రైల్వే మంత్రిత్వ శాఖ
20 లక్షలకు పైగా ఉచిత భోజనాలను పంపిణీ చేసిన భారతీయ రైల్వే
- కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు 300 ప్రదేశాలలో భోజనం పంపిణీ
- ప్రతిరోజూ వేలాది మంది ప్రజలకు వేడిగా వండిన భోజనం అందించేందుకు గాను కలిసికట్టుగా ముందుకు సాగుతున్న భారతీయ రైల్వే సంస్థలు
Posted On:
20 APR 2020 3:11PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలువుతున్న నేపథ్యంలో.. భారతీయ రైల్వే సంస్థలు పేదల కడుపునింపే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. భారత రైల్వే వేడివేడిగా వండి ఇప్పటి వరకు పంపిణీ చేసిన బోజనాల సంఖ్య సోమవారం నాటికి రెండు మిలియన్ల మార్కును దాటి మొత్తం 20.5 లక్షలకు చేరుకుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మన దేశంలో అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. ఈ మహమ్మారి మరియు లాక్‌డౌన్ కారణంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులు, రోజువారీ కూలీలు, కార్మికులు, వలసదారులు, పిల్లలు, కూలీలు, నిరాశ్రయులు, పేదలతో పాటు వలస ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేళకు తిండి దొరక్క ఆకలితో అలమటించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన వారికి వేడి గా వండిన భోజనం అందించడానికి గాను మార్చి 28వ తేదీ నుంచి భారత రైల్వేకు చెందిన అనేక రైల్వే సంస్థలలో సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.
ఐఆర్‌సీటీసీ వంటశాలల్లో పరిశుభ్రంగా తయారీ..
రైల్వే వర్గాలు ఆర్‌సీటీసీ ప్రాథమిక వంటశాలలు, ఆర్‌పీఎఫ్ వనరులు, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారం ద్వారా వేడివేడిగా ఆహారాన్ని తయారు చేస్తున్నారు. మధ్యాహ్నం కాగితపు ప్లేట్లలో ఆహారాన్ని పేదలకు నిస్సహాయులకు అందిస్తున్నారు. రాత్రి పూట వండిన భోజనాన్ని ఆహార ప్యాకెట్లలో శుభ్రంగా ప్యాక్ చేసి నిరుపేదలకు అందిస్తున్నారు. ఆహార పంపిణీనిలో కూడా పూర్తి పరిశుభ్రతను, సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాలలో నిరుపేద ప్రజల ఆహార అవసరాలను తీర్చడంతో పాటు.. రైల్వే స్టేషన్‌ల పరిసరాలకు రాని ప్రాంతాలలోని అన్నార్తులకు ఆహార పంపిణీకి గాను రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్), జీఆర్‌పీ, రైల్వే జోన్‌ల వాణిజ్య విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిపాలన మరియు స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుంటున్నారు.
ప్రధాన జోన్ల పరిధిలో తయారీ..
ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ మరియు దక్షిణ మధ్య రైల్వే జోన్ల పరిధిలోని న్యూఢిల్లీ బెంగళూరు, హుబ్లి, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, భూసావల్, హౌరా, పాట్నా, గయా, రాంచీ, కతిహార్, దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్, బాలసోర్, విజయవాడ, ఖుర్దా, కట్పాడి, తిరుచిరాపల్లి, దన్‌బాద్, గౌహతి, సమస్తీపూర్, ప్రయగ్‌రాజ్, ఇటార్సీ, విశాఖపట్నం,
చెంగల్పటు, పూణే, హాజీపూర్, రాయపూర్, మరియు టాటానగర్లలోని గల ఐఆర్‌సీటీసీ ప్రధాన వంటశాలల సహకారంతో ఇప్పటి (20వ తేదీ) వరకు దాదాపు 20.5 లక్షల వండిన ఆహారాన్ని పంపిణీ చేశారు. ఇందులో సుమారు 11.6 లక్షల భోజనాల్ని ఐఆర్‌సీటీసీ, దాదాపుగా 3.6 లక్షల భోజనాలన్ని ఆర్‌పీఎఫ్ తన సొంత వనరుల నుండి అందించింది. దీనికి తోడు సుమారు 1.5 లక్షల భోజనాల్ని రైల్వే వాణిజ్య మరియు ఇతర విభాగాలు అందించాయి. దాదాపు 3.8 లక్షల భోజనాల్ని రైల్వే సంస్థలతో కలిసి పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థలు అందించాయి.
రోజుకు 50000 మందికి భోజనాలు..
ఐఆర్‌సీటీసీ ఇతర రైల్వే విభాగాలు ఎన్జీవోలు తమ సొంత వంటశాలల్లో తయారు చేసిన ఆహారాన్ని నిరుపేదలకు పంపిణీ చేయడంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ప్రధాన పాత్ర పోషించింది. మార్చి 28న 74 స్థానాలలో దాదాపు 5419 మంది పేదలకు ఆహారం పంపిణీ చేయడంతో మొదలైన ఈ కార్యక్రమం రోజురోజుకు పెరుగుతూపోతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 300 ప్రదేశాలలో సగటున రోజుకు సుమారు 50,000 మందికి ఆర్‌పీఎఫ్ భోజనాన్ని అందిస్తోంది. వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి భారతీయ రైల్వే సంస్థలు వేడిగా వండిన భోజనం తినిపించడానికి కలిసికట్టుగా ముందుకు నడుస్తూ ప్రతిరోజూ వేలాది మందికి ఆపద కాలంలో అన్నార్తిని తీరుస్తూ వారికి దన్నుగా నిలుస్తున్నాయి.
(Release ID: 1616403)
Visitor Counter : 317
Read this release in:
Kannada
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam