మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై పోరుకు తనవంతు చేయూతగా కేవీఎస్‌ చర్యలు

క్వారంటైన్‌ కేంద్రాల కోసం 80 కేంద్రీయ విద్యాలయాల అప్పగింత
7.07 లక్షల మంది విద్యార్థులకు 32,247 మంది టీచర్లతో ఆన్‌లైన్‌ తరగతులు

Posted On: 20 APR 2020 1:18PM by PIB Hyderabad

కోవిడ్‌-19 ముప్పు నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చురుగ్గా స్పందించింది. ప్రస్తుత కఠిన పరిస్థితుల నడుమ అన్ని విద్యా సంస్థలలో తగువిధంగా వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన (కేవీఎస్‌) కూడా తనవంతు చేయూతగా అనేక చర్యలు తీసుకుంది.

కేవీఎస్‌లలో క్వారంటైన్‌ కేంద్రాలు

కోవిడ్‌-19 నిరోధం దిశగా ఏదైనా జిల్లా కేంద్రం లేదా రక్షణశాఖ అధికార సంస్థ నుంచి విజ్ఞప్తి అందగానే కేంద్రీయ విద్యాలయ భవనాలను అప్పగించాలని కేవీఎస్‌ ఆదేశించింది. అలాగే తరగతి గదులను తాత్కాలిక ఆశ్రయాలుగా వినియోగించుకునే వీలు కల్పించాలని సూచించింది. ఈ మేరకు ఇప్పటిదాకా దేశంలోని 80 విద్యాలయాలను ఆయా స్థానిక పాలన యంత్రాంగాలకు అప్పగించింది.

పీఎం కేర్స్‌ నిధికి విరాళాలు

జాతికి తమవంతు తోడ్పాటులో భాగంగా కేవీఎస్‌ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది తమ జీతాలనుంచి మొత్తం 10 కోట్ల 40లక్షల 60వేల 536 రూపాయలను ‘పీఎం కేర్స్‌’ నిధికి విరాళంగా సమర్పించారు. ఇందులో ఒకరోజు జీతం నుంచి లక్ష రూపాయల వ్యక్తిగత మొత్తందాకా విరాళాలుండటం విశేషం.

ఉపాధ్యాయుల చొరవ

భావి పౌరులను తీర్చిదిద్దే కర్తవ్య నిర్వహణలో భాగంగా కేవీఎస్‌ ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు వివిధ డిజిటల్‌ వేదికలపై ఆన్‌లైన్‌ తరగతులతో విద్యాబోధన కొనసాగిస్తున్నారు. ఈ దిశగా కేవీఎస్‌ ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా పంపింది.

*****


(Release ID: 1616343) Visitor Counter : 306