రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నావికా దళం మిషన్ డిప్లోయిడ్, కంబాట్ విధులకు సర్వసన్నద్ధంగా ఉంది
Posted On:
18 APR 2020 7:28PM by PIB Hyderabad
కోవిడ్-19 వైరస్ సోకిన ముంబయి ఐఎన్ఎస్ యాంగ్రేకు చెందిన ఇరవై ఆరు మంది నావికా దళపు సిబ్బందిని తాము ఐసోలేషన్‌లో ఉంచినట్టుగా భారత నావికా దళం తెలిపింది. వీరికి తప్ప విధినిర్వహణల్లో ఉన్న ఏలాంటి ఓడ, జలాంతర్గామి, ఎయిర్ స్టేషన్‌లలో ఒక్క కోవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదని భారత నావికా దళం తేల్చి చెప్పింది. నావికా దళానికి చెందిన వ్యవస్థల్ని మూడంచెలలో మొహరించబడి సర్వసన్నద్ధంగా ఉన్నట్టుగా వివరించింది. దీనికి తోడు నావికా దళానికి చెందిన నెట్‌వర్క్ వ్యవస్థలు అంతరిక్ష నియంత్రణ వ్యవస్థలు కూడా గరిష్ఠ స్థాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఎప్పటిలాగే పోరాటానికి పూర్తి సర్వసన్నద్ధంగా ఉంటూనే.. కోవిడ్-19 మహమ్మారిపై జాతీయ మిషన్‌లో పాల్గొనడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నట్ట నావికా దళం తెలిపింది. దీనికి తోడు ఐవోఆర్ ప్రాంతంలోని భారత్‌తో స్నేహపూర్వకంగా ఉండే పొరుగు దేశాల వారికి కూడా తగిన సహాయాన్ని అందించడానికి తాము పూర్తి సంసిద్ధతతో ఉన్నట్టు వెల్లడించింది.
అన్ని మిషన్ కార్యకలాపాలు యథావిథిగానే..
తూర్పున ఉన్న మలక్కా జలసంధి నుండి మొదలు పశ్చిమాన ఉన్న బాబ్-ఎల్-మండేబ్ వరకు విస్తరించి ఉన్న సముద్రపు జలాలలో నావికా దళం గస్తీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే.. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో మన వాణిజ్య నౌకలతో సహా గల్ఫ్‌లోని యాంటీ పైరసీ పెట్రోలింగ్‌లకు పూర్తి భరోసా మరియు రక్షణ కల్పించేలా చేపట్టిన ఆపరేషన్ సంకల్ప్ కూడా కొనసాగిస్తామని భారత నావికా దళం వెల్లడించింది. తీరప్రాంత మరియు ఆఫ్‌షోర్ భద్రత కోసం గతంలో చేపట్టిన అన్ని రకాల మిషన్లు మునుపటి లాగే కొనసాగుతాయని నావికా దళం తెలిపింది. సివిల్ అథారిటీలు మరియు ఫ్రెండ్లీ మారిటైమ్ నైబర్స్ తో సహా అన్ని తక్షణ ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు గాను 14 రోజుల క్వారంటైన్ నిబంధన పాటింపు విధానాన్ని కొనసాగిస్తున్నారు. దేశవాసులకు ఉపయోగపడేలా ముంబయి, గోవా, కొచ్చి, విశాఖపట్నం తదితర బేస్‌లలోని నావికా దళ ప్రాంగణాలలో పలు క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. గత వారం 44 మంది మాజీ ఇరాన్ యాత్రికులు లడాఖ్,జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చి ముంబయి నావికా దళపు కేంద్రంలో క్వారంటైన్‌లో ఉంచబడ్డారు. ఇక్కడ కల్పించిన సంరక్షణ, సౌకర్యాల పట్ల పూర్తి సంతృప్తి చెందిన వారి క్వారంటైన్‌ను పూర్తి చేసుకొని తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లారు. నావికాదళం విమానాలు అనేక మిషన్లలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకూ సహాయపడే పలు కార్యక్రమాలలో పంచుకుంటూ ఉన్నాయి.
పూర్తిస్థాయిలో వైరస్ సంక్రమణ కట్టడి చర్యలు..
ఈ నెల 7వ తేదీన ఒక నావికుడికి కరోనా వైరస్ సంక్రమించినట్టుగా తేలిన తరువాత అతనితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారిని కచ్చితంగా గుర్తించి వారికి వేగంగా కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు భారత నావికా దళం తెలిపింది. ఈ క్రమంలోనే ఇరవై ఆరు మందికి ఈ వైరస్ సంక్రమణ జరిగినట్టుగా తేలిందని వివరించింది. కోవిడ్ వైరస్ సంక్రమణ జరిగిన నావికులందరూ లక్షణరహితంగా కొనసాగుతున్నారని వీరందరూ ఐఎన్‌హెచ్ఎస్ అశ్విన్ వద్ద మేటి వైద్య నిపుణుల సంరక్షణలో ఉన్నట్టగా తెలిపింది. ఒక నావికుడికి కరోనా సంక్రమించినట్టుగా తేలినప్పటి నుంచి యూనిట్ మొత్తం ప్రాంగణాన్ని మూసివేశారు. వైరస్ కట్టడి జోన్లు, బఫర్ ప్రాంతాలను గుర్తించి వైరస్ ప్రసార గొలుసును విచ్ఛిన్నం చేయడం తద్వారా వ్యాప్తిని నివారించేందుకు గాను ప్రోటోకాల్ ప్రకారం తరచుగా క్రిమిసంహారక చర్యలు చేపట్టడం జరుగుతోందని నావికా దళం తెలిపింది. ఈ ప్రాంగణంలోని అన్ని ఇతర ప్రాంతాలలో కఠినమైన లాక్‌డౌన్ అమలులో ఉంది. ఇక్కడ ఉండే నావికా దళ సిబ్బంది, వారి కుటుంబాల కోసం కఠినమైన క్వారంటైన్, భద్రతా ప్రోటోకాల్స్ అమలు చేయబడుతున్నాయి. ఇంకా ఏవైనా కోవిడ్ కేసులు ఉన్నాయేమో తెలుసుకొనేందుకు గాను ఇంటింటికీ స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు.
పోరుగు దేశాలకు తోడుగా..
విధి నిర్వహణలో తమ అనుభవాలను పంచుకోవడంలో భారత నావికాదళం చాలా చురుకుగా వ్యవహరిస్తోంది. ఇతర నావికాదళాలకు ఉపయుక్తంగా ఉండేలా తమ అనుభవాలను పంచుకునే ఉద్దేశంతో భారత నావికాదళం స్వీకరించిన పలు ఎస్‌వోపీలను హిందూ మహాసముద్ర నావల్ సింపోజియం (ఐవోఎన్ఎస్) వెబ్‌సైట్‌లో వాటిని ఉంచింది. భారత నావికాదళం కోవిడ్ సంక్రమణ వ్యాప్తిని సాధ్యమైనంత వరకు కట్టడి చేసేందుకు కట్టుబడి ఉంది. దీనికి తోడు సముద్ర తలం విభాగంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవటానికైనా ఎప్పటిలాగే కార్యాచరణతో సిద్ధంగా ఉన్నట్టుగా తెలిపింది.
(Release ID: 1615879)
Visitor Counter : 195