ప్రధాన మంత్రి కార్యాలయం
అటల్ టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
హిమాచల్ లోని పీర్‌పంజాల్ ప్రాంతంలో అత్యంత క్లిష్టమైన భూభాగంలో ఈ అధ్బుత సొరంగ మార్గ నిర్మాణాన్ని సాకారం చేసినందుకు ఇంజనీర్లను, బి.ఆర్.ఒ ను అభినందించిన ప్రధానమంత్రి.
ఈ సొరంగమార్గం హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, లెహ్, లద్దాక్‌లకు సాధికారత కల్పిస్తుంది: ప‌్రధానమంత్రి
రైతులు, పండ్లతోటలవారు,యువకులు, టూరిస్టులు, భద్రతా సిబ్బంది ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం పొందుతారు : ప‌్రధానమంత్రి
సరిహద్దు ప్రాంతాల అనుసంధానత అభివృద్ధికి , మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుకు రాజకీయ సంకల్పం కావాలి: ప‌్రధానమంత్రి
వివిధ మౌలికసదుపాయాల ప్రాజెక్టుల సత్వర అమలు ప్రత్యక్షంగా వేగవంతమైన ఆర్ధిక ప్రగతితో ముడిపడి ఉంటుంది: ప‌్రధానమంత్రి
Posted On:
03 OCT 2020 1:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రపంచంలోనే అతి పొడవైన హైవే సొరంగ మార్గం - అటల్ టన్నెల్‌ను దాని దక్షిణభాగంలో ఈరోజు మనాలిలో ప్రారంభించారు.
9.02 కిలోమీటర్ల పొడవుగల ఈ సొరంగ మార్గం మనాలి ని లాహౌల్-స్పితి లోయకు ఏడాది పొడవునా అనుసంధానతను కల్పిస్తుంది. ఇంతకు ముందు ఈ లోయ ప్రాంతం విపరీతమైన మంచుపడుతుండడం వల్ల ఏడాదిలో ఆరునెలలు అనుసంధానత కోల్పోయేది.
ఈ సొరంగమార్గాన్ని అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ,హిమాలయాలలోని పీర్ పంజాల్ రేంజ్‌లో సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో (10,000 అడుగుల ఎత్తు) నిర్మించారు.
ఈ సోరంగమార్గం మనాలి,లెహ్‌లమధ్య రోడ్డు మార్గాన్ని 46 కిలోమీటర్ల దూరం తగ్గిస్తుంది. సమయం ప్రకారం చూసినట్టయితే 4 నుంచి 5 గంటలు ఆదా అవుతుంది.
ఈ సొరంగమార్గ నిర్మాణంలో అత్యధునాతన ఎలక్ట్రో మెకానికల్ వ్యవస్థలు, సెమీ ట్రాన్స్‌వెర్స్ వెంటిలేషన్, ఎస్‌సిఎడిఎ నియంత్రిత అగ్నినిరోధక వ్యవస్థ, లైటింగ్ ,మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌లో భద్రతాపరంగా ఎన్నో పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ఈ సొరంగ మార్గంలో దక్షిణ ద్వారం నుంచి ఉత్తర ద్వారం వరకు ప్రయాణించారు. అలాగే ప్రధాన టన్నెల్‌లోనే నిర్మించిన అత్యవసరంగా బయటపడే మార్గాన్నీ ప్రధాని పరిశీలించారు. అటల్ టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి తిలకించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇది చరిత్రాత్మకమైన రోజుఅని అన్నారు. ఇది మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి దార్శనికతను సాకారంచేస్తున్నదని అలాగేదశాబ్దాల తరబడి ఈ ప్రాంతానికి చెందిన కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నదని అయన అన్నారు.
అటల్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా భాగాలకు అలాగే కొత్త కేంద్రపాలిత ప్రాంతం లెహ్-లద్దాక్‌కు ఒక జీవనరేఖ కానుంది. ఇది మనాలి, కీలాంగ్ లమధ్య ప్రయాణ సమయాన్ని 3 నుంచి 4 గంటలు తగ్గిస్తుంది.
ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, లెహ్- లద్దాక్ ప్రాంతాలు ఎల్లప్పుడూ దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానమై ఉండడమే కాక, సత్వర ఆర్ధిక ప్రగతికి ఇది దోహదపడుతుంది.
రైతులు, పండ్లతోటలవారు, యువకులు దేశరాజధాని ఢిల్లీ, ఇతర మార్కెట్‌లను సులభంగా చేరుకోగలుగుతారని ప్రధానమంత్రి అన్నారు.
సరిహద్దు ప్రాంతంలో గల ఈ అనుసంధానతా ప్రాజెక్టులు, భద్రతా బలగాలకు క్రమం తప్పకుండా సరకులు చేరవేయడానికి , గస్తీకి ఉపకరిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
ఈప్రాజెక్టును సాకారం చేయడంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కృషి చేసిన ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కార్మికుల కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
భారతదేశ సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో అటల్ టన్నెల్ కొత్త శక్తిని ఇవ్వనుంది, ప్రపంచ శ్రేణి సరిహద్దు అనుసంధానతకు ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు. సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, సరిహద్దు ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్న డిమాండ్లు ఎంతో కాలంగా ఉన్నాయని, కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రగతి లేకుండా ఉండేలా గతప్రణాళికలున్నాయన్నారు.
2002 వ సంవత్సరంలో అటల్‌జీ ఈ టన్నెల్ అప్రోచ్ రోడ్‌కు శంకుస్థాపన చేశారని ప్రధానమంత్రి చెప్పారు. అటల్‌జీ ప్రభుత్వం తర్వాత ఇందుకు సంబంధించిన పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, 2013-14 నాటికి కేవలం 1300 మీటర్లు అంటే 1.5 కిలోమీటర్ల లోపు మాత్రమే నిర్మించారన్నారు.అంటే ఏడాదికి 300 మీటర్ల లోపు నిర్మాణం జరిగిందన్నారు.
అదే తీరులో నెమ్మదిగా పనులు సాగితే ఈ సొరంగమార్గం 2040లో పూర్తి అవుతుందని నిపుణులు వివరించారని ప్రధాని అన్నారు.
ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును ఫాస్ట్‌ట్రాక్‌లోకి తెచ్చి ఏటా 1400 మీటర్లవంతున నిర్మాణ పనులుజరిగేలా ప్రాజెక్టును వేగవంతం చేయడం జరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. 26 సంవత్సరాలు పడుతుందని అంచనావేసిన ప్రాజెక్టును 6 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేశామని ఆయన చెప్పారు.
దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలంటే మౌలికసదుపాయాల ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావాలని ప్రధానమంత్రి అన్నారు. ఇందుకు తిరుగులేని రాజకీయ సంకల్పం,దేశ ప్రగతిపట్ల చిత్తశుద్ధి అవసరమని ఆయన అన్నారు.
ఇలాంటి కీలక.ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరిగితే అది ఆర్ధికనష్టానికి దారితీస్తుందని,ప్రజలకు ఆర్థిక. సామాజిక ప్రయోజనాలను దక్కుండాచేస్తుందని ఆయన అన్నారు.
2005లో ఈ టన్నల్ నిర్మాణ వ్యయం 900 కోట్ల రూపాయలుకాగా, నిరంతర జాప్యం వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3 రెట్ల కంటే ఎక్కువగా అంటే 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు.
ఎన్నో ప్రధాన ప్రాజెక్టులు అటల్ టన్నెల్ వంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయని ఆయన అన్నారు.
వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన, వైమానిక దళానికి ఎయిర్‌స్ట్రిప్ అవసరమైనప్పటికీ, లద్దాక్ లోని ఎయిర్‌స్ట్రిప్, దౌలత్ బేగ్ ఓల్డి 40-45 సంవత్సరాలుగా పూర్తికాకుండా ఉందని ప్రధానమంత్రి అన్నారు.
బొగి బీల్ బ్రిడ్జి పనులు కూడా అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో ప్రారంభమయ్యాయని ,అయితే ఆ తర్వాత వాటిలో అంతులేని జాప్యం జరిగిందన్నారు. ఈ బ్రిడ్జి అరుణాచల్ ప్రదేశ్‌ను ఈశాన్య ప్రాంతాన్ని కలిపే కీలక మార్గమని అన్నారు. 2014 తర్వాత ఈ పనులు శరవేగంతో చేపట్టి రెండు సంవత్సరాల క్రితం అటల్ జీ జన్మదినోత్సవం రోజున దానిని ప్రారంభించుకున్నామని ప్రధానమంత్రి చెప్పారు.
బీహార్ లోని మిథిలాంచల్ ప్రాంతంలోని రెండు కీలక ప్రాంతాలను కలిపేందుకు ఉద్దేశించిన కోసి మహాసేతు నిర్మాణానికి కూడా అటల్‌జీ శంకుస్థాపన చేశారన్నారు. 2014 సంవత్సరం తర్వాత ప్రభుత్వం దాని పనులు వేగవంతం చేసి కొద్ది వారాల క్రితమే కోసి మహాసేతును ప్రారంభించుకున్నామని ప్రధానమంత్రి చెప్పారు.
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని,గత ఆరుసంవత్సరాలలో సరిహద్దు మౌలిక సదుపాయాలకు సంబంధించి అవి రోడ్లు కాని బ్రిడ్జిలు కాని, సొరంగ మార్గాలు కానీ అత్యంత వేగంగా వాటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని ప్రధానమంత్రి తెలిపారు.
భద్రతా బలగాల అవసరాలు తీర్చడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో కీలకమైన అంశాలలో ఒకటని ఆయన అన్నారు. అయితే గతంలో ఈ విషయంలో కూడా రాజీ పడ్డారని, దేశ రక్షణ బలగాల ప్రయోజనాల విషయంలోనూ రాజీ పడ్డారని ప్రధానమంత్రి అన్నారు.
రక్షణ బలగాల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఒకే ర్యాంకు,ఒకే పెన్షన్ పథకం, అధునాతన ఫైటర్ విమానాల సేకరణ, ఆయుధాలు సమకూర్చుకోవడం, అధునాతన రైఫిళ్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, తీవ్రచలిని తట్టుకునే పరికరాల వంటి వాటి విషయంలో గత ప్రభుత్వం పెండింగ్‌లోపెట్టిన వాటిని తాము పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వాలకు వీటిని చేపట్టడానికి రాజకీయసంకల్పం లేదని, అయిఏత ప్రస్తుతం దేశంలో పరిస్థితి మారుతున్నదని ఆయన అన్నారు.
దేశంలోనే అత్యంత అధునాతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారుచేసేందుకు , రక్షణ ఉత్పత్తుల విషయంలో ఎఫ్.డి.ఐ ల సడలింపు నకు కీలక సంస్కరణలు తీసుకువచ్చినట్టు ప్రధానమంత్రి తెలిపారు.
ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని ఏర్పాటు చేయడం ద్వారా సంస్కరణలు తీసుకువచ్చామని, అలాగే రక్షణ బలగాలవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి, ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి మరింత సమన్వయం ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి చెప్పారు.
.బారత్ అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్నందుకు అనుగుణంగా దేశం, మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని, ఆర్థిక, వ్యూహాత్మక శక్తిని అదే వేగంతో ముందుకు తీసుకుపోవాలని ప్రధాని అన్నారు.
దేశం స్వావలంబన, ఆత్మనిర్భర్ సాధించాలన్న సంకల్పానికి ఈ అటల్‌టన్నెల్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
***
(Release ID: 1661358)
Visitor Counter : 296
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam