ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 నిర్వహణ స్థితిని సమీక్షించేందుకు రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్

- లాక్‌డౌన్ వేళ క్రమశిక్షణతో కూడిన జీవ‌నం వ‌ల్ల కోవిడ్‌-19 ఆటుపోట్లను త‌ట్టుకోవ‌డంలో మేటి ఫ‌లితాల‌నిస్తుంది
- "కోవిడ్ వైర‌స్ వ్యాప్తి క‌ఠిన సమయాల్లో మ‌న‌ ఆరోగ్య యోధుల సేవలకు దేశం మొత్తం కృతజ్ఞతలు చెబుతోంది"
- "రికవరీ రేటు పెరగడానికి గాను భారతదేశంలో ముందంచెలోని ఆరోగ్య కార్యకర్తలు అందిస్తున్న నాణ్య‌మైన సంరక్షణ చ‌ర్య‌ల‌ను ప్రతిబింబిస్తుంది": డాక్టర్ హర్ష్ వర్ధన్

Posted On: 19 APR 2020 6:08PM by PIB Hyderabad

కోవిడ్‌-19 నిర్వహణ స్థితిని సమీక్షించేందుకు గాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఆదివారం రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించారు. కోవిడ్ -19 వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో పెరుగుతున్న ఆసుప్ర‌తుల‌ సంసిద్ధత, అవ‌స‌రాల‌ను గుర్తించేందుకు గాను మంత్రి రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించారు. మొత్తం 450 పడకలు, ఐసోలేష‌న్ వార్డుల‌తో ఈ ఆసుపత్రి కోవిడ్‌-19 వైర‌స్ రోగుల‌కు ప్ర‌త్యేక‌ చికిత్స ఆసుపత్రిగా పని చేస్తోంది. ఫ్లూ కార్నర్, ఐసోలేషన్ వార్డులు, అబ్జర్వేషన్ వార్డులు, క్రిటిక‌ల్  కేంద్రాలు / ఐసీయులు, కోవిడ్ కారిడార్, కోవిడ్ ఏరియా, కోవిడ్ ఓపీడీ, కోవిడ్ నమూనా సేకరణ యూనిట్, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల సదుపాయాల్ని కూడా మంత్రి సందర్శించారు.
ఈ వార్డులను నిర్వహిస్తున్న వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బంది ఆర్‌ఎంఓ హాస్టల్‌లో తమను తాము శుభ్రం చేసుకొనేందుకు, విధుల అనంత‌రం క్రిమిసంహారకంగా చేసుకోవాడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానం, దుస్తుల మార్పిడి, స్ప్రే సౌకర్యాల‌ను గురించి మంత్రి సంద‌ర్శించారు.
ఈ చ‌ర్య‌ల ప‌ట్ల మంత్రి పూర్తి సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న ఆరోగ్య కార్యకర్తల ద్వారా వారి కుటుంబాల వారికి వైర‌స్ సంక్ర‌మ‌ణ ప్ర‌మాదాన్ని త‌గ్గించేందుకు, వారికి రవాణా సమస్యలను నివారించేందుకు అధికారులు ఆసుప‌త్రి సమీపంలోనే ప‌లు హోటళ్లలో బస సౌకర్యం ఏర్పాటు చేశారు.
కోవిడ్ సోకిన వైద్యుడితో మాట్లాడిన మంత్రి
కోవిడ్ వైర‌స్ సంక్రమించి కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న ఒక వైద్యుడితో మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ముచ్చ‌టించారు. స‌ద‌రు వైద్యుడు విమానాశ్ర‌యంలో కోవిడ్ రోగుల స్ర్కీనింగ్‌తో పాటు న‌రేలా క్వారంటైన్ కేంద్రంలో వైద్య‌ సేవ‌లు అందిస్తూ వైర‌స్ బారిన ప‌డ్డాడు. కోవిడ్ చికిత్స పొందుతున్న‌ వైద్యుడితో ముచ్చ‌టించిన‌ అనంత‌రం మంత్రి మాట్లాడుతూ “ ఆసుపత్రిలో వైద్యుడు బాగా కోలుకుంటున్నాడని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. అత‌నికి హృదయపూర్వక అభినంద‌న‌లు. కోవిడ్‌-19 తో బాధపడుతున్నప్పటికీ అతను చూపుతున్న అత్యున్న‌త‌ నైతికత చాలా ప్రోత్సాహకరంగా ఉంది” అని అన్నారు.
వైద్య సిబ్బంది చూపుతున్న నిబ‌ద్ధ‌త ప్ర‌శంస‌నీయం..
హాస్పిటల్లోని వివిధ వార్డులు ప‌లు ప్రాంగణాలలో త‌నిఖీలు నిర్వ‌హించిన త‌రువాత మంత్రి ప‌లు యూనిట్ల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌మీక్షా కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ “గత కొద్ది రోజులుగా, నేను కోవిడ్-19 యొక్క సంసిద్ధతను సమీక్షించేందుకు ఎయిమ్స్(ఢిల్లీ), ఎల్‌ఎన్‌జేపీ, ఆర్‌ఎంఎల్, సఫ్దర్‌జంగ్, ఎయిమ్స్ జాజ్జర్, రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీలను సందర్శిస్తున్న‌ట్టుగా తెలిపారు. కోవిడ్‌-19
మ‌హ‌మ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఈ ఆసుపత్రుల్లో చేసిన ఏర్పాట్ల ప‌ట్ల సంతృప్తి చెందాన‌ని తెలిపారు. కోవిడ్‌-19ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు గాను  ముందు వ‌రుస‌లో ఉన్న నర్సులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది చూపుతున్న నిబ‌ద్ధ‌త‌ను మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు.
దేశంలో పెరుగుతున్న రిక‌వ‌రీ రేటు..
దేశంలో కోవిడ్‌-19 రోగుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వ‌స్తోంద‌ని మంత్రి వివ‌రించారు. మార్చి 29 తో ముగిసిన వారంలో ఇది 8 శాతం ఉండ‌గా ఈ వారంలో ఇది 12 శాతానికి చేరిన‌ట్టుగా ఆయ‌న తెలిపారు. దీనిని బ‌ట్టి చూస్తే కోవిడ్ రోగులలో ఎక్కువ మంది కోలుకుంటూ వారి ఇళ్లకు తిరిగి వెళుతున్నారనే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంద‌న్నారు. ఇది ముందంచెలోని ఆరోగ్య కార్యకర్తలు అందించే నాణ్య‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ విధానాల్లోని నాణ్యతను ప్రతిబింబి స్తుంద‌ని తెలిపారు. ఈ మేటి విజయానికి తాను వారిని అభినందిస్తున్న‌ట్టుగా మంత్రి తెలిపారు. ఇలాంటి సమయాల్లో వారి సేవలకు దేశం కృతజ్ఞతలు తెలుపుతోంద‌న్నారు. ఈ పరీక్ష సమయాల్లో మన ఆరోగ్య యోధులు అధిక ధైర్యాన్ని చూప‌డం నిజంగా  హృదయపూర్వకంగా అభినంద‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు.
కేసుల వృద్ధిరేటు త‌గ్గింది...
రాష్ట్రాల సహకారంతో దేశంలో కోవిడ్‌-19 నివారణ, నియంత్రణ, నిర్వహణ అంశాన్ని అత్యున్న‌త స్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షించ‌డం జ‌రుగుతోంద‌ని మంత్రి పేర్కొన్నారు. “కొత్త కేసుల వృద్ధి రేటు కొంతకాలంగా స్థిరంగా ఉంది. లాక్‌డౌన్‌కు ముందు, మూడు రోజుల్లోనే కేసులు రెట్టింపు కావ‌డం క‌నిపించింద‌ని అన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల వ‌ర‌కు అందిన డేటా ప్రకారం గత ఏడు రోజులలో కేసుల‌ రెట్టింపు రేటు 7.2 రోజులుగా ఉంద‌ని తెలిపారు. గత 14 రోజులుగా విశ్లేషించి చూస్తే ఇది 6.2గాను, గత 3 రోజులలో ఇది 9.7గాను ఉంద‌ని తెలిపారు.
ప్రతి రోజూ చేసే పరీక్షల సంఖ్య కూడా దాదాపు 14 రెట్లు పెరిగినప్పటికీ కేసుల న‌మోదు తక్కువ ఉండ‌డం విశేష‌మ‌ని మంత్రి వివ‌రించారు. వృద్ధి తీరును పరిశీలిస్తే- మార్చి 15 నుండి 31 వరకు, ఇది 2.1 గా ఉంద‌న్నారు. అయితే ఏప్రిల్‌లో ఇది 1.2 కి త‌గ్గింద‌ని తెలిపారు. అంటే వృద్ధిలో దాదాపు 40% క్షీణ‌త క‌నిపిస్తోంద‌ని అన్నారు. ఇది ఒక సానుకూల సూచన అని.. దేశానికి నిజంగా ఇది ప్రోత్సాహకరంగా ఉంద‌ని తెలిపారు. దీనిని బ‌ట్టి చూస్తే కోవిడ్‌-19  కేసుల సంఖ్య పెరగడం లేదని స్థిరీకర‌ణ ద‌శ ప్రారంభ‌మైంద‌న‌డానికి ఇది సూచ‌న వంటిద‌ని మంత్రి పేర్కొన్నారు.
కోవిడ్‌పై క‌చ్చితంగా విజ‌యం సాధిస్తాం..
మే 03వ తేదీ వ‌ర‌కు పొడిగించిన లాక్‌డౌన్ కార్య‌క్ర‌మంలో కోవిడ్‌-19 వైర‌స్ సంక్ర‌మ‌ణ గోలుసు క‌ట్టును చేధించేందుకు గాను ప్ర‌జ‌లంద‌రు చిత్త‌శుద్ధితో ముందుకు సాగాల‌ని మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఒక లేఖ‌లో కోరారు. లాక్‌డౌన్‌ సమయంలో క్రమశిక్షణతో కూడిన జీవ‌నం వ‌ల్ల కోవిడ్‌-19 కార‌ణంగా ఏర్ప‌డుతున్న ఆటుపోట్లను త‌ట్టుకొని మేటి ఫ‌లితాలు అందుతాయ‌ని అన్నారు. " కోవిడ్‌-19పై పోరులో మ‌నం ఇప్ప‌టికే గెలిచామ‌ని.. ఇక‌పై కూడా ఈ యుద్ధంలో క‌చ్చితంగా విజ‌యం సాధిస్తాం” అని మంత్రి సంపూర్ణ విశ్వాసం వ్య‌క్తం చేశారు.

 

***


(Release ID: 1616171) Visitor Counter : 280