PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 19 APR 2020 6:40PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 15,712; నయమై/కోలుకుని ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 2,231.
  • నియంత్రణేతర ప్రాంతాల్లో రేపటినుంచి దిగ్బంధం ఆంక్షల సడలింపు.
  • దిగ్బంధం సమయంలో ఈ-కామర్స్‌ సంస్థలద్వారా నిత్యావసరాలు కాని వస్తువుల సరఫరాపై నిషేధం.
  • ఆయా రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికుల పయనానికి ప్రామాణిక కార్యకలాపాల ప్రక్రియల ఆవిష్కరణ.
  • దిగ్బంధం వేళ 16.01కోట్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష లబ్ధి బదిలీద్వారా రూ.36,659కోట్లు జమ.
  • దేశీయ పౌర విమానయాన సేవల పునరుద్ధరణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
  • పెన్షన్‌ తగ్గింపు ప్రతిపాదనేదీ లేదని, ఈ మేరకు వస్తున్న కథనాలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టంచేసింది.
  • నావికాదళ ఓడ, జలాంతర్గామి లేదా విమాన స్థావరాలలో ఎక్కడా కోవిడ్‌-19 కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని భారత నావికాదళం స్పష్టీకరణ.

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 15,712కి చేరింది. కాగా, మొత్తం కేసులకుగాను 14.19 శాతం.. అంటే- వైరస్‌ బారినపడి కోలుకుని/పూర్తిగా నయమై ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 2,231గా నమోదైంది. కోవిడ్‌-19 చికిత్స కోసం కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక ఆస్పత్రులను గుర్తించారు. నియంత్రణేతర ప్రాంతాల్లో రేపటినుంచి దిగ్బంధం ఆంక్షలను సడలిస్తారు. అయితే, హాట్‌స్పాట్‌ జిల్లాల పరిధిలోని నియంత్రణ ప్రాంతాల్లో నిబంధనల సడలింపు ఉండదు. అంతేకాకుండా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అదనపు ఆంక్షలను విధించే అవకాశం ఉంది. ఇక ఔషధ, టీకా పరీక్షలకు సంబంధించి శాస్త్రవిజ్ఞానాంశాల పరిశీలన కోసం ఉన్నతస్థాయి కార్యాచరణ బృందం ఏర్పాటైంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616139

ఈ-కామర్స్‌ కంపెనీలద్వారా నిత్యావసరాలు కాని వస్తువుల సరఫరాపై నిషేధం

దిగ్బంధం సమయంలో ఈ-కామర్స్‌ సంస్థలు నిత్యావసరాలు కాని వస్తువులను సరఫరా చేయడంపై నిషేధం కొనసాగుతుందని దేశీయాంగ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616006

కోవిడ్‌-19 నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల పయనానికి ప్రామాణిక కార్యకలాపాల ప్రక్రియలు జారీ

కోవిడ్‌-19 వ్యాప్తి కారణంగా పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణరంగాల్లో పనిచేసే వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులకు ఆయా రాష్ట్ర్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆశ్రయాలు, సహాయ శిబిరాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఏకీకృత సవరించిన మార్గదర్శకాల మేరకు నియంత్రణేతర ప్రాంతాల్లో 2020 ఏప్రిల్‌ 20 నుంచి అదనపు కొత్త కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించింది. అందువల్ల ఈ కార్మికులు ఆయా పరిశ్రమలు, వ్యవసాయ పనులు, జాతీయ గ్రామీణ ఉపాధి పనులకు వెళ్లే వీలుంది. ఆ మేరకు వెసులుబాటు కల్పిస్తూ దేశీయాంగ శాఖ ఆదేశాలు జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616085

కోవిడ్‌-19 నియంత్రణతోపాటు ఏప్రిల్‌ 20 నుంచి దిగ్బంధం ఆంక్షల సడలింపులో వర్తింపజేయదగిన అంశాలపై రాష్ట్రాలతో చర్చించాల్సిందిగా ఉన్నతాధికారులకు  దేశీయాంగ శాఖ మంత్రి ఆదేశం

దేశంలో కోవిడ్‌-19 సంబంధిత స్థితిగతులపై దేశీయాంగ శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా నిన్న తమశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కోవిడ్‌-19 నియంత్రణతోపాటు ఏప్రిల్‌ 20 నుంచి దిగ్బంధం ఆంక్షల సడలింపులో వర్తింపజేయదగిన అంశాలపై రాష్ట్రాలతో చర్చించాలని ఈ సందర్భంగా వారిని ఆదేశించారు. కాగా, హాట్‌స్పాట్‌/క్లస్టర్‌/నియంత్రణ జోన్ల పరిధిలో నిర్దిష్ట కార్యకలాపాలను అనుమతిస్తున్నందున తగిన ముందుజాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు. తదనుగుణంగా వాస్తవాల నిర్ధారణ మేరకు మినహాయింపులు/సడలింపులు ఇవ్వాలని సూచించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616148

దేశీయ పౌర విమానయాన సేవల పునరుద్ధరణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

దేశీయ పౌర విమానయాన సేవల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

పెన్షన్‌ తగ్గింపు ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి పరిస్థితులు, రాబోయే ఆర్థిక ఒడుదొడుకుల దృష్ట్యా పెన్షన్ల కోత/తగ్గింపుపై యోచిస్తున్నదంటూ వస్తున్న కథనాలను కేంద్ర సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్ల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పెన్షనర్లకు ఆందోళన కలిగించేలా పుట్టుకొచ్చిన కథనాల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని వెల్లడించింది. దీనికి సంబంధించి ప్రభుత్వంవద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని, అటువంటి ఆలోచన కూడా లేదని విశదీకరించింది. పెన్షనర్ల సంక్షేమం-శ్రేయస్సుకు ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615802

కోవిడ్‌-19పై పోరులో భాగంగా దేశీయాంగ శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూముల కార్యకలాపాలపై శ్రీ అమిత్‌ షా సమీక్ష

కోవిడ్‌-19పై పోరులో భాగంగా దేశీయాంగ శాఖ ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూముల కార్యకలాపాలపై సమీక్ష సమావేశానికి ఆ శాఖ శ్రీ అమిత్‌ షా అధ్యక్షత వహించారు. ఈ కంట్రోల్‌ రూములు నిరంతరం సేవలందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవడమేగాక వైరస్‌పై యుద్ధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలతోనూ నిత్య సంబంధాలు నెరపుతున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615919

భారత నావికాదళం సదా సన్నద్ధం...  ఏ క్షణంలోనైనా యుద్ధానికి సిద్ధం

కోవిడ్‌-19 వైర‌స్ సోకిన 26 మంది నావికులు ముంబైలోని ఐఎన్ఎస్ యాంగ్రేకు చెందినవారేన‌ని, వీరికి ప్ర‌స్తుతం ఏకాంత చికిత్స అందిస్తున్నామ‌ని భార‌త‌ నావికాద‌ళం తెలిపింది. వీరు మినహా ప్ర‌స్తుతం ఓడ‌లు, జ‌లాంత‌ర్గాములు, విమాన స్థావ‌రాల‌లో ఉన్న ఏ ఒక్క‌రికీ వైర‌స్ సోక‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. నావికా దళ వ్య‌వ‌స్థ‌ల‌ను మూడంచెల‌లో మోహ‌రించి, స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉన్న‌ట్లు వివ‌రించారు. అలాగే నావికా దళానికి చెందిన నెట్‌వర్క్ వ్య‌వ‌స్థ‌లు అంతరిక్ష నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ‌లు కూడా గ‌రిష్ఠ స్థాయిలో పనిచేస్తున్నాయ‌ని వెల్ల‌డించింది. ఎప్ప‌టిలాగానే పోరాటానికి పూర్తి ‌స‌న్న‌ద్ధతో ఉంటూనే.. కోవిడ్‌-19 మహమ్మారిపై జాతీయ స్థాయి పోరులో పాల్గొనేందుకు పూర్తి సంసిద్ధ‌త‌తో ఉన్నామ‌ని తెలిపింది. దీనికితోడు హిందూ మహాసముద్ర తీరప్రాంతంలోని భార‌త్‌ మిత్రదేశాలకూ సహాయం అందించడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్న‌ట్టు వెల్ల‌డించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615879

కోవిడ్‌-19 దిగ్బంధం సమయంలో 16.01 కోట్లమంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు పీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ప్రత్యక్ష లబ్ధి బదిలీకింద రూ.36,659 కోట్లు బదిలీ

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్యాకేజీ కింద నగదు ప్రయోజనాన్ని ప్రత్యక్ష లబ్ధి బదిలీ డిజిటల్‌ మౌలిక సౌకర్యం వేదికగా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఇందుకోసం పీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను గడచిన మూడు ఆర్థిక సంవత్సరాలుగా ప్రభుత్వం వినియోగిస్తోంది. తదనుగుణంగా 2018-19లో డీబీటీ కింద పంపిణీ చేసిన మొత్తం 22 శాతం కాగా, 2109-20 ఆర్థిక సంవత్సరానికల్లా 45 శాతానికి పెరిగింది. లబ్ధిదారులు ఖాతాల్లోకి లబ్ధిని నేరుగా జమ చేసేందుకు డీబీటీ భరోసా ఇస్తుంది. అంతేకాకుండా సమర్థత ఇనుమడించడంతోపాటు దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616228

కోవిడ్‌-19 నేపథ్యంలో ఇచ్చిన గడువు పొడిగింపును పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా రిటర్న్‌ ఫారాలను సవరించనున్న సీబీడీటీ

కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన వివిధ గడువు పొడిగింపు వెసులుబాట్లను ఆదాయపు పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు-సీబీడీటీ 2019-20 ఆర్థిక సంవత్సరం (అంచనా సంవత్సరం 2020-21) సంబంధిత రిటర్నులను సవరిస్తోంది. దీనిపై ఈ నెలాఖరునాటికి నోటిఫికేషన్‌ జారీకానుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616098

దిగ్బంధం ఉన్నా పంట నూర్పిళ్లు, వేసవి పంట‌ల సాగులో అంతరాయం నామ‌మాత్రమే

ప్ర‌స్తుత అనిశ్చితి మధ్య దేశానికి ఆశాజ్యోతిగా నిలిచేది వ్యవసాయ కార్యకలాపాలే. దేశ ఆహార భద్రతకు భరోసా ఇస్తున్నది వ్యవసాయ రంగమే. దేశమంతటా అనేకమంది రైతులు, వ్యవసాయ కూలీలు ఎన్నో కష్టాలను భరిస్తూ నిత్యం చెమటోడుస్తూ పంటలు పండిస్తున్నారు. వారిపని వారు నిశ్శబ్దంగా చేసుకుపోతుండగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమయానుకూల చర్యలతో పంట నూర్పిళ్లకు అంతరాయం నామమాత్రంగానే ఉంది. మరోవైపు వేసవి పంటల సాగు కొనసాగుతూనే ఉంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616119

కోవిడ్‌-19పై పోరాటం బలోపేతం; 2,81,061 కిలోమీటర్లు ప్రయాణించిన లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు

‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ కింద ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌సహా ప్రైవేటు విమానయాన సంస్థలు 288 విమానాలను నడిపాయి. ఈ విమానాల ద్వారా సుమారు 479.55 టన్నుల సరఫరాలను రవాణా చేశాయి. ఈ క్రమంలో లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు 2,87,061 కిలోమీటర్లు ప్రయాణించాయి. కోవిడ్‌-19పై జాతి పోరాటానికి మద్దతుగా పౌర విమానయాన మంత్రిత్వశాఖ దేశంలోని మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య సరఫరాలు చేసేందుకు ఈ విమానాలను నడిపిస్తోంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616048

దిగ్బంధం సందర్భంగా దేశం నలుమూలలకు 1,150 టన్నుల వైద్య సరఫరాలను చేరవేసిన రైల్వేశాఖ

కోవిడ్‌-19వ‌ల్ల జాతీయ దిగ్బంధం నేప‌థ్యంలో అత్యవసర వైద్య సామగ్రిని భారత రైల్వేశాఖ నిరంత‌రాయంగా రవాణా చేస్తోంది. ఈ మేర‌కు దేశంలో క‌రోనా వైరస్ ప్రతికూల ప్రభావాన్ని, స‌వాళ్ల‌ను తిప్పికొట్ట‌డంలో ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధానికి మ‌ద్ద‌తుగా ఔషధాలు, మాస్క్ లు, ఇతర ఆసుపత్రి సామగ్రిని సకాలంలో అందిస్తూ త‌న క‌ర్త‌వ్యాన్ని స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తిస్తోంది. త‌ద‌నుగుణంగా 2020 ఏప్రిల 18వ‌ర‌కూ 1,150 టన్నుల వైద్య సామగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాల‌కు రవాణా చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616077

పాద‌ర‌క్ష‌ల ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధుల‌కు అన్నివిధాలా మ‌ద్ద‌తిస్తాం: కేంద్ర మంత్రి శ్రీ నితిన్‌గడ్క‌రీ హామీ

కోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన దిగ్బంధంవ‌ల్ల త‌లెత్తిన స‌వాళ్ల‌ను ఎదుర్కొనే దిశ‌గా ప్ర‌భుత్వం అన్నివిధాలా మ‌ద్ద‌తిస్తుంద‌ని పాదరక్షల పరిశ్రమ ప్రతినిధులకు  కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డుర‌వాణా-జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గ‌డ్క‌రీ హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615827

నియంత్ర‌ణ లేని ప్రాంతాల్లో 2020 ఏప్రిల్ 20 నుంచి దిగ్బంధం స‌డ‌లింపుపై రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రుల‌తో కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయ‌తీరాజ్‌-వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మ స‌మావేశం.

‌జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం, పీఎంఏవై (జి), పీఎంజీఎస్‌వై, ఎన్ఆర్ఎల్ఎం త‌దిత‌ర ప‌థ‌కాల కింద ప‌నుల నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా చేప‌ట్టాల్సిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల గురించి ఈ సంద‌ర్భంగా శ్రీ న‌రేంద్ర ‌సింగ్ తోమ‌ర్ నొక్కిచెప్పారు. ఎన్ఆర్ఎల్ఎం కింద స్వ‌యం స‌హాయ సంఘాల మ‌హిళ‌లు ‌ఫేస్‌మాస్కులు, ప‌రిశుభ్ర‌త ద్ర‌వాలు, స‌బ్బులు త‌దిత‌రాలు త‌యారుచేసి ఇవ్వ‌డంతోపాటు పెద్ద సంఖ్య‌లో సామాజిక వంట‌శాల‌లు నిర్వ‌హించ‌డంపై మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615883

క‌రోనా వైర‌స్‌పై పోరాడుతున్న యోధుల గౌర‌వార్థం ఎర్ర‌కోట‌, కుతుబ్‌మినార్‌, హుమ‌యూన్ స‌మాధుల‌వ‌ద్ద విభిన్నంగా విద్యుద్దీపాలంక‌ర‌ణ

ప్ర‌పంచ వార‌స‌త్వ దినోత్స‌వం సంద‌ర్భంగా క‌రోనాపై పోరాడుతున్న సాహ‌సుల‌కు భార‌త పురాత‌త్వ అధ్య‌య‌న శాఖ‌, ఢిల్లీ స‌ర్కిల్ వినూత్న రీతిలో కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ మేర‌కు ‌న్యూఢిల్లీలోని చారిత్ర‌క సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలైన ఎర్ర‌కోట‌, కుతుబ్‌మినార్‌, హుమయూన్ స‌మాధి త‌దిత‌రాల‌ను వినూత్న‌రీతిలో విద్యుద్దీపాల‌తో అలంక‌రించింది. అంతేకాకుండా ఈ వార‌స‌త్వ క‌ట్ట‌డాల‌ను గౌర‌వించి, ప‌రిర‌క్షించుకోవ‌డంపై దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మంద్వారా పాఠ‌శాల విద్యార్థుల‌తో ప్ర‌తిజ్ఞ చేయించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615962

కోవిడ్‌-19పై పోరులో భాగంగా కార్వార్‌ వద్ద సేవలందిస్తున్న భారత నావికాదళ నౌకాస్పత్రి... ఐఎన్‌హెచ్‌ఎస్‌ పతంజలి

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1616101

విద్యుత్ లేకుండా విద్యుదావేశంతో అంటువ్యాధుల‌ను నిరోధించే ట్రైబో-ఇ మాస్కులను రూపొందించిన సెంట‌ర్ ఫ‌ర్ నానో అండ్ సాఫ్ట్ మేట‌ర్ సైన్సెస్ సంస్థ‌

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615833

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • అరుణాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్రంలో చిక్కుకుపోయిన కార్మికులకు సహాయ శిబిరాల్లో ఆహారం, వైద్యం, పడక తదితర ప్రాథమిక సదుపాయాలన్నీ కల్పించినట్లు ఇటానగర్‌ పాలన యంత్రాంగం తెలిపింది.
  • అసోం: రాష్ట్రంలో 2020 ఏప్రిల్‌ 21 నుంచి ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మోటారు మెకానిక్‌లు, కార్పెంటర్లు కంప్యూటర్‌/మొబైల్‌ మెకానిక్‌లు వినియోగదారుల ఇళ్లకు వెళ్లి సేవలందించవచ్చు. అయితే, ఈ సందర్భంగా నిర్దేశిత నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కాగా, గువహటి నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం/మూత్ర విసర్జన చేయడాన్ని నిషేధిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రకటించారు. కోవిడ్‌-19 నియంత్రణలో భాగంగా జారీచేసిన ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే రూ.1,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
  • మణిపూర్‌: రాష్ట్రంలో ఇంటింటికీ నిత్యావసరాల సరఫరా నిమిత్తం ఇంఫాల్‌లో హోమ్‌ డెలివరీ సప్లయిస్‌ మేనేజ్‌మెంట్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. కాగా, రాష్ట్రంలో నమోదైన రెండు కోవిడ్‌-19 కేసులు నెగటివ్‌గా తేలడంతో మణిపూర్‌ వైరస్‌రహితమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
  • మిజోరం: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎంఆర్‌ ద్వారా ఐఏఎఫ్‌ విమానాలతో రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు ఇవాళ 9 పెట్టెల వైద్య సరంజామా అందింది.
  • నాగాలాండ్‌: రాష్ట్రంలో 15,340 వ్యక్తిగత రక్షణ సామగ్రి, ఎన్‌95 మాస్కులు 23,115, వెంటిలేటర్లు 49సహా 432 పడకలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
  • త్రిపుర: రాష్ట్రంలోని 8,666 మంది వీధి వ్యాపారులకు ఉచిత రేషన్‌సహా రూ.1,000వంతున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందుతోంది.
  • కేరళ: అమెరికా సంస్థ స్ప్రింక్లర్‌కు కోవిడ్‌ ఆరోగ్య సమాచారం అందజేయడంలో రాష్ట్ర ఐటీశాఖ తప్పిదమేమీ లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్‌-19 నియంత్రణపై ప్రభుత్వ కృషిని నీరుగార్చి అప్రతిష్టపాల్జేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తున్నదని ముఖ్యమంత్రి ఆరోపించారు. కాగా, నిన్న 4 కొత్త కేసులు రాగా, ఇద్దరు కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 140 కాగా, కోలుకుని ఇళ్లకు వెళ్లినవారు 257 మంది; మరో 67,190 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో ఇవాళ నమోదైన కొత్త కేసులన్నీ వ్యాధిగ్రస్థులతో సంబంధం గలవారేనని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు. మరోవైపు ఏ లక్షణాలూ లేనివారితోపాటు అధికంగా ఆధారపడి ఉన్న యూనిట్లలో అధిక ముప్పున్న రోగులను కూడా ప్రభుత్వం పర్యవేక్షించనుంది. కాగా, ప్రభుత్వం నియమించిన 21 మంది సభ్యుల నిపుణుల కమిటీ సోమవారం ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,372 కాగా, మరణాలు 15; కోలుకున్నవారి సంఖ్య 365.
  • కర్ణాటక: రాష్ట్రంలోని మైసూర్‌లో ఇవాళ 4 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 388కి చేరింది. మరణాలు 14 నమోదు కాగా, డిశ్చార్జి అయినవారి సంఖ్య 104గా ఉంది. కాగా, కోవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఇవాళ ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెలాఖరునాటికి మరో 10 టెస్టింగ్‌ సదుపాయాలు సిద్ధమవుతాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.
  • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 647కు చేరింది. మొత్తం మరణాలు 17 కాగా, 65 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పుడు రోజుకు 17,500 నమూనాలను పరీక్షించనుంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించే సడలింపు విధానాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాధి పీడితుల సంఖ్య దృష్ట్యా కర్నూలు 158, గుంటూరు 129, కృష్ణా 75, నెల్లూరు 67 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి.
  • తెలంగాణ: కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి సంక్షోభం నడుమ రాష్ట్రంలో పంటల దిగుబడి అంచనాలను మించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 809 కాగా, మరణాలు 18గా ఉన్నాయి.
  • చండీగఢ్‌: నగరంలో వ్యాధి వ్యాప్తి నియంత్రణలో భాగంగా బయటి ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చేవారిని 14 రోజులపాటు నిర్బంధ పరిశీలనలో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. నగర వాసులందరూ ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని నగరపాలక యంత్రాంగం కోరింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో అందరూ మాస్కులు ధరించాలని, హస్త పరిశుభ్రత పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సూచించింది.
  • పంజాబ్‌: రాష్ట్రంలో మాస్కులు ధరించడాన్ని కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘిస్తే జరిమానాలు సహా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇవాళ పోలీసులను ఆదేశించింది. దేశ పౌరులకు ఆహార పదార్థాల కొరత రాకుండా రాష్ట్రం నుంచి లక్ష టన్నుల గోధుమలను, బియ్యాన్ని ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు 40 రైళ్లద్వారా సరఫరా చేసింది. మరోవైపు గ్రామాల్లో వైరస్‌ నివారణ మందు చల్లేందుకు యువతను పంచాయతీలు ప్రోత్సహిస్తున్నాయి. అలాగే బహిరంగ స్థలాల్లో సామాజిక దూరం పాటించేలా 2 మీటర్ల ఎడం ఉండేవిధంగా తెలుపు/ఎరుగు రంగులు వేశారు. సర్పంచులందరూ సభ్యులుగా వాట్సాప్‌ గ్రూప్‌ను సృష్టించారు. వైరస్‌ నివారణ దిశగా వివిధ రకాల వీడియోలు, సందేశాలను అందులో ఉంచుతున్నారు. అలాగే వలస కార్మికుల సంక్షేమం బాధ్యతను వంతులవారీగా పంచుకుంటున్నారు. మాస్కుల తయారీపై స్వయం సహాయ సంఘాలను ప్రోత్సహిస్తున్నారు.
  • హర్యానా: రాష్ట్రంలోని విద్యార్థులు “స్టే ఎట్‌ హోమ్‌.. స్కూల్‌ ఎట్‌ హోమ్‌, స్టడీ ఎట్‌ హోమ్‌” అనే ‘మూడు ఎస్‌’లను పాటించాలని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ పిలుపునిచ్చారు. జాతీయ ఉద్యాన కార్యక్రమం కింద పనిచేసే అధికారులకు రాష్ట్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి ప్రత్యేక విధులు నిర్దేశించారు. మరోవైపు కోవిడ్‌-19 దిగ్బంధం అమలైనంత కాలం పండ్లు, పూలు, కూరగాయలు, పుట్టగొడుగులు, స్ట్రాబెర్రీస్‌ వగైరాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
  • హిమాచల్‌ప్రదేశ్‌: రాష్ట్ర పౌరులందరూ ‘పీఎం కేర్స్‌’ నిధికి పౌరులు విరాళాలివ్వాలని, అందరూ ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలోని గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఉత్పాదక కార్యకలాపాల ప్రారంభానికి ప్రభుత్వం పరిమిత ఆంక్షల మధ్య అనుమతించనుంది. తదనుగుణంగా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు నివాస వసతి కల్పించాలని సూచించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,648 కాగా, 211 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు దేశంలోనే అత్యధికంగా 66,896 మందికి పరీక్షలు నిర్వహించారు.
  • గోవా: గోవాలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అనుమానితులు ఏడుగురికీ వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు. కాగా, ఏప్రిల్‌ 3వ తేదీనుంచి ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
  • గుజరాత్‌: రాష్ట్రంలో ఇవాళ 104 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,376కు చేరింది. ఇప్పటిదాకా నమోదైన కేసులలో 93 మంది కోలుకోగా, 53 మంది మరణించారు.
  • రాజస్థాన్‌: రాష్ట్రంలో ఇవాళ 122 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1,351కి చేరాయి. మొత్తం నమోదైన కేసులలో 183 మంది కోలుకోగా, 11 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కోవిడ్‌ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,407గా ఉంది. కాగా, ఇండోర్‌ 707 కేసులతో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది.
  • ఛత్తీస్‌గఢ్‌: కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించిన మేరకు రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాలకుగాను 23 గ్రీన్‌జోన్‌ కిందకు వచ్చాయి. ఈ మేరకు కోవిడ్‌-19రహిత క్లస్టర్ల రీత్యా జాతీయ స్థాయిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి గ్రీన్‌జోన్‌లోని జిల్లాల్లో నిర్దేశిత ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయి.
# కోవిడ్-19 లో వాస్తవ తనిఖీ

 

https://pbs.twimg.com/profile_banners/231033118/1584354869/1500x500

 

 

 

*****



(Release ID: 1616237) Visitor Counter : 184