శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వైర‌స్ నుంచి రక్ష‌ణ ఇచ్చే ఎల‌క్ట్రో స్టాటిక్స్ మెటీరియ‌ల్ తో త‌యారు చేసిన మాస్కులు

ట్రిబో ఇ మాస్కుల‌ను త‌యారు చేసిన సిఇఎన్ ఎస్
బైట‌నుంచి విద్యుత్ అవ‌స‌రం లేకుండానే విద్యుత్ ఆవేశం పొంద‌గ‌లిగే ట్రిబో ఇ మాస్కులు
ట్రిబో ఇ మాస్కుల విద్యుతావేశం కార‌ణంగా వైర‌స్ కు అడ్డుక‌ట్ట‌

Posted On: 18 APR 2020 6:19PM by PIB Hyderabad

క‌రోనా వైర‌స్ ను నిరోధించ‌డానికిగాను వైద్య ఆరోగ్యరంగ సిబ్బంది ముందుండి పోరాటం చేస్తున్నారు. వీరు అత్యాధునిక సాంకేతిక‌త‌, నాణ్య‌త క‌లిగిన మాస్కుల‌ను ధ‌రించాల్సి వుంటుంది. వీటి త‌యారీకి  ప్ర‌త్యేక‌మైన నైపుణ్య‌త అవ‌స‌ర‌ముంటుంది. అయితే సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం సాధార‌ణ‌మైన మాస్కుల‌ను ధ‌రించి క‌రోనా వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. 
వైద్య ఆరోగ్య సిబ్బంది వాడే మాస్కుల‌ను వారికి మాత్ర‌మే అందుబాటులో వుండేలా చూడాలి. సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా వాటిని వాడ‌డం మొద‌లుపెడితే ఆధునిక సాంకేతిక‌త‌తో త‌యారైన మాస్కులకు కొర‌త ఏర్ప‌డుతుంది. త‌ద్వారా క‌రోనా రోగుల‌కు సేవ‌లందించే వైద్య ఆరోగ్య సిబ్బంది ప్ర‌మాదంలో ప‌డుతుంది. 
ఈ నేప‌థ్యంలో నానో అండ్ సాప్ట్ మ్యాట‌ర్ సైన్స్ సెంట‌ర్ ( సిఇఎన్ ఎస్‌) కు చెందిన నిపుణుల బృందం మార్కెట్లో అత్యాధునిక మాస్కుల కొర‌త ఏర్ప‌డ‌కుండా వుండ‌డానికిగాను సామాన్య ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుండే  ట్రిబో ఇ మాస్కుల‌ను అందుబాటులోకి తెస్తోంది. బెంగుళూరులోని ఈ సంస్థ సైన్స్ అండ్ టెక్నాల‌జీ విభాగానికి చెందిన స్వ‌యంప్ర‌తిపత్తి సంస్థ‌. ఈ ట్రిబో ఇ మాస్కుల ప్ర‌త్యేక‌త ఏమంటే బైట‌నుంచి విద్యుత్ అవ‌స‌రం లేకుండానే విద్యుతావేశం చెంది ప‌ని చేస్తాయి. త‌ద్వారా వైర‌స్ ను అడ్డుకుంటాయి. 
 ఎల‌క్ట్రో స్టాటిక్స్ ఆధారంగా డాక్ట‌ర్ ప్ర‌ళ‌య్ సంత్రా, డాక్ట‌ర్ ఆశుతోష్ సింగ్‌, ప్రొఫెస‌ర్ గిరిధ‌ర్ యు. కుల‌క‌ర్ణి దీన్ని త‌యారు చేశారు. భౌతిక శాస్త్ర పుస్త‌కాల్లో ట్రిబో విద్యుత్ గురించి మ‌నం చ‌దువుకునే వుంటాం. దాన్నించి వ‌చ్చిన ఆలోచన ప్ర‌కారం ఈ మాస్కుల‌ను రూపొందించారు. పిల్ల‌లు కూడా ఈ విద్యుత్ తో ఆడుకుంటూ వుంటారు. దీని ప్ర‌కారం ట్రిబో ఇ మాస్కుల‌ను ఎవ‌రికి వారు స్వంతంగా ఇంట్లోనే త‌యారు చేసుకొని వాడుకోవ‌చ్చు. దీనికి ఖ‌ర్చు కూడా కాదు. కోవిడ్ -19 వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి మాస్కులు కూడా కీల‌క‌పాత్ర పోషిస్తున్న ఈ త‌రుణంలో ఈ కొత్త మాస్కుల‌ను ముందుకు తీసుకొచ్చామ‌ని ప్రొఫెస‌ర్ కుల‌క‌ర్ణి అంటున్నారు. 
వైర‌స్ ను అరిక‌ట్ట‌డానికిగాను గ‌త కొంత కాలంగా ర‌సాయ‌నిక‌శాస్త్రం, భౌతిక‌శాస్త్రం, జీవ శాస్త్రం...మొద‌లైన శాస్త్రాల ఆధారంగా ప‌లు సృజ‌నాత్మ‌క‌ ప‌రిష్కారాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇలాంటి సృజ‌నాత్మ‌క ప‌రిష్కార‌మే ట్రిబో ఇ మాస్కు అని డిఎస్ టి కార్య‌ద‌ర్శి ప్రొఫెస‌ర్ ఆశుతోష్ శ‌ర్మ అంటున్నారు. ఈ సాధార‌ణ డిజైన్ ద్వారా అత్య‌ధికంగా మేలు జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. 

 


 ట్రిబో ఇ మాస్కు మూడు పొర‌లుగా వుంటుంది. పాలీ ప్రొఫ‌లైన్ లేయ‌ర్ల మ‌ధ్య‌న నైలాన్ బ‌ట్ట లేయ‌ర్ ను వుంచి దీన్ని త‌యారు చేస్తారు. నైలాన్ బ‌ట్ట కు బ‌దులుగా పాత సిల్క్ చీర‌నుంచి తీసుకున్న బ‌ట్ట ముక్క‌‌నైనా వాడుకోవ‌చ్చు. ఈ లేయర్ల‌తో త‌యారు చేసిన మాస్కును ఉప‌యోగించ‌డానికి ముందు మూడు పొర‌లు ఒక‌దాని మీద మ‌రొక‌టి త‌గులుకునేలా రుద్దాలి. దాంతో బైటి పొర‌లు నెగ‌టివ్ ఛార్జిని (రుణావేశం) పొందుతాయి. మ‌ధ్య‌లోని నైలాన్ పొర పాజిటివ్ ఛార్జి (ధనావేశం) పొందుతాయి. దాంతో ఇది విద్యుత్ గోడ‌గా త‌యారై వైర‌స్ లాంటి క్రిములను అడ్డుకుంటుంది. అందుబాటులోని బ‌ట్ట‌ల‌తో వీటిని త‌యారు చేయ‌డం జ‌రుగుతుంది కాబ‌ట్టి వీటిని ఇత‌ర బ‌ట్ట‌ల్లాగానే ఉతుక్కొని తిరిగి ధ‌రించ‌వ‌చ్చు. అయితే ఈ మాస్కుల‌ను వైద్య ఆరోగ్య సిబ్బంది, రోగులు ధ‌రించ‌వ‌ద్దు.  
దీనికి సంబంధించిన వీడియోను ఈ లింకులో చూడ‌వ‌చ్చు. https://youtu.be/lIOKwnVlYXw
ఇత‌ర వివ‌రాల‌కు సంప్ర‌దించాల్సిన నిపుణులు :  డాక్ట‌ర్ ప్ర‌ళ‌య్ కె. సంత్రా ( ఇమెయిల్ 
 psantra@cens.res.in; pralay.santra[at]gmail[dot]com Mob: 9483271510),
డాక్ట‌ర్ ఆషుతోష్ సింగ్ ( ఇమెయిల్  aksingh@cens.res.in; ashuvishen[at]gmail[dot]com) 
మ‌రియు ప్రొఫెస‌ర్ గిరిధ‌ర్ యు. కుల‌క‌ర్ణి ( ఇమెయిల్  guk@cens.res.in; gukulk[at]gmail[dot]com)]
***


(Release ID: 1615833) Visitor Counter : 259