రైల్వే మంత్రిత్వ శాఖ

ఒక్కరోజులో 3.13 లక్షల టన్నుల ధాన్యాన్ని రవాణా చేసిన రైల్వే శాఖ

112 ర్యాకుల ధాన్యం రవాణాతో గత రికార్డులు తెరమరుగు
లాక్‌డౌన్‌ సమయంలో దేశ ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందించేందుకు కృషి
కేంద్ర వ్యవసాయ శాఖ నిశిత పర్యవేక్షణలో ధాన్యం రవాణా

Posted On: 23 APR 2020 4:20PM by PIB Hyderabad

కొవిడ్‌-19 కారణంగా భారతదేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే శాఖ తన రవాణా విభాగం ద్వారా అత్యవసర సేవలను అందిస్తోంది. ఆహార ధాన్యాల వంటి నిత్యావసరాలను సకాలంలో దేశవ్యాప్తంగా రవాణా చేస్తూ, అవి అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేస్తోంది.

    దేశంలోని అన్ని ఇళ్లలో పొయ్యిలు వెలిగేలా, వంటగది కార్యకలాపాలు ఒడిదొడుకులు లేకుండా  సాగేలా భారతీయ రైల్వే ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలను దేశవ్యాప్తంగా తరలించింది. 22 ఏప్రిల్‌ 2020న ఒక్కరోజులోనే 3.13 లక్షల టన్నులకు సమానమైన 112 ర్యాకుల ఆహార ధాన్యాలను దేశవ్యాప్తంగా తీసుకువెళ్లింది. 2020 ఏప్రిల్‌ 9వ తేదీన 2.57 లక్షల టన్నులకు సమానమైన 92 ర్యాకులు, అదే నెల 14, 18వ తేదీల్లో 2.49 లక్షల టన్నులకు సమానమైన 89 ర్యాకుల ఆహార ధాన్యాలను తరలించింది. ప్రస్తుత 112 ర్యాకుల రవాణాతో, గతంలో తాను నెలకొల్పిన రికార్డును తాజాగా అధిగమించింది.

    01.04.2020 నుంచి 22.04.2020 వరకు మొత్తం 4.58 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలను భారతీయ రైల్వే శాఖ రవాణా చేసింది. గతేదాడి ఇదే సమయంలో ఈ పరిమాణం 1.82 మిలియన్‌ టన్నులుగా ఉంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో సేకరించి, రవాణా చేస్తూ తన కృషితో ప్రజలందరికీ భరోసా కల్పిస్తోంది. నిత్యావసరాల లోడింగ్‌, రవాణా, అన్‌ లోడింగ్‌ పూర్తి వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ దీనిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.
 



(Release ID: 1617507) Visitor Counter : 179