ప్రధాన మంత్రి కార్యాలయం

భారత్ వస్త్ర సంప్రదాయాలపై వెబినార్ లో ప్రధాన మంత్రి ప్రసంగపాఠం

Posted On: 03 OCT 2020 7:29PM by PIB Hyderabad

నమస్తే! జౌళి మీద సంభాషణలో నన్ను భాగస్వామిని చేయటం సంతోషకరం. వివిధ దేశాలవారు ఇందులో పాల్గొనటం మరీ సంతోషకరం. భారత సాంస్కృతిక సంబంధాల మండలి, ఉత్తరప్రదేశ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎంతో కష్టపడి ఇలా అందరినీ ఒకచోట చేర్చటం అభినందించదగ్గ విషయం. “సంబంధాల కలనేత: వస్త్ర సంప్రదాయాలు”  అనే సరైన అంశాన్ని మీరు ఎంచుకున్నారు. మిత్రులారా, మనకు వస్త్ర రంగంతో న్న అనుబంధం శతాబ్దాలనాటిది. జౌళి రంగంలో మనం మన చరిత్రను, మన వైవిధ్యాన్ని, అద్భుతమైన అవకాశాలను చూసుకోవచ్చు.

మిత్రులారా, భారత వస్త్ర సంప్రదాయాలు పురాతనమైనవి. నూలు వడకటం, నేత నేయటం, రంగులద్దటం తెలిసిన అతి ప్రాచీనులలో మనమూ ఉన్నాం. సహజసిద్ధమైన రంగులతో కూడిన నూలుకు భారతదేసంలో ఘనమైన చరిత్ర ఉంది. పట్టు విషయమూ అంతే. మిత్రులారా, మన జౌళి రంగపు వైవిధ్యం మన సంస్కృతిలో సుసంపన్నతను చాటి చెబుతుంది. ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి. భిన్నమైన సమూహాలను చూడండి. వాళ్ళ వస్త్ర సంప్రదాయాలలో ఒక విశిష్టత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కలంకారి ఉంటే, అస్సాం వారు గర్వించేది వాళ్ళ మూగా పట్టుతో.  పాశ్మినాతో కశ్మీరీలు గర్వపడితే పంజాబీ సంస్కృతిలో భాగం వారి ఫుల్కరీ. గుజరాత్ లో పటోలాలు ప్రసిద్ధి అయితే, పట్టు చీరెలకు బెనారస్ పేరుమోసింది. మధ్య ప్రదేశ్ లో చండేరి, ఒడిశాలో సంబల్పూర్ బట్ట ప్రసిద్ధం. నేను కొన్ని పేర్లు మాత్రమే ఉదహరించాను. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి.  ఇదే సందర్భంలో మన గిరిజన సమూహాల సుసంపన్నమైన వస్త్ర సంప్రదాయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మన భారత వస్త్ర సంప్రదాయాలన్నిటిలోనూ రంగులున్నాయి, ఉత్తేజపూరితమైన చురుకుదనముంది, సూక్ష్మమైన నైపుణ్యం కలిసి ఉంది.

మిత్రులారా, జౌళి రంగం ఎప్పుడూ తన వెంట అవకాశాలను తెస్తూ ఉంటుంది. భారతదేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించేది జౌళిరంగమే. అంతర్జాతీయంగా మన వర్తకాన్ని, సాంస్కృతిక సంబంధాలను నిర్మించుకోవటంలో జౌళి రంగం ఎంతగానో దోహదపడింది. ఎంతైనా, భారత వస్త్రాలకు అంతర్జాతీయంగా ఎంతో గొప్ప పేరుంది. ఇతర సంస్కృతులనుంచి, ఉత్పత్తులనుంచి, ఆచారాలనుంచి, హస్తకళానైపుణ్యాలనుంచి నేర్చుకున్నది కూడా మనం ఇనుమడింపజేసుకున్నాం.


మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ 150 వ జన్మదినోత్సవ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని నిర్వహించుకుంటున్నాం. సామాజిక సాధికారతకూ, జౌళీ రంగానికీ మధ్య దగ్గరి సంబంధాన్ని గాంధీజీ గుర్తించారు. ఒక మామూలు చరఖాను ఆయన స్వాతంత్ర్యోద్యమ చిహ్నంగా మార్చగలిగారు. ఒక జాతిగా చరఖా మనలందరినీ కలిపి నేత నేసింది.

మిత్రులారా, మనం ఆత్మనిర్భర్ భారత్ లేదా స్వయం సమృద్ధ భారత్ నిర్మాణంలో జౌళి రంగాన్ని ఒక కీలకమైన రంగంగా చుస్తున్నాం. ప్రభుత్వం ప్రత్యేకంగా నైపుణ్యాల పెంపు, ఈ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి ఆర్థిక సహాయం అందించటం మీద దృష్టి సారిస్తోంది. అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు తయారు చేసేలా మనం మన చేనేత కార్మికులకు సాయపడుతున్నాం. అందుకే మనం అంతర్జాతీయ స్థాయి ఆచరనావిధానాలను నేర్చుకోవాలనుకుంటున్నాం. అదే విధంగా ప్రపంచం కూడా మన అత్యుత్తమవిధానాలను ఆచరిమ్చాలై సూచిస్తున్నాం. అందుకే  ఈ రోజు ఈ సంభాషణకు పదకొండు దేశాల వారు హాజరవటం సంతోషంగా ఉంది. ఆలోచనలు, ఉత్తమ ఆచరణీయ విధానాలు పరస్పరం మార్చుకోవటం వలన సహకారంతో కొత్త అవకాశాలు సృష్టించుకోగలుగుతాం.

మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా వస్త్ర రంగం ఎక్కువమంది మహిళలను నియోగించుకుంటోంది. అందువలన చురుకైన వస్త్ర రంగం అంటే మహిళాసాధికారతకు జరిగే కృషిని పటిష్టం చేయటమే. ఈ సవాళ్లతో కూడిన సంక్షోభ సమయంలో మనం మన భవిష్యత్తుకు తగినట్టుగా సమాయత్తం కావాలి. మన వస్త్ర సంప్రదాయాలు శక్తిమంతమైన ఆలోచనలను, సిద్ధాంతాలను ప్రదర్శించాయి. వాటిలో స్వయం సమృద్ధత, నైపుణ్యం, నవకల్పనలు ఉన్నాయి. ఈ సిద్ధాంతలు ఇప్పుడు మరింత సమకాలీనత సంతరించుకున్నాయి. ఈ రోజు నిర్వహిస్తున్న ఈ వెబినార్ లాంటి కార్యక్రమాలు జౌళి రంగాన్ని మరింత ఉత్తేజితం చేస్తాయని, పరిపుష్టం చేస్తాయని ఆశిస్తున్నాను. ఐసిసిఆర్ కి, యుపిఐడి కి, పాల్గొన్నవారందరికీ వాళ్ల కృషికి తగిన ఫలితం అందాలని కోరుకుంటున్నాను.  

ధన్యవాదాలు!!

***



(Release ID: 1661485) Visitor Counter : 207