PIB Headquarters

కోవిడ్-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 05 OCT 2020 6:15PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్ పోరులో కీలక మైలురాయి దాటిన భారత్; 2 వారాలుగా 10 ల‌క్ష‌లలోపే చికిత్స పొందే కేసులు.
  • దేశంలో గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 76, 737; నమోదైన కొత్త కేసులు 74,442.
  • కోలుకునేవారి జాతీయ సగటు 84.34 శాతానికి చేరిక.
  • దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్స పొందుతున్న  కేసుల సంఖ్య 9,34,427.
  • దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్‌ టీకాపొందే ప్రాధాన్య జనాభా జాబితా రూపకల్పన కోసం నమూనా రూపొందిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.
  • ‘ఆయుష్‌’ రంగం కోసం ఐటీ వెన్నెముకగా రూపొందుతున్న ‘ఆయుష్‌ గ్రిడ్‌’ కార్యకలాపాలు ఇకపై జాతీయ డిజిటల్‌ ఆరోగ్య కార్యక్రమంతో అనుసంధానం.

కోవిడ్ పోరులో కీలక మైలురాయి దాటిన భారత్; వరుసగా 2 వారాల‌నుంచి 10 ల‌క్ష‌లలోపే చికిత్స పొందే కేసులు

కోవిడ్ మ‌హ‌మ్మారిపై యుద్ధంలో భారత్ మరో కీలకమైన మైలురాయిని అధిగ‌మించింది. ఆ మేర‌కు వరుసగా రెండు వారాల‌నుంచి చికిత్స‌లోగ‌ల కేసుల సంఖ్య 10 లక్షలలోపే కొనసాగుతోంది. గ‌త 24 గంటల్లో 76,737 మందికి వ్యాధి న‌యం కాగా- 74,442 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే, రోజువారీ కొత్త కేసుల‌క‌న్నా కోలుకునేవారి సంఖ్య కాస్త ఎక్కువ‌గానే ఉంటోంది. దేశవ్యాప్తంగా ఇప్ప‌టిదాకా కోలుకున్న కేసులు 55,86,703కు చేర‌గా, జాతీయంగా కోలుకునే స‌గ‌టు స్థిరంగా పెరుగుతూ నేడు 84.34 శాతానికి దూసుకెళ్లింది. కోలుకున్న కొత్త కేసుల‌లో 75 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే న‌మోద‌వ‌గా, మహారాష్ట్రలో నిన్న అత్య‌ధికంగా 15,000 మందికి వ్యాధి న‌య‌మైంది. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాట‌క రాష్ట్రాలు చెరో 7వేల వంతున కోలుకున్న కేసుల‌తో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఇవాళ్టికి 9,34,427 మంది ఆస్ప‌త్రుల్లో ఉండ‌గా- మొత్తం నిర్ధారిత కేసుల‌లో ఇది కేవ‌లం 14.11 శాతం మాత్ర‌మే. ఈ కేసుల‌లోనూ దాదాపు 77 శాతం కేసులు 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త 24 గంట‌ల్లో న‌మోదైన 74,442 కేసులలో 78 శాతం కూడా ఇదే 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ మేర‌కు మహారాష్ట్ర 12,000 కేసులతో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా 10,000కుపైగా కేసుల‌లో క‌ర్ణాట‌క త‌దుప‌రి స్థానంలో ఉంది. గత 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా 903 మరణాలు సంభ‌వించ‌గా, వీటిలో82 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. అత్య‌ధికంగా 36 శాతంతో (326 మంది) మహారాష్ట్ర, 67 మరణాలతో కర్ణాట‌క ప్ర‌థ‌మ‌, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661709

ప్రయాగ్ రాజ్ మోతీలాల్ నెహ్రూ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్

ప్రయాగ్‌రాజ్‌లోగ‌ల మోతీలాల్ నెహ్రూ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆన్‌లైన్‌ద్వారా ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు. ఈ 220 పడకల ఆస్ప్రతిని పూర్తిగా కోవిడ్ చికిత్స కోసం కేటాయించారు. కోవిడ్ పరీక్షలపై ఐసీఎంఆర్‌ వ్యూహంలో భాగంగా కీల‌క‌మైన ‘కోబాస్-6800’ యంత్రాన్ని కూడా ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద రూ.150 కోట్లతో ఈ విభాగాన్ని నిర్మించారు. ఇందులో న్యూరాలజీ,  న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, సర్జికల్ ఆంకాలజీ, కార్డియో థొరాసిక్ వాస్క్యుల‌ర్ సర్జరీ విభాగాలు కూడా ఉంటాయి. అలాగే 7 ఆపరేషన్ థియేటర్లు, 233 సూపర్ స్పెషాలిటీ పడకలు,52 ఐసీయూ పడకలు, 13 డయాలసిస్ పడకలు ఉన్నాయి. ఇందులో 24 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు శిక్షణ పొందే వీలుంది. పూర్తి స్వ‌యంచ‌లితంగా పనిచేసే కోబాస్-6800 యంత్రం గురించి మంత్రి వివ‌రిస్తూ- దీని సాయంతో పీసీఆర్ కోవిడ్ నిర్ధార‌ణ ఫ‌లితాలు తక్షణం వెల్ల‌డి కాగ‌ల‌వ‌న్నారు. ఆ మేర‌కు 24 గంటల్లో 1200 న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గ‌ల సామ‌ర్థ్యం ఈ యంత్రానికి ఉందని చెప్పారు. ఇది వైరల్ హెపటైటిస్ బి-సి, హెచ్ఐవి, ఎంటీబీ, పాపిలోమా, సైటోమెగలోవైరస్, క్లామీడియా వంటి ఇత‌ర వ్యాధుల నిర్థారణకూ ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌ద‌ని తెలిపారు. రిమోట్ ప‌ద్ధ‌తిలో ప‌నిచేసే ఈ యంత్రంవ‌ల్ల మాన‌వ వ‌న‌రుల వినియోగం కూడా త‌గ్గుతుంద‌ని డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661770

సండే సంవాద్-4లో భాగంగా సామాజిక మాధ్యమ వాడ‌కందారుల‌తో డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ సంభాష‌ణ‌‌

సండే సంవాద్-4లో భాగంగా సామాజిక మాధ్య‌మ వాడకందారుల‌తో కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ సంభాషించారు. ఇందులో భాగంగా వారు సంధించిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. కోవిడ్ చికిత్స‌లో ప్లాస్మా థెర‌పీ విని‌యోగం, కోవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో 2025 నాటికి క్షయవ్యాధి నిర్మూల‌న‌, దేశంలో పాఠ‌శాల‌ల పునఃప్రారంభం తదితర అంశాల‌పై ఆయ‌న జవాబిచ్చారు. కోవిడ్‌ టీకా పంపిణీ ప్రాధాన్యంపై అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జవాబిస్తూ- దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాల నుంచి నివేదికలను తయారుచేయడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ ఒక నమూనా పద్ధతిని రూపొందిస్తున్న‌ద‌ని వివరించారు. ఆయా రాష్ట్రాల జనాభాలో ప్రత్యేకించి కోవిడ్‌-19 నిర్వహణలోగల  ఆరోగ్య కార్యకర్తలుసహా ఏయే వర్గాలకు ప్రాధాన్యం ప్రకారం టీకా ఇవ్వాలో రాష్ట్రాలు నివేదిస్తాయని తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661633

‘ఆయుష్’ రంగానికి ఐటీ వెన్నెముకవంటి ‘ఆయుష్ గ్రిడ్’ కార్యకలాపాలు జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమంతో అనుసంధానం

ఆయుష్‌రంగానికి వెన్నెముక వంటి ఆయుష్‌గ్రిడ్‌ కార్యకలాపాలు జాతీయ డిజిటల్‌ ఆరోగ్య కార్యక్రమం  (NMDH)తో అనుసంధానం కానున్నాయి. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ‌శాఖ కార్య‌ద‌ర్శి విడి.రాజేష్ కొటేచా అధ్య‌క్ష‌త‌న ఇటీవల జ‌రిగిన ఒక ఉన్న‌త‌స్థాయి ఇందుకు ఆమోదం తెలిపింది. కాగా, ఆయుష్ గ్రిడ్-ఎన్డీఎంహెచ్‌ బృందాలు ఈ అంశంపై ఇప్ప‌టికే ప‌లు విడ‌తలు చర్చించి సంబంధిత విధివిధానాలపై ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చాయి. ఈ  అనుసంధానంతో ఆరోగ్య రంగంలోని ఆయుష్ విభాగాల‌ను మ‌రింతగా ప్ర‌ధాన స్ర‌వంతిలోకి తె‌చ్చేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ నేపథ్యంలో ఆయుష్ గ్రిడ్ ప్రాజెక్టుకింద ఇప్పుడు చేప‌డుతున్న సమాచార సాంకేతికత కార్య‌కలాపాల ప్రగతిని ఆయుష్ కార్య‌ద‌ర్శి స‌మీక్షించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661094

ఇంటినుంచే కరోనా చికిత్సకు దూర-వైద్య విధానం ప్రారంభించిన ఐఐటి ఖరగ్‌పూర్

కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో కాలం గడుస్తున్నప్పటికీ టీకాలు అందుబాటులోకి రాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్‌ బారినపడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఈ సమస్యను  పరిష్కరించడం కోసం ఐఐటీ-ఖరగ్‌పూర్ కంప్యూటర్ సైన్స్-ఇంజనీరింగ్ విభాగం పరిశోధకులు మెడిక్స్” (iMediX) పేరిట దూర-వైద్య వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థద్వారా ఆస్పత్రినుంచి ఆరోగ్య సంరక్షణ సేవలను గృహ సంరక్షణ కేసులతో అనుసంధానించవచ్చు. ఆ మేరకు అత్యవసర అవసరాలను పరిగణనలోకి తీసుకుని, వైద్యులు రిమోట్ సంప్రదింపు ద్వారా ఇంటివద్దగల రోగులకు కీలక ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందించడాన్ని ఈ వ్యవస్థ సులభం చేస్తుంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1661053

శాస్త్రీయ సమాచార భాగస్వామ్యానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చింది: ప్రొఫెసర్ అశుతోష్ శర్మ

శాస్త్రీయ సమాచార భాగస్వామ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రొఫెసర్‌ అశుతోష్‌ శర్మ చెప్పారు. శాస్త్ర-సాంకేతిక మంత్రులస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఆయన ఈ మేరకు తెలిపారు. భారత జాతీయ సమాచార భాగస్వామ్యం-అందుబాటు విధానం (INDSAP)తోపాటు ప్రభుత్వ సార్వత్రిక సమాచార పోర్టల్‌ నిర్వహణనుబట్టి ఈ వాస్తవం స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక సొసైటీ ఫోరం 17వ వార్షికోత్సవంలో భాగంగా 2020 అక్టోబర్ 3న ఆన్‌లైన్ ద్వారా ఈ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించబడింది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి శాస్త్ర-సాంకేతిక శాఖల అధిపతులు ఇందులో పాల్గొనగా ప్రొఫెసర్ శర్మ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661657

అటల్‌ సొరంగాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

ప్ర‌పంచంలోనే అత్యంత పొడ‌వైన హైవే సొరంగ మార్గం- ‘అట‌ల్ ట‌న్నెల్‌’ను దాని ద‌క్షిణ ‌భాగంలోగల మ‌నాలిలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ శనివారం ప్రారంభించారు. మొత్తం 9.02 కిలోమీట‌ర్ల పొడ‌వుగ‌ల ఈ సొరంగం మ‌నాలి-లాహౌల్‌-స్పితి లోయ‌లను ఏడాది పొడ‌వునా అనుసంధానిస్తుంది. ఇంత‌కుముందు ఈ లోయ అంతటా విప‌రీత హిమపాతం వ‌ల్ల ఏడాదిలో ఆరునెల‌లు ఈ రెండు ప్రాంతాల మధ్య సంబంధాలు తెగిపోతూండేవి. ఈ నేపథ్యంలో అత్య‌ధునాత‌న ‌సాంకేతిక ప‌రిజ్ఞానంతో హిమాల‌యాల‌లోని పీర్ పంజాల్ పర్వత శ్రేణిలో స‌ముద్ర మ‌ట్టానికి 3000 మీట‌ర్ల (10,000 అడుగుల) ఎత్తున ఈ సొరంగాన్ని నిర్మించడం విశేషం. దీంతో మ‌నాలి-లేహ్‌ల ‌మ‌ధ్య ప్రయాణ దూరం 46 కిలోమీట‌ర్ల మేర తగ్గుతుంది. ఆ మేరకు 4 నుంచి 5 గంట‌ల సమయం కూడా ఆదా అవుతుంది. దీన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిష‌న్‌ను ప్ర‌ధాన‌మంత్రి తిల‌కించారు. ఇది మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బిహారి వాజ్‌పేయి దార్శ‌నిక‌త‌ను సాకారం చేస్తున్న‌ చ‌రిత్రాత్మ‌క‌మైన రోజని ఆయన అభివర్ణించారు. దీంతో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్న ఈ ప్రాంతంలోని కోట్లాది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెరవేరాయని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661358

హిమాచల్‌ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్‌లో అటల్‌ సొరంగాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661494

వస్త్ర సంప్రదాయాలపై ఐసీసీఆర్‌ నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి

వస్త్ర సంప్రదాయాలపై ఐసీసీఆర్‌ శనివారం నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వస్త్రరంగంలో మన చరిత్ర, వైవిధ్యం, అపార అవకాశాలు ప్రతి ఒక్కరికీ తెలిసినవేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గాంధీజీ 150వ జయంతి వేడుకల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వస్త్ర రంగానికి, సామాజిక సాధికారతకు మధ్య సన్నిహిత సంబంధాన్ని మహాత్మా గాంధీ దర్శించగలిగారని పేర్కొన్నారు. ఆ మేరకు సాధారణ చర్ఖాను భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కీలక చిహ్నంగా మార్చారని గుర్తుచేశారు. తదనుగుణంగా చర్ఖా మనందరినీ ఒక జాతిగా దరిచేర్చిందని పేర్కొన్నారు. స్వయం సమృద్ధ భారతం లేదా స్వావలంబిత భారతదేశ నిర్మాణంలో జౌళి రంగం కీలక దోహదకారి కాగలదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661484

వస్త్ర సంప్రదాయాలపై ఐసీసీఆర్‌-యూపీఐడీ నిర్వహించిన వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661485

‘వైభవ్‌-2020’ సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం

“శాస్త్రవిజ్ఞాన రంగంలో య‌వ‌తరానికి మరింత ఆస‌క్తి పెంచడం నేటి అవసరం” అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం “విశ్వభారత వైజ్ఞానిక సదస్సు” పేరిట విదేశాల్లోని భారతీయ పరిశోధకులు-విద్యావేత్తలతో అంతర్జాతీయ వాస్తవిక సాదృశ  సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- భార‌త్‌లోనేగాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా శాస్త్రవిజ్ఞాన‌, ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల గొప్ప‌దనాన్ని సంబ‌రంగా నిర్వహించుకోవడంలో ‘వైభ‌వ్-2020’ సదస్సు ఒక భాగమన్నారు. ప్ర‌పంచ‌ం నలుమూలలా ఉన్న వేలాది ఆలోచ‌న‌నాప‌రులు ఒకచోట‌కు చేర‌డం, భారత్‌సహా ప్ర‌పంచానికి సాధికార‌త కల్పించడమే ఈ స‌మావేశం అంతరార్థమని ప్ర‌ధాని వివ‌రించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661352

విశ్వభారత వైజ్ఞానిక సందస్సు-2020లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661357

ప్రపంచం ఎదుర్కొంటున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, పర్యావరణ సమస్యల పరిష్కారం కోసం గాంధీ ఆదర్శాలను తిరిగి పాటించాలని ఉప రాష్ట్రపతి పిలుపు

ప్రపంచం  సామాజిక‌, రాజకీయ, ఆర్థిక, పర్యావరణ సమస్యల‌ను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మహాత్మాగాంధీ ఆదర్శాల పునరుజ్జీవనం నేటి తక్షణావసరమని ఉప-రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సత్యం, అహింసతోపాటు గాంధీజీ ఆచరించి చూపిన విలువలు కాలాతీతమైనవన్నారు. ప్రపంచానికి కొత్త సవాళ్లు ఎదురైన నేటి పరిస్థితులలో ఆయన ఆద‌ర్శాలకు మరింత ఔచిత్యం ఉందని తెలిపారు. గాంధీజీ 150వ జయంతి రెండేళ్ల వేడుకల ముగింపు సందర్భంగా “గాంధీజీ-ప్రపంచం” ఇతివృత్తంగా ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌’ (ఐ.సి.డబ్ల్యూ.ఐ) నిర్వహించిన అంతర్జాతీయ ఆన్‌లైన్‌ సదస్సులో ముందుగా రికార్డుచేసిన వీడియోద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రసారం చేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661134

ఫూల్‌బగన్‌ మెట్రో స్టేషన్‌ను ప్రారంభించిన రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌

కోల్‌కతాలోని ‘ఈస్ట్‌—వెస్ట్‌ మెట్రో’లో భాగమైన ఫూల్‌బగన్‌ మెట్రో స్టేషన్‌ను రైల్వే, వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ 2020 అక్టోబరు 4న ప్రారంభించారు. అంతేకాకుండా వీడియో లింక్‌ ద్వారా ఈ కొత్త స్టేషన్‌ నుంచి తొలి రైలును జెండాఊపి సాగనంపారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నడుమ ఈ స్టేషన్ పనులను సకాలంలో పూర్తిచేసిన అందరికీ అభినందనలు తెలిపారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661659

హిందూస్థాన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 74వ వార్షిక సమావేశంలో శ్రీ పీయూష్‌ గోయల్‌ ప్రసంగం

‘హిందూస్థాన్‌ చాంబర్ ఆఫ్ కామర్స్’ 74వ వార్షిక సమావేశం సందర్భంగా వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా కేంద్ర వాణిజ్య-పరిశ్రమలు, రైల్వేశాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ శనివారం ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితులలో చాంబర్‌ చూపిన చొరవ, చేపట్టిన చర్యలను బట్టి వారు ఎంతటి సౌహార్దతకు పాత్రులైనదీ స్పష్టమవుతున్నదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే చాంబర్లు ఒకవైపు కోవిడ్‌ మహమ్మారిపై పోరాడుతూ మరోవైపు ప్రభుత్వ ఆందోళనలను, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ప్రముఖంగా అందరి దృష్టికీ తెస్తూ కొత్త పరిష్కారాలను అందుబాటులోకి తేవడలో దోహదపడుతున్నాయని ఆయన ప్రశంసించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661539

కోవిడ్‌-19 భయాలున్నప్పటికీ గాంధీ జయంతి సందర్భంగా రూ.1.02 కోట్ల వ్యాపారం చేసిన ‘ఖాదీ ఇండియా’ ప్రతిష్టాత్మక ‘కన్నాట్‌ ప్లేస్‌’ శాఖ

గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ ప్రేమికులు కోవిడ్‌ భయానికి వెరవకుండా కొనుగోళ్లు చేయడంతో ఢిల్లీలోని ‘ఖాదీ ఇండియా’ ప్రతిష్టాత్మక ‘కన్నాట్‌ ప్లేస్‌’ శాఖ రూ.1 కోటి దాటింది. ఈ మేరకు శుక్రవారం (అక్టోబర్ 2) ఇక్కడ రూ. 1,02,19,496 విలువైన ఖాదీ వస్త్రాల అమ్మకాలు నమోదయ్యాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661581

‘సమగ్ర ఆరోగ్య సంరక్షణ-కమ్యూనికేషన్’పై న్యూఢిల్లీలో అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ వైద్య సిబ్బంది దృష్టి సమగ్ర ఆరోగ్య సంరక్షణపై కేంద్రీకృతమైందని కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు విభిన్న వైద్యవిధానాల్లోని సామర్థ్యాన్ని గరిష్ఠంగా వాడుకోవడంపై శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో “ప్రపంచ సమగ్ర ఆరోగ్య సంరక్షణ-కమ్యూనికేషన్” సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని భిన్న దేశాలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతవరకు ఇతర వైద్య విధానాలమీద అనుమానాలు వ్యక్తంచేసే అల్లోపతి వైద్యవృత్తి నిపుణులు కోవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆయుర్వేద-హోమియో వైద్య విధానాల్లోని రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661540

కోవిడ్‌-19 సంక్ర‌మణకు గురైన ప్రతిభగల క్రీడాకారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు “గ్రాడ్యుయేటెడ్ రిటర్న్ టు ప్లే” పేరిట ‘సాయ్‌’ మార్గ‌ద‌ర్శ‌కాలు

భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న ప్రతిభగల ప్రతి క్రీడాకారులకు కోవిడ్‌ సంక్రమించిన నేపథ్యంలో వారి ఆరోగ్యం-శరీర దారుఢ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, “గ్రాడ్యుయేటెడ్ రిటర్న్ టు ప్లే” పేరిట ‘సాయ్‌” మార్గదర్శకాలను (ఎస్ఓపీ) జారీ చేసింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం- అన్ని ‘సాయ్‌” కేంద్రాలు, అధికారుల‌కు త‌గు సూచనలు కూడా  చేసింది. వీటికి అనుగుణంగా ఆయా కేంద్రాల‌లో శిక్ష‌ణ పొందుతూ.. కోవిడ్-19 బారినపడిన క్రీడాకారుల ఆరోగ్య ప్రగతిని పర్యవేక్షించాలని కోరింది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1661391

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో కేవలం 15 రోజుల వ్యవధిలోనే 10,000 కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడంతో కేరళ అంతటా ఆందోళన పెరుగుతోంది. ఈ మేరకు తిరువనంతపురం, మళప్పురం, కోళికోడ్, ఎర్నాకుళం జిల్లాల్లో రోజువారీగా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి సిబ్బంది సస్పెన్షన్‌పై ప్రభుత్వం వెనక్కుతగ్గే అవకాశాలు లేకపోవడంతో వైద్యసిబ్బంది తమ నిరసనను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆదివారం 4,851 మంది కోలుకోగా ఒక్కరోజులో అత్యధికంగా రోగులు వ్యాధినుంచి బయటపడినట్లయింది. మరోవైపు కోవిడ్ సంక్రమణ కొనసాగుతున్న నేపథ్యంలో 8,553 తాజా కేసులు నమోదయ్యాయి.
  • తమిళనాడు: రాష్ట్రంలోని కోయంబత్తూరులోగల ఇఎస్‌ఐ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా కొరతవల్ల ఇటీవల 10 మంది కోవిడ్ రోగులు మరణించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఈ మరణాలకు కారణం వైరస్‌ తీవ్రతే తప్ప ఆక్సిజన్‌ కొరత కాదని ఆస్పత్రి డీన్‌ ఎ.నిర్మల స్పష్టం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వ వైద్యులతో సమానంగా వేతనాల పెంచాలన్న డిమాండ్‌ను రాష్ట్రంలోని ప్రభుత్వ డాక్టర్లు తిరిగి లేవనెత్తారు.
  • కర్ణాటక: రాష్ట్ర రాజధాని బెంగళూరులో 4340 కొత్త కేసులతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 2.5 లక్షలు దాటింది. కర్ణాటకలో నిన్న వారం వ్యవధిలోనే మూడోసారిగా 10,000 కొత్త కేసులు నమోదవడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఆస్పత్రులలో, ఇళ్లలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 1,15,574గా నమోదైంది. కాగా, మైసూరులో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా కుటుంబ సభ్యులు, సందర్శకులు, మీడియా లేకుండానే నవరాత్రి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించుకోవాలని మైసూరు రాజ కుటుంబం నిర్ణయించింది.
  • ఆంధ్రప్రదేశ్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిగ్బంధ విముక్తి-5వ దశ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని థియేటర్లను 50 శాతం సీట్లతో అక్టోబర్ 15 నుంచి తిరిగి తెరిచేందుకు అనుమతించింది. అలాగే వినోద కేంద్రాలు, ఆటగాళ్ల ప్రాక్టీస్, ఈత కొలనుల పునఃప్రారంభానికి ఆమోదం తెలిపింది. తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులను పాఠశాలలకు అనుమతిస్తారు... అయితే, ఆన్‌లైన్ తరగతులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రెండు వారాలుగా తగ్గుముఖం పట్టాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1335 కొత్త కేసులు, 8 మరణాలు నమోదవగా 2176 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 291 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 2,00,611; క్రియాశీల కేసులు: 27,052; మరణాలు: 1171; డిశ్చార్జి: 1,72,388గా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన టీకాల తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన కరోనావైరస్ టీకా “కోవాక్సిన్”కు మానవ ప్రయోగ పరీక్షల నిర్వహణ ఆమోదం లభించినట్లు పేర్కొంది. రోగనిరోధక ప్రతిస్పందన-దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి  పెంపులో సహాయపడేలా ‘అల్‌హైడ్రక్సీక్విమ్‌-IIను ఈ టీకాలో ఉపయోగిస్తారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఆరు నెలల తర్వాత 4 లక్షలకుపైగా రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు 50 శాతం సామర్థ్యంతో తిరిగి తెరవడానికి అనుమతి ఇవ్వబడింది. అయితే, కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఈ యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, రాష్ట్రంలో మొత్తం 4 లక్షల బార్లు- రెస్టారెంట్లు (ముంబైలోనే 14,000) ఉండగా వీటిలో 30 నుంచి 40 శాతం యజమానులు మాత్రమే తిరిగి తెరిచేందుకు నిర్ణయించుకున్నారు, మరికొందరు మరో వారం వేచి చూడాలని భావిస్తున్నారు. కాగా, మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ- రాష్ట్రంలో కోలుకునే సగటు మెరుగుపడిందని, చికిత్స విధానాలు మారడంతో మరణాల శాతం తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు. కాగా, శనివారం రాష్ట్రంలో దాదాపు 14,000 కేసులు నమోదైతే 19,000 మంది రోగులు కోలుకున్నారని ఆయన చెప్పారు.
  • గుజరాత్: రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులకు సంబంధించి ఆరు నెలలకుపైగా కాలంలో వివిధ అంశాల్లో కనిష్ఠ స్థాయిని అందుకుంటున్న నేపథ్యంలో రోజువారీ మరణాల సంఖ్య ఒకే అంకెకు తగ్గి, ఇవాళ కేవలం 9 మరణాలు మాత్రమే సంభవించాయి. ఇక రోజువారీ కేసుల రీత్యా గత 26 రోజుల్లో ఇవాళ అతి తక్కువగా 1,302 నమోదయ్యాయి. ఇక రోజువారీ పరీక్షలకుగాను 49 రోజుల్లో నేడు అతి తక్కువగా 56,800 మాత్రమే నిర్వహించారు. కాగా, గుజరాత్‌లో చురుకైన కేసుల సంఖ్య గరిష్ఠస్థాయికి చేరి 16,836గా ఉంది.
  • రాజస్థాన్: రాష్ట్రంలోని జైపూర్ నగరంలో 7 రోజులుగా 400కుపైగా కేసులు నమోదవుతూ కోవిడ్ తీవ్రత కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం, 421 కేసులతో మొత్తం కేసుల సంఖ్య 23,179కి చేరింది. ఇందులో వారం వ్యవధిలోనే 2,965 నమోదవగా మార్చి నెలలో తొలి కేసు నమోదైన తర్వాత మొత్తం కేసులలో ఇది 13 శాతంగా తేలింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,720 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 1.35 లక్షలు దాటింది. ఇక 35మంది మరణంతో మృతుల సంఖ్య 2,434కు పెరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 19,372 క్రియాశీల కేసులున్నాయి. కాగా, రాష్ట్రంలో నిత్యం 30వేల పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించుకన్నట్లు అదనపు ప్రధాన కార్యదర్శి (ఆరోగ్యం) మహ్మద్ సులేమాన్ తెలిపారు. అయితే, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రాకపోవడమేగాక పరీక్షల కోసం జ్వర క్లినిక్‌లకు రావడంలేదని చెప్పారు.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో “కరోనా ఇంటెన్సివ్ కమ్యూనిటీ సర్వే కార్యక్రమం” కొనసాగుతోంది. అక్టోబర్ 12నాటికి రాష్ట్రంలోని గ్రామీణ-పట్టణ ప్రాంతాల్లో కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడం లక్ష్యంగా ఈ సర్వే చేపట్టారు. రోగులను వీలైనంత త్వరగా గుర్తించి, ఆస్పత్రులకు తరలించడంద్వారా మహమ్మారిని సమర్థంగా నిరోధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • అసోం: రాష్ట్రంలో నిన్న 1,351 మంది కోలుకోగా, ఇప్పటిదాకా 1,52,124మందికి వ్యాధి నయమైంది. ప్రస్తుతం క్రియాశీల రోగుల సంఖ్య 33,324గా ఉంది.
  • మణిపూర్: రాష్ట్రంలో 206 కొత్త కేసులు నమోదవగా ఇవాళ మరో ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 74కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం కోలుకునేవారి సగటు 77 శాతంగా ఉంది.
  • మేఘాలయ; రాష్ట్రంలో క్రియాశీల కేసులు 2209కాగా, వీరిలో బీఎస్‌ఎఫ్‌, సాయుధ దళాల సిబ్బంది 127 మంది కాగా, మిగిలినవారు మొత్తం 2,082 మంది ఉన్నారు. ఇక ఇప్పటిదాకా 4,393 మంది కోలుకున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మొత్తం 2,120కేసులకుగాను ప్రస్తుతం 313 క్రియాశీల కేసలున్నాయి. కాగా, మిజోరంలో కోలుకునే సగటు 85 శాతంకన్నా అధికం కాగా, ఇది జాతీయంగానే కాక అంతర్జాతీయంగానూ అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో నమోదైన మొత్తం 6,552 కేసుల్లో 3,101 అంటే- 47 శాతం భద్రతదళాల సిబ్బందే కావడం గమనార్హం. మరో తిరిగివచ్చినవారు, పరిచయస్థులు చెరో 24 శాతం కాగా, ముదువరుస పోరాట యోధులు 5 శాతంగా ఉన్నారు. నాగాలాండ్‌లో 123 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 6,552కు చేరాయి. ఇప్పటిదాకా 5,258 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,221 క్రియాశీల కేసులున్నాయి.
  • సిక్కిం: రాష్ట్రంలో మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 45కు చేరింది. మరోవైపు మొత్తం కేసుల సంఖ్య 3,093 కాగా, గత 24 గంటల్లో 43 కొత్త కేసుల నమోదుతో సిక్కింలో ప్రస్తుతం 649 క్రియాశీల కేసులున్నాయి.

FACT CHECK

***



(Release ID: 1661905) Visitor Counter : 270