ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కారణంగా ఆదాయ‌పు పన్ను చెల్లింపుదారుల‌కు గ‌డువు పొడిగింపు ప్రయోజనాలు ల‌భించేందుకు వీలుగా ఐటీ ప‌న్ను రిటర్న్ ఫారములను స‌వ‌రించ‌నున్న సీబీడీటీ

Posted On: 19 APR 2020 3:41PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కార‌ణంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల‌కు భారత ప్రభుత్వం ప్ర‌క‌టించిన ప‌న్నుల‌ మిన‌హ‌యింపుల గ‌డువు పొడిగింపు ప్రయోజనాలు పొందేందుకు వీలుగా సీబీడీటీ 2019-20 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ సంవ‌త్స‌రం 2020-21) ప‌న్ను రిటర్న్ ఫారములలో స‌వ‌ర‌ణ‌లు చేప‌ట్టింది. ఈ నెల చివరి నాటికి వీటిని అధికారికంగా నోటిఫై చేయ‌నుంది. కోవిడ్ నేప‌థ్యంలో జూన్ 30వ తేదీ వరకు వివిధ చెల్లింపులు, మిన‌హాయింపుల గ‌డువు పొడిగింపుతో పన్ను చెల్లింపుదారులకు స‌ర్కారు వెసులుబాటు క‌ల్పించింది. ప‌న్ను చెల్లింపుదారులు పూర్తి స్థాయిలో వీటి ప్ర‌యోజ‌నాలు పొందేందుకు వీలుగా రిటర్న్ ఫారమ్‌లలో అవసరమైన మార్పులను చేప‌ట్టినట్టుగా సీబీడీటీ వివ‌రించింది. దీని వ‌ల్ల పన్ను చెల్లింపుదారులు ఈ కాలంలో నిర్వహించిన అన్ని లావాదేవీల ప్రయోజనాలను వారు పొందవచ్చని సీబీడీటీ ఆదివారం తెలిపింది. అంటే 2019 ఏప్రిల్ 1 నుండి 2020 జూన్ 30వ తేదీ వరకు నిర్వ‌హించిన ఆయా లావాదేవీలు కూడా 2019-20 ఆర్థిక సంవత్సర‌పు రిటర్న్‌ల్లో ల‌బ్ధి పొందేందుకు వెసులుబాటు ల‌భించేలా సీబీడీటీ ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది.  ఏప్రిల్ నుండి జూన్ 2020 కాలానికి పన్ను చెల్లింపుదారులు తమ పెట్టుబడులు/ లావాదేవీల ప్రయోజనాలను పొందటానికి వీలుగా రిటర్న్ రూపాల్లో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు సీబీడీటీ వివరించింది. సవరించిన ఈ రిటర్న్ ఫార‌ముల‌ను నోటిఫై చేసిన త‌రువాత సంబంధిత సాఫ్ట్‌వేర్ మరియు రిటర్న్ ఫైలింగ్ యుటిలిటీల‌లోనూ అవ‌స‌ర‌మైన మార్పులు చేప‌ట్ట‌నున్న‌ట్టు సీబీడీటీ వివ‌రించింది. అవసరమైన మార్పులు చేర్పుల‌ను జ‌రిపిన  తరువాత రిటర్న్ ఫైలింగ్ యుటిలిటీని మే 31వ తేదీ నాటికి అందుబాటులో ఉంచనున్నట్టుగా వివ‌రించింది.
ప‌న్ను చెల్లింపుదారుల‌కు మేలు జ‌రిగేలా ఆర్ఢినెన్స్‌..
కోవిడ్-19 వైర‌స్ వ్యాప్తి కారణంగా ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం - 1961 మరియు ఇతర చట్టాల‌లో కొన్ని నిబంధనలను స‌డ‌లిస్తూ ప్ర‌భుత్వం ఆర్డినెన్స్-2020ని అమ‌లులోకి తెచ్చింది. దీని ప్ర‌కారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను పెట్టుబడి / ఐటీ చట్టం యొక్క చాప్టర్-వీఐఏ-బీ కింద సెక్షన్ 80 సీ (ఎల్‌ఐసీ, పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ మొదలైనవి), 80 డీ (మెడిక్లైమ్), 80 జీ (విరాళాలు), మినహాయింపుల చెల్లింపుల‌ను క్లయిమ్ చేసుకొనేందుకు గ‌డువును స‌ర్కారు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. దీనికి తోడు సెక్షన్ 54 నుండి సెక్షన్ 54 జీబీ కింద చేసి పెట్టుబడి / నిర్మాణం / కొనుగోలు వ్య‌యాల‌ను కూడా మూలధన లాభాలుగా చూపించి రోల్ ఓవర్ బెనిఫిట్ పొందేందుకు కూడా గ‌డువు తేదీని 30 జూన్ 2020 వరకు స‌ర్కారు పొడిగించింది. అందువల్ల స‌డ‌లింపు కాలం యొక్క లావాదేవీలను నివేదించడానికి వీలుగా సీబీడీటీ రిటర్న్ ఫారమ్‌ల‌లో ప‌లు సవర‌ణ‌లు చేప‌డుతోంది. సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలు ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫై చేయ‌డం జ‌రుగుతుంది. ఇదే క్ర‌మంలో 2020-21కి అసెస్‌మెంట్ సంవ‌త్స‌రానికి గాను రిటర్న్లు దాఖలు చేయడానికి ఈ-ఫైలింగ్ యుటిలిటీని ఏప్రిల్ 1వ తేదీ నుంచే అందుబాటులో ఉంచారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ సంవ‌త్స‌రం 2020-21) ఆదాయ-పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఐటీఆర్ -1 (సహజ్) మరియు ఐటీఆర్-4 (సుగ‌మ్‌) ల‌ను కూడా ఈ ఏడాది జనవరి 3వ తేదీ ఒక నోటిఫికేష‌న్ ద్వారా నోటిఫై చేశారు. అయితే కోవిడ్ -19 వైర‌స్ మహమ్మారి కారణంగా నెలకొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప‌న్ను చెల్లింపుదారుల‌కు వెసులుబాటు క‌ల్పిస్తూ వివిధ చెల్లింపులు, మిన‌హాయింపుల గ‌డువును స‌ర్కారు పొడిగించిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌న్ను చెల్లింపుదారులు ఆయా ప్రయోజనాలను పొందటానికి వీలుగా సీబీడీటీ తాజాగా రిటర్న్ ఫార‌ముల స‌వ‌ర‌ణ‌లు చేయాల్సి వ‌చ్చింది. 

 



(Release ID: 1616098) Visitor Counter : 263