బొగ్గు మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 పై పోరాటంలో మేము సైత‌మంటూ ముందుకొచ్చిన బొగ్గు మ‌రియు గ‌నుల ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు : శ‌్రీ ప్ర‌హ్లాద్ జోషి

ఒడిషాలో ప్రారంభించిన కోవిడ్ -19 ఆసుప‌త్రుల‌కు నిధులందిస్తోన్న నాల్కో, ఎంసిఎల్ సంస్థ‌లు

Posted On: 20 APR 2020 3:20PM by PIB Hyderabad

ఒడిషాలో తాజాగా రెండు కోవిడ్ -19 ఆసుప‌త్రులు ప్రారంభ‌మ‌మ్యాయి. వీటిని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఒడిషా ముఖ్య‌మంత్రి శ్రీ న‌వీన్ ప‌ట్నాయ‌క్,   కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి శ్రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ , కేంద్ర బొగ్గు మ‌రియు స‌హ‌జ‌వాయువు శాఖ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషి ప్రారంభించారు.   వీటికి కావ‌‌ల‌సిన నిధుల‌ను నేష‌న‌ల్ అల్యూమినియం కంపెనీ ( నాల్కో), కోల్ ఇండియా స‌బ్సిడిరీ సంస్థ మ‌హాన‌ది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ( ఎంసిఎల్ ) అంద‌జేయ‌నున్నాయి. ఒడిషా రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రు‌ల‌కు రాష్ట్రంలోని ఇత‌ర ఆసుప‌త్రుల‌నుంచి స‌హ‌కారం వుంటుంది. 
కోవిడ్ -19పై పోరాటంలో భాగంగా బొగ్గు మ‌రియు గ‌నుల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు చేయూత‌నివ్వ‌డం గ‌ర్వ‌కార‌ణంగా వుంద‌ని కేంద్ర మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషి అన్నారు. కోవిడ్‌-19 వ్యాధికి చికిత్స‌నందించే ఈ ఆసుపత్రులు ఒడిషా ప్ర‌జ‌ల చాలా స‌హాయ‌క‌రంగా వుంటాయ‌ని ఆయ‌న అన్నారు. ఒడిషా రాష్ట్రం న‌వ‌రంగ‌పూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఆసుప‌త్రికి నాల్కో సాయం అందిస్తుంది. ఇది 200 ప‌డ‌క ఆసుప‌త్రి. ఇక అంగుల్ జిల్లా తాల్చేర్ వద్ద ఏర్పాటు చేసిన ఆసుప‌త్రికి ఎంసిఎల్ నిధులందిస్తుంది. ఇది 150 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి. 
ఎంసిఎల్ త‌న మెడిక‌ల్ కాలేజీ ద‌గ్గ‌ర వున్న స‌దుపాయాల‌ను కూడా కోవిడ్ ఆసుప‌త్రికి అందిస్తోంది. 
జిల్లా ఖ‌నిజ నిధి ద‌గ్గ‌ర మిగిలిపోయిన నిదుల్లో 30 శాతం దాకా కోవిడ్ -19 పై పోరాటానికి వినియోగించుకోవ‌చ్చ‌ని ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది. ఈ నిర్ణయం కార‌ణంగా ఖ‌నిజ సంప‌ద అధికంగా వున్న ఒడిషాలాంటి రాష్ట్రాలు ల‌బ్ధి పొందుతాయ‌ని బొగ్గు మ‌రియు గ‌నుల కేంద్ర మంత్రి అన్నారు. 
అంతే కాదు నాల్కోకు చెందిన ఉద్యోగులు తమ ఒక రోజు జీతాన్ని అంటే రెండున్నర కోట్ల రూపాయ‌ల్ని ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందించారు. ఇక ఎంసిఎల్... ఇప్ప‌టికే ఒడిషా ప్ర‌భుత్వం భువ‌నేశ్వ‌ర్ లో ప్రారంభించిన కోవిడ్ -19 ఆసుప‌త్రికి నిధులందించింది. ఒడిషాలోని జార్సుగూడ జిల్లాలో 50 ప‌డ‌క‌ల ఐసోలేష‌న్ కేంద్రాన్నికూడా ఎంసిఎల్ ప్రారంభించింది. సేవ‌లందించ‌డంలో స‌దా ముందు వుండే ఎంసిఎల్ పారిశుద్ధ్య ప‌నుల్లో కూడా పాల్గొంటున్న‌ది. మాస్కుల‌ను, శానిటైజ‌ర్ల‌ను త‌మ ఉద్యోగులతోపాటు చుట్టుప‌క్క‌ల నివ‌సించే ప్ర‌జ‌ల‌కు కూడా అందించింది.  
కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ నాల్కో కేంద్ర గ‌నుల శాఖ కింద ప‌ని చేస్తోంది. ఎంసిఎల్ అనేది కేంద్ర బొగ్గు శాఖ కింద ప‌ని చేసే కోల్ ఇండియా లిమిటెడ్ ( సిఐఎల్ )కు అనుబంధంగా ప‌ని చేస్తోంది. భార‌త‌దేశంలో 32 శాతం బాక్సైట్‌, 33 శాతం అల్యూమినా మ‌రియు 12 శాతం అల్యూమినియం ఉత్ప‌త్తి నాల్కో ద్వారా సాధ్య‌మవుతోంది. ఇక ఇండియాలో ల‌భించే 80శాతం బొగ్గు ఉత్ప‌త్తి సిఐఎల్ ద్వారా జ‌రుగుతోంది. 
 

 

****


(Release ID: 1616397) Visitor Counter : 285