ప్రధాన మంత్రి కార్యాలయం

వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ (వైభవ్) శిఖరాగ్ర సదస్సు-2020లో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 02 OCT 2020 10:00PM by PIB Hyderabad

నమస్కార్!
ఈ సదస్సులో పాల్గొన్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రవాసి భారతీయులు, భారతీయులు అందరినీ ఒక చోటుకి తెచ్చే వేదిక ఇది. భారతదేశంలోను, ప్రపంచంలోను శాస్ర్తీయ, నవ్య ఆవిష్కరణలను గుర్తించి వాటిని ఆవిష్కరించిన వారికి ఒక గుర్తింపు తెచ్చే కార్యక్రమం వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ (వైభవ్) శిఖరాగ్ర సదస్సు - 2020. దీన్ని నేను అసలైన సంగమం లేదా మేథో సంపత్తి నిపుణుల కలయికగా అభివర్ణిస్తాను. ఈ సంగమం ద్వారా భారతదేశాన్ని, భూగోళం యావత్తును సాధికారం చేసే దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నది మన భావన.

మిత్రులారా,
ఈ రోజు ఈ కార్యక్రమానికి తమ సూచనలు, ఆలోచనలు, వ్యాఖ్యలు అందించిన శాస్త్రవేత్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీ ఆవిష్కరణల్లో మీరు ఎన్నో అంశాలు తెలివిగా స్పృశించారు. ప్రధానంగా భారతదేశానికి చెందిన విద్యావేత్తలు, విదేశీ పరిశోధనా సంస్థల మధ్య విస్తృత సహకారం ఆవశ్యకతను కూడా మీరు ప్రముఖంగా ప్రస్తావించారు. వాస్తవానికి ఈ సమావేశం ప్రధానాంశం కూడా ఇదే. శాస్ర్తీయ పరిశోధనలను సమాజ అవసరాలకు అనుగుణంగా నిర్వహించాలన్న అంశాన్ని కూడా మీరు సరైన రీతిలో ప్రస్తావించారు. అలాగే భారతదేశంలో పరిశోధనా వాతావరణాన్ని మెరుగుపరచాలని కూడా మీరు కొన్ని సూచనలు చేశారు. ఈ ఆలోచనలు తెలియచేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మీ మాటలు విన్న నాకు ఈ వైభవ్ శిఖరాగ్రం అద్భుతమైన, ఉత్పాదకమైన భావాలు పంచుకునేందుకు వేదిగా నిలుస్తుందనిపించింది.

మిత్రులారా,
మానవాళి పురోగతికి మూలాధారం శాస్త్ర జ్ఞానమే. శతాబ్దాల మానవాళి మనుగడను మనం ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కాలాన్ని ఎలా విభజించాం?  రాతి యుగం, కంచు యుగం, ఇనుప యుగం, పారిశ్రామిక యుగం, అంతరిక్ష యుగం, డిజిటల్ యుగం.  ఇవే మనం ఉపయోగించిన పదాలు. ఈ ప్రతీ ఒక్క దశలోనూ విశేషమైన సాంకేతిక పురోగతి చోటు చేసుకుంది. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు మన జీవన శైలిలో మార్పులు కూడా తీసుకువచ్చాయి. మనలో శాస్ర్తీయ అంశాల పట్ల ఉత్సుకతను పెంచాయి.

మిత్రులారా,
సైన్స్, పరిశోధన, ఇన్నోవేషన్ పెంచడానికి భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. సామాజిక, ఆర్థిక పరివర్తనలో సైన్స్ అత్యంత కీలకం. వ్యవస్థలోని జడత్వాన్ని మేం వదిలించాం. వ్యాక్సిన్లను  ప్రవేశపెట్టడంలో దీర్ఘకాలిక విరామాన్ని మేం తొలగించాం. మా టీకాల కార్యక్రమంలో 2014 సంవత్సరంలో నాలుగు కొత్త వ్యాక్సిన్లను ప్రవేశపెట్టాం. ఇందులో దేశీయంగా తయారుచేసిన రొటా వైరస్ వ్యాక్సిన్ కూడా ఉంది. మేం దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. దేశీయంగా తయారుచేసిన న్యూమోకోకల్ వ్యాక్సిన్ మార్కెటింగ్ కు మేం అనుమతి ఇచ్చాం. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం, పోషణ్ ప్రచారోద్యమం మా పిల్లల ఆరోగ్యం, పోషకాహార స్థాయిని మరో స్థాయికి పెంచుతుంది. ప్రస్తుత మహమ్మారి కాలంలో మా వ్యాక్సిన్ తయారీదారులు చురుగ్గా మారి అంతర్జాతీయ పోటీ సామర్థ్యంతో పని చేస్తున్నారు. కాలమే ప్రధానమని మనం అర్ధం చేసుకున్నాం.

2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించేందుకు మేం పెద్ద కార్యక్రమం చేపట్టాం. ఐదు సంవత్సరాల క్రితం మేం నిర్దేశించుకుంటున్న లక్ష్యం ఇది.

మిత్రులారా,
ఇదే సమయంలో సమాంతరంగా ఇతర ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మేం అతి పెద్ద సూపర్ కంప్యూటింగ్ కార్యక్రమం, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమాలతో కృత్రిమ మేథ, రోబోటిక్స్, సెన్సర్లు, బిగ్ డేటా అనలిటిక్స్ విభాగాల్లో ప్రాథమిక పరిశోధన, అప్లికేషన్లు పెరిగాయి. ఇది భారత తయారీ రంగానికి పెద్దబలంగా నిలుస్తుంది. యువతలో మానవ వనరుల నిపుణులను సృష్టించగలుగుతాం. స్టార్టప్ రంగం కూడా ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటికే 26 టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ లు ప్రారంభించాం.

మిత్రులారా,
ప్రపంచ శ్రేణి శాస్ర్తీయ పరిశోధనలు మా రైతన్నలకు సహాయంగా ఉండాలని కోరుతున్నాం. మా వ్యవసాయ పరిశోధనా రంగంలోని శాస్త్రవేత్తలు పప్పుల దిగుబడిని పెంచేందుకు ఎంతో శ్రమించారు. ఈ రోజున మేం అతి తక్కువ పరిమాణంలో మాత్రమే పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం. మా ఆహారధాన్యాల ఉత్పత్తి రికార్డు గరిష్ఠ స్థాయిలకు చేరింది.

మిత్రులారా,
ఇటీవల భారతదేశం కొత్త జాతీయ విద్యావిధానం కూడా పొందింది. మూడు దశాబ్దాల విరామం తర్వాత వచ్చిన పాలసీ ఇది. పాలసీ రూపకల్పనకు ఎన్నో నెలల పాటు విస్తృతమైన సంప్రదింపులు జరిగాయి. రాష్ర్టీయ శిక్షానీతి పేరిట రూపొందించిన ఈ జాతీయ విద్యావిధానం దేశంలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుతుంది. దీర్ఘకాలంగా వేచి చూస్తున్న పరిశోధన, ఇన్నోవేషన్లకు కూడా ఉత్తేజం కల్పిస్తుంది. బహుళ విభాగాల సమ్మిళిత అధ్యయనాలపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుందని నేను ఆశావహంగా ఉన్నాను. విశాల దృక్పథం, అధిక విస్తృతి గల విద్యావాతావరణం యువతలో ప్రతిభకు నీరు పోసి పోషిస్తుంది.
 
ఈ రోజున భారతదేశం ప్రపంచంలో జరుగుతున్న పలు శాస్ర్తీయ పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు సేవలందిస్తూ ప్రధాన భాగస్వామిగా ఉంది. వాటిలో కొన్ని : 2016లో ఆమోదించిన లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషన్-వేవ్ అబ్జర్వేటరీ (ఎల్ఐజిఓ); 2017లో జనవరి నుంచి భారత్ అసోసియేట్ సభ్యదేశంగా ఉన్న యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సెర్న్); ఇంటర్నేషనల్ థెర్మో న్యూక్లియర్ ఎక్స్ పెరిమెంట్ రియాక్టర్ (ఐ-టిఇఆర్) ఉన్నాయి. నా సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ లో ఇందుకు మద్దతుగా పరిశోధన జరుగుతోంది.

మిత్రులారా,
మరింత ఎక్కువ మంది యువజనులు సైన్స్ పై ఆసక్తి పెంచుకోవడం ప్రస్తుతం ఎంతో అవసరం. ఇందుకోసం శాస్ర్తీయ దృక్పథం  చారిత్రక నేపథ్యం, చరిత్రలో శాస్ర్తీయత రెండింటి పైనా మంచి అవగాహన కలిగి ఉండాలి. గత శతాబ్దిఓల ఎంతో కాలంగా పరిష్కారం లేకుండా మిగిలిపోయిన ఎన్నో చారిత్రక అంశాలకు పరిష్కారాలు లభించాయి. ఈ రోజున కచ్చితమైన తేదీల నిర్ధారణకు కూడా శాస్ర్తీయ విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఇవి పరిశోధనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
భారత శాస్ర్తీయ విభాగం సమున్నతమైన  చరిత్రను కూడా మనం ఎన్నో రెట్లు విస్తరించాల్సి ఉంది. దీర్ఘకాలం పాటు మా యువతరం శాస్ర్తీయతకు ముందున్నదంతా మూఢనమ్మకాలు, అంధకార యుగమే అనే అపప్రథలో ఉండిపోవడం విచారకరం. ఇది కంప్యూటర్లు, ప్రోగ్రామింగ్, మొబైల్, అప్లికేషన్ల యుగం. కాని కంప్యూటింగ్ కు మూలం ఏమిటి?  అదే బైనరీ కోడ్ 1 & 0.

మిత్రులారా,
ఒకరు జీరో గురించి మాట్లాడుతుంటే భారతదేశం ప్రస్తావన రాకుండా ఎలా ఉంటుంది?   గణిత శాస్త్రం, కామర్స్ లో జీరోయే కీలకంగా నిలుస్తుంది. బౌద్ధయాన, భాస్కర, వరాహమిహిర, నాగార్జున, సుశృత వంటి ప్రాచీన తరంతో పాటు ఆధునిక తరానికి చెందిన సత్యేంద్రనాథ్ బోస్, సర్ సివి రామన్ గురించి  కూడా యువత తెలుసుకోవాలి. ఈ జాబితాకు అంతమే ఉండదు.

మిత్రులారా,
సమున్నతమైన ప్రాచీన చరిత్ర నుంచి లభించిన స్ఫూర్తితో పాటు వర్తమాన కాలంలో  సాధించిన విజయాల శక్తిని కూడా జోడించి భవిష్యత్తులోకి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. రాబోయే తరాలకు సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించాలనుకుంటున్నాం. భారతదేశం ఎలుగెత్తి ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత లక్ష్యం ప్రపంచ సంక్షేమమే. ఈ కల సాకారం చేయడంలో మీ అందరి సహకారాన్ని నేను కోరుతున్నాను, చురుకైన భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నాను. ఈ మధ్యనే భారతదేశం అంతరిక్ష సంస్కరణలు కూడా ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు ఇటు విద్యారంగానికి, అటు పరిశ్రమకు కొత్త అవకాశాలు అందుబాటులోకి తెస్తాయి. ఎంతో చలనశీలత కలిగిన భారత స్టార్టప్ వాతావరణం గురించి మీ అందరికీ బాగా తెలుసు. శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, విద్యావేత్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి లేకుండా ఈ పురోగతి ఏ మాత్రం సాధ్యం కాదు. మీ మార్గదర్శకత్వంలో మా స్టార్టప్ రంగం మరింత లాభపడుతుంది.

మిత్రులారా,
ప్రపంచ యవనికపై భారత సంతతి ప్రజలు అద్భుతమైన రాయబారులు. వారెక్కడకి వెళ్లినా తమతో భారతదేశానికి చెందిన విలువలను వారు తీసుకెళ్లారు. అలాగే కొత్త నివాస ప్రదేశంలోని సంస్కృతిని కూడా వారు స్వీకరించారు. భిన్న రంగాల్లో భారతీయ సంతతి ప్రజలు విజయాలు సాధించారు. విద్యారంగం వాటిలో సముజ్వలమైన ఉదాహరణగా నిలుస్తుంది. ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలు, సాంకేతిక రంగంలో తమకు తామే సాటి అయిన ప్రపంచ స్థాయి సంస్థలు భారతీయ ప్రతిభతో ఎంతో లాభపడ్డాయి. 

వైభవ్ ద్వారా మాతో అనుసంధానమై, మాతో భాగస్వాములయ్యే ఎంతో పెద్ద అవకాశాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాం. మీ ప్రయత్నాలు భారతదేశానికే కాదు, ప్రపంచానికి కూడా సహాయపడతాయి. భారతదేశం లాభపడితే ప్రపంచం కూడా ఒక అడుగు ముందుకేయగలుగుతుంది. మీ మధ్యన జరిగే ఈ సంభాషణలు తప్పనిసరిగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మీ కృషితో ఆదర్శనీయమైన పరిశోధన వాతావరణం ఏర్పడుతుంది.  అది సాంప్రదాయాలను ఆధునికతతో మేళవిస్తుంది. మనందరం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు దేశీయ పరిష్కారాలను భారత్ అందించగలుగుతుంది. ఇతరు సుసంపన్నతకు కూడా ఇది అవకాశం కల్పిస్తుంది. విప్లవాత్మక టెక్నాజీలను భారతదేశం సృష్టించేందుకు ఇది దోహదపడుతుంది.

మిత్రులారా,
మనం మహాత్మాగాంధీ జయంతి నాడు సమావేశమవుతున్నాం. నూరు సంవత్సరాల క్రితం 1925లోనే తిరువనంతపురం మహారాజా కాలేజిలో మాట్లాడుతూ గాంధీజీ ప్రస్తావించిన అంశాన్ని ఈ రోజు మీకందరికీ గుర్తు చేస్తున్నాను. అధిక శాతం జనాభా జీవించే గ్రామీణ ప్రాంతాలకు శాస్ర్తీయ ప్రగతి ఫలాలు విస్తరించాలన్నది ఆయన ఆకాంక్ష. ఎంతో విస్తృతి కలిగిన సైన్స్ ను బాపూ నమ్మేవారు. 1929లో ఆయన ఎంతో ప్రత్యేకమైన ఒక అంశాన్ని పరీక్షించారు. క్రౌడ్ సోర్సింగ్ పై ప్రయోగం చేశారు. తేలికపాటి బరువు గల చరఖా డిజైన్ చేయాలని ఆయన కోరారు. గ్రామాలు, యువత, పేదల పట్ల ఆయనకు గల శ్రద్ధ, అధిక శాతం జనాభాను సైన్స్ తో అనుసంధానం చేసేందుకు ఆయన కన్న కలలు మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇదే రోజున జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్న దేశానికి గర్వకారణమైన మరో భారత పుత్రుని కూడా మనం స్మరించుకుందాం. ఆయనే మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్ర్తి. ఆయన నిరాడంబరత, హుందాతనం, సమున్నతమైన నాయకత్వం మేం గుర్తు చేసుకుంటున్నాం.

మిత్రులారా,
ఈ కార్యక్రమం అత్యుత్తమ చర్చలకు ఆస్కారం కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను. వైభవ్, ఇందులో జరుగుతున్న చర్చలు అద్భుత విజయం సాధించేందుకు మేం కచ్చితంగా కృషి చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. ఈ ప్రసంగం ముగించే ముందు మీరందరూ ఆరోగ్యంపై సంపూర్ణ జాగ్రత్తలు తీసుకోవాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
ధన్యవాదాలు.

***
 (Release ID: 1661357) Visitor Counter : 26