వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ త‌ర్వాత ఎఫ్ సి ఐ ఆధ్వ‌ర్యంలో ఈశాన్య రాష్ట్రాలకు ఆహార ప‌దార్థాల త‌ర‌లింపు కార్య‌క‌లాపాలు

లాక్ డౌన్ తర్వాత 25 రోజుల్లో 4, 42, 000 మెట్రిక్ ట‌న్నుల ఆహార ప‌దార్థాల‌తో కూడిన‌ 158 రైళ్ల లోడ్లను ఈశాన్య రాష్ట్రాల‌కు త‌ర‌లించిన ఎఫ్ సి ఐ
స‌రాస‌రి ప్ర‌తి నెలా పంపించే ఆహారా ప‌దార్థాలు 80 రైళ్ల లోడ్లుగా వుంటే లాక్ డౌన్ స‌మ‌యంలో ఇది రెట్టింపు
రైలు మార్గంతోపాటు రోడ్డు ర‌వాణాద్వారా కూడా ఈశ్యాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల‌కు చేరుకున్న ఆహార ప‌దార్థాలు

Posted On: 19 APR 2020 8:56PM by PIB Hyderabad

మార్చి నెల 24వ తేదీ దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించారు . ఆ  త‌ర్వాత భార‌త‌దేశ ఫుడ్ కార్పొరేష‌న్ చేప‌ట్టిన ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల్లో ఒక‌టి ఈశాన్య రాష్ట్రాల‌కు ఆహార ప‌దార్థాల స‌ర‌ఫ‌రా. ఈశాన్య రాష్ట్రాల‌కు చేరుకోవాలంటే రైలు సౌక‌ర్యాలు చాలా త‌క్కువ‌గా వున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అత్య‌ధిక జ‌నాభా ప్రజా పంపిణీ వ్య‌వ‌స్థ మీద అధికంగా ఆధార‌ప‌డి వుంటుంది కాబ‌ట్టి అక్క‌డ‌కు బియ్యం, గోధుమ‌ల్ని క్ర‌మం త‌ప్ప‌కుండా పంపించ‌డ‌మ‌నేది ఎఫ్ సి ఐకి పెద్ద స‌వాలుగా మారింది. లాక్ డౌన్ తర్వాత 25 రోజుల్లో 4, 42, 000 మెట్రిక్ ట‌న్నుల ఆహార ప‌దార్థాల‌తో కూడిన‌ 158 రైళ్ల లోడ్లను ఈశాన్య రాష్ట్రాల‌కు ఎఫ్‌ సి ఐ త‌ర‌లించింది. ఇందులో 22 వేల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌లుంటే 4, 20, 000 మెట్రిక్ ట‌న్నుల బియ్యం వున్నాయి. స‌రాస‌రి ప్ర‌తి నెలా పంపించే ఆహారా ప‌దార్థాలు 80 రైళ్ల లోడ్లుగా వుంటే లాక్ డౌన్ స‌మ‌యంలో ఇది రెట్టింపు అయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎఫ్ సిఐ ఆధ్వ‌ర్యంలో 86 డిపోలు ప‌ని చేస్తున్నాయి. వీటిలో 38 డిపోల‌కు మాత్ర‌మే రైలు మార్గం వుంది. మేఘాల‌య డిపోల‌కు చేరుకోవాలంటే పూర్తిగా రోడ్డు మార్గ‌మే శ‌ర‌ణ్యం. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని 13 డిపోల‌లో కేవ‌లం రెండింటిని మాత్ర‌మే రైలు మార్గంద్వారా చేరుకోగ‌లం. ఈ ప‌రిస్థితుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని ప‌లు మారుమూల ప్రాంతాల‌కు ఆహార ప‌దార్థాలు చేరుకోవాలంటే రోడ్డు మార్గం త‌ప్ప‌నిస‌రి. 
ట్ర‌క్కుల‌ద్వారా ర‌వాణా అనేది ఎక్కువ‌గా అస్సాంనుంచి జ‌రుగుతుంది. లాక్ డౌన్ త‌ర్వాత 25 రోజుల్లో అస్సాం నుంచి మేఘాల‌య‌కు రోడ్డు మార్గంద్వారా 33 వేల మెట్రిక్ ట‌న్నుల ఆహార ధాన్యాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది. అలాగే అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ కు రోడ్డు మార్గంద్వారా 11 వేల మెట్రిక్ ట‌న్నుల ఆహార ప‌దార్థాల‌ను పంప‌డం జ‌రిగింది. అలాగే నాగాలాండ్ లోని డిమాపూర్ నుంచి మ‌ణిపూర్ కు రోడ్డు మార్గంద్వారా 14 వేల మెట్రిక్ ట‌న్నుల ఆహార ప‌దార్థాల‌ను స‌ర‌ఫ‌రా చేశారు. ఇలా ప‌లు ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల‌కు ట్ర‌క్కుల‌ద్వారా ఆహార ప‌దార్థాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం అనేక స‌వాళ్ల‌తో కూడుకున్న ప‌ని 
అస్సాంలోని కొన్ని డిపోలు త‌ప్పిస్తే ఈ ప్రాంతంలోని ప‌లు  ఎఫ్ సి ఐ గోదాములు చాలా చిన్న‌వి. దాంతో పిడిఎస్ ద్వారా పంపిణీ అంత‌రాయం లేకుండా సాగాలంటే ఈశాన్య రాష్ట్రాల‌కు క్రమం త‌ప్ప‌కుండా ఆహార పదార్థాల‌ను పంపాల్సి వుంటుంది. అంతే కాదు దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కార‌ణంగా రాష్ట్రాల స‌రిహ‌ద్దుల్లో అనేక నియ‌మ నిబంధ‌న‌లుండ‌డంతో ఎఫ్ సి ఐ అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. 
అయిన‌ప్ప‌టికీ అన్ని ర‌కాల ఇబ్బందుల‌ను అధిగ‌మించి ఈ 25 రోజుల్లో ఆహార ప‌దార్థాల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింది. ఇందులో ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న కింద 1, 74, 000 మెట్రిక్ ట‌న్నుల ఆహార ప‌దార్థాల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింది. 
రాష్ట్రాల వారీగా ఆహార ప‌దార్థాల కేటాయింపు ఇలా వుంది 

అస్సాం                        2,16,000 మెట్రిక్ ట‌న్నులు

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్      17,000 మెట్రిక్ ట‌న్నులు

మేఘాల‌య:                  38,000 మెట్రిక్ ట‌న్నులు

మ‌ణిపూర్‌                      18,000 మెట్రిక్ ట‌న్నులు

మిజోరాం :                     14,000 మెట్రిక్ ట‌న్నులు
నాగాల్యాండ్ :                    14,000 మెట్రిక్ ట‌న్నులు

త్రిపుర‌:                         33,000 మెట్రిక్ ట‌న్నులు
ఎన్ ఎఫ్ ఎస్ ఏ మ‌రియు పిఎం జి కె ఏ వై ల కింద కేటాయింపులు కాకుండా ఎఫ్ సి ఐ అధ‌నంగా ఆహార పదార్థాల‌ను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌ర‌ఫ‌రా చేసింది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల కింద‌కు రాని ప్ర‌జ‌ల‌కు, వ‌ల‌స కార్మికుల‌కు అంద‌జేయ‌డానికిగాను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు బ‌హిరంగ మార్కెట్ ధ‌ర‌ల కింద ఈ ఆహార ప‌దార్థాల‌ను ఇవ్వ‌డం జ‌రిగింది. 
భూటాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, మైన్మార్ దేశాల స‌రిహ‌ద్దుల్లోని మారుమూల ప్రాంతాల‌కు చేరుకోవ‌డానికి చాలా క‌ష్ట‌మైన మార్గాల గుండా ప్ర‌యాణం చేయాల్సి వుంటుంది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ఆహార ప‌దార్థాల‌ను అందించ‌డానికిగాను అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఎఫ్ సి ఐ కృషి చేస్తోంది. దేశంలోని ప్ర‌తి ప్రాంతానికి ఆహార ప‌దార్థాల‌ను చేర్చాలనే నిబ‌ద్ద‌త‌తో ఎఫ్ సి ఐ ప‌ని చేస్తోంది. 
.................

 (Release ID: 1616265) Visitor Counter : 70