రైల్వే మంత్రిత్వ శాఖ

పౌర స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌లో (పీడీఎస్) ఆహార ధాన్యాల లభ్య‌త త‌గినంత‌గా ఉండేలా చూసేందుకు గత సంవత్సరం కంటే రెట్టింపుగా ఆహార ధాన్యాల ర‌వాణాను చేప‌ట్టిన భారతీయ రైల్వే

- లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న మార్చి25 నుండి ఏప్రిల్ 17 వరకు 1500 కి పైగా ర్యాక్‌ల‌లో 4.2 మిలియన్ టన్నులకు పైగా ఆహార ధాన్యాల స‌ర‌ఫ‌రా
- గత ఏడాది ఇదే స‌మయంలో 2.31 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ర‌వాణా
- ఆహార ధాన్యాలు వంటి వివిధ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో స‌మీక‌రించి వాటి స‌ర‌ఫ‌రా
నిరంత‌రాయంగా సాగేందుకు గాను అన్ని ప్రయత్నాలు చేస్తున్న‌ భారతీయ రైల్వే

Posted On: 18 APR 2020 4:37PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నెల‌కొన్న ప్ర‌స్తుత తరుణంలో  ప్ర‌జ‌ల‌కు ఆహార ధాన్యాలు వంటి నిత్య‌వ‌స‌ర వస్తువుల లభ్యత నిరాటంకంగా సాగేందుకు గాను భారతీయ రైల్వే తన సరుకు రవాణా సేవల ద్వారా పూర్తి ప్రయ‌త్నాల‌ను కొనసాగిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు త‌గు విధంగా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండేలా చూసే ప్ర‌య‌త్నంలో భాగంగా భార‌తీయ రైల్వే శుక్ర‌వారం ఒక్క రోజే (17వ తేదీన‌) 83 ర్యాకుల‌లో దాదాపు 3601 వ్యాగన్లలో ఆహార ధాన్యాల‌ను లోడ్ చేసింది (ఒక వ్యాగ‌న్లో 58-60 టన్నుల సరుకు ఉంది). గ‌త నెల మార్చి 25 నుండి ఈ నెల 17 ఏప్రిల్ వరకు అంటే లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న కాలంలో భార‌తీ రైల్వే 1500కి పైగా ర్యాకుల‌లో 4.2 మిలియ‌న్ టన్నుల ఆహార ధాన్యాలు లోడ్ చేసి ర‌వాణా చేసింది. కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆహార ధాన్యాలు వంటి వివిధ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో స‌మీక‌రించి త‌గు విధంగా సరఫరా చేసేందుకు గాను భార‌తీయ రైల్వే ప‌లు ప్రయత్నాలు చేస్తోంది. లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న ప్ర‌స్తుత త‌ర‌ణంలో సైతం అత్య‌వ‌స‌ర‌ వస్తువుల లోడింగ్, రవాణా మరియు అన్లోడ్ పూర్తి స్థాయిలో చేప‌డుతోంది.
వివిధ శాఖ‌లతో సౌజ‌న్యంతో ముందుకు..
ఆహార ధాన్యాల ర‌వాణా కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖతో భార‌తీయ రైల్వే సన్నిహిత అనుబంధాన్ని కొన‌సాగిస్తూ ముందుకు సాగుతోంది. పప్పు ధాన్యాలను పెద్ద మొత్తంలో ర‌వాణా చేసేందుకు గాను కాన్‌కార్ సంస్థ ఎన్ఏఎఫ్ఈడీతో కలిసి పనిచేస్తోంది. త్వ‌ర‌గా పాడైపోయేందుకు ఆస్కారం ఉన్న పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తుల‌తో స‌హా వ్య‌వ‌సాయానికి కావాల్సిన విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా నిమిత్తం లాక్‌డౌన్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి భార‌తీయ రైల్వే పార్శిల్‌ ప్రత్యేక రైళ్ల కోసం 65 మార్గాల‌ను గుర్తించింది.
66 మార్గాలు నోటిపై చేసి టైమ్ టేబుల్ రైలు సేవ‌లు..
ఏప్రిల్ 17 వరకు 66 మార్గాల‌ను నోటిఫై చేసింది. ఆయా మార్గాల్లో భార‌తీయ రైల్వేకు చెందిన టైమ్‌టేబుల్ రైళ్లు నడుస్తున్నాయి. దేశంలోని ఏ ప్రాంతంతో కూడా అనుసంధాన‌త లోపించ‌కుండా చేసేందుకు గాను డిమాండ్ త‌క్కువ‌గా ఉన్న వివిధ మార్గాల‌లో కూడా భార‌తీయ రైల్వే రైళ్ల‌ను న‌డుపుతోంది. స‌రుకుల ర‌వాణా క్లియ‌రెన్స్‌లు గ‌రిష్ఠంగా ఉండేలా చూసేందుకు గాను అన్ని సాధ్యమయ్యే ప్రదేశాలలో రైళ్లను నిలిపే విధంగా భార‌తీయ రైల్వే స‌క‌ల చ‌ర్య‌లు చేప‌డుతోంది.


(Release ID: 1615802) Visitor Counter : 176