శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

శాస్త్రీయ సమాచార పంచుకునేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది

శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ

చివరి దశలో కరోనా వైరస్ కి వాక్సిన్ల ట్రయల్స్ :

ప్రపంచంలో అధిక జనాభాకి అందించగల సామర్థ్యం భారత్ కి ఉంది.

Posted On: 04 OCT 2020 6:20PM by PIB Hyderabad

శాస్త్రీయ డేటాను పంచుకోవటం, అందుబాటులో ఉంచటం కోసం భారత్ రూపొందించుకున్న జాతీయ విధానం  మన ప్రాధాన్యాన్ని, శ్రద్ధను చాటుతోందని శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతూ పోర్టల్ నడపటమే అందుకు నిదర్శనమన్నారు. 17వ వార్షిక శాస్త్ర సాంకేతిక సంఘ వేదిక నిర్వహించిన శాస్త్ర సాంకేతిక మంత్రిత్వస్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

“శాస్త్రీయ సమాచారాన్ని పంచుకోవటాన్ని కొత్త ఎస్ టి పి ఐ -2000 లో చేర్చే అంశం పరిశీలనలో ఉంది. డేటా అనేది నీరు లాంటిది. దీన్ని మనం ఒక అంతర్జాతీయ భాగస్వామిగా అంతర్జాతీయంగా పంచుకోవాలనుకుంటున్నాం” అని ప్రొఫెసర్ శర్మ వ్యాఖ్యానించారు.  

జపాన్ ఆతిథ్యంలో శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వస్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని అక్టోబర్ 3న ఆన్ లైన్ పద్ధతిలో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయంగా పరిశోధన, అభివృద్ధిని పంచుకోవటంలో పాత్ర,  సామాజిక శాస్త్రాలు, మానవశాస్త్రాలు, సార్వజనిక శాస్త్ర విజ్ఞానం తదితర అంశాలమీద ఈ సదస్సు చర్చించింది. ప్రపంచం నలుమూలలనుంచి దాదాపు 50 దేశాలకు చెందిన శాస్త్ర సాంకేతిక విభాగాల అధిపతులు ఇందులో పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్తగా వస్తున్న అవకాశాలను,  కోవిడ్-19 విసిరిన సవాళ్లను ఎదుర్కోవటంలో చేయాల్సిన కృషిని సదస్సులో సవివరంగా చర్చించారు.

ఈ మంత్రిత్వస్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ తరఫున పాల్గొన్న శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ పాల్గొని ప్రసంగించారు. శాస్త్ర సంకేతిక విజ్ఞాన సహకారంలోను, సామాజిక శాస్త్రాలు, మానవశాస్త్రాలు, సార్వజనిక శాస్త్ర విజ్ఞానంలోను  భారత్ తీసుకుంటున్న చొరవను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ రంగాల్లో అంతర్జాతీయ సహకారాని అసాధారణమైన రీతిలో సహకారం అందజేస్తుందన్నారు. ఆరోగ్యం, నీరు, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పు, కమ్యూనికేషన్లు, ప్రకృతి వైపరీత్యాలవంటి విషయాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్న విషయాన్ని ఆయన మరోమారు గుర్తు చేశారు.

భారతదేశం ప్రపంచంలోని 40కి పైగా దేశాలతో శాస్త్ర, సాంకేతిక సహకారం నడుపుతున్నదని పేర్కొంటూ, భారత్ అనేక బహుళ పక్ష, ప్రాంతీయ వేదికలలో భాగస్వామిగా ఉందన్నారు. యూరోపియన్ యూనియన్, బ్రిక్స్, ఏసియాన్, జి20, ఆఫ్రిక ఇనిషియేటివ్స్, ఐక్యరాజ్యసమితి, ఒఇసిడి వేదికలమీద భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ప్రస్తావించారు. ఐటిఇఆర్, టిఎంటి, ఎల్ ఐ జి ఓ లాంటి అనేక అంతర్జాతీయ మెగా సైన్స్ ప్రాజెక్టులను కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు వీలుగా మౌలిక సదుపాయాల కల్పనకు అంతర్జాతీయంగా తీసుకునే చొరవలోనూ, అంతరాయం లేని విద్యుత్ అందించటం కోసం సోలార్ అలయెన్స్, మిషన్ ఇన్నొవేషన్ లాంటి కార్యక్రమాలు చేపట్టటం గురించి ఆయన మాట్లాడారు.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి వాక్సిన్ తయారు చేసే దిశలో వాక్సిన్ ట్రయల్స్ కీలకమైన ఆఖరిదశలో ఉన్నాయని కూడా చెప్పారు. మానవాళిలో అత్యధిక భాగానికి వాక్సిన్ తయారుచేసి అందించగల సామర్థ్యం భారత దేసానికుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ ఉన్నత స్థాయి మంత్రిత్వ సమావేశంలో అర్జెంటైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఇండోనేసియా, భారత్, ఇరాక్, రష్యా, దక్షిణాఫ్రికా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మీద పోరాటానికి శాస్త్ర, సాంకేతిక రంగాలు విశేషమైన, కీలకపాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఈ సదస్సు ప్రత్యేకంగా చర్చించింది. అంతర్జాతీయంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారం మరింత బలపడాలని సదస్సు ఆకాంక్షించింది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి ఎంతో ప్రాధాన్యం ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని సదస్సు అభిప్రాయపడింది.  

శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వస్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్ టి ఎస్ ఫోరమ్ ఏటా నిర్వహించటం ఆనవాయితీ. ఈ వేదికమీద మనసు విప్పి మాట్లాడుకునేందుకు, సరికొత్తగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవటానికి శాస్త్ర, సాంకేతిక రంగాలను వినియోగించటం మీద చర్చించేందుకు ఈ వేదిక అవకాశం కల్పిస్తుంది.

                 

 *****




(Release ID: 1661657) Visitor Counter : 232