రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నరేలా క్వారంటైన్ సెంటర్ కు సైన్యం మద్దతు

Posted On: 19 APR 2020 7:37PM by PIB Hyderabad


దేశంలో కోవిడ్ అనుమానితులకు ఆశ్రయం కల్పించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అతి పెద్ద కేంద్రాల్లో ఢిల్లీలోని నరేలా క్వారంటైన్ సెంటర్ ఒకటి. 2020 మార్చి నెల మధ్యలో ఢిల్లీ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ప్రారంభంలో పలు మిత్రదేశాల నుంచి భారత్ కు వచ్చిన 250 మంది విదేశీయులను ఈ కేంద్రంలో ఉంచారు. ఆ తర్వాత నిజాముద్దీన్ లో జరిగిన మర్కజ్ కు హాజరైన వెయ్యి మందిని  కూడా ఉంచేందుకు అవకాశం కల్పిస్తూ ఈ వసతిని విస్తరించారు.

2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి నరేలా క్వారంటైన్ సెంటర్ లోని పౌర యంత్రాంగానికి సైన్యానికి చెందిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సహకారం అందిస్తున్నారు. ఈ సెంటర్ నిర్వహణలో ఉన్న ఢిల్లీకి చెందిన ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బందికి పగలంతా విశ్రాంతి తీసుకుని రాత్రి వేళల్లో మాత్రమే రావడానికి అవకాశం కల్పించడం కోసం ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతను సైన్యం చేపట్టింది. సైన్యానికి చెందిన ఆరుగురు వైద్యులు, 18 మంది పారామెడికల్ సిబ్బంది సహా మొత్తం 40 మంది ఈ కేంద్రం ప్రాంగణంలోనే నివాసం ఉండడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

సైన్యానికి చెందిన వైద్య సిబ్బంది అనుసరిస్తున్న వృత్తిపరమైన వైఖరి ఈ కేంద్రంలో ఉన్న వారి హృదయాలను ఆకట్టుకుంది. వారందరికీ నిర్వహించాల్సిన వైద్యపరమైన లాంఛనాలన్నీ తేలిగ్గా పూర్తి చేయడానికి సైన్యానికి చెందిన వైద్య బృందానికి వారంతా సానుకూలంగా స్పందిస్తూ ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో మర్కజ్ కు హాజరైన వారిలో 932 మంది ఆశ్రయం పొందగా వారిలో 367 మందికి కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

ఈ కేంద్రం మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో పౌర యంత్రాంగం సహకారం అద్భుతంగా ఉంది. పౌరులందరి భద్రత కోసం జాతీయ స్థాయిలో జరుగుతున్న కరోనా కట్టడి పోరాటానికి సైన్యం సంకల్పశుద్ధి, చిత్తశుద్ధితో హృదయపూర్వకంగా సహకారాన్ని కొనసాగిస్తుంది.



(Release ID: 1616270) Visitor Counter : 225