వ్యవసాయ మంత్రిత్వ శాఖ
మద్దతు ధర ప్రకారం 20 రాష్ట్రాలలో కొనసాగుతున్న పప్పు దినుసులు మరియు నూనె గింజల సేకరణ
నాఫెడ్, ఎఫ్ సి ఐల ఆధ్వర్యంలో రూ. 1313 కోట్ల విలువైన పప్పుదినుసులు మరియు నూనెగింజల సేకరణ. 1, 74, 284 మంది అన్నదాతలకు లబ్ది
ఈశాన్య ప్రాంతంలో నిత్యావసర వస్తువు సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం
Posted On:
22 APR 2020 8:32PM by PIB Hyderabad
లాక్ డౌన్ కాలంలో అన్నదాతలకు అండగా వుండడానికి, వ్యవసాయ కార్యక్రమాలు సజావుగా సాగడానికిగాను కేంద్ర వ్యవసాయ శాఖ అనేక నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా వివరాలు ఇలా వున్నాయి.
ఈ ఏడాది రబీ సీజన్ కు సంబంధించి దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లలో పప్పుదినుసులు మరియు నూనె గింజల సేకరణ కొనసాగుతోంది. నాఫెడ్, ఎఫ్ సి ఐల ఆధ్వర్యంలో రూ. 1313 కోట్ల విలువైన పప్పుదినుసులు మరియు నూనెగింజలు సేకరించారు. దాంతో 1, 74, 284 మంది అన్నదాతలకు లబ్ది చేకూరింది. 1, 67, 570.95 మెట్రిక్ టన్నుల పప్పుదినుసుల్ని, 1,11, 638. 52 మెట్రిక్ టన్నుల నూనె గింజల్ని సేకరించారు. ఆయా రాష్ట్రాలద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా అయ్యే నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలకు సంబంధించి పర్యవేక్షణ చేయడానికిగాను ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పారు.
మహారాష్ట్రనుంచి ఇతర రాష్ట్రాలకు ఉల్లిపాయలు సజావుగా సరఫరా కావడానికి వీలుగా కేంద్ర వ్యవసాయశాఖ మహారాష్ట్ర మండి బోర్డుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే వుంది. నాసిక్ జిల్లాలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు ప్రతి రోజూ సరాసరి మూడువందల ట్రక్కుల ఉల్లిపాయల్ని ఢిల్లీ, హర్యానా, బిహార్, తమిళనాడు, పంజాబ్, కొలకత్తా, జమ్ము అండ్ కశ్మీర్, కర్నాటక, ఒడిషా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, అస్సాం,రాజస్థాన్, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలకు పంపుతున్నాయి.
దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సరఫరా సజావుగా సాగడానికిగాను కేంద్ర వ్యవసాయ శాఖ అనేక జాగ్రత్తలు తీసుకోవడంద్వారా హోల్ సేల్ మార్కెట్లను సరళీకరించింది. జాతీయ వ్యవసాయ మార్కెట్ ( ఇ- నామ్)కు చెందిన పోర్టల్ ను ఆధునీకరించారు. మరో రెండు కొత్త మాడ్యూల్స్‌ను ప్రారంభించారు. మొదటిది గోదాము ఆధారిత వ్యాపారానికి సంబంధించిన మాడ్యూల్. రెండోది రైతులకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ ( ఎఫ్ పివో) మాడ్యూల్.
మొదటి మాడ్యూల్ ప్రకారం వేర్ హౌసింగ్ డెవలప్ మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ( డబ్ల్యు డి ఆర్ ఏ) కింద నమోదైన గిడ్డంగుల ద్వారా రైతులు తమ పంటలు అమ్ముకుంటారు. అలాగే రెండో మాడ్యూల్ ప్రకారం రైతులు భౌతికంగా మండీలకు వెళ్లకుండానే తమ పంటలకు సంబంధించిన ఫోటోలను ఎఫ్ పిఓల ద్వారా అప్ లోడ్ చేస్తారు.
ఇంతవరకూ 12 రాష్ట్రాలకు చెందిన (పంజాబ్ , ఒడిషా, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేవ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ మరియు జార్ఖండ్ ) ఎఫ్ పివోలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగే వ్యాపారంలో పాల్గొన్నాయి.
జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు సైతం పంటల్ని ఇ నామ్ పద్ధతిలో అమ్ముకోవడానికి ఈ సాంకేతిక వేదికను ఉపయోగించుకుంటున్నాయి. రైతులు తమ పంటల వివరాలను ఫోటోలతో సహా ఆన్ లైన్లో అప్ లోడ్ చేస్తున్నారు. వారు ఆయా మండీలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగే ఎఫ్ పివోలు తాము సేకరించిన పంటల్ని ఇ- నామ్ ద్వారా అమ్ముతున్నాయి. అలాగే రవాణా కోసం అంటే వ్యాపారులు ఆయా పంటల్ని తమ తమప్రాంతాల్ని తరలించడానికి వీలుగా ఇ- నామ్ లోని మరో మాడ్యూల్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా వ్యాపారులు తమ ప్రాంతంలో అందుబాటులో వున్న రవాణా సౌకర్యాలను తెలుసుకోగలుగుతున్నారు. ఈ మాడ్యూల్ ద్వారా 11.37 లక్షల ట్రక్కులు, 2.3 లక్షల రవాణా వాహన యజమానులను లింకు చేశారు.
*****
(Release ID: 1617335)
Visitor Counter : 248