ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నియంత్రణకోసం సౌదీ అరేబియాలో జి20 దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశం
కరోనా వైరస్ రోగంపై పోరాటానికిగాను సహకార నిర్మాణం, దేశాల మధ్యన పరస్పర గౌరవం, ఉపయోగకరమైన పొత్తులు ముఖ్యం : డాక్టర్ హర్ష వర్ధన్
ఒక బిలియన్ కు పైగా జనాభా కలిగిన భారతదేశంలో కరోనా మహమ్మారి వైరస్ పై జరుగుతున్న పోరాటంపై సర్వత్రా ప్రత్యేక దృష్టి : డాక్టర్ హర్షవర్ధన్
ఈ పరీక్షా కాలంలో అన్ని సభ్య దేశాలతో కలిసి భారతదేశం నిబద్దతతో పని చేస్తోందని డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టీకరణ
సంతృప్తికరంగా లాక్ డౌన్ ఫలితాలు. 3.4 రోజులనుంచి 7.2 రోజులకు మెరుగైన కేసుల రెట్టింపు రేటు.
Posted On:
19 APR 2020 9:46PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని తుదముట్టించడానికిగాను దేశాల మధ్యన సహకార నిర్మాణం, పరస్పర గౌరవం, ఉపయోగకరమైన ఒడంబడికలు చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ స్పష్టం చేశారు. ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థ జి20 దేశాల వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆయా దేశాల ఆరోగ్యశాఖ మంత్రులతో మాట్లాడారు. ఇందులో జి 20 దేశౄలతోపాటు యూరోపియన్ యూనియన్ కూడా పాల్గొంది. జి 20లో భాగంగా వున్న దేశాలు 19. ఇవి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యన్ సమాఖ్య, సౌదీ అరేబియా, దక్షిణ అమెరికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్, అమెరికా, ఇండియా.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్ -19 వైరస్ ను నిరోధించడానికిగాను ఆయా దేశాలు చేస్తున్న కృషి అబినందనీయంగా వుందని అన్నారు. అంతర్జాతీయంగా ఏర్పడిన ఈ ఆరోగ్యరంగ సంక్షోభ నేపథ్యంలో అందరమూ ఐకమత్యంగా నిలిచి తద్వారా వచ్చిన శక్తియుక్తులతో లక్ష్యాన్ని చేరుకుందామని మంత్రి పిలుపునిచ్చారు. గతంలో కూడా ఇలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు అందరమూ సమైక్యంగా నిలిచి పోరాటం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గుర్తు చేశారు. అదే విధంగా ప్రస్తుతం కూడా అందరమూ ఐకమత్యంగా నిలిచి బలోపేతమై కరోనా మహమ్మారిని జయిద్దామని ఆయన కోరారు. ఇందుకోసం సహకారం, పరస్పర గౌరవం, ఉపయోగకరమైన భాగస్వామ్యాలు ముఖ్యమని ఆయన అన్నారు. జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా లాంటి కొన్ని దేశాలు ఈ పోరాటంలో ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తున్నాయని..మిగతా దేశాలు ఈ కరోనాపై పోరాటంలో ఇంకా సతమతమవుతూనే వున్నాయని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కరోనా వైరస్ ప్రభావం కనీవినీ ఎరగని రీతిలో వుంది కాబట్టి పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే దేశాల మధ్యన సహకారం చాలా అవసరమని అన్నారు.
ఇండియాలో కోవిడ్ -19 పై జరుగుతున్న పోరాట వివరాలను మంత్రి అందరికీ తెలియజేవారు. లాక్ డౌన్ విధించి ఏప్రిల్ 19 నాటికి 25 రోజులైందని..దీన్ని మే 3 వరకు పొడిగించామని మంత్రి వివరించారు. లాక్ డౌన్ ఫలితాలనిస్తోంది. మార్చి 17 నాటికి ప్రతి 3.4 రోజులకు కేసులు రెట్టింపయ్యేవని..అయితే ఇది ఆ తర్వాత అంటే మార్చి 25 నాటికి 4.4 రోజులకు పడిపోయిందని, ప్రస్తుతం ప్రతి 7.2 రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయని అన్నారు.
కోవిడ్ 19పై పోరాటం పంచముఖంగా సాగుతోందని అన్నారు. నిత్యం ప్రజల్లో చైతన్యం పెంచుతూనే వున్నామని, ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, గ్రేడులవారీగా స్పందన వుంటోందని, అన్ని స్థాయిల్లో సమన్వయం చేసుకున్నామని, అలాగే ఈ రోగానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నామని మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు.
కోవిడ్ 19 వైరస్ ను అరికట్టడానికిగాను భారతదేశం వ్యూహాత్మకంగా పని చేస్తోందని చెప్పిన మంత్రి అంతర్జాతీయంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించకముందే అంతర్జాతీయ నియమ నిబంధనలకు అనుగుణంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం భారతదేశం అనేక చర్యలను చేపట్టిందని మంత్రి అన్నారు. జనవరి 30న కరోనా పాజిటివ్ కేసు భారతదేశంలో నమోదైందని దానికంటే 12 రోజుల ముందునుంచే కోవిడ్ -19 ప్రభావిత దేశాలనుంచి వచ్చిన విమానాలన్నిటిపై నిఘా వేసి ప్రయాణికులను స్క్రీన్ చేయడం జరిగిందని అన్నారు. మార్చి 22 నాటికి భారతదేశంలో 400 కంటే తక్కువ కేసులున్నాయని ఆ సమయంలో అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని నిషేధించామని చెప్పారు. మార్చి 25నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోందని అన్నారు.
ప్రజారోగ్య వ్యవస్థలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిని భారతదేశం విజయవంతంగా ఎదుర్కొన్నదని...అన్ని నియమ నిబంధనల ప్రకారం కోవిడ్ -19 వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నామని ఆయన అన్నారు. మహమ్మారి తలెత్తినప్పుడు తెరమీదకు వచ్చే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ ( ఐడిఎస్ పి) ను జాతీయ స్థాయిలో అమలు చేస్తున్నామని అన్నారు. అంతే కాదు సరైన డిజిటిల్ ఇన్ పుట్స్ ప్రకారం దీన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తున్నామని అన్నారు.
కోవిడ్ -19 ఆసుపత్రులను మూడంచెల్లో నెలకొల్పినట్లు రోగుల జబ్బు తీవ్రతను బట్టి వారిని ఆయా ఆసుపత్రుల్లో వుంచి చికిత్స అందిస్తామని అన్నారు.
కోవిడ్ -19 చికిత్సకోసం ప్రత్యేకంగా మందులుగానీ, వ్యాక్సిన్లుగానీ లేవని ఈ పరిస్థితుల్లో పలు రకాలుగా అందుబాటులో వున్న నాణ్యమైన, మెరుగైన చికిత్సలద్వారా వైద్యం చేస్తున్నామని అన్నారు. సామాజిక దూరం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, శ్వాస సంరక్షణ పద్ధతుల్లాంటి విధానాలను ప్రచారం చేస్తున్న విషయాన్ని తెలిపారు. అలాగే భారతదేశంలో వైద్యులు, శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారని అన్నారు. సెల్ ఫోన్ల ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచుతున్నామని స్పష్టం చేశారు.
వసుధైక కుటుంబకం అనే ప్రాచీన భారతీయ సిద్ధాంతాన్ని అనుసరించి పని చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వివరించారు. కోవిడ్ -19 వైరస్ పై పోరాటంలో భాగంగా పలు దేశాలకు భారతదేశం సాయం చేస్తోందని అన్నారు. నాయకత్వ పటిమతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అలాగే కోవిడ్ -19 ప్రభావిత దేశాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించి వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చామని అన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి మందును పలు దేశాలకు సరఫరా చేస్తున్నామని అలాగే వైరస్ పై అత్యంత ప్రభావంతంగా పని చేసే మందుల తయారీకోసం అంతర్జాతీయ సంస్థలతో కలిసి పని చేస్తున్నామని వివరించారు.
ఈ సమావేశ అధ్యక్షులకు అభినందనలు తెలిపిన డాక్టర్ హర్షవర్ధన్ చివరగా మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య ప్రణాళికకు భారతదేశ మద్దతు ఎల్లవేళలా వుంటుందని స్పష్టం చేశారు. అలాగే భారతదేశం...జి20 దేశాలతో కలిసి కోవిడ్ -19 పై సమైక్యంగా పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.
*****
(Release ID: 1616321)
Visitor Counter : 353