్షంలోరైతులకు కలిగే నష్టం భరించలేనిదిగా ఉండేది." అని అన్నారు. 

పెరిగిన పట్టు గూళ్ళను ఐదు రోజుల్లోగా ఉడికించాలి. అందువల్ల ఈ ఒప్పందానికి ఇంత అవసరం ఏర్పడింది.  ఆలస్యమైతే గూడు నుండి లార్వా బయటికి వస్తుంది. అప్పుడు మొత్తం పంట వ్యర్థమైపోతుంది. తెగిన పట్టు గూళ్ళు సిల్క్ దారం తీయడానికి ఉపయోగపడవు. ఈ నేపథ్యంలో, ఈ కొనుగోళ్లు పట్టుగూళ్ల రైతులకు ఒక వరంగా మారాయి. కె.వి.ఐ.సి. చెన్నై లోని కార్యాలయం, ఆరు ఖాదీ సంస్థల సమన్వయంతో 40 లక్షల రూపాయల విలువైన 9,500 కిలోల పట్టుగూళ్లను నేరుగా రైతులనుండి కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసింది.  మరో 8,000 కిలోల పట్టు గూళ్ళను రైతుల నుండి నేరుగా కొనుగోలు చేయడానికి మరో ఆరు ఖాదీ సంస్థలు త్వరలో అనుమతి పొందనున్నాయి.  

ఖాదీ సంస్థల అభివృద్ధి కోసం, ముఖ్యంగా రైతుల అభివృద్ధి కోసం కె.వి.ఐ.సి. ఎప్పుడూ ముందు ఉంటుంది.  గుజరాత్ లోని సురేంద్రనగర్ లో మొట్ట మొదటి సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ఒక చారిత్రాత్మక చర్య.  ఒక పక్క, సిల్క్ దారం ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించడానికి ప్రయత్నిస్తూ, మరో పక్క, పట్టు గూళ్ళ రైతులను అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలువిధానాలను అమలుచేస్తూ, కె.వి.ఐ.సి. రైతులు, ఉత్పత్తిదారులతో పాటు వినియోగదారులకు కూడా భారతదేశం ఒక ఉత్తమ ప్రదేశంగా తీర్చిదిద్దడానికి నిర్విరామంగా కృషి చేస్తోంది. 

*****



(Release ID: 1617598) Visitor Counter : 202