PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 20 APR 2020 6:25PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 17,265;  మరణాలు 543; నయమై/కోలుకుని వెళ్లినవారి సంఖ్య 2,547.
  • దిగ్బంధానికి వారం ముందు రెట్టింపు శాతం 3.4 కాగా,  ప్రస్తుతం మెరుగుపడి 7.5 స్థాయికి చేరింది.
  • ఆవిష్క‌ర‌ణాత్మ‌క ఉత్సాహానికి మారుపేరైన యువ భారతం వినూత్న పని సంస్కృతిని ప‌రిచ‌యం చేయ‌డంలో నాయ‌క‌త్వం వ‌హించాలని ప్రధానమంత్రి అన్నారు.
  • నిత్యావసరాల సరఫరా శృంఖలం సజావుగా సాగేలా చూడాలని దేశీయాంగ శాఖ రాష్ట్రాలకు సూచించింది.
  • కోవిడ్‌-19పై పోరు, నియంత్రణ దిశగా రాష్ట్రాల కృషిని వేగిరపరచి మరింత సమర్థం చేసేదిశగా పరిస్థితులపై అంచనా కోసం కేంద్ర ప్రభుత్వం ఆరు మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేసింది.
  • క్షేత్రస్థాయిలో యంత్రాంగాల కోసం డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు, కార్యకర్తల వివరాలతో ఆన్‌లైన్‌ సమాచార నిధిని ప్రభుత్వం క్రోడీకరించి ఉంచింది.

 

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 17,265కి చేరింది. మొత్తం కేసులకుగాను 14.75 శాతం.. అంటే- వైరస్‌ బారినపడి కోలుకుని/పూర్తిగా నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 2,547గానూ మరణాల సంఖ్య 543గానూ నమోదయ్యాయి. గడచిన ఏడు రోజులలో కోవిడ్‌-19 కేసుల వృద్ధిరేటు రీత్యా భారతదేశంలో రెట్టింపు శాతం దిగ్బంధానికి వారం ముందు 3.4 కాగా, దీనితో పోలిస్తే 2020 ఏప్రిల్‌ 19నాటికి మెరుగుపడి 7.5 శాతంగా నమోదైంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616470

కోవిడ్ -19 శకంలో జీవితం

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సామాజిక మాధ్య‌మం ‘లింక్‌‌డ్ ఇన్’ద్వారా త‌న మ‌దిలో మెదిలే కొన్ని భావాల‌ను ఆస‌క్తిక‌ర రీతిలో దేశ యువ‌త‌తో, వివిధ రంగాల వృత్తి నిపుణుల‌తో పంచుకున్నారు. ఈ మేర‌కు “నేడు ప్ర‌పంచం స‌రికొత్త వ్యాపార న‌మూనాల కోసం అన్వేషిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆవిష్క‌ర‌ణాత్మ‌క ఉత్సాహానికి మారుపేరైన మ‌న యువ భారతం వినూత్న పని సంస్కృతిని ప‌రిచ‌యం చేయ‌డంలో నాయ‌క‌త్వం వ‌హించాలి” అని పిలుపునిచ్చారు. ఈ స‌రికొత్త ప‌ని సంస్కృతికి ఆంగ్ల భాష‌లోని అచ్చు అక్ష‌రాల‌తో మొద‌ల‌య్యే ప‌దాలు- అనుస‌ర‌ణీయ‌త (అడాప్ట‌బిలిటీ), సామ‌ర్థ్యం (ఎఫీషియ‌న్సీ), సార్వ‌జ‌నీన‌త (ఇన్‌క్లూజివిటీ), అవ‌కాశం (ఆప‌ర్చ్యునిటీ), సార్వ‌త్రికం (యూనివ‌ర్స‌ల్‌)‌లతో కొత్త భాష్యం చెప్పాల‌ని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616288

కోవిడ్‌-19పై పోరు, నియంత్రణ దిశగా రాష్ట్రాల కృషిని వేగిరపరచి మరింత సమర్థం చేసేదిశగా పరిస్థితులపై అంచనా కోసం ఆరు మంత్రివర్గ ఉపసంఘాల ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం ఆరు మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్రలలో రెండేసి సంఘాల వంతున, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి వంతున అక్కడి పరిస్థితులపై ఇవి ప్రత్యక్ష అంచనాలు రూపొందిస్తాయి. తదనుగుణంగా రాష్ట్ర అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలు ఇవ్వడంతోపాటు అనంతరం ప్రజాహితం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616399

ఈ-కామర్స్‌ సంస్థల రవాణాసహా దేశంలో సరఫరా శృంఖలం సజావుగా సాగేలా రాష్ట్రాలు తగు చర్యలు తీసుకోవాలి: దేశీయాంగ శాఖ

దేశీయాంగ శాఖ ఈ మేరకు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం పంపి, క్షేత్రస్థాయిలో అన్ని సంస్థలుసహా ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే ఈ-కామర్స్ సంస్థల రవాణాసహా నిత్యావసరాల శృంఖలం వ్యవస్థ సజావుగా సాగేలా  చూడాలని స్పష్టం చేసింది. దేశీయాంగ శాఖ మార్గదర్శకాలను/ఆదేశాలను రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు వాస్తవ పరిస్థితులకు తగినట్లు సవరించి అమలు చేయవచ్చునని పేర్కొంది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616167

కోవిడ్-19 నిరోధం-నియంత్ర‌ణ దిశ‌గా కీలక మానవ వనరుల ఆన్‌లైన్ స‌మాచార నిధికి ప్రభుత్వం శ్రీకారం

కేంద్రప్రభుత్వం https://covidwarriors.gov.in పేరిట ఒక ఆన్‌లైన్ స‌మాచార నిధిని ఏర్పాటుచేసింది.  క్షేత్రస్థాయిలో పాలన‌ యంత్రాంగాలుస‌హా రాష్ట్ర, జిల్లా, స్థానిక సంస్థల పాలన విభాగాల వినియోగానికి అనువుగా ఆయుష్ వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సంర‌క్ష‌ణ నిపుణులు, ఎన్‌వైకే, ఎన్సీపీ, ఎన్ఎస్ఎస్ కార్యకర్తలతోపాటు పీఎంజీకేవై, మాజీ సైనికోద్యోగుల వివ‌రాల‌ను అందుబాటులో ఉంచింది. డ్యాష్‌బోర్డులో ఉంచిన ఈ సమాచారం ఎప్పటికప్పుడు నవీకరించ‌బ‌డుతుంది. కోవిడ్‌-19పై పోరు, నియంత్ర‌ణ కోసం ఈ కీల‌క మాన‌వ వ‌న‌రుల స‌మాచారం క్రోడీక‌రించ‌బ‌డింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616269

కోవిడ్‌-19 నియంత్రణ చర్యలపై జి20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో చర్చ

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నిర్మూల‌న‌కు ప్ర‌పంచ దేశాలమ‌ధ్య స‌హ‌కార నిర్మాణం, ప‌ర‌స్ప‌ర గౌర‌వంతోపాటు ఉప‌యుక్త ఒప్పందాలకు అత్యంత ప్రాముఖ్యం ఉంద‌ని డాక్ట‌ర్ హ‌ర్షవ‌ర్ధ‌న్ నొక్కిచెప్పారు. ఐరోపా స‌మాఖ్య‌స‌హా ప్ర‌పంచంలోని 19 దేశాల ప్ర‌భుత్వాలు స‌భ్య‌త్వం క‌లిగిన అంత‌ర్జాతీయ వేదిక జి20 దేశాల ఆరోగ్య మంత్రుల స‌మావేశంలో దృశ్య‌-శ్ర‌వణ మాధ్య‌మం ద్వారా ఆయ‌న మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య కార్యక్రమానికి భారత మద్దతును డాక్టర్‌ హర్షవర్ధన్‌ పునరుద్ఘాటించారు. ఈ మేరకు “కోవిడ్‌-19 నిర్మూలనకు జి20 సభ్యదేశాలతో కలసి సమష్టిగా కృషి చేసేందుకు భారత్‌ ఎదురుచూస్తోంది” అని ఆయన ప్రకటించారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616321

కోవిడ్‌-19 దిగ్బంధం కొనసాగుతున్నా రైతుల అవసరాలకు తగినట్లు ఎరువుల ఉత్పత్తి-రవాణా

దేశవ్యాప్తంగా కోవిడ్-19 దిగ్బంధం కొనసాగుతున్నప్పటికీ రైతులకు ఎరువుల సరఫరా ఎక్కడా ఆగలేదు. ఇందులో భాగంగా వివిధ కర్మాగారాలు, రేవులనుంచి ఏప్రిల్‌ 17న అత్యధిక సంఖ్యలో గూడ్సు రైళ్లు పలు ప్రాంతాలకు ఎరువులు రవాణా చేశాయి.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616177

దిగ్బంధం సమయంలో ఎఫ్‌సీఐ ఈశాన్య భారత కార్యకలాపాలు

భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ గడచిన 25 రోజుల్లో ఈశాన్య భారత రాష్ట్రాలకు 158 గూడ్సు రైళ్లలో దాదాపు 4,42,000 టన్నుల ఆహారధాన్యాలను రవాణా చేసింది. ఎఫ్‌సీఐ సగటు రవాణా సామర్థ్యం నెలకు 80 గూడ్సు రైళ్ల లోడ్లు కాగా, ప్రస్తుతం సుమారు రెట్టింపు అధికంగా రవాణా చేసింది. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో రైళ్లు చేరలేని ప్రాంతాలకు రోడ్డుమార్గంలో ఆహార ధాన్యాలు రవాణా అయ్యాయి.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616265

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- మాల్దీవ్స్‌ అధ్యక్షుడి మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మాల్దీవ్స్‌ అధ్యక్షుడు గౌరవనీయ ఇబ్రహీం మొహమ్మద్‌ సొలీతో టెలిఫోన్‌లో సంభాషించారు. తమతమ దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత స్థితిగతుల గురించి దేశాధినేతలిద్దరూ చర్చించారు. సార్క్‌ దేశాల మధ్య సమన్వయంపై అంగీకరించిన విధానాలు చురుగ్గా అమలు కావడంపై వారిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616338

నరేలా క్వారంటైన్ కేంద్రానికి సైన్యం మద్దతు

దేశంలో కోవిడ్ అనుమానితులకు ఆశ్రయం కల్పించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అతి పెద్ద కేంద్రాల్లో ఢిల్లీలోని నరేలా క్వారంటైన్  కేంద్రం ఒకటి. ఢిల్లీ ప్రభుత్వం దీన్ని 2020 మార్చి నెల మధ్యలో ఏర్పాటుచేసింది. ఈ కేంద్రంలో 2020 ఏప్రిల్‌ 1 నుంచి సైనిక డాక్టర్లు, నర్సుల బృందం పౌర యంత్రాంగానికి సహకరిస్తోంది. ఈ నేపథ్యంలో 2020 ఏప్రిల్‌ 16నుంచి ఈ కేంద్రంలో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటలదాకా బాధ్యతలను పూర్తిగా సైనిక వైద్య బృందం నిర్వర్తిస్తోంది. తద్వారా ఢిల్లీ ప్రభుత్వ డాక్టర్లకు, ఇతర వైద్య సిబ్బందికి పగటిపూట విశ్రాంతినిస్తూ రాత్రివేళ బాధ్యతలు చూసుకునే వెసులుబాటు కల్పించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616270

దేశంలోని రహదారుల పక్కనగల థాబాలు, లారీ మరమ్మతు షాపుల వివరాలను వెబ్‌సైట్‌ డ్యాష్‌బోర్డు లింకులో ఉంచిన కేంద్ర రోడ్డురవాణా మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా ధాబాలు, ట్రక్కుల మరమ్మతుల షాపుల జాబితాతోపాటు జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్రాలు, చ‌మురు విక్ర‌య కంపెనీలు త‌దిత‌ర‌ సంస్థల వివరాలతో కూడిన డ్యాష్ బోర్డు లింకును ‌కేంద్ర-రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. కోవిడ్-19 వ్యాప్తివ‌ల్ల‌ దిగ్బంధం విధించిన నేప‌థ్యంలో వివిధ రకాల అత్యవసర వస్తువులను దేశంలోని అనేక ప్రాంతాల‌కు ర‌వాణా చేస్తున్న ట్రక్కులు/వాహనాల డ్రైవర్లు, క్లీనర్ల కోసం సౌకర్యార్థం ప్ర‌భుత్వం ఈ ఏర్పాటు చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616431

కోవిడ్‌-19పై ప్రస్తుత పోరాటంలో తనవంతు చేయూతనిస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌

ఈ మేరకు దేశంలోని 80 కేంద్రీయ విద్యాలయాలను క్వారంటైన్‌ కేంద్రాలుగా వాడుకునేందుకు ఆయా ప్రాంతాల సంబంధిత అధికార యంత్రాంగాలకు అప్పగించింది. అలాగే విద్యాబోధనకు నష్టం వాటిల్లకుండా 32,247మంది ఉపాధ్యాయులు 7,07,312మంది విద్యార్థులకు వివిధ ఆన్‌లైన్‌ వేదికలద్వారా పాఠాలు బోధిస్తున్నారు.

మరిన్ని వివరాలకు...For details: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616343

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారిపై దేశవ్యాప్త పోరులో జిల్లా యంత్రాంగాలు, పంచాయతీల చొరవ

సలహా సంఘాల ఏర్పాటు; గోడలపై చిత్రాలతో వ్యాధిపై అవగాహన; స్థానికంగా మాస్కుల తయారీ... పంపిణీ; పేదలకు ఉచిత ఆహారం, రేషన్సరఫరా; బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత ద్రవాలు చల్లడం వంటి వివిధ రకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616341

కోవిడ్‌-19 నియంత్రణ పరిస్థితిపై సమీక్ష కోసం రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

ఆసుప్ర‌తుల‌ సంసిద్ధత దిశ‌గా పెరుగుతున్న అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని త‌గు సంఖ్య‌లో ఏకాంత చికిత్స వార్డులుస‌హా 450 ప‌డ‌క‌లుగ‌ల రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి కోవిడ్‌-19 ప్ర‌త్యేక చికిత్స కేంద్రంగా ప‌నిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అక్క‌డి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. దేశంలో కోవిడ్‌-19 నిరోధం, నియంత్ర‌ణ‌, నిర్వ‌హ‌ణ‌ల‌ను రాష్ట్రాల‌న్నిటి స‌హ‌కారంతో నిరంత‌రం అత్యున్న‌త స్థాయిలో ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616171

నిరుపేద‌ల‌కు 20 ల‌క్ష‌లకుపైగా ఉచిత భోజ‌నాలు పంపిణీ చేసిన భారత రైల్వేశాఖ‌

కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశ‌వ్యాప్త దిగ్బంధం విధించిన నేప‌థ్యంలో భార‌త రైల్వేశాఖ అన్నార్తుల‌ను ఆదుకుంటోంది. ఈ మేర‌కు పేద‌లకు వేడివేడి ఆహారాన్ని అందిస్తోంది. ఇలా ఇప్ప‌టివర‌కూ పంపిణీ చేసిన భోజ‌నాల సంఖ్య 20.5 లక్షలకు చేరుకుంది. ఇందుకోసం 2020 మార్చి 28నుంచి రైల్వేల‌కు చెందిన అనేక సంస్థలలో సిబ్బంది అవిశ్రాంతంగా శ్ర‌మిస్తున్నారు. ఈ మేర‌కు ఐఆర్‌సీటీసీ ప్ర‌ధాన వంట‌శాల‌లు, ఆర్పీఎఫ్ వ‌న‌రుల‌లో స్వ‌చ్ఛంద సంస్థ‌ల తోడ్పాటుతో భారీస్థాయిలో ఆహారాన్ని సిద్ధం చేస్తోంది. ఈ ఆహారాన్ని మ‌ధ్యాహ్నం, రాత్రివేళ‌ల్లో పేప‌ర్ ప్లేట్ల స‌హితంగా నిరుపేద‌ల‌కు అందిస్తోంది. అలాగే ఆహార‌ పంపిణీ సంద‌ర్భంగా సిబ్బంది మొత్తం పూర్తి ప‌రిశుభ్ర‌త‌ను, సామాజిక దూరాన్ని క‌చ్చితంగా పాటిస్తున్నారు

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616403

కోవిడ్ -19పై పోరాటంలో త‌మ‌వంతు చేయూత‌నిస్తున్న బొగ్గు-గ‌నుల ప్ర‌భుత్వరంగ సంస్థ‌లు: శ్రీ ప్ర‌హ్లాద్ జోషి

నేష‌న‌ల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), కోల్ ఇండియా అనుబంధ సంస్థ మ‌హాన‌ది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్‌)ల‌ పూర్తిస్థాయి ఆర్థిక స‌హ‌కారంతో ఒడిషాలో రెండు కోవిడ్ -19 ప్ర‌త్యేక ఆస్ప‌త్రులు ఇవాళ ప్రారంభ‌మ‌య్యాయి. రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ న‌వీన్ ప‌ట్నాయక్ వీటిని దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా ప్రారంభించారు. కేంద్ర పెట్రోలియం-స‌హ‌జ‌వాయువుల శాఖ మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, కేంద్ర బొగ్గు-గ‌నుల‌శాఖ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషి కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఒడిషా రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రు‌ల నిర్వ‌హ‌ణ‌‌కు రాష్ట్రంలోని ఇత‌ర ఆసుప‌త్రుల సిబ్బంది‌నుంచి స‌హ‌కారం ల‌భిస్తుంది.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616397

కోవిడ్‌-19పై పోరులో భాగంగా చండీగఢ్‌లో వ్య‌ర్థాల సేక‌ర‌ణ విధుల్లోగ‌ల డ్రైవ‌ర్ల కోసం వాహ‌న ట్రాకింగ్ యాప్‌లు, జీపీఎస్ స‌దుపాయంగ‌ల‌ స్మార్ట్ వాచ్‌ల వినియోగం‌

చండీగ‌ఢ్‌ నగరంలో తొలి కోవిడ్ కేసు నమోదు కాగానే స్పందించిన న‌గ‌ర యంత్రాంగం స‌ద‌రు రోగితో సంబంధంగ‌ల వారందర్నీ నిర్బంధ ప‌రిశీల‌న కేంద్రాల‌కు త‌ర‌లించ‌డం ప్రారంభించింది. వీరందరినీ సీవీడీ ట్రాకర్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వీరి కుటుంబాలకు అవసరమైన నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616469

దేశంలోని వివిధ ప్రాంతాలకు అత్యవసర మందుల సరఫరాలో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు

దేశంలోని వివిధ ప్రాంతాలకు 507.85 టన్నుల అత్యవసర మందుల సరఫరాలో భాగంగా లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. ఈ మేరకు ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు 301 విమానాలను నడిపాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616441

గ్రామ్‌-నెగటివ్‌ సెప్సిస్‌తో తీవ్రంగా బాధపడుతున్న రోగుల ప్రాణరక్షణ మందు తయారీ కృషికి సీఎస్‌ఐఆర్‌ మద్దతు

కోవిడ్-19 వ్యాధితో ప్రాణాంత‌క స్థితికి చేరిన రోగుల మరణాలు తగ్గించే దిశ‌గా ఔషధ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు సీఎస్ఐఆర్ ప్ర‌స్తుతం యాదృచ్ఛిక‌, అంధ, రెండు చేతులు, క్రియాశీల పోలిక-నియంత్రిత క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభిస్తోంది

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616479

ఉనాలో కేన్స‌ర్‌తో బాధపడుతున్న శిశువుకు అత్యవసర మందులు అందించిన ఇండియా పోస్ట్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనాలో కేన్స‌ర్ బాధిత ఎనిమిదేళ్ల చిన్నారి శాలిని (పేరు మార్చ‌బడింది) కోసం అత్య‌వ‌స‌ర మందుల‌ను ఇండియా పోస్ట్ స‌కాలంలో అందించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616165

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్‌: రాష్ట్రంలో ఆరోగ్య నిబంధనల అమలు దిశగా పంజాబ్‌ మండీ బోర్డు చర్యలు చేపట్టింది. ఈ మేరకు 1.5 లక్షల మాస్కులు, 15,000 సీసాల పరిశుభ్రత ద్రవాలను తమ 5,600 కార్యాలయాలు/అధికారులకు పంపిణీ చేసింది. కోవిడ్‌-19 మహమ్మారి తీవ్రత దశ సమీపిస్తున్న నేపథ్యంలో గోధుమ కొనుగోళ్లు సాఫీగా సాగడం కోసం ఈ చర్యలు తీసుకుంది. కాగా, రాష్ట్ర పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖ వివిధ శాఖలకు 3 లక్షల మాస్కులు పంపిణీ చేసింది. ఈ మాస్కులను జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద స్వయం సహాయ సంఘాలవారు తయారుచేశారు.
  • హిమాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్ర పౌరులు కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ జారీచేసిన స్వీయ సంరక్షణ మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రోగనిరోధకత దిశగా... ప్రత్యేకించి శ్వాసకోశ ఆరోగ్య పటిష్ఠత రీత్యా ఆయుష్‌ శాఖ ఈ మార్గదర్శకాలను జారీచేసింది.
  • అరుణాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్రంలో దిగ్బంధం నిబంధనలు ఉల్లంఘించినందుకు 1,669 మందిపై కేసులు నమోదు కాగా, 492 మందిని అరెస్ట్‌ చేయడంతోపాటు 750 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంమీద 161 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, రూ.6.5 లక్షలమేర జరిమానాకింద వసూలు చేశారు.
  • అసోం: రాష్ట్రం వెలుపల చిక్కుకుపోయిన 86వేల మందికి తలా రూ.2,000 వంతు ప్రభుత్వం విడుదల చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.
  • మణిపూర్‌: ఇంఫాల్‌ తూర్పు-పశ్చిమ జిల్లాల గస్తీ దళం కోసం కొనుగోలు చేసిన 12 కొత్త గస్తీ వాహనాలను ముఖ్యమంత్రి సంబంధిత సిబ్బందికి అందజేశారు.
  • మిజోరం: జాతీయ దిగ్బంధం నేపథ్యంలో ఏప్రిల్‌ 22న రాష్ట్రంలో నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షలను రాష్ట్ర పాఠశాల విద్యాబోర్డు వాయిదా వేసింది.
  • నాగాలాండ్‌: కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో రద్దీ తగ్గించడం కోసం విచారణ ఖైదీలకు పెరోల్‌ మంజూరుపై సంబంధిత కమిటీ వివిధ జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించింది. కాగా, ఇప్పటివరకూ 108 మంది విచారణ ఖైదీలను, 8 మంది బాల విచారణ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది.
  • నాగాలాండ్‌: దిగ్బంధం నడుమ కోహిమా, దిమాపూర్‌లలో సబ్బాత్‌ (ప్రార్థన) దినోత్సవం నిర్వహించారు. ఈ మేరకు చర్చి డీకాన్స్‌ లౌడ్‌స్పీకర్లద్వారా పవిత్ర వాక్యాలను చదివారు. ఆయా ప్రాంతాల నివాసులంతా తమ భవనాల వరండాల్లో, ప్రవేశద్వారాలు, కిటికీలవద్ద నిల్చుని ప్రార్థనల్లో పాల్గొన్నారు.
  • సిక్కిం: రాష్ట్రంలోని పశ్చిమ జిల్లా కమిషనర్‌కు 10 వెంటిలేటర్ల కొనుగోలు కోసం పవర్‌గ్రిడ్‌ రూ.7.85 లక్షల విరాళం అందజేసింది. అలాగే తూర్పు-ఉత్తర జిల్లాల్లో వ్యక్తిగత రక్షణ సామగ్రి కోసం రూ.7 లక్షల వంతున, దక్షిణ జిల్లాకు రూ.3 లక్షల వంతున అందించింది.
  • త్రిపుర: రాష్ట్రంలోని 16 వేర్వేరు ప్రభుత్వ-ప్రైవేటు పరిశ్రమలు, సంస్థల్లో దిగ్బంధం మార్గదర్శకాలకు లోబడి కార్యకలాపాలను అనుమతించడంలో భాగంగా ప్రభుత్వం ఇవాళ ఒక పత్రాన్ని సిద్ధం చేసింది.  
  • కేరళ: కేంద్రం నుంచి ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలో దిగ్బంధం సడలింపులను సవరించింది. మరోవైపు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న ఇటలీ పౌరుడొకరు రాష్ట్రానికి కృతజ్థతలు తెలిపి వెళ్లిపోయారు. కాగా, రాష్ట్రంలో నిన్న 2 కొత్త కేసులు రాగా, 13 మంది కోలుకుని వెళ్లారు. మరో 129 మంది చికిత్స పొందుతున్నారు. 
  • తమిళనాడు: రాష్ట్రంలో మే 3వ తేదీదాకా దిగ్బంధం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, కీల్పాక్‌లో మరణించిన ఒక కోవిడ్‌-19 రోగిని ఖననం చేయడాన్ని స్థానికులు వ్యతిరేకించడంతో మరోచోట అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,447 కాగా, 16 మంది మరణించారు. మరో 411 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, చెన్నైలో 290, కోయంబత్తూరు 133, తిరుప్పూరు 108 వంతున అత్యధిక కేసులన్న ప్రాంతాల జాబితాలో ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలోని కల్బుర్గి జిల్లాలో ఇవాళ 5 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 395కు చేరింది. మరణాలు 16 కాగా, 112 మంది డిశ్చార్జి అయ్యారు. బెంగళూరులో పోలీసులుసహా ఆశా కార్యకర్తలపై దాడుల నేపథ్యంలో కరోనా యోధుల రక్షణ నిమిత్తం కేరళ, ఉత్తరప్రదేశ్‌ల తరహాలో ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.
  • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 75 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 722కు చేరింది. కాగా, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ 3 మాస్కుల వంతున పంపిణీ కోసం స్వయం సహాయ సంఘాలద్వారా 16 కోట్ల మాస్కుల తయారీవల్ల దాదాపు 40వేల మంది మహిళలకు ఉపాధి లభించింది. తద్వారా వారు రోజుకు రూ.500 వంతున ఆర్జిస్తున్నారు. కాగా, కర్నూలు 174, గుంటూరు 149, కృష్ణా 80, నెల్లూరు 67, చిత్తూరు 53 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి.
  • తెలంగాణ: హైదరాబాద్‌కు చెందిన టి-వర్క్స్ బహుళ స్టార్టప్‌ల సహకారంతో నిమ్స్ మార్గదర్శకత్వంలో అత్యవసర ఉపయోగం కోసం బ్యాగ్-వాల్వ్-మాస్క్ (బివిఎం) ఆధారిత వెంటిలేటర్‌ను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో దిగ్బంధాన్ని ప్ర‌భుత్వం మే 7 వరకు పొడిగించింది. కాగా, మొత్తం కేసుల సంఖ్య 858కి చేరుకుంది. యాక్టివ్ కేసులు: 651, మరణాలు: 21, డిశ్చార్జ్ అయిన‌వారు: 186 మంది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 4,203కి చేరింది. ఇప్ప‌టివ‌ర‌కూ 223 మంది మరణించగా, 507 మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో ప‌రీక్ష‌ల సంద‌ర్భంగా ఏ ల‌క్ష‌ణాలూ క‌నిపించ‌నివారిలో మూడింట రెండొంతుల మంది ఇప్పుడు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు.
  • గోవా: గోవా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 265 మంది బ్రిటిష్‌ పౌరులు ఇవాళ ప్రత్యేక విమానంలో స్వదేశానికి వెళ్లారు. కాగా, గోవానుంచి విదేశీ పర్యాటకులతో వెళ్లిన విమానాల్లో ఇది 27వది కావడం గమనార్హం. మొత్తంమీద కోవిడ్‌-19 దిగ్బంధం ప్రకటించిన మార్చి 24వ తేదీనుంచి ఇప్పటిదాకా రష్యా, కెనడా, ఫ్రాన్స్‌, అమెరికాసహా వివిధ దేశాలకు 5వేల మందికిపైగా విదేశీ పర్యాటకులు గోవానుంచి స్వదేశాలకు వెళ్లారు.
  • గుజరాత్‌: రాష్ట్రంలో 139 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,743కు చేరింది. ఇప్ప‌టిదాకా న‌మోదైన కేసుల‌లో 105 మంది కోలుకోగా 63 మంది మరణించారు. మ‌రోవైపు మ‌లేరియా నిరోధ‌క ఔష‌ధం హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ) కోసం జాతీయంగా, అంత‌ర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో గుజరాత్ కేంద్రంగా ప‌నిచేసే ఔషధ కంపెనీలు ఉత్పత్తి ప‌రిమాణాన్ని పెంచాయి. కాగాగుజరాత్‌ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రాష్ట్రంలోని 13 ఫార్మా కంపెనీలకు 20 ఉత్పత్తి లైసెన్స్‌లను మంజూరు చేశారు.
  • రాజస్థాన్‌: రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,478కి పెర‌గ్గా, 14 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. క‌రోనా వైర‌స్ కేసుల నియంత్ర‌ణ‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగంలోని అంకుర సంస్థ‌ మెడ్‌కార్డ్స్‌తో జ‌ట్టుక‌ట్టింది. ఈ ఒప్పందం నేప‌థ్యంలో ఆయు, సెహాత్ సాథీ యాప్ ద్వారా ప్రజలకు 24 గంట‌ల‌పాటు ఆన్‌లైన్ సంప్రదింపులతోపాటు మందుల స‌ర‌ఫ‌రా అందుబాటులో ఉంటాయి.
  • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,407కు పెరిగింది. ఇప్ప‌టిదాకా వ్యాధి నుంచి 131 మంది పూర్తిగా కోలుకోగా, 72 మంది మరణించారు. కాగా, ఇండోర్‌లో అత్యధికంగా 890 కేసులు న‌మోదుకాగా, భోపాల్ 214 కేసుల‌తో రెండో స్థానంలో ఉంది.

 

# కోవిడ్-19 లో వాస్తవ తనిఖీ

******


(Release ID: 1616583) Visitor Counter : 365