ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అంటు వ్యాధుల చట్టం-1897కు సవరణలతో ఆర్డినెన్సు జారీ

Posted On: 22 APR 2020 10:14PM by PIB Hyderabad

ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అత్యంత సంక్లిష్టమైన వైద్య సేవలందిస్తున్న ఆరోగ్య రక్షణ రంగానికి చెందిన సభ్యలను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు దాడులు చేస్తూ వారి విధులకు అంతరాయం కలిగిస్తున్నారు. మానవాళి ప్రాణాలను కాపాడేందుకు 24 గంటలూ అవిశ్రాంతంగా పని చేస్తున్న వైద్య సిబ్బంది వైరస్ వ్యాప్తికి వాహకులన్న అపోహ కారణంగా దురదృష్ట వశాన దుండగుల దాడులకు లక్ష్యం అవుతున్నారు. ఈ అపోహ వారిని సంఘబహిష్కృతులుగాను, కళంకితులుగా ముద్ర వేయడం లేదా కొన్ని కేసుల్లో వారిపై దౌర్జన్యకాండ, వేధిపు చర్యలకు పాల్పడడం జరుగుతోంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంతో కీలకమైన వైద్య సిబ్బంది నైతిక స్థైర్యంతో పూర్తి సామర్థ్యాల మేరకు సేవలందించడానికి ఈ పరిస్థితి ప్రధాన అవరోధం అవుతోంది. వైద్య సిబ్బంది ఎలాంటి వివక్ష లేకుండా విధులకు కట్టుబడి ఆత్మవిశ్వాసంతో సేవలందించాలంటే సమాజం నుంచి సహకారం, మద్దతు అవసరం.

వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు కొన్ని రాష్ర్టాలు గతంలోనే ప్రత్యేక చట్టాలు రూపొందించాయి. కాని ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభం కారణంగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర పనివారిపై ఖనన, దహన వాటికలు సహా అన్ని ప్రదేశాల్లోను, అన్ని రకాలైన దాడులకు గురయ్యే అసాధారణ పరిస్థితి ఏర్పడింది.  ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన దండనలు విధించేందుకు ప్రస్తుతం అమలులో ఉన్న రాష్ట్ర చట్టాలు అనుకూలంగా లేవు. వారిపై భౌతికమైన దాడులు జరిగిన సందర్భాల్లో తప్పితే పని చేసే ప్రదేశాలు, ఇళ్ల వద్ద వేధింపులు, దాడులను నిలువరించేందుకు అవసరమైన విస్తృతమైన నిబంధనలు ఆ చట్టాల్లో లేవు. అంతే కాదు, దురాగతాలకు పాల్పడే వారిని నిలువరించగల కఠిన జరిమానాలు విధించే నిబంధనలు కూడా ఈ చట్టాల్లో లేవు.

ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్ 22న జరిగిన  కేంద్ర కేబినెట్ సమావేశంలో అంటు వ్యాధులు ప్రబలిన సమయాల్లో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి సంపూర్ణ రక్షణ కల్పించడంతో పాటు వారు పని చేస్తున్న లేదా నివశిస్తున్న ప్రదేశాల్లో దౌర్జన్యకాండల నుంచి రక్షణకు వీలు కల్పిస్తూ అంటువ్యాధుల చట్టం-1897కి సవరణలతో ఒక ఆర్డినెన్సుకు ఆమోదముద్ర వేసింది. ఈ ఆర్డినెన్స్ జారీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇలాంటి దౌర్జన్యకాండకు పాల్పడే సంఘటనలను శిక్షార్హమైనవి, బెయిలుకు అవకాశం లేని నేరాలుగాను ప్రకటించడంతో పాటు అంటువ్యాధుల నివారణలో ప్రత్యక్షంగా పని చేసే ఆరోగ్య రక్షణ సిబ్బంది గాయపడినా, వారి ఆస్తులకు నష్టం కలిగినా నష్టపరిహారం కల్పించేందుకు ఈ ఆర్డినెన్సు వీలు కల్పిస్తుంది.

భవిష్యత్తులో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితికి కారణమయ్యే అంటువ్యాధులు ప్రబలిన సమయంలో ఆరోగ్య రక్షణ సర్వీసుల సిబ్బందిపై దౌర్జన్యకాండ, వారి ఆస్తుల నష్టం వంటి సంఘటనల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడానికి వీలు కల్పించడం కూడా ఈ ఆర్డినెన్స్ లక్ష్యం. గత నెల రోజుల కాలంలో వైద్య సంరక్షణ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకారం అందించిన, వారి పట్ల పూర్తి కృతజ్ఞతలు అందించిన సందర్భాలున్నాయి. అదే సమయంలో వైద్య సిబ్బందిలో మానసిక స్థైర్యం దెబ్బ తీసే విధంగా దౌర్జన్యకర సంఘటనలూ జరిగాయి. అందుకే అత్యవసర పరిస్థితులు ఏర్పడిన సందర్భాల్లో వారిపై దౌర్జన్యకాండను నిలువరించేందుకు కఠినాతికఠినమైన ప్రత్యేక నిబంధనలు అవసరమని ప్రభుత్వం భావించింది.

వైద్య సిబ్బందిపై భౌతికమైన దాడులు, ఆస్తులకు నష్టం కలిగించే సంఘటనలన్నింటినీ ఈ ఆర్డినెన్సులో పొందుపరిచిన దౌర్జన్యకాండ నిర్వచనం పరిధిలో చేర్చారు. అలాగే వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు;  అలాగే వ్యాధి విజృంభణను, విస్తరణను నిలువరించేందుకు తగు చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా అధికారాలిచ్చిన సిబ్బంది;  ఇలాంటి అత్యవసర సేవలకు అవసరమని రాష్ట్రప్రభుత్వాలు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించిన వారెవరైనా ప్రజారోగ్య, క్లినికల్ ఆరోగ్య సంరక్షణ సర్వీసుల సిబ్బంది పరిధిలోకి తెచ్చారు.

క్లినిక్ లు, క్వారంటైన్/  ఐసొలేషన్ కేంద్రాలు, మొబైల్ వైద్య సేవలందించే విభాగాలు, ఆరోగ్య సంరక్షణ విభాగంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న సిబ్బంది ఆస్తులకు చేసే నష్టాలన్నింటికీ ఈ శిక్షా నిబంధనలు వర్తిస్తాయి.

ఇలాంటి దౌర్జన్యకర సంఘటనలన్నింటినీ శిక్షార్హమైన, బెయిలుకు అవకాశం లేని నేరాలుగా ప్రకటించారు. అలాగే దౌర్జన్యకర చర్యలను ప్రేరేపించే లేదా ప్రోత్సహించే వారికి 3 నెలల నుంచి 5 సంవత్సరాలు కారాగార వాస శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించవచ్చునని ఇందులో సూచించారు. అలాగే వైద్య సిబ్బందిని ప్రమాదకరంగా గాయపరిచే సంఘటనలకు పాల్పడే వారికి 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలు జరిమానా విధించవచ్చు. దీనికి తోడు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారే బాధితులకు నష్టపరిచిన ఆస్తి మార్కెట్ విలువకు రెట్టింపు పరిహారం అందించాల్సి ఉంటుంది.
ఇలాంటి నేరాలపై సంఘటన జరిగిన 30 రోజుల్లోగా ఇన్ స్పెక్టర్ హోదా గల అధికారి విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే కోర్టు లిఖితపూర్వకంగా విచారణ పొడిగించిన సందర్భంలో తప్పితే విచారణ ఏడాది లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 

కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత విజృంభణ తీరును పరిగణనలోకి తీసుకుని దాని విస్తరణను నిలువరించేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రానికి ఉమ్మడిగా అధికారాలు కట్టబెట్టారు. అలాగే దేశంలోకి వస్తున్న రవాణా వాహనాల తనిఖీ చర్యలను రోడ్డు, రైలు, సాగర, వాయుమార్గాల ద్వారా వచ్చే వాహనాలన్నింటికీ విస్తరించారు.

కోవిడ్-19పై క్షేత్రస్థాయిలో ముందువరుసలో ఉండి పోరాడుతున్న వారు ఆరోగ్య రక్షణ సిబ్బంది. ఇతరుల భద్రత కోసం వారు తమ ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారు. అలాంటి వారు వేధింపులు, దౌర్జన్యకర చర్యలకు బదులుగా ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితిలో అత్యున్నత గౌరవం, ప్రోత్సాహానికి అర్హులవుతారు. ఈ ఆర్డినెన్సు వైద్య సిబ్బందిలో విశ్వాసకల్పనతో పాటు కోవిడ్-19 వంటి అసాధారణ సందర్భాల్లో వారు మరింత గౌరవనీయంగా వృత్తి బాధ్యతలు నిర్వర్తించగలుగుతారు.
 

***(Release ID: 1617371) Visitor Counter : 392