వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

హిందుస్తాన్ వాణిజ్య మండలి 74వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన శ్రీ పీయూష్ గోయెల్

స్వయంసమృద్ధి సాధన లక్ష్యంలో భాగంగా ఉత్పాదక కార్యకలాపాల పరిధి విస్తరణ, తయారీ రంగంలో సదాచరణలు, నాణ్యత మెరుగుదలకు భారదేశం తీసుకున్న చర్యలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు : శ్రీ గోయెల్

Posted On: 03 OCT 2020 7:48PM by PIB Hyderabad

శనివారం వర్చువల్ విధానంలో జరిగిన హిందుస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 74వ వార్షిక సమావేశంలో  కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ పాల్గొన్నారు. హిందుస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వర్తమాన కాలంలో వాణిజ్య చాంబర్ల పాత్ర, సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతను ప్రధాన చర్చనీయాంశంగా తీసుకున్నదని, ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి విజృంభించిన రోజుల్లో ఇది చక్కని అంశమని ప్రశంసించారు. రోజులు గడుస్తున్న కొద్ది వాణిజ్య చాంబర్ల పాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకున్నదని ఆయన అన్నారు. వివిధ చాంబర్లు తీసుకుంటున్న చొరవలు వారు పొందుతున్న సమ్మతికి దర్పణమని ఆయన చెప్పారు. అలాగే చాంబర్లు కోవిడ్ పై పోరాటం చేస్తూనే ఈ దిశగా ప్రభుత్వ ఆందోళనలను, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రముఖంగా అందరి దృష్టికి తీసుకువచ్చి వ్యాపారవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త పరిష్కారాలు అందుబాటులోకి తెస్తున్నాయని ఆయన అన్నారు.  

మనందరం వ్యాపార ధోరణులు పునర్నిర్మిస్తూ, కొత్త ధోరణులు అందించడంతో పాటు ప్రభుత్వం పని చేసే విధానంలో మార్పులకు, విధానాల సవరణకు కారకులవుతున్నామని, చట్టాలు, నిబంధనలు వర్తమాన కాలానికి అనుగుణంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని శ్రీ గోయెల్ అన్నారు. “దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు గడిచిపోయినా నిరాకరణకు గురైన వర్గాలకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు వ్యాపార సంస్థలు, ప్రభుత్వం కలిసికట్టుగా పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల ప్రజల జీవితాల మెరుగుదలకు మనందరం కలిసి పని చేద్దాం. వ్యాపారాలు, ప్రభుత్వంలో వేగం పెంచేందుకు డిజిటల్ టెక్నాలజీలను ఆశ్రయించి 130 కోట్ల మంది భారతీయులకు మెరుగైన భవిష్యత్తు అందించే దిశగా అన్ని రంగాల్లో మెరుగుదలకు కృషి చేద్దాం” అని ఆయన పిలుపు ఇచ్చారు.

ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకోగల భారత వ్యాపార సంస్థల వాస్తవిక సమర్థతకు ఇది పరీక్షా కాలమని మంత్రి అన్నారు. పిపిఇలు, మాస్కులు, వెంటిలేటర్లు, ఔషధాల తయారీలో అగ్రస్థానం పొందడమే కాకుండా భారతదేశం ఇతర దేశాలకు కూడా వాటిని ఎగుమతి చేస్తున్నదని ఆయన చెప్పారు. కఠినమైన లాక్ డౌన్ అమలులో ఉన్న కాలంలో కూడా మన ఎగుమతులు ఆగలేదంటూ దీంతో భారతదేశం విశ్వసనీయమైన భాగస్వామి అని ప్రపంచానికి తేటతెల్లం అయిందని ఆయన అన్నారు. ఈ రోజున ప్రపంచం యావత్తు ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారతదేశాన్ని ఒక నమ్మకమైన, ఆధారనీయమైన భాగస్వామిగా భావిస్తున్నదని ఆయన చెప్పారు. “మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్నపోరాటం, వేగవంతమైన రికవరీ వెనుక గల అసాధారణ కృషిని ప్రపంచం యావత్తు గుర్తించింది. స్వయం సమృద్ధి  సాధనలో భారతదేశానికి గల సామర్థ్యాలు, పారిశ్రామిక కార్యకలాపాల పరిధి విస్తరణ, మెరుగైన తయారీ విధానాలు ఆచరించడం, నాణ్యత పెంపునకు చేస్తున్న కృషిని ప్రపంచం గుర్తించింది. భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత పారిశ్రామిక రంగం ఎదిగిందని నేను ఈ రోజు గర్వంగా చెబుతున్నాను” అన్నారాయన.
ఆర్థిక పునరుజ్జీవం గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు అందుబాటులో ఉన్న పలు గణాంకాలు దారుణమైన స్థితి దాటిపోయిందని సంకేతం ఇస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ నెలలో వాణిజ్య ఎగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 5% పెరిగాయని ఆయన తెలిపారు. అలాగే జిఎస్ టి ఆదాయాలు 4%, రైల్వే సరకు రవాణా 15% పెరిగాయని ఆయన చెప్పారు. “ఈ సూచికలన్నీ భారతదేశం అధిక వృద్ధి శకంలోకి తిరిగి ప్రవేశిస్తున్నదని సూచిస్తున్నాయి” అన్నారు.
అన్ని వ్యాపార విభాగాలు పునరుజ్జీవం సాధించేందుకు ప్రోత్సహించాలని ప్రభుత్వం కట్టుబడి ఉన్నదంటూ ప్రభుత్వం, పారిశ్రామిక రంగం ఉమ్మడి కృషి కారణంగానే ఈ రోజున రికవరీ దశకు చేరుకున్నామని మంత్రి చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రభుత్వం, వ్యాపారాలు, వాణిజ్యం, పారిశ్రామిక విభాగాలు చలనశీలత కలిగి ఉండేలా, వేగం పుంజుకునేలా చేయగలిగామని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 6 సంవత్సరాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు చేపట్టిన చర్యలు ఎంత మంచి ఫలితాలనిచ్చాయి, పేదల జీవితంలో గత కొద్ది సంవత్సరాల్లో నాణ్యత ఎంతగా పెరిగింది, ప్రస్తుత సంక్షోభాన్ని మనం ఏ విధంగా అధిగమించగలిగాం అన్న అంశాన్ని ఈ మహమ్మారి నిరూపించి చూపించిందని శ్రీ గోయెల్ చెప్పారు. మన దేశం చేపట్టిన స్వచ్ఛత ఉద్యమం, ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా, పేదలకు ఆరోగ్య వసతుల మెరుగుదల, జన్  ధన్ ఖాతాలు  సేవలు సమర్థవంతంగా అందించేందుకు సహాయపడ్డాయని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి ఎప్పుడూ సంస్కరణలు, పనితీరు మెరుగుదల, పరివర్తన గురించి మాట్లాడుతూ ఉంటారని, కోవిడ్ మహమ్మారిని అవకాశంగా తీసుకుని వ్యవసాయం, కార్మిక, గనులు, పెట్టుబడి మార్కెట్లు, బ్యాంకింగ్, అంతరిక్ష టెక్నాలజీ, రక్షణ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురాగలిగామని శ్రీ గోయెల్ తెలిపారు. ఇది భారతదేశాన్ని శక్తివంతం చేయడమే కాకుండా ఆ శక్తి ద్వారా ప్రపంచం యావత్తుకు సహకారం అందించగల విధంగా మనం సమాయత్తం అయ్యాయని ఆయన అన్నారు.

ఇటీవల చేపట్టిన వ్యవసాయ సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ భారతదేశం ఆహార రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో రైతుల విశేషమైన కృషిని గుర్తించి 10 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. భారతదేశం వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల అతి పెద్ద ఎగుమతిదారుగా మారడంలో కీలక పాత్రధారులైన  రైతులను ఆయన ప్రశంసించారు.  

శాఖలవారీ అడ్డుగోడలు, భౌతికమైన అవరోధాలు ఛేదించుకుంటూ మనందరం కలిసికట్టుగా పని చేస్తున్నామని, వ్యవసాయ రంగం సాంప్రదాయిక నియంత్రణలు, లైసెన్సులు, కోటా రాజ్ నుంచి బయటపడిందని శ్రీ గోయెల్ అన్నారు. “సంఘటితంగా పని చేస్తే భారతదేశం సూపర్ పవర్ కావడాన్ని, జనాభాలో ప్రతీ ఒక్క వ్యక్తి జీవన నాణ్యతను మెరుగుపరచగల ఆర్థిక వ్యవస్థగా అవతరించడాన్ని భూమండలంపై ఏ శక్తి ఆపలేదు” అని మంత్రి దృఢ స్వరంతో చెప్పారు.

****



(Release ID: 1661539) Visitor Counter : 166