ప్రధాన మంత్రి కార్యాలయం
వైభవ్ 2020 సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రారంభ ఉపన్యాసం
భారత సంతతికి చెందిన మూడు వేలమందికి పైగా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, భారతదేశానికి చెందిన పదివేల మంది శాస్త్రవేత్తల హాజరు
శాస్త్ర విజ్ఞాన రంగాలపట్ల యువతలో మరింత ఆసక్తి పెరగాలి: ప‌్రధాని
అంతరిక్ష రంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల కారణంగా పరిశ్రమలకు, విద్యావేత్తలకు పుష్కలంగా అవకాశాలు : ప‌్రధాని
భారత్ ను 2025 నాటికి క్షయవ్యాధి రహిత దేశంగా ప్రకటించడమే లక్ష్యం: ప‌్రధాని
Posted On:
02 OCT 2020 8:33PM by PIB Hyderabad
శాస్త్ర విజ్ఞాన రంగాలపట్ల యవతలో మరింత ఆసక్తిని పెంచాల్సిన అవసరముందని అదే నేటి అవసరమని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం మనం చారిత్రక విజ్ఞానంపైనా, శాస్త్ర విజ్ఞానాల చరిత్ర మీద పట్టు సాధించాలని ఆయన వివరించారు. అంతర్జాతీయ విర్చువల్ సమావేశమైన వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ ( వైభవ్ ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సమావేశంలో వేలాది మంది దేశ విదేశాలకు చెందిన భారతీయ పరిశోధకులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు.
భారతదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను శాస్త్ర విజ్ఞాన, ఆవిష్కరణల రంగాల గొప్పదనాన్ని సంబరంగా జరుపుకునే సమావేశమే వైభవ్ 2020 సమావేశమని ప్రధాని అన్నారు. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా వున్న వేలాది మంది ఆలోచననాపరులు ఒక చోటకు చేరడం జరిగింది. భారతదేశానికి, ప్రపంచానికి సాధికారత కలిగించడానికే ఈ సమావేశమని ప్రధాని వివరించారు.
దేశంలో సామాజిక ఆర్ధిక మార్పులు తేవడానికిగాను శాస్త్ర విజ్ఞానం ఎంతో ముఖ్యమనేద కేంద్ర ప్రభుత్వ విధానమని శాస్త్ర విజ్ఞాన పరిశోధనలు, ఆవిష్కరణలు పెరగడానికిగాను తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
టీకాల తయారీకోసం, టీకాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించడానికిగాను భారతదేశం చేస్తున్న విశిష్టమైన కృషిని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు.
టీకాల రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన టీకాలకార్యక్రమంలోకి 2014లో నాలుగు నూతన టీకాలను చేర్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన రోటా టీకా వున్న విషయాన్ని ప్రస్తావించారు.
2025 నాటికి భారతదేశంలో క్షయ వ్యాధి లేకుండా చేయడానికిగాను ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా పెట్టుకున్న లక్ష్యానికంటే ఐదు సంవత్సరాలకంటే ముందుగా తాము ఈ పని చేయబోతున్నామని ఆయన దీమా వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కూలంకుషంగా సంప్రదింపులు జరిపిన తర్వాత, చర్చలు చేసిన తర్వాత జాతీయ నూతన విద్యావిధానం 2020ని తీసుకురావడం జరిగిందని మూడు దశాబ్దాల తర్వాత దీన్ని దేశంలో ప్రవేశపెట్టడం జరిగిందని ప్రధాని అన్నారు. నూతన విధానం ద్వారా శాస్త్ర విజ్ఞాన రంగాలపట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నామని, శాస్త్ర పరిశోధనల్ని ఇది మరింత బలోపేతం చేస్తోందని ప్రధాని అన్నారు. యువతలోని ప్రతిభను ప్రోత్సహించడానికిగాను ఈ నూతన విద్యావిధానం సమగ్రమైన, పారదర్శకమైన వాతావరణాన్ని కల్పిస్తోందని ప్రధాని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అంతరిక్ష రంగ సంస్కరణల గురించి వివరిస్తూ వీటి ద్వారా పరిశ్రమలకు, విద్యారంగానికి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో లేసర్ ఇంటర్ ఫెరో మీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ, సెర్న్ మరియు ఇంటర్నేషనల్ థెర్మో న్యూక్లియర్ ఎక్స్ పెరిమెంటల్ రియాక్టర్ (ఐటిఇఆర్ )ల విషయంలో భారతదేశ భాగస్వామ్యం గురించి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ప్రాధాన్యత గురించి, వాటి అభివృద్ధిలో భారతదేశ కృషిని వివరించారు.
సూపర్ కంప్యూటింగ్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ రంగాల్లో భారతదేశం చేపట్టిన ప్రధానమైన కార్యక్రమాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. కృత్రిమ విజ్ఞానం, రోబోటిక్స్, సెన్సార్స్, భారీ డాటా విశ్లేషణ రంగాల్లో ప్రాధమికంగా జరగాల్సిన పరిశోధన, అనువర్తనాల గురించి మాట్లాడుతూ ఇవి స్టార్టప్ విభాగాల్లో, తయారీరంగంలోను మేలు చేస్తాయని అన్నారు.
ఇప్పటికే దేశంలో ప్రారంభించిన ఆవిష్కరణ, సాంకేతికతలకు సంబంధించిన 25 కేంద్రాల గురించి ప్రధాని వివరిస్తూ ఇవి దేశంలోని స్టార్టప్ ఎకో సిస్టమ్ ను మరింతగా బలోపేతం చేస్తాయని అన్నారు.
వ్యవసాయదారులకు సాయం చేయడానికిగాను అత్యున్నత నాణ్యత కలిగిన పరిశోధనలు కావాలని భారతదేశం కోరుకుంటున్నదని ప్రధాని అన్నారు. పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికిగాను భారతీయ శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు.
భారతదేశం ప్రగతి సాధిస్తే ప్రపంచం ప్రగతి సాధించినట్టేనని ప్రధాని అన్నారు.
పరిచయాలు పెంచుకోవడానికి, మన వంతు కృషిని అందించడానికిగాను వైభవ్ ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తోందని ప్రధాని అన్నారు. భారతదేశం ప్రగతి సాధిస్తే తద్వారా అది ప్రపంచాన్ని కూడా ముందుకు నడిపిస్తుందని ప్రధాని అన్నారు. వైభవ్ సమావేశమనేది గొప్ప ఆలోచనాపరుల కలయిక అని ఇలాంటి ప్రయత్నాల వల్ల ఆదర్శవంతమై పరిశోధనా వాతావరణం ఏర్పడుతుందని ప్రధాని అన్నారు. సంప్రదాయాలను, ఆధునికతతో మేళవించి సంపదను తయారు చేసుకోవడానికి ఆ వాతావరణం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంద్వారా ఆవిష్కారమయ్యే ఆలోచనలు బోధన, పరిశోధన రంగాల్లో ఉపయోగకరమైన భాగస్వామ్యాలకు దారి తీస్తాయని అన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకుల కృషి కారణంగా మార్గదర్శకమైన పరిశోధనా వాతావరణం నెలకొంటుందని ప్రధాని స్పష్టం చేశారు.
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు భారతదేశానికి, ప్రపంచానికి మధ్యన అత్యుత్తమ రాయబారులుగా పని చేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. రాబోయే తరాలకు భద్రతమైన, సౌభాగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించాలనే కలను సాకారం చేయడానికి ఈ సమావేశం కృషి చేయాలని ప్రధాని తన సంకల్పాన్ని తెలియజేశారు. ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి ఆదర్శనీయమైన పరిశోధనా వ్యవస్థ ఏర్పడడంలో తన వంతు సాయం అందిస్తుందని ప్రధాని ఆకాంక్షించారు.
వైభవ్ సమావేశంలో 55 దేశాలనుంచి మూడు వేలకుపైగా భారత సంతతి విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. ఇందులో భారతదేశానికి చెందిన పది వేలమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు కూడా పాల్గొంటున్నారు. కేంద్రప్రభుత్వ ప్రధాన శాస్త్ర విజ్ఞాన సలహాదారు ఆధ్వర్యంలో రెండు వందల భారతీయ విద్యా సంస్థలు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల సారధ్యంలో వైభవ్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంలో చర్చలు అక్టోబర్ 3 నుంచి 25వ తేదీవరకు కొనసాగుతాయి. సమావేశ సారాంశం అక్టోబర్ 28న వెలువడుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 31న వైభవ్ సమావేశం ముగుస్తుంది. నెలరోజులపాటు వివిధ రకాల వెబినార్లు, వీడియో కాన్ఫరెన్సులద్వారా పలు దశల్లో సమావేశాలు కొనసాగుతాయి.
స్థూలంగా చూసినప్పుడు ఈ సమావేశంలో చర్చించే శాస్త్ర సాంకేతిక రంగాల అంశాలు ఇలా వున్నాయి. కంప్యుటేషనల్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ టెక్నాలజీ, ఫోటోనిక్స్, ఏరోస్పేస్ టెక్నాలజీ, వైద్యశాస్త్రం, బయోటెక్నాలజీ, వ్యవసాయశాస్త్రం, మెటీరియల్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, అడ్వాన్స్ డ్ మ్యానుఫాక్చరింగ్, ఎర్త్ సైన్స్, ఎనర్జీ, ఎన్విరాన్ మెంటల్ సైన్స్, మేనేజ్ మెంట్ రంగాల్లో ఈ చర్చలు వుంటాయి.
సార్వత్రికంగా అభివృద్ధి సాధనలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికిగాను అంతర్జాతీయంగా వున్న భారతీయ పరిశోధకుల అనుభవాలను, ఆలోచనల్ని ఉపయోగించుకొని సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం.దేశ విదేశాల్లోని భారతీయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తల మధ్యన సహకారం, భాగస్వామ్యం ఏర్పడడానికిగాను ఈ సమావేశం దోహదం చేస్తుంది. అంతర్జాతీయ సహాయాన్ని తీసుకవడంద్వారా వైజ్ఞానిక, ఆవిష్కరణలతో కూడిన ఎకోసిస్టమ్ ను ఆవిష్కరించడమే లక్ష్యం.
ఈ ప్రారంభ సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్ర విజ్ఞాన సలహాదారు ప్రొఫెసర్ కె. విజయరాఘవన్ వివిధ దేశాలనుంచి వచ్చిన 16 మంది పానెలిస్టులు ప్రధానితో మాట్లాడారు. ఈ 16 మంది పానెలిస్టులు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సింగపూర్, కొరియా, బ్రెజిల్, స్విట్జర్లాండ్ మొదలైన దేశాలకు చెందిన వారు. వీరు వివిధ శాస్త్ర విజ్ఞాన సాంకేతిక రంగాల్లో నిపుణులు.
***
(Release ID: 1661352)
Visitor Counter : 364
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam